Notifications
-
మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని.. మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది’’ అని సీఎం రేవంత్ అన్నారు.‘‘నిరుద్యోగుల దశ, దిశ నిర్దేశించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద నిధులు ఇస్తున్నాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది.’’ అని సీఎం రేవంత్ తెలిపారు.ఇదీ చదవండి: నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవే: మాజీ మంత్రి మల్లారెడ్డి‘‘ప్రతిభ ఉన్నా.. నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టాం. తెలంగాణలో ప్రతీ ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐ తో మాట్లాడాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.ఈ శిక్షణ తరువాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ లో ఉద్యోగాలు పొందుతారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే మా లక్ష్యం. గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ఇటీవల పట్టుబడినవారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమైన విషయం. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం.. రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం.. ఇంజనీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించాం. కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయడం ఖాయం. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తున్నాం.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నాం. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు.. నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నాం. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలి. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టాలి. అందుకు మీ అందరి సహకారం అవసరం.రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీ ఏర్పాటు చేస్తాం. తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారు. అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
Apple: స్పైవేర్ దాడులు జరగొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై సైబర్‌దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్ ఏప్రిల్ పదో తేదీ ఒక ‘థ్రెట్’ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్‌తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్‌నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్ నోటిఫికేషన్లో యాపిల్ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్‌సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్ తయారీ పెగాసస్ స్పైవేర్ సాయంతో మొబైల్ ఫోన్‌కు వాట్సాప్ ద్వారా మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా ఆ ఫోన్‌ను సైబర్‌నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ‘‘ఎవరైనా యూజర్‌ను సైబర్‌నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్‌ను హెచ్చరిస్తాం. ఐఫోన్‌ను సైబర్‌భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్డౌన్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్లో ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్, ఫేఫియల్ రికగ్నీషన్, వాయిస్ రిగ్నీషన్ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్ లేదా పాస్‌కోడ్ లేదా ప్యాట్రన్ సాయంతోనే మళ్లీ ఫోన్‌ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్ సూచించింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్‌లపై సైబర్ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్‌లో లెక్కిస్తే మొబైల్ మాల్వే ర్ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి. -
అప్పటి సర్వీస్ కమిషన్ కాదు బాసూ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌సర్వీస్ కమిషన్.. ఒకప్పుడు చంద్రబాబు సేవలో తరించిన ఈ సంస్థ.. ఇప్పుడు నిరుద్యోగుల సేవలో లీనమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంస్థను పూర్తిగా ప్రక్షాళన జరిపి, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే కేంద్రంగా మలిచారు. ఇది గత నాలుగున్నరేళ్లల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేసింది. అంతేకాకుండా సచివాలయాల్లో ఒకేసారి 1.21 లక్షల మందిని నియమించి రికార్డు సృష్టించింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్–1, గ్రూప్–2 వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు పూర్తి చేశారు. ఒక్క కోర్టు కేసు లేదు.. ఒక్క విమర్శా లేదు.. ఒక్క ఫిర్యాదూ లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదకలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడే పచ్చ మీడియా బాసు రామోజీకి కాలేది. ‘ఏ వివాదం లేకుండా, ఉద్యోగాలెలా ఇచ్చేస్తారు? అసలు వివాదాలు పెట్టేదే ఉద్యోగాలు ఎగ్గొట్టడానికి కదా. చంద్రబాబు హయాంలో అంతా ఇలానే జరిగింది కదా! ఇప్పుడంతా సక్రమంగా జరగడమేంటి’ అంటూ లోలోన మండిపోయి.. ఏపీపీఎస్సీపై ఓ బండ వేయాలని చూశారు. చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీలో చైర్మన్, సభ్యుల నియామకాల్లో జరిగిన ఆశ్రిత పక్షపాతం, అవకతవకలను వదిలేసి, ఇప్పుడు కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలన్నీ రాజ్యాంగబద్ధంగా జరిగినప్పటికీ, ‘‘ఏపీపీఎస్సీనా? వైసీపీఎస్సీనా?’’ అంటూ ఈనాడు పత్రికలో విషం కక్కారు. కమిషన్‌ను కమీషన్లతో నింపేసిన బాబు చంద్రబాబు సీఎంగా ఉండగా ఏపీపీఎస్సీని తన అభిమానులు, తనకు సేవ చేసే వారితో నింపేశారు. ఆయన హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ తెలియని పరిస్థితి. ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు వంటి కారణాలతో నిలిచిపోవడమో లేక పరీక్షలు రద్దు కావడమో జరిగేవి. 2014–18 మధ్య ఇచ్చిన నోటిఫికేషను వేళ్లపై లెక్కించేవే అయినా దాదాపు 350కి పైగా కేసులు పడ్డాయి. అసలు సభ్యుల నియామకమే కమీషన్లపై జరిగిందని ఆ పార్టీలోని ముఖ్య నేతలే విమర్శించారు. 2014 ఎన్నికలకు ఎన్నారైల నుంచి నిధులు సేకరించినందుకు ఉదయ్ భాస్కర్‌కు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టారన్న విమర్శలు ఉండేవి. సభ్యుల విషయానికి వస్తే నాటి ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె గుర్రం సుజాత, తాడికొండలో టీడీపీ అభిమాని విజయకుమార్, నాటి హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సిఫారసుతో పద్మరాజును నియమించారు. చంద్రబాబు ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాటి ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్ర తన శిష్యుడు రామరాజుకు సభ్యుడిగా పదవి ఇప్పించారు. మరో సభ్యుడు రంగ జనార్థన్ కూడా ఇలా వచ్చినవారే. వీరికి పదవులు ఇచ్చే ముందే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగి భాస్కర్ నాయుడు తిరుపతిలో వీరితో వేర్వేరుగా సమావేశమై, తాము చెప్పినట్టు వింటేనే పదవులు ఉంటాయని హెచ్చరించిన విషయం ఎల్లో మీడియా కప్పిపుచ్చినా బయటకు వచ్చేసింది. ♦ 2016లో నోటిఫికేషన్ ఇచ్చి, 2017 జూలైలో నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను ఎంత వివాదాలతో నింపేశారో ప్రతి నిరుద్యోగికీ తెలుసు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగాల్సిన పరీక్షను వారికి అవసరమైన వారికోసం విశాఖపట్నం గీతం కాలేజీ, మరికొన్ని చోట్ల సాయంత్రం 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్వహించి వేల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. కొన్ని ప్రశ్నలు ఉద్దేశపూర్వకంగా బయటకు వెల్లడించగా.. ఇవన్నీ గీతం కాలేజీ కేంద్రంగానే జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ♦ అధికార పార్టీ పెద్దలతో సాన్నిహిత్యమున్న కొన్ని కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఏపీపీఎస్సీలో తిష్టవేసి ఇష్టారీతిన వ్యవహారాలు నడిపించాయి. తమ వద్ద చదివిన వారు ఒకే కేంద్రంలో వరుసగా వచ్చేలా ఏర్పాట్లు చేయించుకొని మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాల స్క్రీన్షాట్లు ఏకంగా వాట్సప్‌లలో ప్రత్యక్షమయ్యాయి. ♦ కమిషన్‌లో మెజారిటీ సభ్యుల ఆమోదంతో తీసుసుకోవాల్సిన నిర్ణయాలను నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఒక్కరే తీసుకుని వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ♦ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకుండా 2017లో జీవో నం.55 విడుదల చేసి, డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ‘మైనస్ మార్కు’లను అమల్లోకి తెచ్చింది. దాంతో అంతకుముందు ఏటా సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులైతే.. జీవో నం.55 వచ్చాక ఆ సంఖ్య 4 నుంచి 6 శాతం మించలేదు. కొన్ని విభాగాల్లో ఒక్క శాతం కూడా పాసవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జీవోతో దాదాపు ఉద్యోగులు మూడేళ్లపాటు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కోల్పోయారు. ♦ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఇప్పుడు నిబద్ధతతో పనిచేసే వారికే సభ్యులుగా అవకాశం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. అన్ని అర్హతలున్నవారు, సమర్థతతో పనిచేసే వారు, నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వారిని సభ్యులుగా నియమించింది. దాంతో గత నాలుగేళ్లల్లో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 పోస్టులను సకాలంలో భర్తీ చేసింది. ‘సచివాలయ’ వ్యవస్థలో ఒకేసారి 1.21 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే బాధ్యతను కూడా కమిషన్ విజయవంతంగా నిర్వర్తించింది. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశచరిత్రలోనే లేదు. గత డిసెంబర్లో 899 గ్రూప్–2 పోస్టులతో పాటు గ్రూప్–1, పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు వంటి దాదాపు 1,446 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈనెల 25న జరిగే గ్రూప్–2 పరీక్షకు ఎల్లో మీడియా, టీడీపీ కలిసి ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ, సర్వీస్ కమిషన్ సమర్థంగా అధిగమించి ముందుకెళుతోంది. 2019–23 మధ్య ఏపీపీఎస్సీ నిర్వహించిన 78 నోటిఫికేషన్లలో ఒక్కటి కూడా వాయిదా పడలేదు. నిరుద్యోగుల నుంచి ఒక్క కేసు నమోదైందీ లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలూ పొందింది. అయినా, వాస్తవాలన్నింటినీ కప్పిపుచ్చి ఎల్లో బాసు రామోజీ మాత్రం అక్రమాలంటూ అభాండాలు వేస్తున్నారు. -
కొలువుల పట్టిక తారుమారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లలో కొలువుల పట్టిక తారుమారు కానుంది. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లలో నిర్దేశించిన పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ మాయం కానుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజాంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి, ఉద్యోగాలను భర్తీ చేయని వాటిల్లో హారిజాంటల్ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)లు నోటీసులు ఇచ్చాయి. వీలైనంత వేగంగా పోస్టుల క్రమాన్ని మార్చి పంపించాలని స్పష్టం చేశాయి. ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు దిగనున్నట్లు స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, గురుకుల కొలువులు, సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సవరణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు అనుసరించిన వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు 33 1/3 శాతం పోస్టులను ఆయా వరుస క్రమంలో రిజర్వ్ చేసి (నిర్దిష్ట పాయింట్ కింద ఉన్న పోస్టును మహిళలకని ప్రత్యేకంగా మార్క్ చేసి) చూపించేవారు. కానీ తాజా హారిజాంటల్ విధానంలో మహిళలకు ఎక్కడా పోస్టులను రిజర్వ్ చేయరు (ఎలాంటి మార్కింగ్ ఉండదు). భర్తీ సమయంలోనే ప్రతి మూడింటా ఒక్క పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు. అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్‌తో కూడిన కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలకు సమర్పించాల్సి ఉంది. ఉదాహరణకు గతంలో ఓ శాఖలో పది ఉద్యోగాలకు సంబంధించి 3 పోస్టులను మహిళలకు రిజర్వ్ చేసి పంపినట్లైౖతే, తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్‌ను తొలగించి పది పోస్టులను జనరల్‌కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలి. అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు. కేవలం మహిళలకు రిజర్వ్ చేసిన స్థానం సంబంధిత వర్గ జనరల్ కేటగిరీకి మారుస్తారు. ఇలా శాఖలన్నీ హారిజాంటల్ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనుంది. -
స్టాఫ్ నర్సులను భర్తీ చేసింది మేమే..
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సుల ఉద్యోగ భర్తీ ప్రక్రియను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట హడావుడి చేస్తున్నారని వైద్యఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రా లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం హరీశ్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ 1 నోటి ఫికేషన్‌ను ఫిబ్రవరి 1న ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్.. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి మరల్చేందుకే స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ పేరిట హడావుడి చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచి్చన హామీ ప్రకారం ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ వల్ల ఆటంకం వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది నియామకానికి తామే శ్రీకారం చుట్టామని హరీశ్‌రావు పేర్కొన్నారు. మొత్తంగా 7,094 స్టాఫ్‌నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించినా ఎన్నికల కోడ్ మూలంగా తుది ఫలితాల విడుదల జరగలేదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన నియామకాలను తమ ఘనతగా చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సు పోస్టులను ఉన్నతీకరిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసినా కాంగ్రెస్ నేటికీ పరిగణనలోకి తీసుకోవడం లేదని హరీశ్‌రావు ఆ ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాల మరుసటి రోజే మిమ్మల్ని కలుస్తా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున డిసెంబర్ నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లో యువతతో సమావేశమవుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు హామీనిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు తాము భరోసాగా ఉంటామని ప్రకటించారు. పలు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కొందరు విద్యార్థులు సోమవారం కేటీఆర్‌తో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన సుమారు రెండు గంటల పాటు విస్తృతంగా సంభాషించారు. నోటిఫికేషన్ల ఫలితాల జారీపై ఉన్న కేసుల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని, యువత ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. పదేళ్ల పాటు ఉద్యోగం చేసిన యువకుడిగా, సోదరుడిగా యువత ఆకాంక్షలను అర్ధం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తు తం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా వివరించారు. మా నిబద్ధతను ప్రశ్నించే అవకాశం లేదు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ప్రశ్నించే అవకాశం ఎవరికీ లేదని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా వేయి ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి తమను ప్రశ్నించే కనీస అర్హత లేదన్నారు. 2లక్షల30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే 1,62,000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తే లెక్కలతో సహా వివరించాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం చేస్తున్న అసత్య పూరిత ప్రచారాన్ని యువత తెలుసుకుని తిప్పికొట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పోస్టుల సంఖ్యను పెంచండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వల్ల యువతలో కొంత ఆందోళన నెలకొందని కేటీఆర్‌తో భేటీ అయిన యువకులు తెలిపారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ, రోస్టర్ పాయింట్ల కేటాయింపు, విద్య అర్హతల విషయంలో ఉన్న కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం ఉందంటూ ఇందుకు సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలను అందించారు. కేవలం సాంకేతికపరమైన అంశాల ఆధారంగా అనేక న్యాయపరమైన కేసులు ఎదురవుతున్నాయని, వీటి వలన భర్తీ ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని చెప్పుకొచ్చారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందిస్తూ, వివిధ నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియ పై ఉన్న కోర్టు కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. -
ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్!
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరిన వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు మీ ఐఫోన్లను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్లు సంచలనం సృష్టించాయి. ఇది కచ్చితంగా కేంద్రంలోని మోదీ సర్కారు పనేనంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. గతంలో పెగసెస్ సాఫ్ట్‌వేర్‌తో తమపై గూఢచర్యం చేసిన బీజేపీ, ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి చౌకబారు చర్యలకు దిగిందంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ కలకలం నేపథ్యంలో, తమ నోటిఫికేషన్లలో కొన్ని ఫేక్ అలర్టులు కూడా ఉండొచ్చంటూ యాపిల్ స్పందించింది. భారత్‌లోనేగాక 150 దేశాల్లో పలువురు యూజర్లకు ఇలాంటి అలర్టులు వచ్చాయని పేర్కొంది. అయితే ఈ అలర్టులకు దారితీసిన కారణాలను బయట పెట్టేందుకు నిరాకరించింది. దుయ్యబట్టిన విపక్ష నేతలు ఈ ఉదంతంలో కేంద్రప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉందంటూ విపక్ష నేతలు ఆరోపించారు. తమ ఫోన్లలో అభ్యంతరకర సమాచారాన్ని చొప్పించి అందుకు తమను బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని తక్షణం లోక్‌సభ హక్కుల కమిటీకి నివేదించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యతలపై ఇలాంటి దాడి దారుణమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర విపక్ష నేతలను విచారణ పేరుతో వేధించడం, తాజాగా వారి ఫోన్ల హ్యాకింగ్‌కు ప్రయత్నించడం మోదీ సర్కారు అభద్రతా భావానికి సూచనలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. లోతుగా దర్యాప్తు: ఐటీ మంత్రి వైష్ణవ్ విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. మోదీ నాయకత్వంలో దేశ ప్రగతిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ ఉదంతంపై కూలంకషంగా దర్యాప్తు జరిపించి నోటిఫికేషన్ల వ్యవహారాన్ని నిగ్గుదేలుస్తామని ప్రకటించారు. ‘పూర్తి పారదర్శకంగా సరైన సమాచారాన్ని అందజేయడం ద్వారా విచారణలో మాతో కలిసి రావాల్సిందిగా యాపిల్‌ను కోరాం. ముఖ్యంగా ప్రభుత్వ దన్నుతో హ్యాకింగ్ జరగవచ్చని ఏ ఆధారంతో చెప్పారో వివరించాలని సూచించాం. ఇది పూర్తిగా సాంకేతికపరమైన దర్యాప్తు. కనుక కంప్యూటర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు బాధ్యత వహించే జాతీయ నోడల్ ఏజెన్సీ సెర్ట్–ఇన్ దీన్ని చేపడుతుంది.’ అని మంత్రి ప్రకటించారు. ఇలాంటి నోటిఫికేషన్లు 150కి పైగా దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు వచ్చాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. నా ఫోన్ తీసుకోండి: రాహుల్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్ కచ్చితంగా మోదీ సర్కారు పనేననంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేం భయపడేది లేదు. మా ఫోన్లను ఎంతగా హాకింగ్ చేసుకుంటారో చేసుకోండి. మీకు కావాలంటే చెప్పండి, నా ఫోన్ కూడా ఇస్తా’ అంటూ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీయే ప్రస్తుతం దేశాన్ని రిమోట్ కంట్రోల్‌తో నడుపుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పుడు దేశంలో అదానీయే నంబర్ వన్. తర్వాతి స్థానాల్లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ఆత్మ అదానీ దగ్గరుంది. అందుకే అదానీని ఎవరైనా ఒక్క మాటన్నా వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగుతున్నాయి. అలర్టులు అందుకున్న నేతలు.. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరా, కె.సి.వేణుగోపాల్, సుప్రియా శ్రీనేత్, టి.ఎస్.సింగ్‌దేవ్, భూపీందర్ సింగ్ హుడా, రాహుల్‌గాంధీ సహాయకులు, మహువా మొయిత్రా (టీఎంసీ), సీతారాం ఏచూరి (సీపీఎం), ప్రియాంకా చతుర్వేది (శివసేన–యూబీటీ), రాఘవ్ ఛద్దా (ఆప్), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సమీర్ సరణ్ (ఓఆర్ఎఫ్ అధ్యక్షుడు), సిద్ధార్థ్ వరదరాజన్ (ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్డీ తదితరులు యాపిల్ అలర్టులో ఏముందంటే... ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హాకర్లు మీ ఐఫోన్‌ను టార్గెట్ చేసుకుని ఉండొచ్చని యాపిల్ అనుమానిస్తోంది. బహుశా మీ హోదా, మీరు చేస్తున్న పనుల వల్ల మీరు వ్యక్తిగతంగా వారి లక్ష్యంగా మారి ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాకర్లు మీ ఫోన్‌ను హాక్ చేసి తమ అ«దీనంలోకి తీసుకుంటే అందులోని సున్నితమైన డేటా, సమాచారంతో పాటు కెమెరా, మైక్రోఫోన్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఇది ఫేక్ హెచ్చరికే అయ్యుండే ఆస్కారమూ లేకపోలేదు. కానీ దయచేసి దీన్ని సీరియస్‌గా తీసుకోండి’ -
‘స్టేట్ స్పాన్సర్డ్ అటాక్’ వివాదం.. యాపిల్ స్పందన ఇదే..
పలువురు లోక్‌సభలోని ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్లు వారి ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు అలర్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పటికే త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ ప్రియాంక చతుర్వేదికు అలర్ట్‌లు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన మెసేజ్‌లను తమ ఎక్స్ ఖాతాద్వారా ప్రముఖులు పంచుకున్నారు. ఈ అలర్ట్‌లను ఉద్దేశించి యాపిల్ స్పందించింది. స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ నోటిఫికేషన్లు కొన్నిసార్లు తప్పుడు అలారాలు కావచ్చని యాపిల్ చెప్పింది. అలా అటాక్ చేసేవారి వద్ద అధునాతన టెక్నాలజీ ఉంటుందని పేర్కొంది. దాంతో వారు ఎలాంటి దాడికైనా పాల్పడే అవకాశం ఉందని చెప్పింది. అయితే అలా వస్తున్న అలర్ట్‌ల్లో కొన్ని తప్పుడు నోటిఫికేషన్లు ఉండవచ్చని యాపిల్ వివరించింది. ఈ నోటిఫికేషన్ల జారీకి గల కారణాలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ నిరాకరించింది. ఎందుకంటే పూర్తి వివరాలు వెల్లడిస్తే భవిష్యత్తులో దాడిచేసే వారిని గుర్తించకుండా తప్పించుకోవడానికి సహాయపడినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది. -
విలువలతో కూడిన జర్నలిజం అవసరం
-
మెసేజ్ లింక్స్‌తో జాగ్రత్త..!
ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పూర్ణిమ(పేరుమార్చడమైనది) ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చుపెడుతుంది. రాత్రి పడుకునే ముందు సోషల్‌మీడియా అకౌంట్స్‌తో పాటు, మెయిల్‌కి వచ్చిన నోటిఫికేషన్స్ చూడటం అలవాటు. వాటిలో తన ఆఫీసు నుంచి, స్నేహితుల నుంచి వచ్చిన మెసేజ్‌లకు రిప్లై చేసింది. అదే సమయంలో మరో మెసేజ్ వచ్చింది. గోల్డ్స్కీమ్కి సంబంధించిన సమాచారం అది. ఆసక్తిగా అనిపించడంతో దానిని ఓపెన్ చేసింది. ఆ స్కీమ్‌లో చేరితే తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేయవచ్చు. అది, పేరున్న కంపెనీ వెబ్సైట్ నుంచి వచ్చింది. లిమిటెడ్ టైమ్‌లో వచ్చిన ఆఫర్ అది. మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని, అప్లికేషన్లో తన వివరాలను పొందుపరిచి, సెండ్ చేసింది. మిగతావి ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం అని ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంది. ఉదయం పనిచేసుకుంటూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది. వచ్చిన బ్యాంక్ మెసేజ్‌లు చూసి షాక్ అయ్యింది. యాభై వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా బ్యాంక్ మెసేజ్ అది. నిన్నరాత్రి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. స్కీమ్‌లో చేరినట్టుగా వివరాలు ఇచ్చింది కానీ, బ్యాంక్ అకౌంట్స్‌కి సంబంధించిన సమాచారం ఏమీ ఇవ్వలేదు తను. తన డబ్బు మరెలా పోయినట్టు? మెయిల్ ఐడీలో ఉన్న కస్టమర్ కేర్‌కి మెసేజ్ చేసింది. ఫోన్ చేసింది. కానీ, ఎలాంటి సమాచారమూ లేదు. పూర్ణిమ మాదిరే చాలామంది మెసేజ్‌లు లేదా మెయిల్స్‌కు వచ్చిన ఆకర్షణీయమైన పథకాలతో ఉన్న లింక్స్‌ను ఓపెన్ చేయడం, వాటి ద్వారా మోసాలకు గురికావడం అతి సాధారణంగా జరుగుతున్నాయి. దీనికి కారణం అధికారిక కంపెనీల నుంచి వచ్చినట్టుగా మెసేజ్ లింక్స్ ఉండటం ప్రధాన కారణం. ఈ రోజుల్లో స్పూఫింగ్ అనేది మన భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. ఈ రకమైన దాడుల గురించి తెలుసుకోవడం, వాటి నుండి తమను తాము రక్షించుకోవడానికి అందరం సిద్ధపడాల్సిన సమయం ఇది. పేరున్న కంపెనీల పేరుతో అధికారిక వెబ్సైట్లనుంచి వచ్చినట్టు మెసేజ్‌లు మెయిల్స్‌కు వస్తుంటాయి. అయితే, వాటిలో ఏవి కరెక్ట్ అనేది పెద్ద సంశయం. ఇలాగే, క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఓటీపీ, లాగిన్ ద్వారా మోసగాళ్లు మన సమాచారాన్ని బయటపెట్టేలా చూస్తుంటారు. లాటరీ వచ్చింది, డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంక్ వివరాలు ఇవ్వమని అడగడం, ఓటీపీ చెప్పమని కోరడం, బ్యాంక్ లేదా ఏదైనా ఇతర సంస్థ నుండి ఫోన్ కాల్స్ చేస్తుంటారు. ఈ కాల్స్ ద్వారా బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని మనం బయటపెట్టేలా మోసం చేసే అవకాశం ఉంది. మనలో నమ్మకాన్ని కలిగించడానికి సులువైన, ఆకర్షణీయమైన పద్ధతులను మోసగాళ్లు ఎంచుకుంటారు కాబట్టి, మనమే జాగ్రత్త వహించాలి. ఇ–మెయిల్ ద్వారా.. ఫేక్ మెయిల్ ఐడీతో మన ఇన్‌బాక్స్‌లో ఓ మెసేజ్ వస్తుంది. అది వేరొకరి నుండి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఫిషింగ్ దాడులలో ఉపయోగించబడుతుంది, ఇక్కడ దాడి చేసే వ్యక్తి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి లేదా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్ లోడ్ చేయడానికి, మోసగించడానికి ప్రయత్నిస్తాడు. ♦ పంపినవారి ఇ–మెయిల్ చిరునామా అనుమానాస్పదంగా ఉండచ్చు. ఉదాహరణకు.. మనకు వచ్చిన ఫేక్ మెయిల్ ఐడీలో లెక్కకు మించి, అక్షర దోషాలు లేదా వింత భాష ఉండచ్చు. గమనించాలి. ♦మోసపూరిత ఇ–మెయిల్లు ఎలా ఉంటాయంటే.. తరచుగా క్రెడిట్ కార్డ్ నంబర్లు, సోషల్ సెక్యూరిటీ నంబర్లు లేదా పాస్‌వర్డ్‌ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్‌లు కోరుతుంటాయి. ♦ ఇ–మెయిల్లోని అనుమానాస్పద లింక్‌లు చట్టబద్ధమైన వెబ్సైట్లా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌కి దారితీయవచ్చు. లేదా అవి అసాధారణమైన అక్షరాలను కలిగి ఉండవచ్చు. లేదా వేరే వెబ్‌సైట్‌కి దారి మళ్లించవచ్చు. ఫోన్ ద్వారా దాడులు ♦ ఫోన్ ద్వారా దాడులకు పాల్పడే వ్యక్తులు ఉంటారు. వీరు వినియోగదారుడిని రకరకాల ఆకర్షణీయ పథకాల ద్వారా అతని వ్యక్తిగత, బ్యాంకు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ♦ మీ ఫోన్‌కి బయటి దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి. ♦ మీకు తక్కువ సమయంలో ఎక్కువ కాల్స్ వచ్చినా, పగలు లేదా రాత్రి అసాధారణ సమయాల్లో మీకు కాల్స్ వచ్చినా, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ♦మీరు గుర్తించని కంపెనీలు లేదా వ్యక్తుల నుండి అయాచిత కాల్స్‌ను స్వీకరిస్తే, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ♦కాలర్ ఐడీ స్పూఫింగ్ తరచూ క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా సామాజిక భద్రతా నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్‌లు ఉంటాయి. ♦ఫోన్ కాల్లో అవతలి వారి మాటల్లో ఏ మాత్రం క్వాలిటీ లేకపోయినా, కాల్ సమయంలో అసాధారణ శబ్దాలు లేదా అంతరాయాలు ఉంటే, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ఇలా సురక్షితం... ♦ అపరిచిత ఇ–మెయిల్లు, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ♦ బ్రౌజర్ అడ్రస్ బార్లో లాక్ గుర్తు ఉండదు. అడ్రస్ బార్‌పై అక్షరాల్లో చిన్న చిన్న తేడాలు ఉంటా యి. ఈ చిన్న అక్షరాలను కూడా గమనించాలి. ♦యుఆర్ఎల్ అక్షరాలు సరిగా ఉన్నా డిజైన్లలో కూడా తేడాలు ఉంటాయి. గమనించాలి. ♦బ్యాంక్, డిజిటల్ రెండు రకాల కార్యకలాపాలకు రెండు కారకాల ఫోన్ ప్రమాణీకరణను ప్రారంభించడం శ్రేయస్కరం. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
పట్వారీ కొలువుల కోసం 12 లక్షలకు పైగా దరఖాస్తులు
భోపాల్: పెరుగుతున్న జనాభా, కరోనా తర్వాతి పరిస్థితులు.. ఇలా పలు కారణాలతో దేశంలో నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది. మరోవైపు పోటీ ప్రపంచంలోనూ తీవ్రత ఊహించని రీతిలోనే ఉంటోంది. తాజాగా పట్వారీ కొలువుల కోసం ఏకంగా 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లో ల్యాండ్ రెవెన్యూ అధికారుల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్. అటు ఇటుగా ఆరు వేల దాకా ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే పోటీ ఎంతలా ఉందంటే.. ఏకంగా ఈ పోస్టుల కోసం పన్నెండున్నర లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీళ్లలో పీహెచ్డీ చేసిన వాళ్లతో పాటు ఇంజినీరింగ్ స్డూడెంట్స్, ఎంబీఏ చదివిన వాళ్లు సైతం ఉన్నారు. మొత్తం 12.79 లక్షల మంది అభ్యర్థులకుగానూ.. వెయ్యి మంది హీహెచ్డీ చేసిన వాళ్లు, 85 వేలమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్, లక్ష దాకా ఎంబీఏ చేసిన వాళ్లు, మరో రెండు లక్షల మంది ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వాళ్లు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగ శాతం 1.9 గా ఉందని ఈ జనవరిలో సీఎంఐఈ(సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) నివేదిక ఇచ్చింది. ఈ తరుణంలో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తున్నారాయన. ఇదిలా ఉంటే.. తాజా నోటిఫికేషన్ అభ్యర్థుల గణాంకాలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగవకాశాలను కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. -
తెలంగాణ: మరో 16 వేలకు పైగా ఖాళీ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న పోస్టుల్లో 60 వేల ఖాళీల భర్తీకి విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ కాగా.. మరో గుడ్‌న్యూస్ ప్రకటించింది. మరో 16 వేలకు పైగా ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 90 వేల ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, అందులో భాగంగా విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ ఇంతకు ముందు ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఇఫ్పటికే చాలా శాఖలకు చెందిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. -
టీఎస్పీఎస్సీ బోర్డు సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్–1తో పాటు వివిధ కేటగిరీల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలపై టీఎస్పీఎస్సీ నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో శనివారం జరిగే బోర్డు సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. గ్రూప్–1 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే శాఖల వారీగా ప్రతిపాదనలు టీఎస్పీఎస్సీకి చేరాయి. వీటిలో కొన్ని శాఖలకు సంబంధించి ప్రతిపాదనల్లో సవరణలు కోరగా.. వాటిని ఆయా శాఖలు సమర్పించినట్లు తెలిసింది. అవన్నీ సరిగ్గా ఉంటే ఉద్యోగ ప్రకటనకు ఇబ్బందులు ఉండవు. బోర్డు సమావేశంలో కోరం ఆమోదంతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలుంటాయి. శనివారం సమావేశంలో తీసుకునే నిర్ణయంతో నోటిఫికేషన్లపై స్పష్టత రానుంది. -
టీఆర్ఏసీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. తెలంగాణ హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీఆర్ఏసీ) కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి ఈనెల 7న జారీచేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నియామక ప్రక్రియ నిలిపివేయాలని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పిటిషనర్లను విధుల నుంచి తొలగించడానికి వీల్లేదని న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ ఆదేశించారు. టీఆర్ఏసీ అదనపు డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో 2007 నుంచి విధులు నిర్వహిస్తున్నామని, తమను కాకుండా ఇతరులతో ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జి.వెంకట్రామయ్యతోపాటు మరో 14 మంది దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈ పోస్టులకు పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారని, వీరికి కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికే కాల్‌లెటర్లు పంపించారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలంటూ ఈమెయిల్ ద్వారా ఇతర అభ్యర్థులకు సమాచారం అందించారని వివరించగా.. కోర్టు పైవిధంగా స్పందించింది. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఇక్కడ అన్ని ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడును
ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగం ప్రతీ నిరుద్యోగి కల.. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల్లో కొలువులు తగ్గుతుండగా, నిరుద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు కొలువులు భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను ప్రకటించారు. త్వరలోనే భర్తీకి నోటిపికేషన్లు ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు, సర్కారు కొలువు కల నెరవేర్చుకునేందుకు ఎస్సీ, బీసీ, స్టడీ సర్కిళ్లు సన్నద్ధమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో రెండు స్టడీ సర్కిళ్లు.. సర్కారు కొలువు సాధించాలనే లక్ష్యంతో పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుపేద నిరుద్యోగులకు దారిచూపుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు. కొందరు ప్రిపరేషన్ కోసం హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు తరలుతున్నారు. మరికొందరు ఇంటి వద్దే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి, ప్రైవేట్ శిక్షణను పొందలేని, సరిగ్గా పుస్తకాలు సైతం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి స్థానికంగా ఉన్న స్టడీ సర్కిళ్లు ఆశా దీపాలుగా నిలుస్తున్నాయి. స్టడీ సర్కిళ్లలో సౌకర్యాలు... బీసీ స్టడీ సర్కిల్‌కు రూ.3.75 కోట్ల నిధులతో 2019లో అధునాతన భవనాన్ని నిర్మించారు. ఇందులో కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ, స్టడీ హాల్, డైనింగ్ హాల్, క్లాస్ రూం, గెస్ట్రూంలు, 16 హాస్టల్ రూంలు ఉన్నాయి. ఎస్సీ స్టడీ సర్కిల్‌ను 2016 అక్టోబర్‌లో ప్రారంభించారు. ఈ రెండు కేంద్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందజేయడమే కాకుండా వారిలో వివిధ నైపుణ్యాలు అభివృద్ధి చెందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 3,176 ఉద్యోగ ఖాళీలు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లోని 3,176 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 1,193, మంచిర్యాల 1,025, నిర్మల్ 876, కొమరం భీమ్ ఆసిఫాబాద్ 825 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు తమ కొలువుల కల సాకారం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సాధించిన విజయాలు.. ఇప్పటి వరకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 2,395 మంది అభ్యర్థులకు వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ అందించారు. 220 మంది ప్రభుత్వ కొలువులు సాధించారు. వీరిలో 10 మంది రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించారు. అత్యధికంగా 60మంది పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. 35మంది ఉపాధ్యాయులుగా, 43మంది పంచాయతీ సెక్రెటరీలుగా, 20మంది గురుకుల ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జాబ్‌మేళా ద్వారా 500మంది ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు సాధించారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటివరకు 600 మందికి శిక్షణ పొందారు. 107 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 43 మంది ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు సాధించారు. డిజిటల్ శిక్షణ... స్టడీ సర్కిల్లో దాదాపుగా ప్రతీ బ్యాచ్‌లో 100మందికి శిక్షణ ఇస్తారు. ప్రభుత్వం కొలువులు భర్తీ చే యనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు పెద్దసంఖ్యలో నిరు ద్యోగులకు శిక్షణ అందజేయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు డిజిటల్ విధానంలో శిక్షణ ఇవ్వడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. యూ ట్యూబ్, టీ–శాట్ చానళ్ల ద్వారా శిక్షణ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా రోజుకు 100 పోటీ పరీక్షల ప్రశ్నలను అభ్యర్థులకు తెలియజేయనున్నారు. డిజిటల్ శిక్షణ విధానంలో 2వేల నుంచి పది వేల మందికి శిక్షణ అందించే వెసులుబాటు ఉంది. అత్యున్నత శిక్షణ ఇస్తున్నారు.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్నాను. ఉపాధ్యాయ నియామక పరీక్షకు, అదేవిధంగా గ్రూప్–1, గ్రూప్–2 నియామక పరీక్షలకు సిద్ధమవుతున్నాను. స్టడీ సర్కిల్లో ఉచిత వసతితో పాటు నిత్యం 8గంటలు శిక్షణ ఇస్తున్నారు. – రాజ్‌కుమార్, బెజ్జూర్, కుమురంభీం ఆసిఫాబాద్ ప్రణాళికాబద్ధంగా చదువుతున్న స్టడీ సర్కిల్లో చక్కని శిక్షణ ఇస్తున్నారు. కానిస్టేబు ల్, ఎస్సై ఉద్యోగాల కో సం ప్రయత్నిస్తున్నాను. రెండు ఉద్యోగాలను సాధించే దిశగా ప్రణాళి కాబద్ధంగా చదువుతున్న. మొదటిసారి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పటికీ, స్టడీ సర్కిల్లో శిక్షణ ద్వారా మార్గనిర్ధేశం చేస్తున్నారు. ఉద్యోగం సాధిస్తాననే నమ్మకంతో ఉన్న. –జే.సుప్రియ, ఆదిలాబాద్, ఎస్సీ స్టడీ సర్కిల్ త్వరలోనే తరగతులు... బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ తరగతులు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తాం. గురుకుల, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన శిక్షణ ఇస్తాం. అన్ని వసతులతో కూడిన అధునాతన భవనంలో శిక్షణ అందిస్తాం. అభ్యర్థులను స్కీన్రింగ్ టెస్ట్ లేదా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తాం. –ప్రవీణ్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, ఆదిలాబాద్ లక్ష్యం చేరడానికి మార్గం.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగులకు తీపి కబురు. ఇటువంటి సమయంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎస్సీ, స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ పొంది తమ లక్ష్యం చేరడానికి మార్గం వేసుకోవాలి. ఎస్సీ, స్టడీ సర్కిల్లో నియామక ప్రకటనలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణ అందజేస్తాం. నిరుద్యోగులు తమ కొలువు కల సాధించే దిశగా కృషి చేస్తాం. –రమేశ్, ఎస్సీ స్టడీసర్కిల్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు.. ఈ టిప్స్ పాటిస్తే జాబ్ మీదే!
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనే సర్కారు ప్రకటనతో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. స్టడీ మెటీరియల్ కోసం పుస్తకాల షాపులను, నిపుణులను సంప్రదిస్తున్నారు. మరోవైపు స్టడీ హాళ్లు, లైబ్రరీలు సందడిగా మారాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, దిల్‌సుక్‌నగర్, తదితర ప్రాంతాలోని కోచింగ్ సెంటర్లకు అభ్యర్థులు వెల్లువెత్తుతున్నారు. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు పోటీ పరీక్షలనగానే ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆందోళనకు గురవుతారు. ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించేందుకు సానుకూలమైన దృక్పథంతో అధ్యయనం ఆరంభించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి.. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారు మొదట స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎంపిక చేసుకున్న లక్ష్యం పట్ల బలమైన ఆకాంక్షను కలిగి ఉండాలి. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి దరఖాస్తు చేస్తున్నాం అనే మొక్కుబడి వైఖరితో కాకుండా ఆ ఉద్యోగం తనకు ఎందుకు తప్పనిసరి అవసరమనే విషయంపై స్పష్టత ఏర్పర్చుకోవాలి. అనంతరం పరీక్షలకు అవసరమైన మెటీరియల్, కోచింగ్ వంటివి సమకూర్చుకొని మానసిక, శారీరక సంసిద్ధతతో ప్రిపరేషన్ ఆరంభించాలి. సంశయాత్మక వైఖరి కూడదు.. ప్రిపరేషన్ ప్రారంభించిన తర్వాత కూడా చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. లక్షలాది మందితో పోటీపడడం తనకు సాధ్యం కాదేమోననే ఆందోళనకు గురవుతారు. తమ చుట్టూ ఉన్నవారు బాగా చదువుతున్నారని, తాము మాత్రమే వెనుకబడిపోతున్నామనే భావన కొంతమందిని వెంటాడుతుంది. ఇలాంటి సంశయాత్మక వైఖరి వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. తాము తప్పకుండా విజయం సాధిస్తామనే సానుకూలమైన భావనతో అధ్యయనం మొదలుపెట్టాలి. రాయబోయే పోటీపరీక్షలో తాను విజేతగా నిలవబోతున్నాననే ప్రగాఢమైన నమ్మకంతో సన్నద్ధం కావాలి. కఠినమైన అంశాలపై దృష్టి సారించాలి.. సాధారణంగా చాలా మంది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో తేలిగ్గా ఉండే అంశాలతో ప్రారంభించి ఆ తర్వాత కఠినమైన అంశాల్లోకి వెళ్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికి వారు తమకు కఠినమైనవిగా అనిపించిన పాఠ్యాంశాలను మొదట ఓ పట్టుపడితే ఆ తర్వాత తేలిగ్గా ఉన్న అంశాలను వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. మన స్థాయిని అంచనా వేసుకోవాలి.. ఇతరులతో పోల్చుకొని తాము వెనుకబడిపోతున్నామని ఆందోళనకు గురికావొద్దు. తోటివారితో పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ తమ ప్రిపరేషన్‌ను నిరుత్సాహానికి గురి చేసేలా ఉండకూడదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దాని కంటే ఆ రోజు చదివిన అంశాలపై మన అవగాహన ఏ స్థాయిలో ఉంది అనేది అంచనా వేసుకోవడం మంచిది. – డాక్టర్ గీత చల్లా, మానసిక నిపుణులు ప్రశాంతంగా ఉండాలి.. ప్రిపరేషన్ సమయంలో ఆందోళనకు గురైతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా అలవర్చుకోవాలి. దీంతో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటాయి. అలసట లేకుండా అధ్యయనం చేయగలుగుతారు. సరైన నిద్ర, చక్కటి పోషకాహారం కూడా ఈ సమయంలో ఎంతో అవసరం. – డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్ట్ -
ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. ఉగాది నాటికి తొలివిడత నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది. ఏప్రిల్ 2న ఉగాది పండుగ జరుపుకోనుండగా, మరో రెండువారాల్లోగా తొలి విడత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 27 ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దశలవారీగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా 30 వేల నుంచి 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఎక్కువ మంది ఈ మెగా ఉద్యోగమేళాలో భాగం పంచుకోవాలన్న ఉద్దేశంతో విడతలవారీగా ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం. ఒకేసారి 80 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడం వల్ల ఇబ్బందులుంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కాగా, వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగ ఖాళీల సమాచారంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. గురువారంనాటికి 10 ప్రభుత్వ శాఖలు కొలువుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించాయి. హోం, వైద్యారోగ్య, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. హోంశాఖలో 18,334 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 12,755, పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు కొన్ని మార్పులను సూచించగా ఒకటి రెండు రోజుల్లో ఆ శాఖల నుంచి తుది ప్రతిపాదనలు మళ్లీ ఆర్థిక శాఖకు అందనున్నాయి. సీఎం సూచనలు అందిన వెంటనే జీవోలు సీఎం కేసీఆర్ నుంచి సూచనలు అందిన వెంట నే శాఖల వారీగా తొలివిడత పోస్టుల భర్తీకి పరిపాలనాఅనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేయనుంది. ఆ వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా నియామక సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారంలో ఎక్కడా తేడా రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్లో ఎలాంటి తప్పులు రాకుండా తగిన చర్యలు చేపట్టారు. తొలివిడత నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ రెండువారాల్లో పూర్తి కానుందని, వచ్చే నెల ప్రారంభంలో నోటిఫికేషన్లు రావచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ఆంధ్రప్రదేశ్: త్వరలో 1,180 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మరో వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఈ నెలాఖరున నోటిఫికేషన్లు విడుదల చేసేలా కమిషన్ కసరత్తు పూర్తి చేసి అంతా సిద్ధంగా ఉంచింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్ క్యాటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి మే నెలలో ముగిసింది. ఈ నేపథ్యంలో రిజర్వుడ్ అభ్యర్ధుల గరిష్ట వయో పరిమితి ఉత్తర్వుల పొడిగింపుపై కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు ప్రభుత్వం ఇంతకు ముందే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కోటాలో పోస్టులు మిగిలితే కనుక వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం కమిషన్ లేఖ రాసింది. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. 1,180 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో 49 విడుదల చేయడం తెలిసిందే. రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ కోటా మిగులు పోస్టులపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే 15 విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తూ పోస్టుల భర్తీకి కమిషన్ చర్యలు చేపట్టనుంది. -
Telangana: 56,979 కొలువులేవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఉద్యో గాలను భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నా.. ఇప్పటికీ నోటిఫికేషన్లు రాకపోవడంపై నిరుద్యో గులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏళ్లుగా నిరీక్షిస్తున్నామని, ఇంకెన్నాళ్లు వేచిచూడాలని ఆవేదన చెందుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్టు ఆర్థిక శాఖ నాలుగైదు నెలల కిందటే ప్రకటించింది. మూడు నెలల క్రితం ఉద్యోగ ఖాళీల సంఖ్యను తేల్చింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారంతో మొత్తం 57వేలకుపైగా ఖాళీలు ఉన్నట్టు గుర్తించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడంతో.. ఉద్యోగాల భర్తీ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. పోస్టుల విభజన కోసం.. కొత్త జోనల్ విధానం ఆధారంగా.. జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయిల్లో పోస్టుల విభజన, కొత్త జిల్లాల మధ్య పంపిణీ వంటి అంశాలను తేల్చడంపై ఆర్థికశాఖ దృష్టి పెట్టింది. తాజాగా ఈ కసరత్తు కూడా ఓ కొలిక్కి వచ్చిందని.. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 67 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నట్టు తేలిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఈ ఖాళీల వివరాలను ఆమోదించాల్సి ఉందని.. ఆ తర్వాత మార్గదర్శకాలు రూపొందించి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో.. లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేదు కొత్త జోనల్ విధానం నేపథ్యంలో మూడున్నరేళ్లుగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. అంతకుముందే జారీ అయిన కొన్ని నోటిఫికేషన్ల ప్రక్రియ మాత్రమే కొనసాగింది. కొత్త నోటిఫికేషన్లేవీ విడుదల కాలేదు. అయితే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీకి చర్యలు చేపడతామని ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపింది. దీనిపై సీఎం ఆదేశాల మేరకు అధికారులు హడావుడిగా కసరత్తు మొదలుపెట్టారు. వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల వారీగా ఖాళీల జాబితాను రూపొందించాయి. రాష్ట్రవ్యాప్తంగా 56,979 నేరుగా భర్తీ చేసే (డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించాయి. ఇందులో ప్రభుత్వ శాఖల్లో 44,022 ఉద్యోగాలు.. సొసైటీలు, కార్పొరేషన్ల పరిధిలో 12,957 ఉద్యోగాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఇదే సమయంలో కొత్త జోనల్ విధానంలో సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త విధానానికి అనుగుణంగా.. ఏ జిల్లాకు, జోన్‌కు నష్టం జరగకుండా మళ్లీ ఉద్యోగ ఖాళీలు, అవసరాల లెక్క తీశారు. దీని ప్రకారం.. 67 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ తేల్చింది. అడ్డంకులు తొలగిపోయినా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో సర్వీసు సంబంధిత అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని.. కానీ కొత్త నియామకాల విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంతకుముందు జిల్లాస్థాయి నియామకాల కమిటీ (డీఎస్సీ)లు ఉండేవి. ప్రభుత్వం వాటిని రద్దు చేసి.. దాదాపు అన్నిరకాల ఉద్యోగాల భర్తీని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఇతర నియామకాల బోర్డుల ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్పీఆర్బీ), తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎంఆర్బీ)ల ద్వారా నియామకాలు చేపడుతున్నారు. వివిధ ప్రభుత్వశాఖల్లో పోస్టుల సంఖ్య, నియామకాల ఆవశ్యకత ఆధారంగా ప్రభుత్వం ఆయా శాఖలకు అధికారాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసింది. ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ శాఖలు గుర్తించిన ఖాళీలను ఇప్పటికిప్పుడు భర్తీ చేసుకునే వీలుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. మరోవైపు సొసైటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 12,957 పోస్టుల భర్తీకి సర్వీసు నిబంధనల అడ్డంకులు ఉన్నాయని అంటున్నాయి. ప్రభుత్వం గుర్తించిన 67 వేల ఖాళ్లలో టీచర్ పోస్టులు లేవు. ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయితే తప్ప ఖాళీల లెక్క తేలే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అంటే టీచర్ పోస్టుల భర్తీపై ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేడర్ స్ట్రెంత్ కొలిక్కి.. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించి శాఖలవారీగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. కేడర్ వారీగా జిల్లా, జోనల్, మల్టీజోనల్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి కౌన్సెలింగ్ పూర్తిచేస్తే.. విభజన ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు ప్రభుత్వ రంగ విభాగాలైన వివిధ సొసైటీలు, కార్పొరేషన్లలోని పోస్టుల విభజన ఇంకా జరగలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. వయసైపోతోంది ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు పలు సడలింపులు ఉన్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో వయసు పెరిగి.. ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి ఉందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017 జూన్ నాటి గణాంకాల ప్రకారం.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) కింద 24,62,032 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో పురుషులు 14,71,205, మహిళలు 9,90,827 మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ నాటికి 40 ఏళ్లు దాటినవారు 40,994 మంది ఉన్నారు. ప్రస్తుతం వారికి 44 ఏళ్లు దాటి ఉద్యోగాలకు అనర్హులు కానున్నారు. పీఆర్సీ చెప్పిన ఖాళీలు 1.9 లక్షలు మాజీ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తొలి వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) తమ నివేదికలో రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని పేర్కొంది. అయితే అందులో పలు నోటిఫికేషన్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ నియామకాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని అధికారవర్గాలు చెప్తున్నాయి. అవిపోగా మిగతా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడిస్తున్నాయి. -
ఇక పోస్టుల భర్తీ చకచకా.. ఏపీపీఎస్సీ కసరత్తు
సాక్షి, అమరావతి: ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు చకచకా భర్తీ కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపట్టి ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కసరత్తు చేపట్టింది. ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి పోస్టుల భర్తీ ప్రక్రియను నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం ఏపీపీఎస్సీ సమావేశం జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించారు. నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, అభ్యర్థుల ఎంపిక తదితర ప్రక్రియలను త్వరత్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ వంటి అంశాల్లో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 1,180 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నివేదించగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయడంపై సమావేశంలో చర్చించారు. విడుదలైన నోటిఫికేషన్లలో పోస్టుల భర్తీపైనా .. గత టీడీపీ సర్కారు ఐదేళ్లపాటు ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయించి చేతులు దులుపుకుంది. అప్పట్లో ప్రభుత్వంపై నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలతో ఉండటంతో వారిని పక్కదోవ పట్టించేందుకు, వారి దృష్టిని ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దారి మళ్లించేందుకు ఈ నోటిఫికేషన్లను ఇచ్చింది. కేవలం ఎన్నికల దృష్టితో ఇచ్చిన ఈ నోటిఫికేషన్లన్నీ లోపభూయిష్టంగా ఉండటం, అప్పట్లో జరిగిన పరీక్షలు, ఇతర అంశాలు అవకతవకల మయంగా మారడంతో వాటిపై న్యాయపరమైన, ఇతర వివాదాలు తలెత్తాయి. అప్పటి నోటిఫికేషన్లకు సంబంధించిన పలు పోస్టులకు సంబంధించి న్యాయ వివాదాలను పరిష్కరింపచేస్తూ ప్రస్తుత కమిషన్ భర్తీ చేసింది. మొత్తం 32 నోటిఫికేషన్లకు సంబంధించిన 3,944 పోస్టులలో ఇప్పటికే 3,013కి పైగా పోస్టుల్లో నియామకాలను ప్రస్తుత కమిషన్ పూర్తి చేయించింది. ఇతర పోస్టులపైనా వివాదాలను పరిష్కరింపజేసి నియామకాలు పూర్తి చేయించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. కోర్టు కేసులతో ఆగిపోయిన నియామకాలను తీర్పులు వచ్చిన వెంటనే భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఇటీవల ఆమోదం లభించిన 1,180 పోస్టులతో పాటు మరికొన్ని గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీకి అవకాశముందని, వాటన్నిటినీ కలుపుకుని ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కమిషన్ వర్గాలు వివరించాయి. -
టీఎస్పీఎస్సీలోనే ఖాళీలు, ఇక నోటిఫికేషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే కమిషన్ కార్యాలయంలో ఖాళీలు ఏర్పడ్డాయి. రెండు నెలలుగా అవి భర్తీకి నోచుకోవడంలేదు. దీంతో కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకపాత్ర పోషించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరిస్థితి. గతేడాది డిసెంబర్లో కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితోపాటు ఇద్దరు సభ్యులు సి.విఠల్, చంద్రావతి పదవీకాలం పూర్తయింది. దీంతో మిగిలిన ఇద్దరు సభ్యులు కృష్ణారెడ్డి, సాయిలు మాత్రమే కొనసాగుతున్నారు. వీరిలో ఇన్చార్జి చైర్మన్‌గా కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. తాజాగా కృష్ణారెడ్డి ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఎస్పీఎస్సీలో కేవలం ఒక్కరు మాత్రమే మెంబర్‌గా కొనసాగనున్నారు. ఒక్క సభ్యుడితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొనసాగింపు అనేది మున్ముందు అయోమయంగా మారనుంది. ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఉద్యోగాలభర్తీకి సన్నద్ధమవుతున్న వేళ కమిషన్‌లో సభ్యులు లేకపోవడంతో నియామకాలపై సందిగ్ధత ఏర్పడే అవకాశముంది. కోరం ఉంటేనే నోటిఫికేషన్లు... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ ప్రకటనలు వెలువడాలంటే చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యులు తప్పకుండా ఉండాలి. వారి ఆమోదంతోనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా నిబంధనలున్నాయి. కానీ, ప్రస్తుతం ఇద్దరుసభ్యులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరు ఇన్చార్జి చైర్మన్‌గా ఉండగా, మరొకరు మాత్రమే సభ్యుడిగా కొనసాగుతుండటంతో ఇప్పటికిప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి లేదని కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే శాఖలవారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. మంజూరైన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీలను లెక్కిస్తూ శాఖలవారీగా అంచనాలపై ఆర్థికశాఖ స్పష్టమైన నివేదికను తయారు చేసి ఉంచింది. ఆర్థికశాఖ అనుమతి ఇస్తే ప్రభుత్వం ఉద్యోగఖాళీల భర్తీకి ఇండెంట్లు వెలువడతాయి. ఇండెంట్లు వచ్చిన వెంటనే నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, నోటిఫికేషన్ల విడుదల కోరం మాత్రం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 39,952 పోస్టుల భర్తీకి అనుమతులు రాగా... అందులో అన్ని వివరాలు అందిన 36,758 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేశారు. అన్నింటికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించగా, 35,724 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 31,062 మంది ఉద్యోగాలలో చేరిపోయారు. మిగతా ప్రక్రియ కొనసాగుతోంది. -
వచ్చే నెలలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీని కోసం నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో త్వరితంగా నోటిఫికేషన్ల విడుదలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రాథమికంగా 12 వేల నుంచి 15 వేల వరకు ఖాళీలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యాశాఖలోని దాదాపు 18 వేల మందికి పదోన్నతులు కల్పించారు. వీరిలో 10 వేల మందికి పైగా పై స్థానాలకు వెళ్లడంతో కింది పోస్టులు ఖాళీ అయ్యాయి. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ఆ పోస్టుల్లోకి కూడా పదోన్నతులు కల్పించారు. ప్రస్తుత డీఎస్సీలో ఈ ఖాళీలు కూడా చేరనున్నాయి. పోస్టుల వారీగా ఖాళీల సమగ్ర సమాచారాన్ని ఆయా జిల్లాల నుంచి రప్పించేందుకు అధికారులకు ఆదేశాలు పంపనున్నామని అధికారులు తెలిపారు. అలాగే, మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఆ శాఖ నుంచి తెప్పిస్తున్నారు. జనవరి మొదటి వారంలో టెట్..ఆఖర్లో డీఎస్సీ నోటిఫికేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ముందుగా టీచర్ అర్హత పరీక్షను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. గతంలో టీచర్ అర్హత పరీక్ష (టెట్)ను, టీచర్ నియామక పరీక్ష (టీఆర్టీ)ని కలిపి టెట్ కమ్ టీఆర్టీగా నిర్వహించారు. అయితే, ఈసారి రెండింటినీ కలపకుండా వేర్వేరుగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం.. టెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహించాలి. 2018లో టెట్‌ను ఒకసారి నిర్వహించారు. ఈ ఏడాదిలో ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర కారణాలవల్ల దానిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో.. ఏటా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో టెట్, డీఎస్సీల నిర్వహణకు అడుగులు వేస్తున్నారు. డీఎస్సీ కన్నా ముందుగా టెట్ నోటిఫికేషన్‌ను జనవరి మొదటి వారంలో ఆ తరువాత నెలాఖరున డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి. ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరి ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వరకు వచ్చే ఏడాది నుంచి, ఆ తరువాతి ఏళ్లలో వరుసగా ఇతర తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనా నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండేలా టెట్, డీఎస్సీలలో సంబంధిత అంశాలపై ప్రశ్నలు పొందుపర్చనున్నారు. టెట్ పేపర్–1, 2 రెండింటిలోనూ ఇంగ్లీషు ప్రావీణ్యంపై ప్రశ్నలున్నాయి. పేపర్–2ఏలో భాషాంశాలు, కమ్యూనికేషన్ ఇతర సమగ్ర నైపుణ్యాలు పరీక్షిస్తున్నారు. కాగా, డీఎస్సీ–2018లో కొన్ని ప్రత్యేక పోస్టులకు ఆంగ్ల నైపుణ్యాలపై ఒక పేపర్‌గా పెట్టారు. ఈసారి ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో ఎంపికయ్యే టీచర్లలో ఆంగ్ల నైపుణ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక పేపర్ పెట్టనున్నారు. అలాగే, టెట్‌లో ఇప్పుడు అడుగుతున్న అంశాలకు అదనంగా మరికొన్ని అంశాలను చేర్చనున్నారు. డీఎస్సీలో అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రత్యేక పేపర్ ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ఎదురుచూపు గత ఏడాదిలో డీఎడ్, బీఎడ్ కోర్సు పూర్తిచేసిన ఒక బ్యాచ్ అభ్యర్థులతో పాటు తాజాగా ఈ కోర్సులు పూర్తయిన వారు కూడా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో నిర్వహించిన టెట్లలో అర్హత సాధించలేని వేలాది మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు టెట్ నోటిఫికేషన్‌పై దృష్టిసారించారు. డీఎడ్ అభ్యర్థులు రెండు బ్యాచ్‌లు కలిపి 80వేల మంది, బీఎడ్ అభ్యర్థులు 30వేల మందితో పాటు గతంలోని అభ్యర్థులూ వేలల్లోనే ఉన్నారు. -
ఉద్యోగాలు జో ‘నిల్’
ప్రభుత్వ శాఖల్లో కొత్త నియామకాలు ఇప్పట్లో కష్టమే. గతేడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్ విధానంతో ఈ పరిస్థితి తలెత్తింది. అంతకుముందున్న విధానంతో ఉద్యోగాలను భర్తీ చేసిన నియామక సంస్థలు కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగాల ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల విడుదలకు బ్రేక్ వేశాయి. ప్రభుత్వం ఆమోదించిన పోస్టులను సైతం భర్తీ చేయకుండా వాయిదా వేశాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి వివిధ నియామక సంస్థలు ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల విభజన, పోస్టుల సర్దుబాట్లు, ఖాళీలపై స్పష్టత వచ్చే వరకు నూతన నియామకాలు చేపట్టే అవకాశాలు లేవనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారీ కొలువుపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం మరికొంతకాలం వేచిచూడాల్సిందే. – సాక్షి, హైదరాబాద్ కొత్త విధానమేమిటంటే.. రాష్ట్రంలో నూతన జోనల్ విధానాన్ని ఆమోదిస్తూ గత ఆగస్టులో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు, 31 జిల్లాలుగా విభజించారు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో మల్టీజోన్లు, జోన్ల పరిధిలో ఏయే జిల్లాలు వస్తాయనే అంశంపై స్పష్టత లేదు. రాష్ట్రంలో ఇదివరకు రెండు జోన్లు, 10 జిల్లాల మేరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో స్థానికత, కేడర్ ఆధారంగా మల్టీజోన్లు, జోన్లు, జిల్లా స్థాయిలో ఉద్యోగులను విభజించాలి. దీనికి ప్రతి ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వాలి. ఉద్యోగుల సుముఖత, శాఖల సౌలభ్యం ప్రకారం విభజన ప్రక్రియ పూర్తయితేనే కేటగిరీల వారీగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై స్పష్టత వస్తుంది. ఈ రెండు ప్రధాన కారణాలతో ఉద్యోగ నియామకాలకు బ్రేక్ పడింది. ఆ నోటిఫికేషన్ల సంగతి.. గతేడాది రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే నాటికే ప్రభుత్వం కొన్ని రకాల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సంబంధిత నియామక సంస్థలకు పంపగా.. నోటిఫికేషన్ల రూపకల్పన దాదాపు పూర్తయింది. చివరి నిమిషంలో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడటం.. కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. టీఎస్పీఎస్సీ, గురుకుల, మెడికల్ బోర్డుల పరిధిలో 8,547 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పరిధిలో గ్రూప్–1 కేటగిరీలో 138, గ్రూప్–2 కేటగిరీలో 60, గ్రూప్–3 కేటగిరీలో 339, అదేవిధంగా 117 అసిస్టెంట్ ఇంజనీర్, 58 డ్రాఫ్ట్‌మన్, 68 దేవాదాయ, 31 అటవీ అధికారి, 260 రెవెన్యూ అధికారి, 287 కార్మిక ఉపాధి కల్పన, 208 రోడ్డు రవాణా సంస్థ విభాగాలతో పాటు మరిన్ని శాఖల్లో సింగిల్ డిజిట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసే క్రమంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ►తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, లైబ్రేరియన్, క్రాఫ్ట్, ఆర్ట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టాఫ్ నర్సు కేటగిరీల్లో దాదాపు 2,440 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ బోర్డు నుంచి ఏడాదిన్నరగా నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ►తెలంగాణ రాష్ట్ర వైద్య నియామకాల బోర్డు పరిధిలో కూడా డాక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్స్, హెల్త్ అసిస్టెంట్ తదితర కేటగిరీల్లో 4,150 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటివరకు నోటిఫికేషన్లు వెలువడలేదు. -
త్వరలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీని 31 జిల్లాల ప్రకారమే చేపట్టే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన ములుగు, నారాయణ్‌పేట్ కలుపుకొని 33 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో 31 జిల్లాల ప్రకారమే ముందుకు సాగాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ) భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు సమాచారం. దీంతో గురుకులాల్లోని 2,500 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. మొత్తం 5 శాఖలకు చెందిన గురుకులాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులకు సంబంధించిన వివరాలను ఆయా గురుకులాల సొసైటీల కార్యదర్శులు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 1,900 పోస్టులు బీసీ గురుకులాలకు చెందినవి కాగా, మరో 600 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. 1,900 పోస్టులు బీసీ గురుకులాల్లోనే.. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ గురుకులాలు 261 ఉండగా, అందు లో 119 గురుకులాలు ఈ ఏడాదే ప్రారంభం అయ్యాయి. వాటిల్లోనే 1,900 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 1,071 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), 119 స్టాఫ్‌నర్స్, 119 లైబ్రేరియన్స్, 119 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు, 110 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే పీజీటీ హిందీ–100, ఫిజికల్ డైరెక్టర్స్–70 పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా మరో 192 పోస్టులను మిగతా బీసీ గురుకులాల్లో భర్తీ చేయనున్నారు. ఇతర సంక్షేమ శాఖలకు చెందిన గురుకులాల్లో మరో 600 వరకు బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆయా పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు సీఎస్‌కు లేఖ రాసింది. -
గిరిజన వర్సిటీ ప్రవేశాలు లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీ ఈ ఏడాది కూడా అందుబాటులోకి వచ్చేలా లేదు. వాస్తవానికి 2019–20 విద్యా సంవత్సరం నుంచి మహబూబాబాద్ జిల్లాలో ఈ వర్సిటీని ప్రారంభించాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈమేరకు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సూచనలు సైతం చేశారు. నిర్దేశిత యూజీ, పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాలి. ఈక్రమంలో హెచ్‌సీయూ ద్వారా విడుదలయ్యే నోటిఫికేషన్ ద్వారా గిరిజన యూనివర్సిటీ ప్రవేశాలు జరుగుతాయని భావించారు. ఇటీవల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పలు పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఇందులో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. స్థలం కేటాయింపు... భవనాల అప్పగింత గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 483 ఎకరాల భూమిని కేటాయించగా, ఇప్పటికే మెజార్టీ భూమిని రెవెన్యూ అధికారులు గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించారు. తక్షణమే తరగతులు నిర్వహించుకునేందుకు వీలుగా యూత్ ట్రైనింగ్ సెంటర్ కోసం కేటాయించిన భవనాన్ని వర్సిటీకి గిరిజన సంక్షేమ శాఖ అప్పగించింది. దీంతో ఇప్పటికిప్పుడు తరగతులు మొదలుపెట్టే వీలుంది. అయితే డిగ్రీ, పీజీ కేటగిరీల్లో నిర్దేశిత కోర్సుల్లో ప్రవేశాలు, బోధన తదితర బాధ్యతలన్నీ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి అప్పగించింది. అయితే, ఇప్పటికీ గిరిజన వర్సిటీ ఊసే ఎక్కడా కనిపించడం లేదు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు నోటిఫికేషన్లు జారీ చేయగా, చాలావాటికి దరఖాస్తుల స్వీకరణ గడువు సైతం ముంచుకొస్తోంది. గిరిజన యూనివర్సిటీ ప్రవేశ బాధ్యతలు ప్రభుత్వం హెచ్సీయూకు అప్పగించిన నేపథ్యంలో హెచ్‌సీయూ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు జరుగుతాయని అంతా భావించారు. ఇటీవల హెచ్‌సీయూ నోటిఫికేషన్లో గిరిజన వర్సిటీ ప్రవేశాల సమాచారం లేకపోవడంతో ఈ ఏడాది కూడా గిరిజన వర్సిటీ అందుబాటులోకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు కోర్సులకు అవకాశం ఉన్నా... 2019–20 విద్యా సంవత్సరంలో గిరిజన యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే తొలుత ఆరు కోర్సులను ప్రారంభించాలి. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులున్నాయి. డిగ్రీలో బీఏ (హోటల్ మేనేజ్మెంట్), బీసీఏ, బీబీఏ, పీజీ కేటగిరీలో ఎంసీఏ, ఎంబీఏ (మార్కెటింగ్, ప్యాకేజింగ్), ఎంఏ (గిరిజన సంస్కృతి, జానపద కళలు) కోర్సులను ప్రారంభిస్తారు. మరిన్ని పీజీ, పీహెచ్డీ కోర్సులను దశలవారీగా అందుబాటులోకి తెస్తారు. తొలిఏడాది ప్రారం భించే కోర్సుల్లో మొత్తంగా 180 మందికి ప్రవేశా లు కల్పిస్తారు. ఏటా తరగతులు పెరుగుతూ, కొత్త కోర్సుల్లో ప్రవేశాలతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. గిరిజనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కావడంతో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశాల్లో 30 శాతం సీట్లు వారికి కేటాయించనుంది. కానీ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లే విడుదల కాకపోవడంతో గందరగోళం నెలకొంది.