మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్‌: సీఎం రేవంత్‌ | Cm Revanth Said Another 35 Thousand Posts Will Be Notified Soon | Sakshi
Sakshi News home page

మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌: సీఎం రేవంత్‌

Published Wed, Sep 25 2024 2:35 PM | Last Updated on Wed, Sep 25 2024 3:36 PM

Cm Revanth Said Another 35 Thousand Posts Will Be Notified Soon

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని.. మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్‌ ప్రోగ్రామ్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది’’ అని సీఎం రేవంత్‌ అన్నారు.

‘‘నిరుద్యోగుల దశ, దిశ నిర్దేశించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కార్పొరేషన్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద నిధులు ఇస్తున్నాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్‌, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్‌ ఉంది.’’ అని సీఎం రేవంత్‌ తెలిపారు.

ఇదీ చదవండి: నా కాలేజీలు కాంగ్రెస్‌ హయాంలో కట్టినవే: మాజీ మంత్రి మల్లారెడ్డి

‘‘ప్రతిభ ఉన్నా.. నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టాం. తెలంగాణలో ప్రతీ ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐ తో మాట్లాడాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.

ఈ శిక్షణ తరువాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ లో ఉద్యోగాలు పొందుతారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే మా లక్ష్యం. గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ఇటీవల పట్టుబడినవారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమైన విషయం. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.

65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం.. రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం.. ఇంజనీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించాం. కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయడం ఖాయం. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తున్నాం.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నాం. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు.. నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నాం. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలి. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టాలి. అందుకు మీ అందరి సహకారం అవసరం.

రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీ ఏర్పాటు చేస్తాం. తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారు. అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతాం’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement