Telangana: 56,979 కొలువులేవీ? | Telangana Unemployed JAC Attempts To Siege Pragati Bhavan In Demand For Job Notification | Sakshi
Sakshi News home page

Telangana: 56,979 కొలువులేవీ?

Published Wed, Aug 25 2021 3:36 AM | Last Updated on Wed, Aug 25 2021 3:38 AM

Telangana Unemployed JAC Attempts To Siege Pragati Bhavan In Demand For Job Notification - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీగా ఉద్యో గాలను భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నా.. ఇప్పటికీ నోటిఫికేషన్లు రాకపోవడంపై నిరుద్యో గులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏళ్లుగా నిరీక్షిస్తున్నామని, ఇంకెన్నాళ్లు వేచిచూడాలని ఆవేదన చెందుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్టు ఆర్థిక శాఖ నాలుగైదు నెలల కిందటే ప్రకటించింది. మూడు నెలల క్రితం ఉద్యోగ ఖాళీల సంఖ్యను తేల్చింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారంతో మొత్తం 57వేలకుపైగా ఖాళీలు ఉన్నట్టు గుర్తించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త జోనల్‌ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడంతో.. ఉద్యోగాల భర్తీ అంశం మళ్లీ మొదటికి వచ్చింది.

పోస్టుల విభజన కోసం..
కొత్త జోనల్‌ విధానం ఆధారంగా.. జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయిల్లో పోస్టుల విభజన, కొత్త జిల్లాల మధ్య పంపిణీ వంటి అంశాలను తేల్చడంపై ఆర్థికశాఖ దృష్టి పెట్టింది. తాజాగా ఈ కసరత్తు కూడా ఓ కొలిక్కి వచ్చిందని.. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 67 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నట్టు తేలిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఈ ఖాళీల వివరాలను ఆమోదించాల్సి ఉందని.. ఆ తర్వాత మార్గదర్శకాలు రూపొందించి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో.. లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మూడున్నరేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ లేదు
కొత్త జోనల్‌ విధానం నేపథ్యంలో మూడున్నరేళ్లుగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. అంతకుముందే జారీ అయిన కొన్ని నోటిఫికేషన్ల ప్రక్రియ మాత్రమే కొనసాగింది. కొత్త నోటిఫికేషన్లేవీ విడుదల కాలేదు. అయితే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీకి చర్యలు చేపడతామని ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపింది. దీనిపై సీఎం ఆదేశాల మేరకు అధికారులు హడావుడిగా కసరత్తు మొదలుపెట్టారు. వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల వారీగా ఖాళీల జాబితాను రూపొందించాయి. రాష్ట్రవ్యాప్తంగా 56,979 నేరుగా భర్తీ చేసే (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించాయి. ఇందులో ప్రభుత్వ శాఖల్లో 44,022 ఉద్యోగాలు.. సొసైటీలు, కార్పొరేషన్ల పరిధిలో 12,957 ఉద్యోగాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఇదే సమయంలో కొత్త జోనల్‌ విధానంలో సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త విధానానికి అనుగుణంగా.. ఏ జిల్లాకు, జోన్‌కు నష్టం జరగకుండా మళ్లీ ఉద్యోగ ఖాళీలు, అవసరాల లెక్క తీశారు. దీని ప్రకారం.. 67 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ తేల్చింది.

అడ్డంకులు తొలగిపోయినా..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో సర్వీసు సంబంధిత అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని.. కానీ కొత్త నియామకాల విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంతకుముందు జిల్లాస్థాయి నియామకాల కమిటీ (డీఎస్‌సీ)లు ఉండేవి. ప్రభుత్వం వాటిని రద్దు చేసి.. దాదాపు అన్నిరకాల ఉద్యోగాల భర్తీని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లేదా ఇతర నియామకాల బోర్డుల ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఎస్‌పీఆర్‌బీ), తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎంఆర్‌బీ)ల ద్వారా నియామకాలు చేపడుతున్నారు. 

వివిధ ప్రభుత్వశాఖల్లో పోస్టుల సంఖ్య, నియామకాల ఆవశ్యకత ఆధారంగా ప్రభుత్వం ఆయా శాఖలకు అధికారాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేకంగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసింది. ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ శాఖలు గుర్తించిన ఖాళీలను ఇప్పటికిప్పుడు భర్తీ చేసుకునే వీలుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. మరోవైపు సొసైటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 12,957 పోస్టుల భర్తీకి సర్వీసు నిబంధనల అడ్డంకులు ఉన్నాయని అంటున్నాయి.

ప్రభుత్వం గుర్తించిన 67 వేల ఖాళ్లలో టీచర్‌ పోస్టులు లేవు. ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయితే తప్ప ఖాళీల లెక్క తేలే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అంటే టీచర్‌ పోస్టుల భర్తీపై ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేడర్‌ స్ట్రెంత్‌ కొలిక్కి..
కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించి శాఖలవారీగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. కేడర్‌ వారీగా జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి కౌన్సెలింగ్‌ పూర్తిచేస్తే.. విభజన ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు ప్రభుత్వ రంగ విభాగాలైన వివిధ సొసైటీలు, కార్పొరేషన్లలోని పోస్టుల విభజన ఇంకా జరగలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.

వయసైపోతోంది
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు పలు సడలింపులు ఉన్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో వయసు పెరిగి.. ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి ఉందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017 జూన్‌ నాటి గణాంకాల ప్రకారం.. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో వన్‌ టైం రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) కింద 24,62,032 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇందులో పురుషులు 14,71,205, మహిళలు 9,90,827 మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్‌ నాటికి 40 ఏళ్లు దాటినవారు 40,994 మంది ఉన్నారు. ప్రస్తుతం వారికి 44 ఏళ్లు దాటి ఉద్యోగాలకు అనర్హులు కానున్నారు.

పీఆర్సీ చెప్పిన ఖాళీలు 1.9 లక్షలు
మాజీ ఐఏఎస్‌ అధికారి సీఆర్‌ బిశ్వాల్‌ నేతృత్వంలోని తొలి వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) తమ నివేదికలో రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని పేర్కొంది. అయితే అందులో పలు నోటిఫికేషన్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ నియామకాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని అధికారవర్గాలు చెప్తున్నాయి. అవిపోగా మిగతా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement