ఆశల పల్లకిలో నిరుద్యోగులు | unemployees waiting for notifications | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకిలో నిరుద్యోగులు

Published Mon, Sep 29 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

ఆశల పల్లకిలో నిరుద్యోగులు

ఆశల పల్లకిలో నిరుద్యోగులు

 డిసెంబర్ మొదటివారం లేదా చివర్లో నోటిఫికేషన్లు!
 కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్న యువత
 
 సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో కొలువులు వెల్లువలా వస్తాయని తెలంగాణలోని నిరుద్యోగ యువత కోటిఆశలతో ఎదురు చూస్తోంది. నోటిఫికేషన్లు త్వరలోనే వెలువడనున్నాయని సంకేతాలు రావడంతో శిక్షణ కేంద్రాలకు పోటెత్తుతోంది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ కావడం, త్వరలోనే కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిరుద్యోగులంతా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.  గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ (టీచర్ పోస్టుల) తదితర పోటీ పరీక్షల్లో శిక్షణ కోసం హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో నగరంలో కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన అశోక్‌నగర్, చిక్కడపల్లి తదితర ప్రాంతాలు నిరుద్యోగ యువతి,యువకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం గాంధీనగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో సీటు కోసం వందలమంది నిరుద్యోగులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శిక్షణ కోసం వస్తున్న అభ్యర్థుల రద్దీని తట్టుకునేందుకు ఇక్కడ చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఒకేసారి నాలుగైదు బ్యాచ్‌లను కొనసాగిస్తున్నాయి.

 దసరా తర్వాత టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకం!

 ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యులను దసరా తరువాత నియమించేందుకు ఫైలు సిద్ధం చేస్తోంది. కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పడిన వెంటనే ప్రస్తుతం ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విభజనకు చర్యలు చేపట్టనుంది. మొత్తానికి వచ్చేనెలలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తరువాత పోటీ పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలపై దృష్టి సారించనుంది. అందుకు శాఖల వారీగా ఇండెంట్లు తెప్పించుకోవాల్సి ఉంది. మరోవైపు పరీక్షల సంస్కరణలు, వార్షిక కేలండర్‌ను ప్రకటించేం దుకు అవసరమైన చర్యలూ చేపట్టనుంది.

 మూడేళ్ల నుంచి నోటిఫికేషన్ల కరువు..

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్ల నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా సజావుగా జారీ కాలేదు. దీంతో గరిష్ట వయోపరిమితిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు అవసరమైన ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి జారీ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని నవంబర్ లోపు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. వీలైతే డిసెంబర్ మొదటి వారం లేదా చివరి వారంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది.
 
 కోచింగ్ కోసం బారులు
 
 ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కొత్త సినిమా వస్తే అభిమానులు టికెట్ల కోసం బారులు తీరడం మనకు తెలిసిందే...  దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా కోచింగ్ సెంటర్‌లో సీటు కోసం నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. ఆదివారం గాంధీనగర్‌లోని ఓ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-2 శిక్షణలో సీటు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా అభ్యర్థులు తరలివచ్చారు. ఇక్కడ గ్రూప్- 2 కోచింగ్ కోసం ఇప్పటికే మూడు బ్యాచ్‌లు నడుస్తుండగా మరో మూడు బ్యాచ్‌ల కోసం 1,500 దరఖాస్తులను ఇస్తున్నారని తెలియడంతో వందలాదిమంది నిరుద్యోగులు అర్ధరాత్రి నుంచే ఇక్కడ బారులు తీరారు. అలాగే, ఎన్‌బీకే ఎస్టేట్‌లో ఉన్న మరో ఇన్‌స్టిట్యూట్‌లో సీటు కోసం ఇదే విధంగా యువత బారులు తీరింది. అశోక్‌నగర్, చిక్కడపల్లిలోని దాదాపు ప్రతి కోచింగ్ సెంటర్ల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
 
 తెలంగాణలో 98 వేల ఖాళీలు..
 
 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 98,016 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఇవి కాకుండా ఈ మూడునాలుగు నెలల్లో ఖాళీ అయిన పోస్టులు వీటికి అదనం. అయితే వాటిలోని 20 నుంచి 25 వేల పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు పని చేస్తున్నట్లు అంచనా. మరోవైపు కొన్ని పదోన్నతులపై భర్తీ చేయాల్సిన పోస్టులు ఉన్నాయి. మొత్తానికి డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా దాదాపు 50 వేల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాటిల్లో ప్రధానంగా టీచర్ పోస్టులు 15 వేలు ఉండగా, జూనియర్ లెక్చరర్ పోస్టులు 2,500 వరకు ఉన్నాయి. మరోవైపు పోలీసు కానిస్టేబుల్, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 తదితర కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-4లో  నాలుగు వేలకు పైగా పోస్టులు రానున్నాయి.

 శాఖల వారీగా ఖాళీలు ఇవీ ...     

  • విద్యాశాఖలో: డిప్యూటీ డీఈఓ- 40, డిప్యూటీ ఐఓఎస్- 21, సీటీఈ లెక్చరర్స్- 48, డైట్ లెక్చరర్స్-166, ఎంఈఓ- 399 పోస్టులు ఉన్నాయి. వీటిలో 30 శాతం పోస్టులను డెరైక్ట్  రిక్రూట్‌మెంట్, మిగతావి పదోన్నతులపై భర్తీ చేస్తారు.
  •      టీచర్ కేటగిరీలో: పీజీటీ- 1,131, టీజీటీ- 719, డ్రాయింగ్, ఆర్ట్ టీచర్స్ - 254, క్రాఫ్ట్ టీచర్స్- 313, లాంగ్వేజ్ పండిట్- 765, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం -270, పీఈటీ - 404, స్కూల్ అసిస్టెంట్ - 3,367, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్ - 616, ఎస్‌జీటీ - 11,874,  వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్  - 184 పోస్టులను విద్యాశాఖ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పీఈటీ - 49, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) బయాలజీ - 164, ఎస్‌ఏ ఇంగ్లిష్ - 167, ఎస్‌ఏ హిందీ - 136, ఎస్‌ఏ మ్యాథ్స్ - 215, ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ - 186, ఎస్‌ఏ ఫిజికల్‌సైన్స్ - 233, ఎస్‌ఏ సోషల్ - 117, ఎస్‌ఏ తెలుగు - 130, ఎస్‌జీటీ - 473 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
  •      వైద్య శాఖలో: మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 3,500
  •      పంచాయతీరాజ్ శాఖలో: గ్రేడ్-1 పంచాయతీ సెక్రటరీ - 417, గ్రేడ్-2 పంచాయతీ సెక్రటరీ - 371, గ్రేడ్-4 పంచాయతీ సెక్రటరీ - 1,143, గ్రేడ్-3 పంచాయతీ సెక్రటరీ - 2,111, వీఆర్‌ఓ అండ్ వీఏఓ - 4,081, విలేజ్ సర్వెంట్- వీఆర్‌ఏ- 1,087 పోస్టులు ఉన్నాయి.
  •      పోలీసు శాఖలో: కానిస్టేబుల్ పోస్టులు 7 వేల వరకు ఉన్నాయి. వీటిని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.
  •     గ్రూప్-1 కేటగిరీలో: డీఎస్పీ-5, డివిజినల్ పంచాయతీ ఆఫీసర్- 2, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ -6, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-19, ఎంపీడీఓ-114, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-32 ఉన్నాయి.
  •     గ్రూప్-2 కేటగిరీలో: డిప్యూటీ తహసీల్దార్-156, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్- 77, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్-78, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్-45, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-4, ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్- 99, అగ్రికల్చర్ ఏవో -290 తదితర పోస్టులు ఉన్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement