సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీఆర్‌ఏసీ) కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి ఈనెల 7న జారీచేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నియామక ప్రక్రియ నిలిపివేయాలని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పిటిషనర్లను విధుల నుంచి తొలగించడానికి వీల్లేదని న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ ఆదేశించారు.
టీఆర్‌ఏసీ అదనపు డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో 2007 నుంచి విధులు నిర్వహిస్తున్నామని, తమను కాకుండా ఇతరులతో ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జి.వెంకట్రామయ్యతోపాటు మరో 14 మంది దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈ పోస్టులకు పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారని, వీరికి కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికే కాల్‌లెటర్లు పంపించారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలంటూ ఈమెయిల్ ద్వారా ఇతర అభ్యర్థులకు సమాచారం అందించారని వివరించగా.. కోర్టు పైవిధంగా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment