stayed
-
TG: బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట.. ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట లభించింది. కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల ఆందోళనతో ప్రభుత్వం పోలీస్ శాఖ కీలక నిర్ణయం శుక్రవారం(అక్టోబర్ 25) తీసుకుంది. బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయమై కానిస్టేబుల్ కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయించారు.సెలవుల రద్దుపై బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో హైదరాబాద్‌లో శుక్రవారం పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వారిని అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుంది. -
ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్
సాక్షి, ఢిల్లీ: అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాలపై సిట్ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ గురువారంతో పూర్తైంది. ఇరుపక్షాల వాదనలు ముగియగా.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీం ధర్మాసనం. అంతకు ముందు విచారణ సమయంలో జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారం లేదంటే ఎలా? అలాంటి వారికి వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్లు కాదా? ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదా?.. దురుద్దేశం లేదని చెప్పేందుకే సీబీఐకి ఇస్తామని చెప్పారు కదా? దురుద్దేశం గనుక ఉంటే ఇవన్నీ దర్యాప్తులో తెలుస్తాయి కదా! అని ప్రశ్నించింది. రాజకీయ వైరుధ్యం వల్ల ఎంక్వేరీ చేయవద్దా?. గత ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారమే లేదంటే ఎలా?. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక విధానాలు, ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన సిట్ పై స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక పోలీసు స్టేషన్లో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకు నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామని, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామన్నారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని తెలిపారు. విధాన నిర్ణయాలు, టెండర్, కాంట్రాక్టులకు సంబంధించిన కేసుల్లో సారూప్యం చూడాలని కోరారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని, నిజ నిర్ధారణపై నిషేధం ఉండదని స్పష్టం చేస్తూ ఈ మేరకు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇక వర్లరామయ్య తరపు న్యాయవాది దవే వాదనలు వినిపిస్తూ.. పక్షపాతంతో ఈ అంశంపై జివో ఇచ్చారని, అధికార పార్టీతో నిజనిర్దారణ ఏర్పాటుచేశారని వాదించారు. ఈ క్రమంలో ధర్మాసనం కలుగజేసుకుని.. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా ఉంటే దర్యాప్తు చేయకూడదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఏవైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించదగినదే కదా? అని ప్రశ్నించింది. ఇదీ చదవండి: అమరావతి రైతులకు హైకోర్టులో ఎదురు దెబ్బ -
టీఆర్ఏసీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. తెలంగాణ హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీఆర్ఏసీ) కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి ఈనెల 7న జారీచేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నియామక ప్రక్రియ నిలిపివేయాలని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పిటిషనర్లను విధుల నుంచి తొలగించడానికి వీల్లేదని న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ ఆదేశించారు. టీఆర్ఏసీ అదనపు డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో 2007 నుంచి విధులు నిర్వహిస్తున్నామని, తమను కాకుండా ఇతరులతో ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జి.వెంకట్రామయ్యతోపాటు మరో 14 మంది దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈ పోస్టులకు పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారని, వీరికి కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికే కాల్‌లెటర్లు పంపించారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలంటూ ఈమెయిల్ ద్వారా ఇతర అభ్యర్థులకు సమాచారం అందించారని వివరించగా.. కోర్టు పైవిధంగా స్పందించింది. -
అమెజాన్‌కు ఊరట: సుప్రీం కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్యూచర్ గ్రూపు వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) డీల్‌కు మరోసారి బ్రేక్ పడింది. ఈ ఒప్పందానికి సంబంధించి "యథాతథ స్థితిని" కొనసాగించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ తీర్పుపై స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమాన్, బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం ఫ్యూచర్ రిటైల్, గ్రూపు అధినేత కిషోర్ బియానీ, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. రానున్న మూడు వారాల్లో దీనిపై సమాధానం చెప్పాలని కోరింది. అలాగే ఈ వివాదంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆర్ఐఎల్తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఫ్యూచర్ గ్రూప్ ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ 2021 పిబ్రవరి 2న ఉత్తర్వులిచ్చింది. దీనిపై అమెజాన్ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం తాజా ఆదేశాలతో రిలయన్స్ రీటైల్‌తో ఒప్పందానికి సంబంధించి ఫ్యూచర్ గ్రూపునకు తాజాగా మరో ఎదురు దెబ్బ గిలింది. -
అంబానీ బ్రదర్స్ మెగా డీల్‌కు బ్రేక్: షేర్లు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిలయన్స్ జియోకు ఆస్తుల అమ్మకంపై స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ విక్రయం తన తుది ఆదేశానికి లోబడి ఉంటుందని కోర్టు తెలిపింది, తుది ఆదేశాలవరకు యథాతధ స్థితిని కొనసాగించాలని సుప్రీం ఆదేశించింది. తద్వారా తన అనుమతిలేనిదే ఈ డీల్‌ను పూర్తి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సుమారు రూ.39వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా తన వైర్లెస్ స్పెక్ట్రం, టవర్, ఫైబర్, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించనున్నట్టు ఆర్‌కాం ప్రకటించింది. అయితే ట్రిబ్యునల్ ఆర్డర్‌కు భిన్నంగా ముందస్తు అనుమతి లేకుండా దాని ఆస్తుల విక్రయం లేదా బదిలీకి కుదరదంటూ ఈ నెల 8న ముంబై హైకోర్టు ఈ డీల్‌ను తిరస్కరించింది. ఆర్‌కాంనుంచి వెయ్యికోట్లకుపైగా బకాయి రావాల్సిన దేశీయ చిప్ మేకర్ ఎరిక్సన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అయితే ఆర్‌కాంకు మద్దతుగా నిలిచిన ఎస్బీఐ ట్రిబ్యునల్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల అమ్మకానికి అనుమతి నివ్వాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన సుప్రీం ముంబై హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తాజా ఆదేశాలిచ్చింది. కాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ( జియో) కు కంపెనీ ఆస్తులను విక్రయించాలని ఆర్‌కాం అధినేత అనిల్ అంబానీ నిర్ణయించారు. అప్పుల ఊబినుంచి బయటపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని గత ఏడాది డిసెంబర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఆదేశాల నేపథ్యంలో స్టాక్మార్కెట్లో ఆర్‌కాం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో 5శాతానికి పైగా నష్టపోయింది. -
శ్రీవారి ఆలయంలో 17 నుండి సుప్రభాతం రద్దు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈనెల 16వ తేది నుండి 2018, జనవరి 14వ తేది వరకు జరనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 17వ తేది నుండి శ్రీవారికి సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు పారాయణం చేయనున్నారు. రోజుకొకటి చొప్పున నెలరోజుల పాటు మొత్తం 30 పాసురాలు వేద పండితులు పారాయణం చేయనున్నారు. ఈ నెల రోజుల పాటు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్‌సృష్టిని లయ బద్దంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుంచి శ్రీకారం చుడతారని పురాణప్రసిద్ధి. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాల్ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15వ తేది నుంచి యథావిధిగా సుప్రభాత సేవ పునఃప్రారంభిస్తారు. -
సురక్షితమైన చోట మోదీ బస
జెరూసలెం: మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ దేశం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఆయన ఉండేందుకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన హోటల్ సూట్లో బస ఏర్పాటు చేశారు. జెరూసలెంలోని కింగ్ డేవిడ్ హోటల్లో మోదీ ప్రస్తుతం ఉంటున్నారు. ఆయన ఉండే సూట్ అత్యంత సురక్షితమైనది. బాంబు దాడులు, రసాయనిక దాడులు.. ఇలా ఎలాంటి దాడులు జరిగినా.. మోదీ బస చేసిన సూట్ మాత్రం చెక్కుచెదరదని కింగ్ డేవిడ్ హోటల్ ప్రతినిధి షెల్డన్ రిట్జ్ తెలిపారు. ప్రధాని మోదీ, తన ప్రతినిధి బృందం ఉండేందుకు దాదాపు 110 గదులను కేటాయించారు. ఇప్పటి వరకు ఈ ప్రత్యేకమైన సూట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షులు క్లింటన్, బుష్, ఒబామా మాత్రమే ఉన్నారు. వారి తర్వాత ఆ గౌరవం ప్రధాని మోదీకి దక్కడం విశేషం. మోదీకి ఇష్టమైన గుజరాతీ వంటకాలతో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన తినే కుకీస్‌లో కూడా కోడిగుడ్డు, పంచదార లేకుండా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. మోదీ ఉండే సూట్‌కు ప్రత్యేకంగా కిచెన్ ఏర్పాటు కూడా ఉంది. ఆయనకు ఎప్పుడు ఏమి తినాలనిపిస్తే అందులో వెంటనే వంట చేసి నిమిషాల్లో అందిస్తారు. ప్రధాని మోదీ ఉండే ప్రాంతమంతా భారతీయులు ఇష్టపడే పువ్వులతో అందంగా అలంకరించారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ.