
రెండు బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి
మూడో బ్యాచ్‌కి ఆదివారం అర్హత పరీక్ష
మూడేళ్లలో 30 వేల మందికి ఉద్యోగాలే లక్ష్యంగా శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బీటెక్ పట్టభద్రుల కోసం ప్రారంభించిన బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్‌ఎస్‌ఐ – స్కిల్లింగ్) కోర్సుకు మంచి స్పందన లభిస్తోంది. మొదటి, రెండో విడత బ్యాచ్‌ల శిక్షణ ఇప్పటికే పూర్తికాగా, మూడో విడత కోర్సుల శిక్షణ కోసం ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు.
వీరిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై వరకు బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామింగ్, అప్లికేషన్ అండ్ డేటాబేస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తారు.
ఆ తరువాత బీఎఫ్‌ఎస్‌ఐకు సంబంధించి హైదరాబాద్‌లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఏటా 10 వేల మందికి శిక్షణ ఇస్తారు. వీరిలో 5 వేల మంది ఇంజనీరింగ్, మరో 5 వేల మంది డిగ్రీ పట్టభద్రులుంటారు. రానున్న మూడేళ్లలో 30 వేల మంది తెలంగాణ యువతకు ఈ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
గతేడాది సెప్టెంబర్‌లో ‘బీఎఫ్‌ఎస్‌ఐ – స్కిల్లింగ్’ కోర్సు ప్రారంభమైంది. ఖర్చును ఎక్విప్, బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్షియం భరిస్తుంది. విద్యార్థుల నుంచి రూ.5 వేలు వసూలు చేస్తారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న పట్టభద్రులు స్కిల్స్ యూనివర్సిటీ వెబ్‌సైట్ yisu.in ను సందర్శించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment