
ఈ నెల 16 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
నిర్దేశించిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి
లేకుంటే తదుపరి అవకాశం ఉండదని టీజీపీఎస్సీ స్పష్టీకరణ
అభ్యర్థులు గైర్హాజరైతే తదుపరి మెరిట్ అభ్యర్థులకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు అభ్య ర్థులను ఎంపిక చేస్తూ... జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఒక్కో ఉద్యోగానికి ఒక అభ్యర్థినే ఎంపిక చేసింది. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక చేపట్టడంతో ప్రస్తుతం ఏ కేటగిరీలోనూ అభ్యర్థులు షార్ట్‌ఫాల్ లేదని కమిషన్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈ నెల 16వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పబ్లిక్ గార్డెన్‌లోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్‌లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు.
గ్రూప్–1 నోటిఫికేషన్‌లోపి అనెక్జర్–6లో నిర్దేశించిన విధంగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, స్వీయ ధ్రువీకరణతో రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.
గైర్హాజరైతే ఉద్యోగం పోయినట్లే...
ధ్రువపత్రాల పరిశీలనకు నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. నిర్దేశించిన తేదీల్లో హాజరు కాకపోయినా, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోయినా తదుపరి అవకాశం ఉండదని వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థుల సంఖ్య తగ్గితే తదుపరి మెరిట్ అభ్యర్థులకు సమాచారం ఇచ్చి ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించనున్నట్లు వివరించింది.