
ఉద్యోగం ఇప్పిస్తామంటూ యువత నుంచి రూ. 50–రూ.60 వేలు వసూలు
సైబర్ ముఠాలకు అప్పగిస్తూ వారి నుంచి అంతేస్థాయిలో కమీషన్లు
‘సైబర్ సెక్యూరిటీ బ్యూరో’దర్యాప్తులో కీలక వివరాలు వెల్లడించిన ఏజెంట్ బషీర్
ఇప్పటికే 8 మంది ఏజెంట్లు అరెస్టు.. తాజాగా మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల పేరిట ఏజెంట్లు వేసే ఉచ్చులో యువత ఈజీగా చిక్కుకుంటోంది. విదేశాల్లో కొలువు చేసి బాగా స్థిరపడాలన్న వారి ఆశను కొందరు ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. థాయ్‌లాండ్‌లో డేటా ఎంట్రీ, ఇతర ఉద్యోగాల్లో చేర్చుతామని ఒక్కొక్కరి నుంచి రూ.50 –రూ.60 వేలు కమీషన్లు తీసుకొని అక్కడకు పంపుతున్నారు. ఆ తర్వాత వారిని ఒక బంగ్లాదేశీయుడి ద్వారా మయన్మార్, కాంబోడియాలోని చైనీయులు నడిపే సైబర్‌నేర ముఠాలకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో వారి నుంచి కూడా కమీషన్లు తీసుకుంటారు.
ఈ మొత్తం వ్యవహారంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కీలకంగా ఉన్నట్టు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తులో గుర్తించారు. రాష్ట్రానికి చెందిన 24 మందిని గత నెలలో మయన్మార్ ఆర్మీ రెస్క్యూ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మయన్మార్ ముఠా నుంచి బయట పడి ఇండియాకు వచ్చిన వనస్థలిపురానికి చెందిన సాయికార్తీక్ ఫిర్యాదుతో టీజీసీఎస్‌బీ మరో కేసు నమోదు చేసింది. అన్ని కేసు ల్లో కీలకంగా వ్యవహ రించిన స్థానిక ఏజెంట్లపై టీజీసీ ఎస్‌బీ అధికారులు ఫోకస్ పెంచారు. ఇప్పటికే ఎనిమిది మంది ఏజెంట్లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా ఏజెంట్లలో ఒకరైన బషీర్ అహ్మద్ నుంచి సేకరించిన వివరాల మేరకు బంగ్లాదేశ్‌కు చెందిన రియాజ్‌ఖాన్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టు గుర్తించారు.
అందరిదీ అదే కథ
ఆర్థిక అవసరాలు తీరక, విదేశాల్లో కొలువుల కోసం ప్రయత్నించే వారిని కొందరు ఏజెంట్లు టార్గెట్ చేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్, టెలికాలర్ జాబ్స్ ఉన్నాయని, కొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే అక్కడకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని నమ్మబలుకుతున్నారు. అక్క డి కంపెనీల ప్రతినిధులతో జూమ్ ఇంటర్వ్యూలు నిర్వహి స్తున్నారు. ఎదుటి వ్యక్తులు తమ వలలో పడ్డట్టు గుర్తించిన తర్వాత, మొదట థాయ్‌లాండ్‌కు పంపుతున్నారు. ‘అక్కడ విమానం దిగగానే.. కంపెనీ ప్రతినిధి వచ్చి మిమ్మల్ని కలు స్తాడు.. మీరు పనిచేసే చోటకు తీసుకెళతాడు’అని చెబుతు న్నారు. ముందు చెప్పినట్టుగానే సైబర్ ముఠాకు చెందిన వారు ఎయిర్‌పోర్టుకు వచ్చి భారత్ నుంచి వచ్చిన యువ కులను రిసీవ్ చేసుకుంటారు.
వెంటనే వారి నుంచి పాస్ పోర్టును తీసుకొని ఆ తర్వాత మయన్మార్‌లోని కేకే3 పార్క్ ప్రాంతంలోని సైబర్ ముఠాల కాల్ సెంటర్లకు పంపుతు న్నారు. ఇలా భారత్ నుంచి మనుషులను అక్రమంగా రవాణా చేసినందుకు ఒక్కో ఏజెంట్‌కు రూ.50 నుంచి రూ.60వేల వరకు సైబర్‌ముఠాలు ఇస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని రియాజ్‌ఖాన్ హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా చేస్తున్నట్టు టీజీసీఎస్‌బీ అధికారులు గుర్తించారు. అటు అమాయకులైన యువకుల నుంచి రూ.50 నుంచి రూ.60 వేల వరకు, అటు సైబర్ ముఠాల నుంచి రూ. 60 వేల వరకు ఈ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు.
ఇలా సైబర్ ముఠాలకు చేరిన యువకులతో చైనా సైబర్ ముఠాలు క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు సహా పలు రకాల ఆర్థిక మోసాలపై తర్ఫీదు ఇచ్చి మరీ చేయిస్తున్నారు. ఈ వ్యవహారం నచ్చక ఎదురు తిరిగితే పాస్‌పోర్టు ఇచ్చేందుకు రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలని చిత్రహింసలు పెడుతు న్నారు. మయన్మార్, ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్లలో బయటపడుతున్న కొందరు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇలా తెలంగాణకు చేరిన బాధితుల నుంచి ఫిర్యా దులు తీసుకోవడంతోపాటు ఈ మయన్మార్ ముఠాలపై టీజీసీఎస్‌బీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.