సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో గ్రూప్–1 మొదలు అన్ని రకాల ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటనలు జారీ చేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇటీవల దాదాపు 60 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. మరి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన ఎలా ఉంది? తెలంగాణ ఏర్పాటయిన తర్వాత ఏ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి? ఈ ప్రశ్నలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే–2023 సమాధానం ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ ఏర్పాటయిన ఏడాదిని మినహాయిస్తే 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2022–23 వరకు అంటే 8 ఏళ్లలో ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాల సంఖ్య 17.2 లక్షలపైనే. టీఎస్–ఐపాస్ కింద రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతులు పొందిన సంస్థలు, కంపెనీల్లో ఈ మేరకు ఉపాధి అవకాశాలు లభించాయి.
వరుసగా నాలుగేళ్లు..
గత 8 ఏళ్లలో ప్రైవేటు రంగంలో లభించిన ఉద్యోగావకాశాలను పరిశీలిస్తే రియల్ ఎస్టేట్, ఐటీ భవనాలు, పారిశ్రామిక పార్కుల్లోనే యువతకు ఎక్కువగా ఉపాధి లభించిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 9.5 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించాయి. ఆ తర్వాత ఫార్మా, కెమికల్ రంగంలో, వరుసగా ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, టెక్స్‌టైల్స్ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. ఈ ప్రధాన రంగాలు కాకుండా మిగిలిన రంగాల్లో కలిపి 3.5 లక్షల ఉద్యోగాల వరకు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 75 వేలకుపైగా, ఫార్మాలో 1.2 లక్షలు, ఇంజనీరింగ్‌లో 60 వేల మంది వరకు ఉపాధి కలిగింది. సంవత్సరాలవారీగా పరిశీలిస్తే 2017–18, 2018–19, 2019–20లో 12 లక్షల మందికిపైగా ఉపాధి కల్పన జరిగింది. 2017–18లో 2,74,963, 2018–19లో 5,99,933, 2019–20లో 3,15,607 ఉద్యోగాలు లభించాయని, టీఎస్–ఐపాస్ ద్వారా ఈ ప్రధాన రంగాల్లో గత 8 ఏళ్లలో దాదాపు రూ. 2.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్లు ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment