‘దేవుడే’ దిక్కు..!  | Jogini system continues today also | Sakshi
Sakshi News home page

‘దేవుడే’ దిక్కు..! 

Published Sun, Oct 1 2023 3:08 AM | Last Updated on Sun, Oct 1 2023 3:08 AM

 Jogini system continues today also - Sakshi

నా తల్లిదండ్రులు నన్ను జోగినిగా చేసి వదిలేశారు. ఉపాధి లేక దొరికిన రోజు కూలి పనులకు వెళ్తున్నా. వచ్చే కూలి పైసలతో కుటుంబ పోషణ భార మైంది. ప్రభు త్వం మాకు దళిత బంధు ఇస్తే ఉపాధి కల్పించినోళ్లయితరు.     – గుర్రం బాలమ్మ

నన్ను తెలియని వయసు లో జోగినిగా మార్చారు. నాకు ఇద్దరు పిల్లలు. మట్టి పని చేస్తూ సాకుతున్నా. పింఛన్‌ కోసం నాలుగేళ్లుగా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ పెన్షన్‌ రాలేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. – చెక్క తిరుమలమ్మ 

నన్ను జోగినిగా మార్చి 25 ఏళ్లు. ఈమె నా బిడ్డ భారతి. తండ్రి పేరు లేనిదే స్కూల్‌లో చేర్పించుకోమని చెప్పడంతో చదువు చెప్పించలేదు. మాకు ఈ పెంకుటిల్లు తప్ప వేరేది లేదు. వర్షం వస్తే ఇల్లంతా నీళ్లే. కూతురి కూలిపైనే కడుపు నింపుకొంటున్నాం. మాకు గృహ లక్ష్మితో పాటు స్వయం ఉపాధి కల్పించాలి. – దొర్లపల్లి ఎల్లమ్మ 

మాది పులిమామిడి గ్రామం. నాకు 38 ఏళ్లు.. ముగ్గురు పిల్లలు. నన్ను 20 ఏళ్ల క్రితమే జోగినిని చేశారు. ఒంటరి మహిళ కింద ఆసరా పింఛన్‌ కోసం మూడు సార్లు ఊట్కూరు మండల కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నా. మా తరఫున మాట్లాడేవారు లేకపోవడంతో అధికారులు అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారు.  
– శిపురం గజలమ్మ

..ఈ నలుగురే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సమాజంలో దేవుడి భార్యలుగా చెలామణి అవుతున్న వారి దీన గాథ ఇది. కూడు, గూడు, ఉపాధి లేక నానాపాట్లు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒంటరి పింఛన్‌ మినహా.. వారి స్థితిగతులను మార్చేలా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు పడకపోవడంపై వారిలో ఆవేదనతో కూడిన అసంతృప్తి పెల్లుబికుతోంది. ఆధునిక కాలంలోనూ ఆదరణకు నోచుకోకపోవడం.. విద్య, ఆర్థిక తదితర రంగాల్లో వెనుకబాటుతనం వెరసి దుర్భర జీవితాలు అనుభవిస్తున్న జోగినులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. 

ఏడేళ్ల క్రితం వరకు యథేచ్ఛగా.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా 
సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన అట్టడుగు వర్గాల స్త్రీలను జోగినులుగా మార్చి దేవతలకు అర్పించడం.. ఊరికి ఉపకారం పేరిట ఉంపుడుగత్తెలను చేయడం ప్రాచీన కాలం నుంచి ఆచారంగా వచ్చింది. ఈ దురాచారాన్ని 1988లో రద్దు చేశారు. అయితే ఏడెనిమిదేళ్ల క్రితం వరకు యథేచ్ఛగా సాగిన ఈ జోగినీ వ్యవస్థ ఇప్పటికీ పలు చోట్ల గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

కోవిడ్‌ కాలంలో ఈ దురాచారం మళ్లీ పురుడుపోసుకున్నట్లు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. దేవరకద్ర, ఊట్కూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రెండేళ్లుగా సుమారు 18 మందిని జోగినులుగా మార్చినట్లు సమాచారం. గత ఏడాది ఫిబ్రవరిలో దేవరకద్ర పరిధిలో ఓ విద్యావంతుల కుటుంబానికి చెందిన అమ్మాయిని జోగినిగా మార్చేందుకు ప్రయత్నించగా.. ఓ ఎన్జీఓ సంస్థ అడ్డుకోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

ఇక జోగినుల జీవన భృతికి సంబంధించి ఒంటరి పింఛన్‌కు అర్బన్‌ ప్రాంతాల్లో 30 ఏళ్లు, గ్రామాల్లో 35 ఏళ్ల వయసు ఉన్న వారిని అర్హులుగా గుర్తించారు. కానీ పలు చోట్ల 20, 25 ఏళ్లు ఉన్న జోగిని మహిళలు ఒంటరి పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి ఈ వ్యవస్థ ఇంకా కొనసాగుతోందని ఎన్జీఓలు చెబుతున్నారు.

అప్పట్లో నిజామాబాద్‌లో.. ఇప్పుడు పాలమూరులో ఎక్కువగా 
1987–88లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 24,273 మంది జోగినులు ఉన్నట్లు ఆనాటి ప్రభుత్వం గుర్తించింది. ఇందులో తెలంగాణలోనే 14,863 మంది జోగినులు ఉండగా.. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 5,666 మంది ఉన్నట్లు తేలింది. ఇక 2013లో ఏక సభ్య కమిషన్‌ నివేదిక ప్రకారం తెలంగాణలో 12 వేల మంది జోగినులు ఉన్నట్లు గుర్తించారు.

ఇందులో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల పరిధిలోని దేవరకద్ర, మహబూబ్‌నగర్, గద్వాల, గట్టు, ధరూర్, నారాయణపేట , ఊట్కూర్, మక్తల్, మాగనూర్, ధన్వాడ, నర్వ, అమరచింత, ఆత్మకూర్‌ మండలాల్లో సుమారు ఐదు వేల మందికి పైగా ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. ఇక ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎనిమిది వేలకు పైగా జోగినులు ఉన్నట్లు ఎన్జీఓ సంస్థలు చెబుతున్నాయి. 

విద్యకు దూరం..  
జోగినులుగా మారినమహిళలకు వివాహం ఉండదు.. కుటుంబం కుదరదు.. సొంత జీవితమంటూ ఉండదు.. ఎవరి ఆదరణకు నోచుకోకపోవడంతో వ్యభిచారంతో ఆరోగ్యం దెబ్బతిని ఇప్పటికే వందల సంఖ్యలో అకారణంగా మృత్యువాతపడ్డారు. 75 శాతం మేర జోగినుల వయసు పైబడడం, తండ్రి పేరు లేకపోవడంతో వారి పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోకపోవడంతో ఉన్న వారు సైతం నిరక్షరాస్యులుగానే మిగిలారు.

2009లో తల్లిపేరుతో అవకాశం కల్పించినప్పటికీ.. పదో తరగతికి మించి ఒకట్రెండు కుటుంబాలు మినహా ఉన్నత విద్యను అభ్యసించలేకపోయాయి. దీనికి తోడు అమ్మాయిల సంతానం ఎక్కువగా ఉన్న కుటుంబాలు ఆడపిల్లలను వదిలించుకుందామనే ఉద్దేశంతో మొక్కు పేరిట జోగినిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా కుటుంబాలను చైతన్యం చేయడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఈ దురాచారాన్ని నిర్మూలించే అవకాశం ఉంది.

జోగినులకు ప్రత్యేక చట్టం చేయాలి.. 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది జోగినులు ఉన్నారనే దానిపై  సర్వే చేపట్టాలి. ఆ తర్వాత ఏపీలో చేసిన తరహాలో ప్రత్యేక చట్టం చేయాలి. గతంలో ఏకసభ్య కమిషన్‌కు సమర్పించిన డిమాండ్లను నెరవేర్చాలి.   – హాజమ్మ, జోగిని నిర్మూలన హక్కుల పోరాట సమితి జిల్లా కన్వినర్‌ 

ప్రత్యేక బడ్జెట్‌.. జోగిని బంధు..  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా బడ్జెట్‌లో జోగిని సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3 కోట్ల బడ్జెట్‌ కేటాయించేవారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ సంప్రదాయం అటకెక్కింది. దీన్ని కొనసాగించడంతోపాటు రాష్ట్రంలోని వివిధ కులాలకు ఉన్నట్లుగానే జోగినుల సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని జోగినులు డిమాండ్‌ చేస్తున్నారు.

దీని ద్వారా ఒక్కో జోగిని కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని.. నివాసం కోసం ఉచితంగా స్థలంతో పాటు ఇల్లు కట్టించాలని కోరుతున్నారు. అదేవిధంగా దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు వలే జోగిని బంధు తీసుకొచ్చి.. ప్రతి ఒక్క జోగినికి స్వయం ఉపాధి నిమి త్తం రూ.10 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. 

జోగినుల ఇతర డిమాండ్లు.. 
♦  ప్రతి జోగినికి రూ.3 వేల భృతి ఇవ్వాలి.  
పదో తరగతి పాసైన జోగినిల పిల్లలకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. 
స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకులతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వాలి. 
చదువుకునే జోగిని పిల్లలందరికీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ప్రై వేట్‌ విద్యాలయాల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను బోధించాలి. డిగ్రీ ఆపై విద్యార్హత ఉన్న వారికి ఉన్నత ఉద్యోగావకాశాలు కల్పించాలి. 
1988 జోగిని నిర్మూలన చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలి. 
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కమిటీలో జోగినులకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి. గ్రామాల్లో ఉన్న ప్రతి జోగిని కుటుంబానికి ఆహారభద్రత కార్డు ఇవ్వాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement