
సన్నాహాలు చేస్తున్న అధికారులు
మెమోల్లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా..
వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కుల ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 30వ తేదీన పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విడుదల చేసే అవకాశం ఉందని టెన్త్ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. వాస్తవానికి టెన్త్ మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, పలు దఫాల పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అ«దీనంలోనే ఉంది. ఈ కారణంగా ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధికారులు భావించారు.
ఆ సమయంలో సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన వచ్చే వరకూ నిరీక్షించారు. ఇటీవల అధికారులు సీఎంను కలవగా, ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్పగించినట్టు తెలిసింది. ఈనెల 30న భట్టి సమయం ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
మెమోల్లో మార్పులు
టెన్త్ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఇందుకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చేవాళ్లు. ఇక నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్‌తో పాటు, విద్యార్థి మార్కులు మోమోలో పొందుపరుస్తారు. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మార్కులు, జీపీఏ మెమోలో ఉంటాయని ఆ ఆదేశాల్లో వెల్లడించారు.
ఇప్పటివరకూ విద్యార్థి ఆయా సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. దీనివల్ల ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించడం కష్టం. ఇప్పుడీ విధానాన్ని మార్చడంతో గ్రేడ్స్‌తో పాటు ఆయా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది. ప్రస్తుతం వార్షిక పరీక్ష ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన 20 అంతర్గత మార్కులుగా ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులను ఎత్తివేసేందుకు కూడా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.