సాక్షి, హైదరాబాద్: పదోతరగతి విద్యార్థుల ఫలితాలను ఈ నెల 21న (శుక్రవారం) విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. వాటిని మరోసారి పరిశీలిస్తోంది. ఒకవేళ ఆ రోజు వీలుకాకపోతే 22వ తేదీన విడుదల చేయనుంది. కరోనా కారణంగా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది.
ఆయా సబ్జెక్టులకు ఎఫ్‌ఏ–1లో నిర్దేశిత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్థి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనుంది. ఎఫ్‌ఏ–1 పరీక్షలకు 5.21 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన విద్యాశాఖ వారికి ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి (20 శాతాన్ని 100 శాతానికి పెంచి) గ్రేడ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కుల ప్రకారం గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ)ను ఖరారు చేసి ప్రకటించనుంది. దీంతో ఈసారి 2.2 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీకి కొత్త కళ
Comments
Please login to add a commentAdd a comment