ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ స్కూళ్లలో ఆన్‌లైన్ పాఠాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు.. కొన్ని బడా ప్రైవేటు స్కూళ్లలోనూ రికార్డెడ్ వీడియో పాఠాలు.. మరికొన్ని బడ్జెట్ ప్రైవేటు పాఠశాలల్లోనైతే అసలే మొదలుకాని చదువులు, ప్రభుత్వం ప్రసారం చేసే టీవీ పాఠాలనే వింటూ వెళ్లదీస్తున్న వైనం. కరోనా దెబ్బతో రాష్ట్రంలో విద్యా బోధన అస్తవ్యస్తమైంది. చూస్తుండగానే నవంబరు నెల వచ్చేసింది. సగం విద్యా సంవత్సరం పూర్తయిపోయింది. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు సమయం వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ఎలా? ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎలా? పదో తరగతి విషయంలో ఎలా ముందుకు సాగాలన్న దానిపై అధికారుల్లో ఆలోచనలు మొదలయ్యాయి.
అదుపులోకి రాని కరోనా
దేశంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పాఠశాలలను ప్రారంభించారు. మన రాష్ట్రంలో మాత్రం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచే విద్యాసంవత్సరాన్ని విద్యాశాఖ ప్రారంభించింది. కరోనా కారణంగా తరగతుల నిర్వహణలో ప్రత్యక్ష బోధన, అభ్యసనను ప్రారంభించలేదు. అయితే ఆన్‌లైన్, డిజిటల్ పాఠాలను మాత్రం బోధిస్తున్నారు. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్నింటిలోనూ ఏదో ఒక రకంగా (ఆన్‌లైన్, డిజిటల్) బోధనను ప్రారంభించారు. ఇక 5వ తరగతి వరకు మాత్రం కార్పొరేట్ స్కూళ్లలో ఆన్‌లైన్ పాఠాలు కొనసాగుతుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు (టీశాట్, దూరదర్శన్ ద్వారా వీడియో పాఠాల ప్రసారం) కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయడంలో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవని అధికారులు భావిస్తున్నారు. ఇక ఆరో తరగతి నుంచి 10 తరగతి వరకు ఎలా ముందుకు సాగాలన్న దానిపై ఆలోచనలు చేస్తున్నారు. డిటెన్షన్ విధానం లేనందున 6 నుంచి 9వ తరగతి వరకు కూడా ప్రమోట్ చేస్తే ఇబ్బందేమీ ఉండదన్న భావనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆసలు సమస్య పదో తరగతి పరీక్షలే. వాటి నిర్వహణ విధానం ఏంటన్న దానిపైనే సందిగ్ధత నెలకొంది.
గత విద్యా సంవత్సరంలో ఇంటర్నల్స్ ఆధారంగా
గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల ప్రాతిపదికన ప్రభత్వం టెస్త్ విద్యార్థులందరిని పాస్ చేసింది. పైగా గత మార్చి నెల వరకు తరగతులు కొనసాగాయి. దీంతో విద్యార్థులకు ఇంటర్నల్స్‌లో వచ్చిన మార్కులను బట్టి విద్యాశాఖ విద్యార్థులకు గ్రేడ్ పాయింట్లను, గ్రేడ్‌లను ఇచ్చింది. అయితే ఈసారి ఇంటర్నల్ మార్కులను వేసేందుకు అవకాశం లేకుండాపోయింది. ఇప్పటివరకు ఇంటర్నల్స్‌కు ప్రత్యేకంగా పరీక్ష అంటూ ఏమీ లేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో (సీసీఈ) భాగంగా తరగతిలో విద్యార్థుల అభ్యసన తీరు, ప్రతిస్పందనలు, ప్రాజెక్టులు, సృజనాత్మకత వంటి అంశాల ఆధారంగా ఇంటర్నల్స్ మార్కులను ఇచ్చారు. ఈసారి వాటికి అవకాశం లేకుండాపోయింది. వచ్చే నెల నుంచి తరగతులు ప్రారంభమైతే వాటికి కొంత అవకాశం ఉంటుంది. ఒకవేళ కరోనా కేసులు ఇలాగే ఉంటే తరగతుల ప్రారంభం కష్టమే. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ఆలోచనలు మొదలయ్యాయి.
వివిధ కోణాల్లో ఆలోచనలు
ప్రస్తుత విద్యా బోధన పరిస్థితుల్లో పరీక్షలు లేకుండానే ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను అప్‌గ్రేడ్ చేయాలా? అలా చేస్తే ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తాయా? అన్న కోణంలోనూ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఇక పదో తరగతి పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే సమయం వచ్చేసింది. ఇప్పటినుంచి పనులను మొదలు పెడితేనే ఏప్రిల్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే పరీక్షల విధానంపైనా ఆలోచనలు చేస్తున్నారు. మరోవైపు పదో తరగతికి పలు అసైన్‌మెంట్లతో ఇంటర్నల్ మార్కులు వేసి, వాటి ఆధారంగానే ఉత్తీర్ణులను చేయాలా? లేదా ఓపెన్ బుక్ పరీక్షల విధానం ప్రవేశపెట్టాలా? ఆన్న అంశాలపైనా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసి, పరీక్షల విధానాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా పదో తరగతి విషయంలో ఇప్పుడే పరీక్షల విధానంపై ఓ నిర్ణయానికి వస్తేనే విద్యార్థులు అందుకు సిద్ధం అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ నిర్ణయం మేరకే...
ప్రస్తుత పరిస్థితుల్లో పదో తరగతికి ఈసారి ఓపెన్ బుక్ పరీక్షల విధానం పెడితే బాగానే ఉంటుందన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఓపెన్ బుక్ విధానంలో ప్రశ్నపత్రాలు ఇస్తారు.. పాఠ్యపుస్తకాలు, నోట్స్ చూస్తూ సమాధానాలు రాసే వెసులుబాటు ఉంటుంది. పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులకు అసైన్‌మెంట్స్ ఇవ్వడం, ప్రాజెక్టులు చేయించడం, వాటిల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను ఇంటర్నల్ మార్కులుగా పరిగణనలోకి తీసుకొని వాటి ఆధారంగా మార్కులిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనా ఉంది. వ్యాసరూప విధానంలో కాకుండా బిట్‌పేపర్ తరహాలో ప్రశ్నపత్రాలు రూపొందించి ఇంటర్నల్స్ నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనా చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి, లోతుగా అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం తరువాతే విధానాన్ని ప్రకటించనున్నారు. పరీక్షలను ఏప్రిల్/ మే నెలల్లో నిర్వహించే అవకాశం ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment