ssc public exams
-
‘పది’ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ 9:30 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిపోయారు. ఇక, ఈ నెల 30 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28తో ముగుస్తాయి. కాగా, మరో రెండు రోజులు అంటే మార్చి 30 వరకు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. 2023–24లో మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు కాగా 3,05,153 మంది బాలికలు. కాగా, గతేడాది ఉత్తీర్ణులు కాకపోవడంతో తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా పరీక్షలు రాయనున్నారు. అలాగే ఓరియంటల్ విద్యార్థులు 1,562 మంది ఉన్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరో 30 నిమిషాల వరకు అవకాశం కల్పించారు. పరీక్షల పర్యవేక్షణకు 3,473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 3,473 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 35,119 మంది ఇని్వజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను నియమించారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో అదనంగా సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. పేపర్ లీకులకు ‘క్యూఆర్’ కోడ్‌తో చెక్ మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఈ ఏడాది పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఇని్వజిలేటర్లు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, నాన్–టీచింగ్ సిబ్బంది, ఏఎన్ఎంలు, చీఫ్ ఇని్వజిలేటర్లు ఇలా ఎవరైనా సరే సెల్ఫోన్లతో పరీక్ష కేంద్రాల్లోకి రావడాన్ని నిషేధించామన్నారు. ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను తేవద్దన్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా పదో తగరతి పరీక్ష పేపర్లపైనా, ప్రతి ప్రశ్నకు ‘క్యూఆర్’ కోడ్‌ను ముద్రించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డా, పేపర్ లీక్ చేసినా.. ఏ సెంటర్లో ఏ విద్యార్థి పేపర్ లీక్ అయిందో ప్రత్యేక టెక్నాలజీ ద్వారా తెలుసుకోనున్నారు. పరీక్షలు పూర్తయ్యాక ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు స్పాట్ వ్యాల్యూయేషన్ చేపట్టనున్నారు. ఆ తర్వాత వెంటనే ఫలితాలను వెల్లడించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. హాల్‌టికెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం.. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. పదో తరగతి హాల్‌టికెట్‌ను చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లొచ్చు. అల్ట్రా పల్లె వెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా వెళ్లి రావొచ్చని విద్యాశాఖ ప్రకటించింది. -
ఆ సబ్జెక్టు వరకు పాస్ చేసేద్దామా?
సాక్షి, హైదరాబాద్: ఉట్నూర్ కేంద్రంలో సోమవారం మాయమైన పదో తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ సబ్జెక్టు వరకూ వారిని పాస్ చేయడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిరోజు టెన్త్ పరీక్ష సందర్భంగా ఉట్నూర్ కేంద్రంగా ప్రైవేటు విద్యార్థులు (సప్లిమెంటరీ) 9 మంది పరీక్ష రాశారు. ఆ పేపర్లను ముందే నిర్ణయించిన ప్రకారం వాల్యూయేషన్ కేంద్రానికి తరలించాల్సి ఉంది. వీటిని దగ్గర్లోని పోస్టాఫీసుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఎక్కడో పడిపోయాయి. దీన్ని గుర్తించిన విద్యాశాఖాధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. జవాబు పత్రాలు మాయమైన ఘటనకు విద్యార్థులను బాధ్యులను చేయడం సరికాదని భావించి, ఆ సబ్జెక్టు వరకు పాస్ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. -
టెన్త్ పేపర్ లీకేజీ.. కీలక విషయాలు వెల్లడించిన సిపి రంగనాథ్
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ లో కలకలం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ పై పోలీసులు కొరఢా ఝళిపించారు. పేపర్ ను ఫోటో తీసి బయటికి పంపిన మైనర్ బాలుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందంటూ ప్రచారం చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. మైనర్ బాలుడు కమలాపూర్ బాలుర ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టుపైకి ఎక్కి తన స్నేహితుడి కోసం హిందీ ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మిత్రుడు శివగణేష్ కు పంపాడని సిపి రంగనాథ్ తెలిపారు. శివ గణేష్ ఓ జర్నలిస్టు మహేష్ కు పంపగా వారిద్దరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. దాన్ని మరో జర్నలిస్ట్ ప్రశాంత్ బిజెపి నాయకులతో పాటు జర్నలిస్ట్ గ్రూపులో బ్రేకింగ్ న్యూస్ అంటూ హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిందని టెక్స్ట్ మెసేజ్ పోస్ట్ చేశాడని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు పేపర్ బయటికి పంపిన మైనర్ బాలుడు పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్ ప్రస్తుతం మైనర్ బాలుడితోపాటు శివ గణేష్, ప్రశాంత్‌ను అరెస్టు చేశామని మహేష్ పరారీలో ఉన్నాడని మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు. వాస్తవంగా సెంటర్లో ఉన్నవారికి ఈ విషయం తెలియదని వారి నిర్లక్ష్యం ఉన్నట్లు భావించి డిపార్ట్మెంట్ పరంగా ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. - ఏవి.రంగనాథ్ - సిపి వరంగల్ -
అగ్రస్థానం అనుమానమే..?
సాక్షి, జగిత్యాల: పదోతరగతి ఫలితాల్లో జిల్లా వరుసగా రెండుసార్లు అగ్రస్థానంలో నిలిచింది. గతంలో కలెక్టర్ శరత్ చొరవతో చేపట్టిన ఉత్తేజం కార్యక్రమం సత్పలితాలనిచ్చింది. ఈనెల 16న పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈసారి కూడా రాష్ట్రంలో మళ్లీ అగ్రస్థానంలో నిలిస్తే ముచ్చటగా మూడోసారి(హ్యాట్రిక్) నంబర్‌వన్‌గా నిలిచే అవకాశం దక్కుతుంది. అయితే గతంలో మాదిరిగా ఉత్తేజం కార్యక్రమానికి కలెక్టర్ నిధులు మంజూరు చేయకపోవడంతో స్థానిక దాతల నుంచి నెట్టుకొచ్చారు. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఎన్నికల విధుల్లో ఉండడం.. కొన్ని పాఠశాలల్లో సిలబస్ కూడా పూర్తికాకపోవడం నంబర్‌వన్ సాధించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వరుసగా రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా నంబర్‌వన్‌గా నిలుస్తోంది. 2016–17 విద్యాసంవత్సరం పదోతరగతి ఫలితాలలో జిల్లా 97.35 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. మరుసటి సంవత్సరం 2017–18 ఫలితాల్లోనూ 97.56 ఉత్తీర్ణతశాతంతో జగిత్యాల జిల్లా రెండోసారి రాష్ట్రంలో అగ్రభాగాన నిలిచింది. వీరిలో బాలికలు 98శాతం ఉత్తీర్ణత కాగా బాలురు 97 శాతం ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 201 ప్రభుత్వ పాఠశాలల్లో 117 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఉత్తేజంతో ఊపు.. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కలెక్టర్ శరత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచేందుకు ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఉత్తేజం కార్యక్రమంతో పది విద్యార్థులకు పాఠశాల సమయానికి గంట ముందు, తర్వాత స్టడీఅవర్స్‌లో చదువుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఆ సమయంలో వారికి స్నాక్స్ అందించేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. కలెక్టర్ నిధులతోపాటు విస్త్రృతమైన ప్రచారంతో దాతలు ముందుకు రావడంతో సాయంత్రం వేళ విద్యార్థుల ఆకలి తీరింది. ఫలితంగా రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలుస్తోంది. మాస్ కాపీయింగ్ మరకలు గతేడాది మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షాసమయంలో జిల్లాలోని కొడిమ్యాల మండలంలో జరిగిన మాస్‌కాపీయింగ్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందుకు ఎన్నడు లేని విధంగా ఏకంగా ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం కలకలం రేపింది. జిల్లాను ఫలితాల్లో నంబర్‌వన్‌గా ఉంచాలనే ఒత్తిడితో కొన్ని చోట్ల ఉపాధ్యాయులు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్తేజం అంతంతే! గత రెండేళ్లుగా జిల్లాలో పదోతరగతి విద్యార్థుల కోసం చేపట్టిన ఉత్తేజం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. కలెక్టర్ శరత్ రెండేళ్లపాటు ఉత్తేజం కోసం ఏటా సుమారు రూ.15 లక్షలు కేటాయించారు. వీటితోపాటు ఆయా మండలాలు, గ్రామాల్లో స్థానిక నాయకులు, దాతల నుంచి విరాళాలు భారీగా వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించలేదు. కేవలం గ్రామస్థాయిల్లో దాతల విరాళాలతో నెట్టుకొస్తున్నారు. రెండేళ్లుగా లభించిన ప్రచారం, ప్రోత్సాహం ఈ దఫా కరువైనట్లు కనిపిస్తోంది. దీనికితోడు ఈసారి ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో నిమగ్నమవడం.. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో ఇప్పటి వరకు సిలబస్ పూర్తికాలేదు. ఈ పరిస్థితుల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి హ్యాట్రిక్ సాధించడం కష్టతరంగా మారింది. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుండా చూడాలి మాస్‌కాపీయింగ్ నిరోధానికి చర్యలు : డీఈవో లింగయ్య ఆదిలాబాద్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య చీఫ్ సూపరిటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను ఆదేశించారు. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణపై శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కేంద్రాల్లో అసౌకర్యాలు గురికాకుండా అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. పరీక్ష కేంద్రం లోకి అధికారులు, విద్యార్థులకు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించ వద్దని తెలిపారు. మార్చి 14 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్న 12.15 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో మొత్తం 10,410 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు. వీరిలో రెగ్యూలర్ విద్యార్థులు 9,752 మంది, ప్రైవేటు విద్యార్థులు 658 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. విద్యాశాఖ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, ఉప విద్యాధికారి శాంరావు పాల్గొన్నారు.