పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
- విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుండా చూడాలి
- మాస్‌కాపీయింగ్ నిరోధానికి చర్యలు : డీఈవో లింగయ్య
ఆదిలాబాద్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య చీఫ్ సూపరిటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను ఆదేశించారు. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణపై శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కేంద్రాల్లో అసౌకర్యాలు గురికాకుండా అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. పరీక్ష కేంద్రం లోకి అధికారులు, విద్యార్థులకు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించ వద్దని తెలిపారు.
మార్చి 14 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్న 12.15 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో మొత్తం 10,410 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు. వీరిలో రెగ్యూలర్ విద్యార్థులు 9,752 మంది, ప్రైవేటు విద్యార్థులు 658 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. విద్యాశాఖ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, ఉప విద్యాధికారి శాంరావు పాల్గొన్నారు.