government college
-
ఆదర్శమంటే ఆయనే: సర్కారు కాలేజీలో పీవో కుమారుడు
సీతానగరం (పార్వతీపురం): ఒకరికి ఏదైనా సలహా ఇచ్చేముందు మనమూ దాన్ని ఆచరించేందుకు సిద్ధంగా ఉండాలనే మాటను అక్షరాల పాటిస్తున్నారు పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్. తన పిల్లలను ప్రభుత్వ బడి, కళాశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల పార్వతీపురం కేపీఎం మున్సిపల్ హైస్కూల్లో పదోతరగతి పూర్తిచేసిన కుమారుడు త్రివిక్రమ్‌ను గురువారం సీతానగరం మండలం జోగంపేటలో ఉన్న గిరిజన ప్రతిభ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం నాడు–నేడు నిధులతో సుందరంగా తీర్చిదిద్దిందని, ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తున్నారని, అందుకే గిరిజన కళాశాలలో తన కుమారుడిని చేర్పించానని ఆయన విలేకరులకు తెలిపారు. అనంతరం అక్కడి విద్యార్థులకు బ్యాగ్‌లు, మెటీరియల్, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఇవీ చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా? -
తెలంగాణ: కాలేజీలకు తాళం!
నల్లగొండ జిల్లా మునుగోడులో పదేళ్లకు పైబడి కొనసాగిన ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ సొసైటీ మార్పునకు దరఖాస్తు చేసుకుంది. విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలతో కళాశాల నిర్వహణ బాధ్యతల నుంచి ప్రస్తుత సొసైటీ తప్పుకుంటూ హైదరాబాద్‌లోని మరో సొసైటీకి అప్పగించనుంది. ప్రభుత్వం అనుమతిస్తే ఈ కాలేజీ ఇకపై హైదరాబాద్‌లో కొనసాగనుంది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలు త్వరలో ఆమోదం పొందే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఓ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ సైతం సొసైటీ మార్పునకు దరఖాస్తు చేసుకున్నాయి. జూనియర్ కాలేజీని మల్కాజ్గిరి జిల్లాకు చెందిన సొసైటీ పేరిట మార్పునకు దరఖాస్తు సమర్పించగా, డిగ్రీ కాలేజీని హైదరాబాద్ జిల్లాలోని మరో సొసైటీ పేరిట మార్చేందుకు అర్జీ పెట్టుకుంది. మార్పు చేయించుకునే సొసైటీలు ఇప్పటికే పలు కళాశాలలను నిర్వహిస్తుండటంతో ప్రక్రియ వేగవంతంగా పూర్తికానుంది. సాక్షి, హైదరాబాద్: నిర్వహణభారంతో సతమతమవుతున్న గ్రామీణ ప్రాంత కాలేజీలను వదిలించుకునే దిశగా యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. కోవిడ్–19 వ్యాప్తి మొదలైన తర్వాత ఈ విద్యాసంస్థల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఒకవైపు అడ్మిషన్లు కొనసాగుతున్నా విద్యార్థుల నుంచి ఫీజులు పెద్దగా రాకపోవడం, మరోవైపు ప్రభుత్వం కూడా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో ఆ కాలేజీలు ఆర్థికంగా చితికిపోయాయి. అనుబంధ గుర్తింపునకు పదిశాతం దూరం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న 2,400 ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఖ్య తాజాగా 1,680కు పడిపోయింది. ప్రతి ఏటా సగటున 50 నుంచి 100 జూనియర్ కాలేజీలు మూతపడుతున్నట్లు తెలుస్తోంది. 2021–22 విద్యాసంవత్సరంలో కేవలం 1,520 కాలేజీలు మాత్రమే అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. పదిశాతం కాలేజీలు ఇప్పటికీ అనుబంధ గుర్తింపు కోసం ఫీజు చెల్లించకపోవడం గమనార్హం. బకాయిల భారం... 201–20 ఆర్థిక సంవత్సరం నుంచి సగానికిపైగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న జూనియర్ కాలేజీల్లో ముప్పావువంతు కాలేజీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్‌తో మూతపడ్డ కాలేజీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. ఈ విద్యాసంవత్సరం కూడా ఇంకా ఆన్లైన్ తరగతులకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలను నిర్వహించడానికి బదులు తప్పుకోవడమే ఉత్తమమనే ఆలోచనతో పలువురు ఇతర సొసైటీల చేతుల్లో పెడుతున్నారు. ప్రస్తుతం సొసైటీ మార్పు కోసం దాదాపు 42 కాలేజీలకు సంబంధించిన ఫైళ్లు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రోత్సహించకుంటే కష్టం.... ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఖ్య ఎక్కువ. గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు దొరక్క ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. సేవా దృక్పథంతోనే కొనసాగుతున్న గ్రామీణ కాలేజీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ కాలేజీలు మూతపడితే గ్రామీణ విద్యార్థులు పదో తరగతికే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. కోర్సు ఫీజులను కూడా కాస్త పెంచి యాజమాన్యాలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. –గౌరిసతీశ్, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం మూతపడితే కాలేజీ విద్యకు నోచుకోరు రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ఏటా పెద్ద సంఖ్యలో మూతపడుతున్నాయి. విద్యార్థుల నుంచి తీసుకునే ఫీజుల కంటే నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీలు సైతం నామమాత్రపు ఫీజులు తీసుకుంటున్నాయి. అవి కూడా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడుతున్నాయి. ఇలాంటప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసే చర్యలు తీసుకోవాలి. –ఎం.దుర్గేశ్వర్‌రెడ్డి, టీపీజేఎంఏ, ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా -
దేవుడు వరం ఇచ్చినా..!
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించడంలేదన్న చందంగా మారింది జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల జీవితాలు. ఏటా రెన్యువల్ ఉత్తర్వుల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తుంటడం.. మరోవైపు తమ ఉద్యోగాలు రెన్యువల్ చేయాలని సాగిస్తున్న పోరాటాలు.. వెరసి వీరి జీవితాలు దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్లుగా మారింది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినప్పటికీ ఒక పక్క రెన్యువల్ కాక మరోపక్క వేతనాలు దక్కక అర్ధాకలితో అలమటిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక పది రోజుల బ్రేక్‌తో 12 నెలల వేతనం ఇవ్వాలని అది కూడా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదేశాలు ఉన్నప్పటికీ.. గత కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ డిమాండ్ల సాధన కోసం తరగతి గదులు సైతం వదిలి రోడ్డు ఎక్కారు. ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేశారు. అయినా వారి కల సాకారం కాలేదు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇన్నాళ్లూ ఏడాదిలో కేవలం 10 నెలలు మాత్రమే వేతనాలు అందుకున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఏడాది మొత్తం 12 నెలల పాటు పది రోజుల బ్రేక్‌తో వేతనాలు ఇవ్వాలని విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి ఆదిత్యనాధ్‌దాస్, ఆర్థికశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో జిల్లాలోని మొత్తం 33 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 240 మంది జూనియర్ అధ్యాపకులకు లబ్ధి చేకూరుతుందని ఎంతో సంబరపడ్డారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కిందిస్థాయి అధికారులు మరుగున పడేయడంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నెల 22న రాష్ట్ర జేఏసీ నాయకులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఏప్రిల్, మే నెల వేతనాలతో పాటు పనిచేసిన జూన్, జూలై నెలలకు సంబంధించి వేతనాలు విడుదల చేయాలని గత నెల 25న జీఓ జారీ చేశారు. దీనిపై డీవైఈవోలు ప్రోసీడింగ్స్ ఇచ్చి తక్షణమే బిల్లులు ట్రెజరీలకు అందజేయాలని ప్రిన్సిపాల్స్‌ను కోరారు. అయితే నామమాత్రంగా బిల్లులు తయారు చేసిన ప్రిన్సిపాల్స్ ట్రెజరీ అధికారులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. జిల్లాలోని కొన్ని కళాశాల ప్రిన్సిపాల్స్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు సహకరించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అధ్యాపకులు వాపోతున్నారు. భద్రత లేని ఉద్యోగం అసలే అరకొర జీతాలు.. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా వారికి గుర్తింపు లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మినెంట్ చేస్తానని వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తడం మానేసింది. అయితే కాంట్రాక్ట్ అధ్యాపకులు పలు దఫాలుగా చేసిన ఆందోళన ఫలితంగా దిగొచ్చిన ప్రభుత్వం ఎన్నికలు సమీపించడంతో కేబినెట్లో చర్చించింది. దీని ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులకు డీఏతో కూడిన ఏంటీఎస్, 60 ఏళ్లు రిటైర్మెంట్ వయసు పెంపు, పది రోజుల విరామంతో 12 నెలలకు వేతనం, 180 రోజుల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ప్రతి పీఆర్సీలో రివైజ్డ్ పేస్కేలు వర్తింపు, హెల్త్‌కార్డులు మంజూరు, కాంట్రాక్ట్‌కు బదులు ఎంటీఎస్ హోదా వంటివి అమలు చేస్తున్నట్లు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎంటీఎస్ హోదా రావడంతో రెన్యువల్ విధానం అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు మాత్రం బాండ్ తప్పనిసరి అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జీతాలు లేక అల్లాడుతున్నాం గత ఇరవై ఏళ్లుగా కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తూ కుటుంబాలు పోషించుకుంటున్నాం. ఇన్నాళ్లూ ఏడాదిలో 10 నెలలు మాత్రమే వేతనాలు ఇస్తుండటంతో మిగిలిన రెండు నెలలు అర్థాకలితోనే కాలం వెళ్లదీస్తున్నాం. ఇప్పుడు పది రోజుల విరామంతో 12 నెలలు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు సమన్వయలోపం కారణంగా నాలుగు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – జీఎస్కే విద్యాసాగర్, జిల్లా జేఏసీ నాయకుడు -
సిగ్గు..సిగ్గు!
వీరఘట్టం శ్రీకాకుళం : అన్ని విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు ఉండాల్సిందే. మరుగు సమస్య లేకుండా చూడాలి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం ఇది. అయితే ఈ ఆదేశం అన్నిదగ్గర్ల అమలవుతోందో..లేదో తెలియదుగాని..వీరఘట్టం ప్రభు త్వ జూనియర్ కళాశాలలో మాత్రం అమలు జరగడం లేదు. ఇక్కడ 200 మంది అమ్మాయిలతోపాటు.. మరో 250 మంది మగపిల్లలు చదువుతున్నారు. అందుకుతగ్గట్టుగా మరుగుదొడ్లు లే వు. దీంతో అత్యవసర సమయంలో సమీపంలో ని తుప్పలు, డొంకల చాటుకు వెళ్లాల్సి రావడం సిగ్గుపడాల్సి విషయమే. ఈ కళాశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పలుమార్లు అధికారులను కోరా రు. జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. పరిస్థితి ఇదీ సుమారు 50 ఏళ్ల చరిత్ర ఉన్న వీరఘట్టం ప్రభు త్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల లేమితో విద్యార్థినీ విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. వీరఘట్టం, వంగర, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లోని పలు గ్రామాల కు చెందిన పిల్లలు ఇంటర్ చదువుకు ఈ కళాశాలలో చేరుతుంటారు. ప్రస్తుతం ప్రథమ, ద్వితీ య సంవత్సరం కలిపి సుమారు 450 మంది పిల్లలు ఉండగా.. వీరిలో 200 మంది అమ్మాయిలు. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి ఉంది. అది కూడా శిథిలమైంది. దీంతో మరుగు సమస్యతో నిత్యం విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో కాలేజీకి సమీపంలో ఉన్న తుప్పులు..డొంగల వైపు వెళ్లలేక బాలికలు బాధపడుతున్నారు. పట్టించుకోని ఇంటర్ బోర్డు ! ఫీజుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ఇంటర్మీడియెట్ బోర్డు కళాశాలలో మౌలి క వసతుల కల్పనకు చర్యలు చేపట్టకపోవడం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలా ఎన్ని రోజులు తమ పిల్లలు ఇబ్బందులు పడాలని ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం కళాశాలలో మరుగుదొడ్ల సమస్యతో విద్యార్థులు, స్టాఫ్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బిల్లింగ్‌ల కొరతకూడా ఉంది. ఇటీవల కొత్తగా విధుల్లో చేరాను. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. – పి.శంకరరావు, ప్రిన్సిపాల్, వీరఘట్టం జూనియర్ కాలేజీ ఎవరితో చెప్పుకోలేకపోతున్నాం కళాశాలలో చేరి ఏడాది గడిచింది. మా సమస్యలను ఎవరితో చెప్పుకోలేక నిత్యం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న ఒక మరుగుదొడ్డి కూడా శిథిలమైంది. – కె.నాగమణి, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆరుబయటకు వెళ్తున్నాం మరుగుదొడ్లు లేకపోవడంతో అత్యవసరవేళ ఆరుబయటకు వెళ్తున్నాం. సిగ్గుతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి మరుగుదొడ్లు నిర్మించి మా ఇబ్బందులు తీర్చాలి. – ఎ.సుశీల, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని -
ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు
-
కీచక ప్రొఫెసర్ పీచమణిచారు
పాటియాలా: విద్యార్థినుల ఫోన్లకు అసభ్యకరమైన సందేశాల పంపిన ఓ ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు యూనివర్సిటీ అమ్మాయిలు. ప్రొఫెసర్ని కాలేజీ నుంచి బయటకు లాక్కెళ్లి చితక్కొట్టారు. ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగింది. పాటియాలాలోని ప్రభుత్వ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్ అదే కాలేజీలో చదువుతున్న కొంతమంది అమ్మాయిలకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. దీంతో కోపోద్రిక్తులైన అమ్మాయిలు ఆ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. కళాశాల నుంచి అతడిని బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. ఇదంతా ఓ విద్యార్థిని వీడియో తీసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. కాగా ఆ ప్రొఫెసర్ పేరు ఇంత వరకూ బయటకు వెల్లడించలేదు. బాధితులు పోలీసులను సంప్రదించారో లేదో స్పష్టత లేదు. ఎనిమిది మంది జేఎన్‌యూ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్ అతుల్ జోహారీ ఉదంతం మర్చిపోకముందే కళాశాలల్లో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. -
పుస్తకాల్లేవు.. చదువెలా..?
►పాఠ్యపుస్తకాలు లేక ఇంటర్ విద్యార్థుల అగచాట్లు ►కాలేజీలు ప్రారంభమై నెల దాటినా మార్కెట్‌కు రాని పుస్తకాలు ►ప్రభుత్వ కాలేజీల్లోను సర్దుబాటుపైనే దృష్టి ఒంగోలు: ఇంటర్మీడియెట్ విద్యార్థుల అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. కాలేజీలు ప్రారంభమై నెలరోజులు దాటినా ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేదు. దీంతో పాఠ్యాంశాల బోధన సంగతి అటుంచితే విద్యార్థులు కనీస సాధన చేసుకునేందుకు సైతం అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో పరిస్థితి ఇదీ జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి దాదాపు 52 వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. సరాసరిన ఒక్కో సంవత్సరానికి 26 వేలమంది చొప్పున వీరున్నారు. అయితే వచ్చే ఏడాది ఇంటర్ పాఠ్యపుస్తకాల సిలబస్ మార్చాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో పుస్తకాల ముద్రణకు ప్రైవేటు ముద్రణా సంస్థలు ముందుకు రాలేదు. ఒక వేళ పుస్తకాలు ఏమైనా మిగిలితే వచ్చే ఏడాది పనికిరావనే ఉద్దేశంతో వారు వెనుకడుగు వేశారు. కేవలం గత సంవత్సరం ముద్రణలో మిగిలి ఉన్న పుస్తకాలను మాత్రమే విక్రయించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముద్రణా సంస్థలు ఉన్న గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లోనే పుస్తకాలకు డిమాండ్ ఉండడంతో ఇతర జిల్లాలకు ఈ పాఠ్యపుస్తకాలు చేరడం లేదు. దీంతో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉచితానికి స్వస్తి ఇదిలా ఉంటే ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో, ఏపీ మోడల్ స్కూళ్లలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తుంది. దాని ప్రకారం జిల్లాలో సుమారుగా 14 వేల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుందని అంచనా. వచ్చే ఏడాది పాఠ్యపుస్తకాల సిలబస్ మారుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ముద్రణా సంస్థ కూడా పుస్తకాల ముద్రణకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరినా పుస్తకాలు మాత్రం అందుబాటులోకి రాని పరిస్థితి. అయితే ఉచితంకు స్వస్తి పలికినట్లవుతుందనే విమర్శలు వ్యక్తమవుతుండడంతో అధికారులు జాగ్రత్త పడడం ప్రారంభించారు. అందులో భాగంగా గత సంవత్సరం ఏదైనా కాలేజీలలో పాఠ్యపుస్తకాలు ఏమైనా మిగిలాయా అన్న కోణంలో విచారించారు. మిగిలిన పుస్తకాలను ప్రస్తుతం సర్దుబాటు చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ చాలనిపక్షంలో ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుంచి ప్రథమ సంవత్సరం పుస్తకాలను తీసుకొని ప్రస్తుత ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పంపిణీ చేయాలన్నారు. అదే విధంగా ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సర్దుబాటు చేసేందుకుగాను తమ కాలేజీల్లో విద్యను అభ్యసించి టీసీ తీసుకువెళ్లేందుకు వచ్చే విద్యార్థులకు పుస్తకాలను తీసుకొచ్చి ఇచ్చి టీసీలు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ముందే ఇతరులకు ఎవరికైనా సర్దుబాటు చేసిన వారి పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇబ్బందికరంగా మారిన సర్దుబాటు ప్రక్రియ అయితే ఈ సర్దుబాటు వ్యవహారం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం పుస్తకాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. ఎంసెట్ పరీక్షల్లో రెండు సంవత్సరాలకు సంబంధించి పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను ఇవ్వమంటే ఎంసెట్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలనేది విద్యార్థుల ప్రశ్న. మరో వైపు ప్రైవేటు కాలేజీల్లో చదివేవారికి అయితే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక వైపు లెక్చరర్లు తమ వద్ద ఉన్న పాఠ్యపుస్తకంతో వేగవంతంగా సిలబస్ పూర్తిచేస్తుంటే దానికి తగ్గట్లుగా విద్యార్థులు ప్రిపేర్ కా>లేకపోతున్నారు. ఇక ఈ కాలేజీల్లో పుస్తకాల సర్దుబాటు ప్రక్రియ కూడా సా«ధ్యమయ్యే పనికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి పాఠ్యపుస్తకాలను తమకు అందించేందుకు ముందుకు రావాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుండా చూడాలి మాస్‌కాపీయింగ్ నిరోధానికి చర్యలు : డీఈవో లింగయ్య ఆదిలాబాద్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య చీఫ్ సూపరిటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను ఆదేశించారు. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణపై శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కేంద్రాల్లో అసౌకర్యాలు గురికాకుండా అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. పరీక్ష కేంద్రం లోకి అధికారులు, విద్యార్థులకు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించ వద్దని తెలిపారు. మార్చి 14 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్న 12.15 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో మొత్తం 10,410 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు. వీరిలో రెగ్యూలర్ విద్యార్థులు 9,752 మంది, ప్రైవేటు విద్యార్థులు 658 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. విద్యాశాఖ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, ఉప విద్యాధికారి శాంరావు పాల్గొన్నారు. -
విద్యార్థినిని వేధించిన లెక్చరర్ అరెస్ట్
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో తన తరగతిలోని విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. దీంతో ఆ ఉపాధ్యాయుడి చెర నుంచి తప్పించుకునేందుకు విద్యార్థిని(17) ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన లెక్చరర్‌ను అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేటలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న రామచంద్రం అదే కళాశాలలో చదువుకుంటున్న రెండో సంవత్సరం విద్యార్థినిని గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని పదే పదే ఇబ్బందులకు గురి చేస్తుండటంతో.. విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లెక్చరర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య
యాదాద్రి: ప్రభుత్వ కళాశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. సోమవారం ఆమె నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో రూ.2.50 కోట్లతో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి, రూ.6 కోట్లతో నిర్మించే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలబాలికల హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే బాలబాలికలకు మధ్యాహ్నభోజనం, ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా ఉందని విప్ చెప్పారు. -
సర్కారు కాలేజీల ‘వెనుకబాటు’
♦ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ♦ ఉత్తీర్ణత అంతంత మాత్రమే ♦ ఫస్టియర్‌లో 37, సెకండియర్‌లో 59 శాతం పాస్ సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంటర్మీడియట్ ఫలితాల్లో సర్కారు కాలేజీలు వెనకబడ్డాయి. రాష్ట్రస్థాయిలో జిల్లా అగ్రగామిగా ఉన్నా ప్రభుత్వ కాలేజీల విభాగంలో మాత్రం అథమంగానే నిలిచింది. జిల్లాలో 24 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 2015-16 వార్షిక సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 2,943 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో కేవలం 1,082 మంది మాత్రమే (37శాతం) ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం నుంచి 2,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 1,406 మంది మాత్రమే (59శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఉత్తీర్ణత శాతం రాష్ట్ర సగటును సైతం అందుకోకపోవడం గమనార్హం. ‘ప్రథమం’లో చివరి ర్యాంకు... జిల్లాలో 450 ఇంటర్మీడియట్ కాలేజీలుండగా.. ఇందులో 5శాతం ప్రభుత్వ కాలేజీలున్నాయి. మిగతా వాటిలో 280కిపైగా కార్పొరేట్ కాలేజీలు. ఇవన్నీ మహానగరానికి సమీపంలో ఉండడం.. వీటిలో విద్యార్థుల సంఖ్య లెక్కకు మించి ఉండడం.. తాజాగా పాసైన వారిలో ఈ విద్యార్థులే అధికం కావడంతో ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రభాగాన నిలిచిందని చెప్పొచ్చు. అదే ప్రభుత్వ కాలేజీలు, గ్రామీణ కాలేజీల్లో మాత్రం ఫలితాల తీరు అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రభుత్వ కాలేజీల విభాగం ఫస్టియర్ ఫలితాల్లో జిల్లా అట్టడుగున 10 ర్యాంకుతో సరిపెట్టుకోగా.. సెకండియర్‌లో ఏడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
హాజరు లేదని.. హాల్‌టికెట్ ఇవ్వలేదు
ప్రొద్దుటూరు: హాజరు శాతం లేని కారణంగా 23 మంది విద్యార్థులను పరీక్షకు హజరు కాకుండా అడ్డుకోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 23 మంది విద్యార్థులకు సరైన హాజరు లేకపోవడంతో కళాశాల ప్రిన్పిపల్ హాల్‌టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో పరీక్ష సమయానికి వచ్చిన విద్యార్థులు హాల్‌టికెట్ ఇవ్వాలని ధర్నాకు దిగడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపిచేశారు. -
సంక్షేమంలో సంక్షోభం !
- జిల్లా కేంద్రంలో చదివే బీసీ విద్యార్థులకు తప్పని తిప్పలు - కళాశాల వసతిగృహాలు సరిపడా లేక ఇక్కట్లు - ఉన్న హాస్టళ్లలోనూ పేదలకు దక్కని స్థానం ! - అయినవారికే అందలమనే ఆరోపణలు - బాలబాలికల సమస్యలు పట్టని అధికారులు ఇందూరు : విద్యనభ్యసించేందుకు దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే పేద విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకునేలా ఉచితంగా భోజనం, అన్ని వసతులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కళాశాల వసతిగృహాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సరిపడా వసతిగృహాలు ఉన్నప్పటికీ బీసీ విద్యార్థులు మాత్రం సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు. బీసీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండగా, బాల, బాలికలకు ఒక్కో హాస్టల్ చొప్పున మాత్రమే ఉన్నారు. జిల్లాలోని 36 మండలాలకు చెందిన అనేక మంది బీసీ విద్యార్థులు జిల్లా కేంద్రంలో చదువుకుంటున్నారు. వీరు ప్రతి రోజు మారుమూల ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి రావడం, తిరిగి ఇంటికి వెళ్లేసరికి సమయమంతా బస్సుల్లోనే గడుస్తోంది. దీంతో కళాశాల వసతిగృహంలో ఉండేందుకు పలువురు విద్యార్థులు దరఖాసు చేసుకున్నారు. సుభాష్ నగర్లో ఉన్న బాలికల వసతిగృహంలో 100 సీట్లకు గాను ఇప్పటికే 106 మంది విద్యార్థులు ఉన్నారు. మరో 60 మంది ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాందేవ్‌వాడలోని బాలుర వసతిగృహంలో 200 సీట్లు ఉండగా అవి కూడా భర్తీ అయ్యాయి. ఇంకా చాల మంది విద్యార్థులు తమకు సీటు కావాలని అధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. ప్రజావాణిలో సైతం ఈ సమస్యపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అరుుతే ఈ హాస్టళ్లలో ఇప్పటికే పరిమితికి మించి సీట్లు భర్తీ చేశామని, కొత్తగా ఇంకెవరికీ అవకాశం ఇవ్వలేమని బీసీ సంక్షేమాధికారులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది బాలబాలికలు ఇంకా సీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో సీట్లు ఖాళీగా ఉన్నా, అందులో బీసీ విద్యార్థుల ప్రవేశాలకు సంబంధిత శాఖల అధికారులు ఒప్పుకోవడం లేదు. చర్యలు చేపట్టని అధికారులు... జిల్లా కేంద్రంలో మరో రెండు కళాశాల వసతిగృహాలు అవసరం ఉన్నా వాటి కోసం బీసీ సంక్షేమాధికారులు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. కనీసం ఉన్నతాధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు. ప్రతి సంవత్సరం ఈ సమస్య ఎదురవుతున్నా ప్రత్యామ్నాయ మార్గాలు చూపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఏటా తెలిసిన వారికి సీట్లిచ్చి, అసలైన పేద వారికి సీట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. తద్వారా చాల మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు ఈ రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. బాలికలకు మరో హాస్టల్ నిర్మిస్తున్నాం ‘జిల్లా కేంద్రంలో బాలుర, బాలికల కళాశాల వసతిగృహాలు సరిపడా లేవు. ఉన్న వసతిగృహాల్లో సీటు కోసం చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. సీట్లు లేకపోవడంతో వారికి న్యాయం చేయలేకపోతున్నాం. అయితే కోటగల్లిలో నూతనంగా బాలికల వసతిగృహాన్ని నిర్మిస్తున్నాం. అది పూర్తయితే బాలికల సమస్య సగం వరకు తీరుతుంది.’ - శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్డబ్ల్యూఓ, నిజామాబాద్ -
ఫలితాల్లో ‘ప్రభుత్వ’ జోరు
నిజామాబాద్ అర్బన్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. 68 శాతం మంది ఉత్తీర్ణులయ్యూరు. గతేడాదికంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది 62.64 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో 4,283 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,921 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇం దులో బాలురు 1,997 మంది పరీక్షలు రాయగా 1,220 పాసయ్యూరు. ఉత్తీర్ణత శాతం 61.09గా నమోదయ్యింది. బాలికలు 2,286 మంది పరీక్షలు రాయగా 1,701 ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 74.41. మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల 93.18 శాతం తో మొదటి స్థానంలో నిలిచింది. మద్నూరు జూనియర్ కళాశాల 91.29 శాతంతో రెండో స్థానం పొందింది. జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 91.13 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదయ్యూంది. ఇక్కడ 6.58 శాతం విద్యార్థులే పాసయ్యూరు. ఒకేషనల్ విభాగం జిల్లాలో ఒకేషనల్ విద్యార్థులు 73.02 శాతం ఉత్తీర్ణులయ్యూరు. గతేడాది ఉత్తీర్ణత శాతం 52గా నమోదయ్యింది. జిల్లా వ్యాప్తంగా 341 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 249 మంది ఉత్తీర్ణులయ్యారు. కోటగిరి కళాశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. బాల్కొండ 94.44 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో ఉంది. ఆ ర్మూర్ బాలుర ఒకేషనల్ కళాశాలలో ఒక్క వి ద్యార్థి మాత్రమే ఉండగా.. జీరో శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. నిజామాబాద్ బాలుర కళాశాలలో 72 మందికిగాను 29 మంది పాసయ్యా రు. 40.28 శాతం ఉత్తీర్ణత నమోదయ్యిం ది. ఎయిడెడ్ కళాశాలల్లో.. ఈ ఏడాది ఎయిడెడ్ కళాశాలల్లో జిల్లావ్యాప్తంగా 142 మంది పరీక్షలకు హాజరు కాగా 21 మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యూరు. 15 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 100 మంది పరీక్షకు హాజరు కాగా 11 మంది, బాలికలు 42 మంది పరీక్ష రాయగా 10 మంది పాసయ్యారు. గతేడాది 18 శాతం ఉత్తీర్ణులయ్యూరు. కామారెడ్డి ఎరుుడెడ్ కళాశాలలో 31.48 శాతం, ఆదర్శ హిందీ మహావిద్యాలయంలో 13.73 శాతం, సీఎస్ఐ జూనియర్ కళాశాలలో 5.3 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. సీఎస్ఐ జూనియర్ కళాశాలలో 56 మంది విద్యార్థులకుగాను ముగ్గురు మాత్రమే పాసయ్యూరు. గురుకులాల్లో.. జిల్లాలోని గురుకుల కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలో 666 మంది గురుకుల విద్యార్థులు పరీక్షలు రాయగా 593 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.04 ఉత్తీర్ణత శాతం నమోదయ్యింది. పోచారంపాడ్, ధర్మారం, బ్రాహ్మణపల్లిలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదరుు్యంది. సుద్దపల్లిలో 98.61 శాతం, భిక్కనూరులో 98. 68 శాతం, ఉప్పల్వాయిలో 98.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాన్సువాడ గురుకుల పాఠశాలలో అతి తక్కువగా 43.24 శాతమే ఉత్తీర్ణులయ్యూరు. జిల్లాలో గల ఏకైక ట్రైబల్ కళాశాల (గాంధారి)లో 31 మందికిగాను 31 మంది ఉత్తీర్ణులయ్యారు. ‘ఆదర్శ’లో.. ఆదర్శ కళాశాలల్లో 68.31 శాతం ఉత్తీర్ణత నమోదరుు్యంది. జిల్లాలో 16 పాఠశాలలు ఉండగా 506 మంది పరీక్షలకు హాజరయ్యూరు. ఇందు లో 346 మంది పాసయ్యూరు. డిచ్పల్లి ఆదర్శ పాఠశాలలో 44 మంది పరీక్షలు రాయగా 42 మంది(95.45 శాతం) ఉత్తీర్ణులయ్యూరు. సదాశివనగర్ ఆదర్శ పాఠశాలలో 38 మం దికాగాను 35 మంది(92.11శాతం), మేనూ రు ఆదర్శ పాఠశాలలో 27 మందికిగాను 24 మంది(88.89 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అతి తక్కువగా జక్రాన్‌పల్లి ఆదర్శ పాఠశాల లో 39 మందికిగాను 8 మంది విద్యార్థులే పాసయ్యూరు. ఇక్కడ ఉత్తీర్ణత 20.51 శాతం గా నమోదరుు్యంది. -
సీట్లు.. పాట్లు
కర్నూలు(జిల్లా పరిషత్): ప్రభుత్వ కళాశాలలో ఎంఎస్సీ నర్సింగ్ చేయాలంటే రాష్ట్రం దాటాల్సిందే. 13 జిల్లాల కొత్త రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోనూ ఎంఎస్సీ నర్సింగ్ సీట్లు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ కళాశాలలో సీట్లు మంజూరు కాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల్లో వేలాది రూపాయలు వెచ్చించి చదవాల్సి వస్తోంది. బీఎస్సీ నర్సింగ్ సీట్ల పెంపును ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1982లో వైజాగ్, కర్నూలులో మాత్రమే ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనంతపురం, కడప, శ్రీకాకుళం, గుంటూరు, మచిలీపట్నం, నెల్లూరు జిల్లాల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. మొత్తం అన్ని కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్ కోర్సు లేకపోవడం గమనార్హం. ఈ కోర్సు పూర్తి చేయాలంటే విద్యార్థినులు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. కర్నూలులో 1982లో 25సీట్లతో కళాశాలను ప్రారంభించారు. అప్ప ట్లో సొంత భవనం లేకపోవడంతో కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఓ నాలుగు గదుల్లో కళాశాలను కొనసాగించారు. ఇలా దాదాపు 29 ఏళ్ల పాటు మెడికల్ కాలేజీలోనే నర్సింగ్ కళాశాల నిర్వహించారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయడంతో 2011లో నిర్మా ణం పూర్తయింది. ఆ సంవత్సరం ఆగస్టులో కొత్తభవనంలోకి కళాశాలను మార్పు చేశారు. అయితే సీట్ల పెంపు మాత్రం మరిచారు. కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను 25 నుంచి 60కి పెంచాలని, 30 సీట్లతో ఎంఎస్సీ కోర్సు ను ప్రారంభించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది. నర్సింగ్ కళాశాలలో అధ్యాపకుల కొరత బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో ఒక ప్రిన్సిపాల్ పోస్టు, ఆరు అసిస్టెంట్ ప్రొఫెసర్, 10 లెక్చరర్, 10 పీహెచ్ఎన్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆరు అసిస్టెంట్ పోస్టుల్లో ఇద్దరు డిప్యూటేషన్‌పై వెళ్లగా రెండు పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. 10 లెక్చరర్ పోస్టుల్లో ఇద్దరు డిప్యూటేషన్‌పై వెళ్లగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. పది పీహెచ్ఎన్ పోస్టుల్లో 8 పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. మొత్తం 26 టీచింగ్ పోస్టుల్లో 15 పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనలో నాణ్యత కొరవడింది. విద్యార్థినులు ప్రాక్టికల్స్ చేయాలన్నా, థియరీ వినాలన్నా ఇబ్బందిగా మారింది. హాస్టల్ భవనం లేక ఇబ్బందులు నర్సింగ్ కళాశాలకు సొంత భవనం ఉన్నా అందులో చదివే విద్యార్థినులకు హాస్టల్ వసతి కరువైంది. నాలుగేళ్లకు గాను మొత్తం 100 మంది విద్యార్థినులు ఇక్కడ అభ్యస్తుం డగా 25 మంది డే స్కాలర్, 75 మంది హాస్టల్లో ఉంటున్నారు. గతంలో కలెక్టరేట్ పక్కనున్న నర్సింగ్ క్వార్టర్స్‌లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినిలు వసతి పొందేవారు. నర్సింగ్ స్కూల్‌ను అక్కడికి మార్చడంతో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులకు ఇబ్బందిగా మారిం ది. ప్రస్తుతం సొంత భవనంలోనే పైఅంతస్తు లో విద్యార్థినులకు వసతి కల్పిస్తున్నారు. అక్కడా చాలీచాలని వసతులతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పట్టని ప్రజాప్రతినిదులు బీఎస్సీ నర్సింగ్ కళాశాల అభివృద్ధి పట్ల పాలకులు శీతకన్ను వేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నివాసముంటున్న నగరంలోని కళాశాలకే ఈ దుస్థితి ఉండటం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పడిన ఈ కళాశాలలో సీట్లను పెంచేందుకు, ఎంఎస్సీ కోర్సును ప్రవేశపెట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని అధ్యాపకులు, విద్యార్థినులు కోరుతున్నారు. -
‘ఫాస్ట్’పై సమరం
సిద్దిపేట అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్సియల్ అసిస్టెంట్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) పథకానికి సంబంధించిన మార్గదర్శకాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం సిద్దిపేటలో విద్యార్థిలోకం సమరశంఖం పూరిం చింది. పట్టణంలో వివిధ ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్, డిగ్రీ, పీజీ, ఒకేషనల్ విద్యార్థులంతా ఏకమై భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట పాత బస్టాండ్, బ్లాక్ ఆఫీస్ చౌరస్తాల వద్ద ఆందోళనకు దిగి రాస్తారోకో నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలని, లేకపోతే విద్యార్థుల ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంతో మంది బడులు, బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారన్నారు. అలాంటి వర్గాల వారంతాప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తమకు మేలు జరుగుతుందని భావించారని, అయితే సర్కార్ తీరుతో వారంతా ఆందోళన చెందుతున్నారన్నారు. ‘ఫాస్ట్’ పథక విధివిధానాలను సర్కార్ ఇంతవరకు వెళ్లడించకపోవడంతో విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినప్పటికీ ప్రభుత్వం ‘ఫాస్ట్’ పథకంపై ముందడుగు వేయకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్న విద్యార్థుల సమస్యలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేయడం సరికాదన్నారు. ఇప్పటికైన సీఎం వెంటనే స్పందించి ఫాస్ట్ పథక మార్గదర్శకాలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దర్పిల్లి చంద్రం, టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు తాటికొండ రమేష్‌లు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలి
ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సమన్వయంతో కృషి చేయాలని ఇంటర్మీడియట్ విద్య గుంటూరు జోన్ ఆర్జేడీ డి.రామకృష్ణ పరమహంస కోరారు. స్థానిక ఏకేవీకే జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, గురుకుల, మోడల్ కళాశాలల ప్రధానాచార్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐవో పి.మాణిక్యం అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఆర్జేడీ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ విద్య కీలకమన్నారు. అందువల్ల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా ప్రధానాచార్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను ముందుకు నడిపిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పారు. తద్వారా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో గత సంవత్సరం పనిచేసిన కాంట్రాక్టు అధ్యాపకులందరినీ రెన్యువల్ చేసుకుని విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని రామకృష్ణ పరమహంస సూచించారు. జిల్లాలో మొత్తం 240 మంది కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు. కళాశాలల్లో అడ్మిషన్లకు ఈ నెలాఖరు వరకూ గడువున్నందున అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించాలన్నారు. జిల్లాలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో 26 వేల మంది విద్యార్థులు చేరగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 11,089 మంది మాత్రమే చేరారన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థులంతా ఇంటర్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెలలో అన్ని కళాశాలలను సందర్శించి మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్ఐవో పి.మాణిక్యం మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో మంచి ఫలితాలు సాధించినందున అడ్మిషన్లు కూడా ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. పామూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకునిగా పనిచేస్తూ బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించిన ఫిజిక్స్ లెక్చరర్ ఎంవీ సురేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, గురుకుల, మోడల్ కళాశాలల సిబ్బంది రూ.66 వేలు వసూలు చేసి ఆర్జేడీ, ఆర్ఐవో చేతుల మీదుగా పామూరు ప్రిన్సిపాల్‌కు అందజేశారు. ఆ చెక్కును సురేష్ భార్యకు అందించాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జె.నాగేశ్వరరావు, ఎస్.సత్యనారాయణ, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ అధ్యక్షుడు కేపీ రంగనాయకులు, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ అధ్యక్షుడు కుమ్మరగుంట సురేష్, ఎయిడెడ్ అధ్యాపకుల సంఘ నాయకుడు నాగేశ్వరరావు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. 23న జాబ్‌మేళా... గుంటూరులోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈ నెల 23వ తేదీ ఒకేషనల్ విద్యార్థులకు అప్రంటీస్ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు రామకృష్ణ పరమహంస తెలిపారు. ఈ జాబ్‌మేళాకు వివిధ పరిశ్రమల ప్రతినిధులు హాజరై ప్రతిభావంతులైన ఒకేషనల్ విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేస్తారన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ఆయా కంపెనీల్లోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. గుంటూరు జోన్ పరిధిలోని పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఒకేషనల్ విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఆదిలోనే హంసపాదు
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులంటే యాజమాన్యాలకూ లోకువే. 2013-14 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాలకు దరఖాస్తుల విషయంలో ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరే ఇందుకు నిదర్శనం. విద్యా సంవత్సరం ముగిసినా నేటికీ గత ఏడాదికి (2013-14) సంబంధించిన 14,486 దరఖాస్తులు కళాశాలల స్థాయిలోనే పెండింగ్ పడ్డాయి. వీటిలో 90 శాతం ప్రభుత్వ కళాశాలల నుంచే పెండింగ్ ఉండడం గమనార్హం. యాజమాన్యాల అలసత్వంతో పాటు చిన్న చిన్న కారణాల వల్ల దరఖాస్తులు ముందుకు వెళ్లలేదు. పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం లేకపోవడం వల్ల కూడా కొన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా సర్టిఫికెట్లు స్కానింగ్‌కు తీసుకోవడం లేదు. అమ్మాయికి బదులుగా అబ్బాయి, అబ్బాయికి బదులుగా అమ్మాయి అని పొరబాటున క్లిక్ చేసిన కారణంగా, బ్యాంకు ఖాతా నంబరు తప్పుగా నమోదు చేసినందు వల్ల వాటిని సవరించుకునే వీలు లేకుండా పోయింది. జిల్లా స్థాయిలో సరిదిద్దుకునే వెసులుబాటు కల్పించలేదు. ప్రతి చిన్న విషయానికి హైదరాబాద్‌కు వెళ్లాలంటూ ఆయా శాఖల అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు. దీంతో వారు తలలు పట్టుకుంటున్నారు. బయో మెట్రిక్‌తో అసలు సమస్య ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పు మంజూరు కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వెంటనే స్పందించి బయోమెట్రిక్ మిషన్లు కొనుగోలు చేశాయి. విద్యార్థులతో దరఖాస్తులు చేయిస్తున్నాయి. ఈ మిషను ఖరీదు రూ.25 వేల నుంచి రూ.30 వేల దాకా ఉంటుంది. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలంటూ ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు ప్రశ్నించడంతో చివరకు ఆయా శాఖల అధికారులు కల్పించుకుని వాటిని సమకూర్చారు. అయినప్పటికీ చాలా దరఖాస్తులు కళాశాలల స్థాయిలోనే ఉండిపోయాయి. మినహాయింపు ఇచ్చిన కళాశాలలూ నిర్లక్ష్యం స్కాలర్‌షిప్పు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు విషయంలో ఈ ఏడాది జూనియర్ కళాశాలల విద్యార్థులకు బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. వారు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయినా చాలా జూనియర్ కళాశాలల నుంచి నేటికీ దరఖాస్తులు అందలేదు. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలే ఉండడం గమనార్హం. ముందు దరఖాస్తు చేసుకున్న వారికే ప్రాధాన్యత గతంలో ఒక కళాశాలలో ఏ ఒక్క విద్యార్థి దరఖాస్తు చేసుకోకపోయినా మొత్తం విద్యార్థుల దరఖాస్తులు పెండింగు పడేవి. ఇప్పడా పరిస్థితి లేదు. ఆన్లైన్ చేయడంతో ఎవరు ముందు దరఖాస్తు చేసుకుని ఆయా శాఖల్లో హార్డ్‌కాపీలు ఇస్తారో...వారికి (నిధులున్న మేరకు) మంజూరు చేస్తారు. ఈ విషయంలో ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలనే తారతమ్యమేమీ ఉండదు. విద్యార్థులతో దరఖాస్తు చేయించాల్సిన బాధ్యత ఆయా కళాశాలల యాజమాన్యాలదే. ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు తేరుకునేలోపే పుణ్యకాలం కాస్త ముగిసింది. దరఖాస్తుల విషయంలో ప్రైవేట్ యాజమాన్యాలు చాలా ముందున్నాయి. ముందస్తుగా దరఖాస్తు చేయడంతో మంజూరైన నిధుల్లో 80 శాతానికి పైగా ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకే అందాయి. 20 శాతంలోపు బడ్జెట్ మాత్రమే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు మంజూరు చేశారు. -
గ్రేడ్ల వారీగా ఉత్తీర్ణత శాతం
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారిలో గ్రేడ్ల వారీగా విద్యార్థుల వివరాలివీ.. 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారు (ఏ గ్రేడ్) - 2,31,764 మంది 60 శాతం నుంచి 75 శాతంలోపు మార్కులు సాధించినవారు (బి గ్రేడ్) - 1,44,336 మంది 50 శాతం నుంచి 60 శాతంలోపు మార్కులు సాధించినవారు (సి గ్రేడ్) - 75,263 మంది 35 శాతం నుంచి 50 శాతంలోపు మార్కులు సాధించినవారు (డి గ్రేడ్) - 33,706 మంది ప్రభుత్వ కళాశాలల్లో తగ్గిన ఉత్తీర్ణత.. ఈసారి ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్థులు గతేడాది 46 శాతం మంది ఉత్తీర్ణులవగా.. ఈసారి 44.2 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. వివిధ గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు హెచ్ఈసీ హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా 1405143508 టి.అనూహ్య 460 కృష్ణా 1412121084 వి.సురేఖ 458 కడప 1404135709 ఎస్.అశోక్ 454 పశ్చిమగోదావరి 1416135033 సనా ఫిర్దోజ్ 454 నిజామాబాద్ 1401131067 ఎన్.సునీల్‌కుమార్ 454 శ్రీకాకుళం 1424113995 జి.త్రినాథ 452 విజయనగరం 1424119345 ఆకుల రమేష్ 452 విజయనగరం 1405138476 బి.రవికుమార్ 451 కృష్ణా బైపీసీ హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా 1419114965 ఎ.శ్రావ్యచౌదరి 437 ఖమ్మం 1405111475 ఆదర్శవర్థన్ తంగెళ్ల 436 కృష్ణా 1405130449 వి.అక్షయ 436 కృష్ణా 1405135859 కె.సింధుభార్గవి 436 కృష్ణా 1406113115 కె.శ్రీశ్రావణి 436 గుంటూరు 1415157495 కె.లిఖిత 436 రంగారెడ్డి 1422121495 ఆర్.అనూష వర్ణవి 436 హైదరాబాద్ బైపీసీలో 435 మార్కులు సాధించిన వారు 13 మంది ఉన్నారు... ఎంఈసీ హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా 1405136817 వి.అఖిల 492 కృష్ణా 1406130995 సి.వెంకటఅఖిలాండేశ్వరి 492 గుంటూరు 1402122404 ఎ.శ్రీవిద్య 491 విశాఖపట్నం 1406130986 బి.పృధ్వీరాజ్ 491 గుంటూరు 1406130997 మహ్మద్ ఉమ్మయ్ హబీబా 491 గుంటూరు 1406131047 పి.రాజ్యలక్ష్మి 491 గుంటూరు 1409131712 జి.శ్రీలక్ష్మి 491 చిత్తూరు 1422122381 ఎం.లక్ష్మీప్రసన్న 491 హైదరాబాద్ 1422130680 ఎ.వినోద్‌కుమార్ 491 హైదరాబాద్ 1408119254 పి.వినీత్ 491 నెల్లూరు ఎంపీసీ హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా 1416122178 క్యాతం చలన 467 నిజామాబాద్ 1419116077 బోడెంపూడి స్నేహ 467 ఖమ్మం 1405149110 ఎన్.కృష్ణ విక్రాంత్ 467 కృష్ణా 1419114898 మాచవరపు నాగరాజు 467 ఖమ్మం 1414112776 చింతా సాయి తేజేశ్వర్‌రెడ్డి 467 మెదక్ 1405149102 బోయపల్లి నర్సింహారెడ్డి 467 కృష్ణా 1407117722 గుట్టి జాహ్నవి 467 రకాశం 1419118874 ఎస్.ఏ. రుబీనా కౌసర్ 467 ఖమ్మం 1415149885 గొట్టం సాయి పునీత్‌రెడ్డి 467 రంగారెడ్డి సీఈసీ హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా 1418131531 సాయిరాజు 481 కరీంనగర్ 1404119255 ఆర్.రేవతి 480 పశ్చిమగోదావరి 1427118214 ఎం.హరిత 480 హైదరాబాద్ 1417134293 ఆర్.కురుమూర్తి 480 మహబూబ్‌నగర్ 1406136568 షేక్ షమీమ్ 479 గుంటూరు 1409145262 వై.గీతారాణి 479 చిత్తూరు 1417121910 కె.అర్చణ పటేల్ 479 మహబూబ్‌నగర్ 1420112584 సబా యాస్మీన్ 479 వరంగ ల్ 1420136303 ఆకుల సాయిరామ్ 479 వరంగల్ -
పాలమూరు మావోయిస్టు మృతి
పాన్‌గల్, న్యూస్‌లైన్: ఒడిశా రాష్ట్రంలో శుక్రవారం జరిగి న పోలీసుల ఎన్కౌంటర్లో మావోయిస్టు ఉద్యమంలో ఉన్న జిల్లా వాసి మృతి చెం దాడు. పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌కి చెందిన మధు అలియాస్ గొల్లరాములు (35) పోలీసు తూటాలకు బలయ్యాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... గోప్లాపూర్‌కి చెందిన గొల్లగౌరమ్మ, పెంటయ్య దంపతుల కుమారుడు గొల్లరాములు ఐదో తరగతి వరకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే చదువుకున్నాడు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాన్‌గల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, తొమ్మిది, పదో తరగతి వనపర్తిలో పూర్తి చేశాడు. 1996-97లో వనపర్తి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో చేరిన రాములు ఎస్ఎఫ్ఐ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అదే సమయంలో ప్రజా నాట్య మండలిలో పనిచేస్తూ నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతను ఎక్కడున్నాడో తెలియదని, ఇన్నేళ్ల తర్వాత టీవీల్లో ఆయన మరణ వార్త వింటున్నామని గ్రామస్తులు తెలిపారు. రాములు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోప్లాపూర్‌లో విషాదం అలుముకుంది. రాములు తల్లి గౌరమ్మకు అనారోగ్యంతో బాధపడుతోంది. పక్షపాతంతో మంచం పట్టిన తండ్రి పెంటయ్యకు కుమారుడి మరణవార్త చెప్పలేదు. కుటుంబ నేపథ్యం... నిరుపేద కుటుంబానికి చెందిన గొల్ల పెంటమ్మ, గౌరమ్మలకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. గొల్ల రాములు కుటుంబంలో మూడో కుమారుడు. పెద్ద కొడుకు పెద్ద బిచ్చన్న గ్రామంలో వ్యవసాయం చేసుకుంటుండగా, రెండో కుమారుడు చిన్న బిచ్చన్న రేషన్ డీలరుగా పని చేస్తున్నారు. ముగ్గురు కూమార్తెల్లో ఒక్క కూతురు చనిపోయింది.