దేవుడు వరం ఇచ్చినా..! | Tanuku Government College Contract Teachers Has Low Salaries | Sakshi
Sakshi News home page

దేవుడు వరం ఇచ్చినా..!

Published Tue, Aug 20 2019 8:33 AM | Last Updated on Tue, Aug 20 2019 8:33 AM

Tanuku Government College Contract Teachers Has Low Salaries - Sakshi

తణుకులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 

సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించడంలేదన్న చందంగా మారింది జూనియర్‌ కళాశాలల్లో కాంట్రాక్ట్‌ అధ్యాపకుల జీవితాలు. ఏటా రెన్యువల్‌ ఉత్తర్వుల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తుంటడం.. మరోవైపు తమ ఉద్యోగాలు రెన్యువల్‌ చేయాలని సాగిస్తున్న పోరాటాలు.. వెరసి వీరి జీవితాలు దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్లుగా మారింది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినప్పటికీ ఒక పక్క రెన్యువల్‌ కాక మరోపక్క వేతనాలు దక్కక అర్ధాకలితో అలమటిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక పది రోజుల బ్రేక్‌తో 12 నెలల వేతనం ఇవ్వాలని అది కూడా ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఆదేశాలు ఉన్నప్పటికీ..
గత కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్‌ అధ్యాపకులు తమ డిమాండ్ల సాధన కోసం తరగతి గదులు సైతం వదిలి రోడ్డు ఎక్కారు. ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేశారు. అయినా వారి కల సాకారం కాలేదు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇన్నాళ్లూ ఏడాదిలో కేవలం 10 నెలలు మాత్రమే వేతనాలు అందుకున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఏడాది మొత్తం 12 నెలల పాటు పది రోజుల బ్రేక్‌తో వేతనాలు ఇవ్వాలని విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి ఆదిత్యనాధ్‌దాస్, ఆర్థికశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో జిల్లాలోని మొత్తం 33 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 240 మంది జూనియర్‌ అధ్యాపకులకు లబ్ధి చేకూరుతుందని ఎంతో సంబరపడ్డారు.

అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కిందిస్థాయి అధికారులు మరుగున పడేయడంతో కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నెల 22న రాష్ట్ర జేఏసీ నాయకులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఏప్రిల్, మే నెల వేతనాలతో పాటు పనిచేసిన జూన్, జూలై నెలలకు సంబంధించి వేతనాలు విడుదల చేయాలని గత నెల 25న జీఓ జారీ చేశారు. దీనిపై డీవైఈవోలు ప్రోసీడింగ్స్‌ ఇచ్చి తక్షణమే బిల్లులు ట్రెజరీలకు అందజేయాలని ప్రిన్సిపాల్స్‌ను కోరారు. అయితే నామమాత్రంగా బిల్లులు తయారు చేసిన ప్రిన్సిపాల్స్‌ ట్రెజరీ అధికారులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. జిల్లాలోని కొన్ని కళాశాల ప్రిన్సిపాల్స్‌ కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు సహకరించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అధ్యాపకులు వాపోతున్నారు. 

భద్రత లేని ఉద్యోగం
అసలే అరకొర జీతాలు.. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా వారికి గుర్తింపు లేదు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను పర్మినెంట్‌ చేస్తానని వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తడం మానేసింది. అయితే కాంట్రాక్ట్‌ అధ్యాపకులు పలు దఫాలుగా చేసిన ఆందోళన ఫలితంగా దిగొచ్చిన ప్రభుత్వం ఎన్నికలు సమీపించడంతో కేబినెట్‌లో చర్చించింది.

దీని ప్రకారం కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు డీఏతో కూడిన ఏంటీఎస్, 60 ఏళ్లు రిటైర్మెంట్‌ వయసు పెంపు, పది రోజుల విరామంతో 12 నెలలకు వేతనం, 180 రోజుల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ప్రతి పీఆర్‌సీలో రివైజ్డ్‌ పేస్కేలు వర్తింపు, హెల్త్‌కార్డులు మంజూరు, కాంట్రాక్ట్‌కు బదులు ఎంటీఎస్‌ హోదా వంటివి అమలు చేస్తున్నట్లు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ఎంటీఎస్‌ హోదా రావడంతో రెన్యువల్‌ విధానం అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు మాత్రం బాండ్‌ తప్పనిసరి అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

జీతాలు లేక అల్లాడుతున్నాం 
గత ఇరవై ఏళ్లుగా కాంట్రాక్ట్‌ అధ్యాపకులుగా పనిచేస్తూ కుటుంబాలు పోషించుకుంటున్నాం. ఇన్నాళ్లూ ఏడాదిలో 10 నెలలు మాత్రమే వేతనాలు ఇస్తుండటంతో మిగిలిన రెండు నెలలు అర్థాకలితోనే కాలం వెళ్లదీస్తున్నాం. ఇప్పుడు పది రోజుల విరామంతో 12 నెలలు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు సమన్వయలోపం కారణంగా నాలుగు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.                        
– జీఎస్‌కే విద్యాసాగర్, జిల్లా జేఏసీ నాయకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement