Chandrababu Naidu Impatience With Farmers In West Godavari - Sakshi
Sakshi News home page

‘ఏయ్‌ ఆగవయ్యా.. నువ్వాగు!’.. రైతులపై చంద్రబాబు అసహనం

Published Fri, May 12 2023 9:41 AM | Last Updated on Fri, May 12 2023 10:24 AM

Chandrababu Impatience On Farmers In West Godavari - Sakshi

రచ్చబండలో మాట్లాడుతున్న చంద్రబాబు

తణుకు: ‘ఏయ్‌.. ఏం మాట్లాడుతున్నావ్‌. ఆగవయ్యా.. నువ్వాగు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ రైతులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహించేందుకు గురువారం రాత్రి ఇరగవరం వచ్చిన చంద్రబాబు అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతులు ఆయనను నిలదీస్తుండగా చంద్రబాబు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఓ యువరైతు మాట్లాడుతూ.. ‘మీరు సీఎంగా ఉన్నప్పుడు రైతులు నష్టపోతే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి పరిస్థితుల్ని చూసి చలించిపోయారు. రైతులు నష్టపోయిన విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మీరు అలా ఎందుకు చేయట్లేదు’ అని ప్రశ్నించగా.. అతడిపై చంద్రబాబు కస్సుమన్నారు. ‘ఏయ్‌.. ఏం మాట్లాడుతున్నావ్‌ నువ్వు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ అసహనం ప్రదర్శించారు.

ప్రభుత్వ యంత్రాంగం రైతుల నుంచి «ధాన్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను అడ్డుకున్న చంద్రబాబు తాను చెప్పేది మాత్రమే వినాలంటూ ఎప్పటిలా తన సొంత డబ్బా చెప్పుకొంటూ వెళ్లారు. రైతు బిడ్డల్ని కోటీశ్వరులను చేస్తానని, పేదలను ధనికులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే ధాన్యం కొనుగోలులో పాత విధానం తీసుకొస్తానని చంద్రబాబు చెప్పారు. మూడు రోజులపాటు గోదావరి జిల్లాల్లో పర్యటించి 72 గంటల్లో తడిసిన ధాన్యం, మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని అల్టిమేటం ఇస్తే.. ఇప్పుడు తాను తిరుగుతున్న ప్రాంతాల్లో హడావుడిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు.

‘సాక్షి’పై మరోసారి అక్కసు
ఈ పర్యటన సందర్భంలో చంద్రబాబు ‘సాక్షి’పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రైతులను పరామర్శించడానికి వచ్చి రైతులతో మాట్లాడుతుంటే కొందరు సైకో కార్యకర్తలను పంపి గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. దీనిని వక్రీకరిస్తూ ‘సాక్షి’ పేపర్‌లో ‘చంద్రబాబును అడ్డుకున్న రైతులు’ అని రాస్తారన్నారు. రైతుల ముసుగులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement