చీర్ల నాగేంద్ర (తుపాను)
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చీర్ల శ్రీనివాస్, గంగా భవానీల కుమారుడు చీర్ల నాగేంద్ర. 1996 నవంబర్ 7న జన్మించాడు. ఆ సమయంలో రాష్ట్రాన్ని పెను తుపాను కమ్మేసి ఉంది. ముసురు బట్టి రోజుల తరబడి వర్షం పడుతోంది. ఆ సమయంలో పుట్టినందున తల్లిదండ్రులు తమ కుమారుడు నాగేంద్రకు తుపాను అని ముద్దు పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగు పొరుగు.. అదే పేరుతో పిలుస్తుండటంతో నాగేంద్ర పేరు తుపానుగానే స్థిరపడిపోయింది.
తను కూడా తన పేరు నాగేంద్ర కన్నా.. తుపానుగానే ఎక్కువ ఫీలవుతాడు. అందుకే నాగేంద్రా.. అని పిలిచినదానికన్నా, తుపానూ.. అని పిలిచినప్పుడే ఎక్కువగా స్పందిస్తాడు. ఎనిమిదో తరగతి వరకు చదివిన తుపాను.. బైక్ మెకానిక్‌గా స్థిరపడ్డాడు. తన తమ్ముడు రామాంజనేయులు కూడా 1998వ సంవత్సరం వరదల సమయంలో పుట్టాడని తుపాను చెప్పాడు.
ఇక తన ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు కూడా ప్రత్యేకతలున్నాయన్నాడు. పెద్ద కుమారుడు మోహిత్ 2020 జూలైలో కరోనా సమయంలో, చిన్న కుమారుడు ఈ ఏడాది మేలో వచ్చిన అసనీ తుపాను సమయంలో పుట్టారని చెప్పారు. తన కుటుంబానికి ప్రకృతి విపత్తులకు విడదీయరాని అనుబంధం ఉందని.. తమది ప్రకృతి విపత్తుల నుంచి పుట్టుకొచ్చిన ఫ్యావిులీ.. అంటూ చమత్కరించాడు.
Comments
Please login to add a commentAdd a comment