మహిళేంద్రజాలం
‘నీపై నీకు నమ్మకం ఉంటే అద్భుతం సాధ్యం అవుతుంది’ అనే మాట మెజిషియన్ లక్ష్మికి తెలియనిదేమీ కాదు. ఆ నమ్మకం వల్లే గానం నుంచి ఇంద్రజాలం వరకు ఎన్నో విద్యల్లో ప్రావీణ్యం సాధించింది ‘ఆహా!’ అనిపిస్తుంది...
అయిదు అంగుళాల పదునైన మేకును సుత్తితో ముక్కు లోనికి పంపుతూ లక్ష్మి చేసే సాహసం చూసి ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడుస్తుంది. అటూ ఇటూ కదులుతూ చేతిలోని గొడుగును ఆడిస్తూ ఒకదాని తరువాత ఒకటి చొప్పున అలవోకగా 30 కు పైగా గొడుగులు, స్వింగ్‌ఫ్లవర్స్ తీయడం చూస్తే ఔరా అనిపిస్తుంది.
నంబర్స్‌తో మెంటలిజం మ్యాజిక్ చేసి అవాక్కు చేయడమే కాదు, వస్తువుల్ని మాయం చేయడం, పుట్టించడం, మనిషిని రెండు భాగాలు చేసినట్టు భ్రమింప చేయడం... ఇలా ఆమె చేసే ఇంద్రజాలం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.
ఇంద్రజాలంతోనే కాదు తన గానంతో కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండ లక్ష్మీప్రసన్నదేవి భర్త రాము సింగర్, డ్యాన్సర్, మిమిక్రీ ఆర్టిస్టు, మెజీషియ¯Œ , ఎంటర్‌టైనర్‌గా సుపరిచితుడు. భర్తతోపాటు ఎన్నో ప్రాంతాలకు వెళుతుండేది లక్ష్మి. అలా వెళ్లడం ద్వారా వివిధ కళా రూపాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే అపురూప స్పందనను ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది.
రెండేళ్ల క్రితం భర్తతో కలిసి కేరళలో జరిగిన మ్యాజిక్‌పోటీలకు వెళ్లింది లక్ష్మి. ఆపోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనించింది.
మహిళలు కనిపించని ఆ లోటే తనను మ్యాజిక్‌పై ఆసక్తి పెంచుకునేలా చేసింది. ‘నేను మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను’ తన మనసులో మాటను భర్తకు చెప్పింది.
అతడు ఎగతాళిగా నవ్వి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోగానీ ‘భేషుగ్గా నేర్చుకోవచ్చు’ అనడమే కాదు ఇల్లే పాఠశాలగా ఇంద్రజాల విద్య నేర్పడం మొదలుపెట్టాడు.
భర్త నుంచి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకున్న లక్ష్మి చేసిన మొదటి మ్యాజిక్ షోకు మంచి స్పందన వచ్చింది. తనమీద తనకు నమ్మకం వచ్చింది.
ఇక అప్పటి నుంచి ‘మ్యాజిక్’ తని ఇంటి పేరుగా మారింది. బర్త్‌డే పార్టీల నుంచి మ్యారేజ్ వరకు రకరకాల ఫంక్షన్‌లలో ఇప్పటివరకు వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. గుంటూరులో జరిగిన ‘అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్’ రాష్ట్రస్థాయిపోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. తాజ్ మ్యాజిక్ సొసైటీ ఆగ్రాలో నిర్వహించిన జాతీయస్థాయిపోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.
దేశవ్యాప్తంగా మేకు మ్యాజిక్ చేస్తున్న ఏడుగురు మెజిషీయన్‌లలో ఏకైక మహిళను తానే అంటుంది లక్ష్మి. పాటలు పాడటంలో నైపుణ్యాన్ని సాధించిన లక్ష్మి యాంకర్‌గా, సింగర్‌గా వెయ్యికి పైగా షోలు చేసింది. ‘ఇంకా ఎన్నో కళలు నేర్చుకోవాలని ఉంది. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది’ అంటుంది లక్ష్మీప్రసన్నదేవి.
ఆ చప్పట్లు చాలు...
ప్రేక్షకులలో ఒకరిగా ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలను చూసి చప్పట్లు కొట్టాను. ఇప్పుడు నేను ప్రదర్శన చేస్తుంటే అలాంటి చప్పట్లు వినడం అపురూపంగా ఉంది. లక్షలు, కోట్లు అక్కర్లేదు. ఆ చప్పట్లు చాలు కళాకారుడిలో నిత్య ఉత్సాహం నింపడానికి. కళకు ప్రాంతం, జెండర్ అనే తేడా తెలియదు. కళాకారులలో ఏ కొంచెం ప్రతిభ ఉన్నా ప్రపంచం సొంతం చేసుకుంటుంది.
గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ‘ఇప్పుడు ఇవన్నీ ఎందుకు!’ అనుకోలేదు. ‘నేను ఎందుకు నేర్చుకోకూడదు’ అని మాత్రమే అనుకున్నాను. అలా అనుకోవడం వల్లే మెజీషియన్‌గా, సింగర్‌గా, యాంకర్‌గా నాకంటూ ఎంతో కొంత గుర్తింపు వచ్చింది. మరిన్ని కళలు నేర్చుకొని, దేశవ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను.
– దండ లక్ష్మీప్రసన్నదేవి
– పెనుపోతుల విజయ్‌కుమార్, సాక్షి, భీమవరం
ఫొటోలు: బడేటి తిరుపతి వెంకటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment