►పాఠ్యపుస్తకాలు లేక ఇంటర్ విద్యార్థుల అగచాట్లు
►కాలేజీలు ప్రారంభమై నెల దాటినా మార్కెట్‌కు రాని పుస్తకాలు
►ప్రభుత్వ కాలేజీల్లోను సర్దుబాటుపైనే దృష్టి
ఒంగోలు: ఇంటర్మీడియెట్ విద్యార్థుల అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. కాలేజీలు ప్రారంభమై నెలరోజులు దాటినా ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేదు. దీంతో పాఠ్యాంశాల బోధన సంగతి అటుంచితే విద్యార్థులు కనీస సాధన చేసుకునేందుకు సైతం అవకాశం లేకుండా పోయింది.
జిల్లాలో పరిస్థితి ఇదీ
జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి దాదాపు 52 వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. సరాసరిన ఒక్కో సంవత్సరానికి 26 వేలమంది చొప్పున వీరున్నారు. అయితే వచ్చే ఏడాది ఇంటర్ పాఠ్యపుస్తకాల సిలబస్ మార్చాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో పుస్తకాల ముద్రణకు ప్రైవేటు ముద్రణా సంస్థలు ముందుకు రాలేదు. ఒక వేళ పుస్తకాలు ఏమైనా మిగిలితే వచ్చే ఏడాది పనికిరావనే ఉద్దేశంతో వారు వెనుకడుగు వేశారు. కేవలం గత సంవత్సరం ముద్రణలో మిగిలి ఉన్న పుస్తకాలను మాత్రమే విక్రయించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముద్రణా సంస్థలు ఉన్న గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లోనే పుస్తకాలకు డిమాండ్ ఉండడంతో ఇతర జిల్లాలకు ఈ పాఠ్యపుస్తకాలు చేరడం లేదు. దీంతో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఉచితానికి స్వస్తి
ఇదిలా ఉంటే ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో, ఏపీ మోడల్ స్కూళ్లలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తుంది. దాని ప్రకారం జిల్లాలో సుమారుగా 14 వేల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుందని అంచనా. వచ్చే ఏడాది పాఠ్యపుస్తకాల సిలబస్ మారుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ముద్రణా సంస్థ కూడా పుస్తకాల ముద్రణకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరినా పుస్తకాలు మాత్రం అందుబాటులోకి రాని పరిస్థితి. అయితే ఉచితంకు స్వస్తి పలికినట్లవుతుందనే విమర్శలు వ్యక్తమవుతుండడంతో అధికారులు జాగ్రత్త పడడం ప్రారంభించారు. అందులో భాగంగా గత సంవత్సరం ఏదైనా కాలేజీలలో పాఠ్యపుస్తకాలు ఏమైనా మిగిలాయా అన్న కోణంలో విచారించారు.
మిగిలిన పుస్తకాలను ప్రస్తుతం సర్దుబాటు చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ చాలనిపక్షంలో ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుంచి ప్రథమ సంవత్సరం పుస్తకాలను తీసుకొని ప్రస్తుత ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పంపిణీ చేయాలన్నారు. అదే విధంగా ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సర్దుబాటు చేసేందుకుగాను తమ కాలేజీల్లో విద్యను అభ్యసించి టీసీ తీసుకువెళ్లేందుకు వచ్చే విద్యార్థులకు పుస్తకాలను తీసుకొచ్చి ఇచ్చి టీసీలు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ముందే ఇతరులకు ఎవరికైనా సర్దుబాటు చేసిన వారి పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
ఇబ్బందికరంగా మారిన సర్దుబాటు ప్రక్రియ
అయితే ఈ సర్దుబాటు వ్యవహారం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం పుస్తకాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. ఎంసెట్ పరీక్షల్లో రెండు సంవత్సరాలకు సంబంధించి పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను ఇవ్వమంటే ఎంసెట్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలనేది విద్యార్థుల ప్రశ్న. మరో వైపు ప్రైవేటు కాలేజీల్లో చదివేవారికి అయితే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.
ఒక వైపు లెక్చరర్లు తమ వద్ద ఉన్న పాఠ్యపుస్తకంతో వేగవంతంగా సిలబస్ పూర్తిచేస్తుంటే దానికి తగ్గట్లుగా విద్యార్థులు ప్రిపేర్ కా>లేకపోతున్నారు. ఇక ఈ కాలేజీల్లో పుస్తకాల సర్దుబాటు ప్రక్రియ కూడా సా«ధ్యమయ్యే పనికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి పాఠ్యపుస్తకాలను తమకు అందించేందుకు ముందుకు రావాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
పుస్తకాల్లేవు.. చదువెలా..?
Published Tue, Jul 4 2017 1:36 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
Advertisement
Advertisement