
రికార్డు సమయంలో ఇంటర్ ఫలితాల వెల్లడి కోసం అధికారుల హడావుడి
ఇష్టానుసారంగా మూల్యాంకనానికి గడువు కుదింపు
మొదట మార్చి 17 నుంచి ఏప్రిల్ 8 వరకు షెడ్యూల్ ప్రకటన
తాజాగా తుది గడువును ఏప్రిల్ 3కు కుదించిన అధికారులు!
రోజుకి 30 పేపర్లు లిమిట్ ఉన్నా... 45 పేపర్లు దిద్దిస్తున్న వైనం
లెక్చరర్లపై తీవ్ర ఒత్తిడితో మార్కుల్లో తేడాలు వచ్చే ప్రమాదం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అధికారులు కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ప్రభుత్వం మెప్పు కోసం వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు రికార్డు సమయంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక లెక్చరర్‌తో పరిమితికి మించి బుక్‌లెట్లు వేల్యుయేషన్ చేయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో మూల్యాంకనం షెడ్యూల్‌ను కూడా అధికారులు కుదించారు.
మార్చి 17 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు మూల్యాంకనం షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. అయితే, రెండుసార్లు ఈ షెడ్యూల్‌ను మార్చేసి ఏప్రిల్ 3 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశించినట్టు సమాచారం. ఆ తక్కువ సమయంలో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశామన్న గొప్ప కోసం... ఏదైనా పొరపాటు జరిగి మార్కులు తప్పుగా నమోదైతే విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయనే విషయాన్ని విస్మరించారనే విమ
ర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్‌లో లిమిట్ 30.. టార్గెట్ 45 జవాబు పత్రాలు
ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభించారు. మొదటి పరీక్షగా నిర్వహించిన సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ఆ రోజే పూర్తి చేశారు. ఇంగ్లిష్‌తోపాటు ఇతర పరీక్షల పేపర్ల మూల్యాంకనం ఈ నెల 17న ప్రారంభించి విడతల వారీగా ఏప్రిల్ 8 నాటికి పూర్తి చేయాలని తొలుత షెడ్యూల్ నిర్ణయించారు. కానీ, తర్వాత తుది గడువును ఏప్రిల్ 5కి మార్చారు. తాజాగా 3వ తేదీకి కుదించినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. మూల్యాంకనంలో రోజుకు ఒక ఎగ్జామినర్ (లెక్చరర్) ఉదయం 15, మధ్యాహ్నం 15... మొత్తం 30 జవాబు పత్రాలనే దిద్దాలనేది నిబంధన.
ఇలా చేస్తే ఎక్కడా పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు. కానీ, ఈసారి 30 జవాబు పత్రాలే దిద్దాలని చెప్పినా... ఎగ్జామినర్లపై ఒత్తిడి తెచ్చి అదనంగా మరో 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నారు. ఫలితాలు త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో నిబంధనలకు తూట్లు పొడిచి విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగేలా ఎక్కువ పేపర్లు దిద్దించడంపై లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో జవాబు పత్రాల్లో మార్కులు తప్పుగా నమోదై ఒక్క పేపర్ తప్పినా విద్యార్థికి తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు.