Intermediate
-
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి–2025లో పరీక్షలు రాయనున్న మొదటి రెండో సంవత్సరం విద్యార్థులు ఈనెల 21 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రూ.1000 ఆలస్య రుసుంతో నవంబర్ 20వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. ఈ గడువు తర్వాత అవకాశం ఉండదని అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్‌కు సూచించామని తెలిపారు. 15 వరకు ప్రైవేటు విద్యార్థుల ఎన్రోల్ ఇంటర్ పరీక్షలు ప్రైవేటుగా రాయదలచిన విద్యార్థులకు అటెండెన్స్ మినహాయింపునిచ్చారు. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీ వరకు రూ.1500, రూ.500 పెనాల్టీతో నవంబర్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. ప్రైవేటుగా పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు పదో తరగతి పాసై ఏడాది పూర్తయిన వారు ఇంటర్ మొదటి సంవత్సరం, రెండేళ్లు దాటిన వారు రెండో సంవత్సరం పరీక్షలకు హాజరు కావొచ్చు. -
ఇంటర్ సిలబస్ మార్పు
ఇంటర్మీడియెట్‌లో కొత్త సిలబస్ అమలు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదే తరహాలో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ సిలబస్ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తాయి.వాస్తవానికి ఇంటర్ సిలబస్‌పై అధ్యయనం చేసి మార్పులు తేవాలని వైఎస్సార్ సీపీ హయాంలోనే నిర్ణయించగా ఈ విద్యా సంవత్సరంలో అధ్యయనం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు కానున్నాయి. – సాక్షి, అమరావతి పుష్కర కాలంగా పాత సిలబస్సేరాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రకారం పాఠశాల విద్య సిలబస్‌ను మార్చారు. అయితే ఇంటర్మీడియట్లో దాదాపు పుష్కర కాలంగా పాత సిలబస్సే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్ఈపీ, వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను సవరించి 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆపై 2026–27 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండో ఏడాది సిలబస్‌ను మార్చనున్నారు.పరీక్షల సరళిలో మరిన్ని మార్పులుఇంటర్ విద్యా మండలి కమిషనర్, కార్యదర్శిగా కృతికా శుక్లా బాధ్యతలు చేపట్టాక కళాశాలల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. యూనిట్ టెస్టుల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారు చేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్ టెస్ట్‌ను ఆయా కాలేజీలే నిర్వహించుకోగా రెండో యూనిట్ టెస్ట్ మాత్రం రాష్ట్రవాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరిగే క్వార్టర్లీ పరీక్ష సైతం ఇదే తరహాలో ఉండనుంది. గతంలో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకునేటప్పుడు సిలబస్ పూర్తి కాని పాఠ్యాంశాలను మినహాయించి పేపర్లు తయారు చేసేవారు. కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షలతో అన్ని కాలేజీల్లో ఒకేసారి సిలబస్ పూర్తి చేసేలా మార్పు తెచ్చారు. ప్రైవేట్ కాలేజీలు సైతం ఇదే విధానం అనుసరిస్తున్నాయి. బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను సైతం వచ్చే ఏడాది సవరించి కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.సైన్స్‌లో జాతీయ స్థాయి ఆర్ట్స్‌లో స్టేట్ సిలబస్ప్రస్తుతం ఇంటర్లో బోధిస్తున్న సిలబస్‌ను 2011–12 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. నాటి సమకాలీన అంశాలను ఇందులో చేర్చారు. అయితే ఆ పాఠ్యాంశాలు పాతబడిపోవడం, సైన్స్ పాఠాలు పూర్తిగా మారిపోవడంతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అప్డేట్ అయ్యాయి. అయినప్పటికీ పాత సిలబస్ బోధిస్తూ, పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లల్లో 6–10 తరగతుల వరకు సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇంటర్ సిలబస్‌ను జాతీయ సిలబస్‌కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇంటర్ స్థాయిలో నీట్, ఐఐటీ లాంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్‌ను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఐఐటీ, నీట్ సిలబస్‌కు అనుగుణంగా సిద్ధం చేస్తూ సిలబస్ మార్చనున్నారు. దీంతోపాటు హెచ్‌సీఈలో ఏపీ చరిత్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్థిక శాస్త్రంలోను వర్తమాన మార్పులు జోడించనున్నారు. సిలబస్ అధ్యయన కమిటీల్లో ఇంటర్మీడియట్ సబ్జెక్టు లెక్చరర్లు నలుగురు నుంచి ఎనిమిది మంది, డిగ్రీ కాలేజీ సబ్జెక్టు లెక్చరర్, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటారు. -
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల య్యాయి. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది.విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3 వరకూ జరిగాయి. సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలకు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ (జనరల్) ఫలితాల కోసం క్లిక్ చేయండిఇంటర్ ఫస్ల్ ఇయర్ సప్లమెంటరీ(వొకేషనల్) ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
AP: ఒక్క క్లిక్‌తో ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఒక్క క్లిక్‌తో జనరల్ ఫలితాలుఒక్క క్లిక్‌తో ఒకేషనల్ ఫలితాలు ఏపీ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్టు ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించారు. ఈ పరీక్షలకు రెండో సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. -
ఇంటర్మీడియట్ లవ్ స్టోరీ.. ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటోన్న ట్రైలర్!
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ సూపర్బ్ అంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. తమ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం పట్ల మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఇంటర్లో ఇక ఆన్లైన్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి/నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మిడియట్ పరీక్షల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం ప్రక్రియకు ఇంటర్మిడియట్ విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అధ్యాపకులు సెంటర్లలో మాన్యువల్‌గా చేస్తున్న ప్రక్రియను ఇకపై ఇంటి నుంచి లేదా కళాశాల నుంచి ఆన్లైన్లో చేయవచ్చు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ విధానం వల్ల మూల్యాంకనంలో పొరపాట్లు జరగవని, తద్వారా రీ వెరిఫికేషన్ లేదా రీ కౌంటింగ్‌కు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఖర్చు, సమయం ఆదా అవడంతో పాటు విద్యార్థికి నూరు శాతం న్యాయం జరుగుతుంది. తక్కువ సమయంలోనే ఫలితాలు ఇవ్వవచ్చని చెబుతున్నారు. డీఆర్డీసీల స్థానంలో స్కానింగ్ సెంటర్లు జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఇప్పటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా రీ కలెక్షన్, డి్రస్టిబ్యూషన్ సెంటర్ (డీఆర్డీసీ) లు ఉన్నాయి. ఆన్లైన్ మూల్యాంకనంలో డీఆర్డీసీ స్థానంలో రీజినల్ రిసెప్షన్ స్కానింగ్ సెంటర్లు (ఆర్ఆర్ఎస్సీ) ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రతి జిల్లాలో సేకరించిన జవాబు పత్రాలను జంబ్లింగ్ విధానంలో ఇతర జిల్లాలకు పంపేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నంలలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆ రోజు జవాబు పత్రాలను ఈ కేంద్రాల్లో స్కాన్ చేస్తారు. ప్రతి ప్రశ్నను పరిశీలించాల్సిందే ఆన్లైన్ మూల్యాంకనంలో పొరపాట్లకు తావుండదు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే అనేక పొరపాట్లకు ఆన్లైన్ విధానంతో చెక్ పెట్టవచ్చు. విద్యార్థి రాసినా, రాయకపోయినా ప్రతి ప్రశ్నను అధ్యాపకుడు పరిశీలించాలి. జవాబుకు ఇచి్చన గరిష్ట మార్కులకంటే ఎక్కువ వేసినా సిస్టం తీసుకోదు. – ఎం.నీలావతిదేవి,జిల్లా ఇంటర్మిడియట్ విద్యా శాఖాధికారి, పల్నాడు జిల్లాతప్పులకు ఆస్కారం లేదు ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ, పలు విద్యా సంస్థలు ఆన్లైన్ మూల్యాంకనం అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో తప్పులకు ఆస్కారం ఉండదు. ముందుగానే కొన్ని జవాబు పత్రాలను సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తాం. వాటిని అధ్యాపకులకూ పంపిస్తాం. నిపుణులు మూల్యాంకనం చేసిన విషయం అధ్యాపకుడికి తెలియదు. దీనివల్ల వారు పేపర్లు ఎలా మూల్యాంకనం చేస్తున్నారో తెలుస్తుంది. మాన్యువల్ విధానంలో పలు పొరపాట్లు జరిగేవి. ఆన్లైన్ విధానంలో ఒక్క తప్పు కూడా జరగదు. – సౌరభ్ గౌర్,ఇంటర్ విద్యా మండలి కమిషనర్ఆన్లైన్ మూల్యాంకనం ఇలా..స్కాన్ చేసిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అర్హతలుండి జ్ఞానభూమి పోర్టల్‌లో నమోదైన అధ్యాపకులకు పంపిస్తారు. వారు httpr://apbieeva.order.in/ వెబ్సైట్లో తమ టీచర్ యుఐడీ ద్వారా ఓటీపీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. సైట్లో ప్రతి రోజూ ఒక్కో అధ్యాపకునికి 60 జవాబు పత్రాలు ఉంటాయి. ⇒ ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల్లోపు ఇల్లు లేదా కళాశాలలో సొంత ల్యాప్‌టాప్/ కంప్యూటర్ లేదా కాలేజీ సిస్టంలో మాత్రమే మూల్యాంకనం చేయాలి. ఇంటర్నెట్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లోని కంప్యూటర్లను వినియోగించకూడదు. ⇒ మొత్తం 25 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థి వివరాలు ఉన్న మొదటి పేజీ తప్ప, మిగిలిన 24 పేజీలు అధ్యాపకులకు ఇస్తారు. తద్వారా ఏ పేపర్ ఎవరిదో అధ్యాపకులకు తెలియదు. మొదటి పేజీలోని విద్యార్థి బార్కోడ్ నంబర్ డీ–కోడ్ అవడంతో కంప్యూటర్ తప్ప మరొకరు గుర్తించడం సాధ్యం కాదు. ⇒ కంప్యూటర్‌కు ఉన్న కెమెరా ద్వారా ప్రతి 15 నిమిషాలకు అధ్యాపకుడి లైవ్ ఫొటో బోర్డుకు చేరుతుంది. తద్వారా మూల్యాంకనం ఎవరు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలుస్తుంది. ⇒ ఆన్లైన్లో కనిపించే జవాబు పత్రాలను ఫొటోలు తీసినా, ఇతరులకు పంపినా ఆ వివరాలు కూడా బోర్డుకు తెలిసేలా ‘ఏఐ’ టెక్నాలజీని వినియోగించారు. ⇒ ఆన్లైన్ మూల్యాంకనంలో డాష్‌బోర్డుపై ఎడమ చేతి వైపు జవాబు పత్రం, కుడివైపు గ్రిడ్‌లో ప్రశ్నల నంబర్లు, వాటికి కేటాయించిన మార్కులు ఉంటాయి. పక్కనే ఎగ్జామినర్ ఇచ్చే మార్కుల నమోదుకు బాక్స్ ఉంటుంది. అధ్యాపకుడు అందులో మార్కులు వేయాలి. ⇒ విద్యార్థి ఏదైనా ప్రశ్నకు జవాబు రాయకపోతే ఆ ప్రశ్న సంఖ్య ఆన్లైన్లో కనిపిస్తుంది. ⇒ ఒక గ్రూప్‌లో 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటే కొందరు విద్యార్థులు 6 ప్రశ్నలకు జవాబులు రాస్తారు. ఇలాంటప్పుడు రాసిన అన్ని జవాబులకు మార్కులు వేయాలి. ఎక్కువ మార్కులు వచి్చన 4 జవాబులనే సిస్టం తీసుకుంటుంది. దీనిద్వారా విద్యారి్థకి న్యాయం జరుగుతుంది. ⇒ మాన్యువల్ మూల్యాంకనంలో ఎగ్జామినర్లు కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయడం, మరికొన్నింటిని మర్చిపోవడం, టోటల్ మార్కుల నమోదులో పొరపాట్లు జరుగుతుంటాయి. విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోరినప్పుడు ఇవి బయటపడుతున్నాయి. ఆన్లైన్ విధానంలో ఏ జవాబుకైనా మార్కులు ఇవ్వకపోతే వెంటనే ‘ఎర్రర్’ చూపి ఎక్కడ మార్కులు వేయలేదో చూపుతుంది. దీంతో మార్కుల నమోదు మర్చిపోయేందుకు ఆస్కారం లేదు. ప్రతి జవాబుకు తప్పనిసరిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ మూల్యాంకనం పూర్తయిన తర్వాత అధ్యాపకుడు ఇచి్చన మార్కులను చీఫ్ ఎగ్జామినర్ మరోసారి పరిశీలిస్తారు. జవాబు పత్రాల్లో 10 శాతం పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసి ఫైనల్ మార్కులను నమోదు చేస్తారు. -
ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఫలితాల వెల్లడిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తేదీని ప్రకటించనున్నట్టు బోర్డు కమిషనర్ శృతి ఓజా ’సాక్షి’ప్రతినిధికి తెలిపారు. ఆది, లేదా సోమవారం ఫలితాలను వెల్లడించాలనుకుంటున్నామని, ఎక్కువ శా తం సోమవారమే ఉండొచ్చని ఆమె చెప్పారు. ఫలితాలకు సంబంధించి అన్ని దశల్లోనూ పరిశీలన పూర్తయిందని, ఎలాంటి లోటు పాట్లు లేవని భావించిన నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. మార్చి 6వ తేదీ నుంచే మూల్యాంకన ప్రక్రియ మొదలు పెట్టారు. దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఈ నెల మొదటి వారంలో ఓఎంఆర్ షీట్ల డీ కోడింగ్ చేశారు. మార్కులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. -
ఇంటర్ ఫలితాలు.. అమ్మాయిలదే హవా
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మార్చి ఒకటి నుంచి 20 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు బాలికలు, బాలురు కలిపి మొత్తం 10,02,150 మంది హాజరవగా 6,63,584 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,29,528 మంది (78 శాతం), మొదటి సంవత్సరం విద్యార్థులు 3,34,056 మంది (67 శాతం) ఉన్నారు. ఈ మేరకు ఫలితాలను శుక్రవారం తాడేపల్లిలోని ఇంటర్మీడియెట్ విద్యా మండలిలో కమిషనర్, కార్యదర్శి సౌరభ్ గౌర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వీవీ సుబ్బారావు సంయుక్తంగా విడుదల చేశారు. పరీక్షలు ముగిశాక కేవలం 21 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం. కాగా ఎప్పటిలాగే బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 81 శాతం, మొదటి ఏడాదిలో 71 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలురు రెండో ఏడాది 75 శాతం, మొదటి సంవత్సరంలో 64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2023 మార్చిలో ఇంటర్ మొదటి ఏడాది 4.33 లక్షల మంది పరీక్ష రాయగా 61 శాతం, ద్వితీయ సంవత్సరం 3.80 లక్షల మంది రాయగా 72 శాతం మంది పాసయ్యారు. మొత్తం మీద గతేడాది కంటే ఈసారి 6 శాతం ఉత్తీర్ణత మెరుగుపడింది. ఫలితాల్లో జిల్లాల వారీగా కృష్ణా మొదటి స్థానంలో (మొదటి సంవత్సరం 84 శాతం, ద్వితీయ సంవత్సరం 90 శాతం) సాధించగా, చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు (ఇంటర్ మొదటి ఏడాది), చిత్తూరు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. ఫలితాలను https://resultsbie.ap.gov.in లేదా www. sakshieducation.comÌ లో చూడవచ్చు. ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి.. ఒకేషనల్ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి ఏడాది 70 శాతం, రెండో ఏడాది 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు మొదటి ఏడాది 47 శాతం, రెండో ఏడాది 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఒకేషనల్ విభాగంలో బాలికలు, బాలురు కలిపి మొదటి సంవత్సరం మొత్తం 38,483 మంది పరీక్షలకు హాజరు కాగా 23,181 మంది (60 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 32,339 మంది హాజరవగా 23 వేల మంది (71 శాతం) విజయం సాధించారు. ఒకేషనల్ విభాగంలో మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి ఏడాది 77 శాతం, రెండో ఏడాది 83 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచింది. చివరి స్థానంలో వైఎస్సార్ (మొదటి ఏడాది), పల్నాడు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. 24 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని కార్యదర్శి సౌరభ్ గౌర్ కోరారు. ఈ నెల 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మే 25 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. మార్కుల లిస్టులు డిజిలాకర్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇవి రెగ్యులర్ పత్రాలుగానే చెల్లుబాటవుతాయన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా ఉండాలి ఉత్తీర్ణులు కానివారు ఆందోళన చెందొద్దని సౌరభ్ గౌర్ సూచించారు. గతంలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైనవారికి ‘కంపార్ట్మెంటల్’ అని సరి్టఫికెట్‌పై వచ్చేదని, ఇప్పుడు దాన్ని రద్దు చేశామన్నారు. ఇకపై సప్లిమెంటరీ కూడా రెగ్యులర్‌తో సమానంగానే ఉంటుందన్నారు. ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు మనోధైర్యాన్ని అందించాలని సూచించారు. బైపీసీలో విశాఖ అమ్మాయి పావనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా గాజువాక చైతన్య కళాశాల విద్యార్థి శరగడం పావని సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000కి 991 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకును దక్కించుకుంది. పావని తండ్రి నాగగంగారావు గంగవరం పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని పావని తెలిపింది. కిరణ్మయికి స్టేట్ సెకండ్ ర్యాంక్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన ఆలూరి కిరణ్మయి సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000కి 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది. కిరణ్మయి విజయవాడలోని శ్రీ గోసలైట్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది. కిరణ్మయి తండ్రి ఏవీ గిరిబాబు సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి విజయశాంతి గృహిణి. ఎంబీబీఎస్ చదివి న్యూరాలజిస్ట్ కావాలన్నదే తన చిరకాల కోరిక అని కిరణ్మయి వెల్లడించింది. -
గురుకుల సొసైటీల ఇష్టారాజ్యం!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను గాలికొదిలేశాయి. వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత కాలేజీలకు సెలవులు ప్రకటించాలని ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంటీర్మీడియట్ బోర్డు గత నెల 30న ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి మే నెల 31వరకు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఇవ్వాలని, జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది. కానీ ఈ నిబంధనలను పట్టించుకోని గురుకుల సొసైటీలు... పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచే తరగతులు ప్రారంభించాయి. ఇంటర్మీడియ్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు రెండో సంవత్సరం పాఠ్యాంశాన్ని ప్రారంభించగా... ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు. ఏయే సొసైటీలంటే.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఎస్), మహాత్మా జ్యోతి బా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలేన్సీ(సీఓఈ) జూనియర్ కాలేజీలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తుండగా... తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) మాత్రం రంజాన్ నేపథ్యంలో వచ్చే వారం నుంచి తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. సీఓఈలకు ప్రత్యేకమంటూ... రాష్ట్రంలోని గురుకుల సొసైటీల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక ప్రాంగణంలో ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు పాఠశాలలు నిర్వహిస్తుండగా.. జూనియర్ కాలేజీని ప్రత్యేక ప్రిన్సిపల్‌తో నిర్వహిస్తున్నారు. గురుకుల సొసైటీలకు పాఠశాలలతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం సీఓఈల పేరిట ప్రత్యేక పాఠశాలలున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 38, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో 30, బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 12 సీఓఈల్లో ఇంటర్మీడియట్ తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయా సొసైటీ కార్యదర్శులు వేరువేరుగా ఉత్తర్వులు సైతం జారీ చేశారు. సీఓఈల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫస్టియర్ కేటగిరీకి మే 15వ తేదీ వరకు, సెకండియర్ విద్యార్థులకు మే 26వ తేదీ వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నా రు. ముందస్తుగా పాఠ్యాంశాన్ని ముగించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సొసైటీ కార్యదర్శులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదే బాటలో ప్రైవేటు కాలేజీలు.. గురుకుల విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహిస్తుండడంతో పలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు సైతం ఇదే బాట పట్టాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా తరగతులను నిర్వహిస్తున్నాయి. వేసవి సీజన్లో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత ఉండగా కనీస ఏర్పాట్లు చేయకుండా పలు కాలేజీలు తరగతులు నిర్వహిస్తుండడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరగతులకు హాజరు కాకుంటే సిలబస్ మిస్సవుతుందనే ఆందోళనతో తప్పనిసరి పరిస్థితుల్లో పంపుతున్నట్లు వాపోతున్నారు. -
‘స్పాట్’ కేంద్రాల్లోకి మొబైల్ నో
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్ వాల్యూయేషన్) ఇంటర్ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. తాజాగా స్పాట్ కేంద్రాల్లోకి అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తినట్టు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటే హాలులో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి ఇచ్చేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్లో నమోదు చేయాలని బోర్డు సూచించింది. విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కార్పొరేట్ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు తెలిపారు. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మూల్యాంకనంలో 20 వేల మంది ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. పది రకాల పరీక్షల తర్వాతే ఆన్‌లైన్‌లోకి.. సమాధాన పత్రాలు మూల్యాకనం చేసిన అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను ఆన్లైన్లో ఫీడ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
‘నేను పేదవాడిని.. పాస్ చేయండి’.. సమాధాన పత్రంలో వింత అభ్యర్థనలు!
బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన ఇంటర్, మెట్రిక్యులేషన్ పరీక్షల జవాబు పత్రాలను సంబంధిత అధ్యాపకులు దిద్దుతున్నారు. ఈ సమాధాన పత్రాలలో పలువురు విద్యార్థులు తమకు తగినన్ని మార్కులు వేయాలని విన్నవించుకుంటున్నారు. ‘నేను పేదవాడిని. నన్ను పాస్ చేయించండి’ అని ఒక విద్యార్థి వేడుకోగా, మరో విద్యార్థిని ‘సార్, దయచేసి నన్ను పాస్ చేయండి, లేకపోతే మా నాన్న నాకు పెళ్లి చేస్తారు’ అని రాసింది. ఒక విద్యార్థి అత్యంత విచిత్రమైన రీతిలో ప్రశ్నలకు సమాధానాలు రాసే బదులు ప్రేమ లేఖ రాశాడు. జవాబు పత్రాలు దిద్దుతున్న ఉపాధ్యాయులకు వింతవింత సమాధాన పత్రాలు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని బెదిరింపులు కూడా కనిపిస్తున్నాయని అధ్యాపకులు మీడియాకు తెలిపారు. ఫన్నీ కవితలు, పద్యాలు మొదలైనవి కూడా రాస్తున్నారు. ముఖ్యంగా గమనిక అంటూ పలు సందేశాలను రాస్తున్నారు. విద్యార్థులు తమను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పరీక్షా పత్రాలు దిద్దుతున్న అఖిలేష్ ప్రసాద్ అనే అధ్యాపకుడు మీడియాకు తెలిపారు. -
AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలి. శుక్రవారం మొదటి ఏడాది, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు ఇద్దరు అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కెమేరాలతో నిఘా ఉంచారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి, పరిశీలకుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్ బోర్డు ‘డిజిటల్ నిఘా’ను ఏర్పాటు చేసింది. పరీక్ష పేపర్లకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్‌ను జోడించారు. పేపర్ ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే సెంటర్లను కేటాయించడంతో పాటు వీరికి మరో గంట అదనపు సమయం, పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. కాగా, పరీక్షలు ముగిసేంత వరకు తాడేపల్లిలోని ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్‌ల స్వీకరణకు 08645–277707, టోల్‌ఫ్రీ నంబర్ 18004251531కు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేయొచ్చు. -
పక్కా నిఘా..పటిష్ట బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 5,07,754 మంది విద్యార్థు లు పరీక్ష కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 4,88,113 మంది హాజరయ్యారు. 19,641 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. మూడుచోట్ల మాల్ ప్రాక్టీసింగ్ జరిగినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. కరీంనగర్, నిజామాబాద్, జనగాం జిల్లాల్లో ఈ మేరకు కేసులు నమోదైనట్టు తెలిపింది. తొలి రోజు ద్వితీయ భాష పేపర్–1 పరీక్ష నిర్వహించారు. మూడు సెట్ల ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపి అందులో ‘ఎ’సెట్‌ను ఎంపిక చేశారు. ప్రైవేటుపై ప్రత్యేక నిఘా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 1,521 పరీక్షా కేంద్రాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశా రు. 880 ప్రైవేటు కాలేజీల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. కార్పొరేట్ కాలేజీల జోక్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా, అసాంఘిక శక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు ఈసారి పోలీసు బందోబస్తు పెంచారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు సుడిగాలి తనిఖీలు చేపట్టాయి. 200 సిట్టింగ్ స్వా్కడ్స్ సమస్యాత్మక కేంద్రాల్లో సజావుగా పరీక్షలు జరిగేందుకు తోడ్పడ్డాయి. టెన్షన్... టెన్షన్... తొలి రోజు పరీక్ష కావడంతో పలు ప్రాంతాల్లో విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం కన్పించింది. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షకు గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడం కన్పించింది. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనల్లో స్వల్పంగా సడలింపు ఇచ్చినట్టు జిల్లాల అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, అవి సకాలంలో అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు విన్పించాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు సొంత రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. -
Intermediate Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)
-
54 ఏళ్ల వయసులో మాజీ ఎమ్మెల్యే బీఏ పరీక్షలు!
చదువుకు వయసు ఒక ఆటంకం కాదంటారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ పరిధిలోగల బిత్రీ చైన్పూర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా అలియాస్ పప్పు భరతౌల్ ఈ మాట నిజమని నిరూపిస్తున్నారు. గత ఏడాది మాజీ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ మిశ్రా ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు బీఏ పరీక్షలకు హాజరవుతున్నారు. బీఏ మొదటి సంవత్సరం హిందీ సబ్జెక్టు పరీక్షను రాశారు. తాను ఇంటర్మీడియట్ పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక ఎల్ఎల్బీ చేయాలనుకుంటున్నానని ఆయన మీడియాకు తెలిపారు. తాను లా కోర్సు పూర్తి చేశాక పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం చేస్తానని రాజేష్ కుమార్ మిశ్రా తెలిపారు. తన జీవితంలో రాజకీయాలకు, చదువులకు, వయసుకు సంబంధం లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను న్యాయవాది కావాలనుకునేవాడినని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ కూడా పాసవుతానని అన్నారు. ప్రతి సమస్యకు చదువుతోనే పరిష్కారం లభ్యమవుతుందని, విద్యతోనే పేదరికాన్ని తరిమికొట్టవచ్చని అన్నారు. -
టెన్త్, ఇంటర్లో భారీగా రీ అడ్మిషన్లు
-
టెన్త్, ఇంటర్లో భారీగా ‘రీ అడ్మిషన్లు’
సాక్షి, అమరావతి: గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్’ అవకాశాన్ని భారీ సంఖ్యలో వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో చేరిన రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో నూరు శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) సాధనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్ తప్పినవారికి రాష్ట్ర ప్రభుత్వం పునర్ ప్రవేశ అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి, ఆయా విద్యార్థులను తిరిగి ఎన్రోల్ చేశారు. దాంతో 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పిన 1,23,680 మందిలో 1,03,000 మంది, ఇంటర్లో 90,251 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా పరీక్ష తప్పినవారు తిరిగి ఫీజు కట్టి పరీక్షలు రాస్తే (సప్లిమెంటరీ) వారిని ‘ప్రైవేటు’ విద్యార్థులుగా పరిగిణిస్తారు. కానీ.. రీ అడ్మిషన్ తీసున్న వారిని ‘రెగ్యులర్’ విద్యార్థులుగానే పరిగణిస్తారు. ఎక్కువ మార్కులే పరిగణనలోకి.. ఆయా తరగతుల్లో రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఫెయిలైన సబ్జెక్టులు మాత్రమే కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పబ్లిక్ పరీక్షల్లో అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మార్కులను పరిశీలించి, ఆయా సబ్జెక్టుల్లో ఏ విద్యా సంవత్సరంలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అంతిమంగా లెక్కలోనికి తీసుకుంటారు. ఉదాహరణకు ఓ విద్యార్థి 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫెయిలై, ఇప్పుడు రీ అడ్మిషన్ తీసుకుంటే.. గతేడాది మ్యాథ్స్ పేపర్లో 70 మార్కులు వచ్చాయనుకుంటే.. ఈ ఏడాది పరీక్షల్లో అదే పేపర్ 30 మార్కులే వస్తే.. గత ఏడాది వచ్చిన 70 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే.. అన్ని సబ్జెక్టులు పాసైన రీ అడ్మిషన్ విద్యార్థుల సర్టీఫికెట్లపై ప్రైవేట్/కంపార్ట్మెంటల్/స్టార్ గుర్తు వంటివి లేకుండా ‘రెగ్యులర్’ అని గుర్తింపు ఇస్తారు. వీరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే జగనన్న విద్యాకానుక, అమ్మ ఒడి వంటి అన్ని పథకాలు వర్తింపజేశారు. ఒక్కసారే అవకాశం ఓ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన వారికి మరుసటి సంవత్సరం మాత్రమే రీ అడ్మిషన్‌తో పాటు అన్ని రెగ్యులర్ ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యార్థులు రెండో ఏడాదీ ఫెయిలైతే వారికి మరో అవకాశం ఉండదు. వారు ప్రైవేటుగానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 2022–23లో ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫెయిలై తిరిగి రెగ్యులర్ గుర్తింపు పొందిన 1,93,251 మంది విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరానికి గాను వచ్చే మార్చిలో పరీక్షలు రాయనున్నారు. వీరు ఈ విద్యా సంత్సరంలో అన్ని సబ్జెక్టులు పాసైతే ‘రెగ్యులర్’ సర్టీఫికెట్ అందుకుంటారు. ఫెయిలైతే తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిందే. -
ఏపీలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
-
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..ఇంకా ఇతర అప్డేట్స్
-
Yashoda Lodhi: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్ మాట్లాడొద్దా?
యూ ట్యూబ్ తెరుస్తున్న కొత్త ద్వారాలు చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఒక బర్రెలక్క ఉన్నట్టుగానే ఉత్తర ప్రదేశ్‌లో ఒక టీచరక్క ఉంది. ఇంటర్ మాత్రమే చదివిన వ్యవసాయ కూలీ యశోదా లోధి ఇంగ్లిష్ మీద ఆసక్తితో నేర్చుకుంది. ‘నాలాగే పల్లెటూరి ఆడవాళ్లు ఇంగ్లిష్ మాట్లాడాలి’ అనుకుని ఒకరోజు పొలం పని చేస్తూ, ఇంగ్లిష్ పాఠం వీడియో విడుదల చేసింది. ఇవాళ దాదాపు మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఆమె ఇంగ్లిష్ పాఠాలను నేర్చుకుంటున్నారు. యశోదా లోధి సక్సెస్ స్టోరీ. ‘కట్ టు ద చేజ్’ అంటే ఏమిటి? ‘బై ఆల్ మీన్స్’ అని ఎప్పుడు ఉపయోగించాలి? ‘అకేషనల్లీకి సమ్టైమ్స్కి తేడా ఏమిటి?’... ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మంచినీళ్లు తాగినంత సులభంగా ఇంగ్లిష్ మాట్లాడటం ఎలాగో నేర్పుతోంది ఒక పల్లెటూరి పంతులమ్మ. ఆశ్చర్యం ఏమిటంటే తాను ఒకవైపు నేర్చుకుంటూ మరో వైపు నేర్పుతూ. చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే. అది కూడా హిందీ మీడియమ్‌లో. కాని యశోదా లోధి వీడియోలు చూస్తే ఆమె అంత చక్కగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నప్పుడు మనమెందుకు మాట్లాడకూడదు అనిపిస్తుంది. అలా అనిపించేలా చేయడమే ఆమె సక్సెస్. ఆమె యూట్యూబ్ చానల్ సక్సెస్. ఇంగ్లిష్ విత్ దేహాతీ మేడమ్ ‘దెహాత్’ అంటే పల్లెటూరు అని అర్థం. యశోదా లోధి ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సిరాతు నగర్ అనే చిన్న పల్లెటూళ్లో ఉంటోంది. అందుకే తన యూట్యూబ్ చానల్‌కు ‘ఇంగ్లిష్ విత్ దెహాతి మేడమ్’ అనే పేరు పెట్టుకుంది. ఆమె ఇంగ్లిష్ పాఠాలకు ఇప్పటికి రెండున్నర కోట్ల వ్యూస్ వచ్చాయి. మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. అంతే కాదు... ఆమెను చూసిన ధైర్యంతో చాలామంది గృహిణులు ఇంగ్లిష్ ఎంతో కొంత నేర్చుకుని ఆమెతో లైవ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ మురిసిపోతుంటారు. ఇంగ్లిష్ మన భాష కాదు, మనం మాట్లాడలేము అనుకునే పల్లెటూరి స్త్రీలకు, గృహిణులకు యశోద గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంది. 300 రూపాయల రోజు కూలి యశోద కుటుంబం నిరుపేదది. చిన్నప్పటి నుంచి యశోదకు బాగా చదువుకోవాలని ఉండేది. కాని డబ్బులేక అతి కష్టమ్మీద ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. భర్త ఎనిమిది వరకు చదివారు. ఆడపడుచులు స్కూలు ముఖం చూడలేదు. అలాంటి ఇంటికి కోడలైంది యశోద. పల్లెలో భర్తతో పాటు బంగాళదుంప చేలలో కూలి పనికి వెళితే రోజుకు రూ. 300 కూలి ఇచ్చేవారు. మరోవైపు భర్తకు ప్రమాదం జరిగి కూలి పని చేయలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో ఏం చేయాలా... కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలా... అని తీవ్రంగా ఆలోచించేది యశోద. ఒంటి గంట నుంచి మూడు వరకు పల్లెలో ఇంటి పని, పొలం పని చేసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు వరకు దొరికే ఖాళీలో మాత్రమే యశోద వీడియోలు చేస్తుంది. ‘మా ప్రాంతంలో నెలంతా సంపాదిస్తే 9 వేలు వస్తాయి. చాలామంది పిల్లలకు మంచి చదువు లేదు. నేను యూట్యూబ్‌లో బాగా సంపాదించి అందరికీ సాయం చేయాలని, మంచి స్కూల్ నడపాలని కోరిక’ అంటుంది యశోద. పల్లెటూరి వనితగా ఎప్పుడూ తల మీద చీర కొంగును కప్పుకుని వీడియోలు చేసే యశోదకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆదాయం కూడా చాలా బాగా ఉంది. ఇది నేటి పల్లెటూరి విజయగాథ. గతి మార్చిన స్మార్ట్‌ఫోన్ ‘2021లో స్మార్ట్‌ఫోన్ కొనడంతో నా జీవితమే మారిపోయింది. అప్పటి వరకూ నాకు ఈమెయిల్ క్రియేట్ చేయడం తెలియదు, యూట్యూబ్ చూడటం తెలియదు. కాని ఫోన్ నుంచి అన్నీ తెలుసుకున్నాను. యూట్యూబ్‌లో మోటివేషనల్ స్పీచ్‌లు వినేదాన్ని. నాకు అలా మోటివేషనల్ స్పీకర్ కావాలని ఉండేది. కాని నా మాతృభాషలో చెప్తే ఎవరు వింటారు? అదీగాక నా మాతృభాష కొద్దిమందికే. అదే ఇంగ్లిష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎవరినైనా చేరవచ్చు అనుకున్నాను. అలా ఇంగ్లిష్ నేర్చుకోవాలని ఇంగ్లిష్ నేర్పించే చానల్స్ చూడసాగాను. నేర్చుకుంటూ వెళ్లాను. అలా నేర్చుకుంటున్నప్పుడే నాకు ఆలోచన వచ్చింది. నాలాగా ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే పేద మహిళలు, పెద్దగా చదువుకోని మహిళలు ఉంటారు... వారి కోసం ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలి అని. నేను ఆశించేదీ, అందరు మహిళలు చేయాలని కోరుకునేదీ ఒక్కటే... భయం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడటం. అది కష్టం కాదు. నేను నేర్చుకున్నాను అంటే అందరికీ వస్తుందనే అర్థం’ అంటుంది యశోద. -
‘డిజి లాకర్’లో ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్మిడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వలెన్సీ, జెన్యూన్‌నెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలన్నా తీసుకునేలా ‘డిజి లాకర్’ (https://digilocker.gov.in)లో ఉంచింది. అందుకోసం రాష్ట్ర విద్యా సంబంధ ఆన్లైన్ ఫ్లాట్ఫారమైన జ్ఞానభూమిని డిజిలాకర్‌కు అనుసంధానించింది. ఇప్పటికే 1.14 కోట్ల మంది టెన్త్ సర్టిఫికెట్లను ప్రభుత్వం డిజి లాకర్లో ఉంచింది. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఇంటర్మిడియట్ పూర్తిచేసిన 45.53 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచింది. ఉమ్మడి రాష్ట్రంలో పాసైన (2014కు ముందు) ఏపీ విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం మరికొద్ది రోజుల్లో డిజి లాకర్లో ఉంచనుంది. కేవలం రెండు నెలల్లోనే లక్షలమంది సర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేసి, డిజి లాకర్లో ఉంచడం దేశ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. అంతే కాకుండా సర్టిఫికెట్లలో తప్పు పడిన పేరు సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు. ఐఐటీ, నీట్‌తో పాటు అనేక జాతీయ స్థాయి ఎంట్రన్స్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే చాలా మంది విద్యార్థులు డిజి లాకర్లో ధ్రువపత్రాలు పొందుతున్నారు. ఇకపై ఇంటర్మిడియట్ (+2) పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లను బోర్డుకు చెందిన జ్ఞానభూమి ద్వారా డిజి లాకర్లో పొందవచ్చు. డిజిటల్ సర్టిఫికెట్లను దేశ, విదేశాల్లోని యూనివర్సిటీలు, జేఈఈ, నీట్ కాలేజీలు కూడా అంగీకరించడంతో ఇకపై విద్యార్థులకు డూప్లికేట్ సర్టిఫికెట్ల అవసరం ఉండదు. ఎప్పుడైనా సర్టిఫికెట్లు పొందే అవకాశం ఇప్పటిదాకా ఏ కారణం చేతనైనా సర్టిఫికెట్లు పోగొట్టుకుని నకళ్లు (డూప్లికేట్) పొందడం పెద్ద ప్రహసనం. ముందుగా సర్టిఫికెట్ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేసి, అది దొరకలేదని ఎన్వోసీ ఇస్తారు. ఇందుకు కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత నోటరీ చేసిన అఫిడవిట్‌తో సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకుంటే మరో నెల, రెండు నెలల తర్వాత డూప్లికేట్ సర్టిఫికెట్ వస్తుంది. ఇంత సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్‌తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు వెంటనే సర్టిఫికెట్ పొందవచ్చు. టెన్త్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఇలా.. 2004 నుంచి 2023 వరకు పదో తరగతి పాసైన విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం పాఠశాల విద్యాశాఖ డిజి లాకర్లో ఉంచింది. ఇందులో 2008, 2009, 2010, 2011 విద్యా సంవత్సరాల సర్టిఫికెట్లను మరో పది రోజుల్లో డిజి లాకర్లో ఉంచనుంది. విద్యార్థులు తమ పాస్ మెమోల కోసం డిజి లాకర్ యాప్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ‘క్లాస్ గీ మార్క్‌షీట్’ ఓపెన్ చేస్తే, వివిధ రాష్ట్రాల ఎస్సెస్సీ బోర్డుల ఐకాన్స్ కనిపిస్తాయి. వీటిలో ‘సూ్కల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్’పై క్లిక్ చేసి, రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ అయ్యి సర్టిఫికెట్‌ను పొందవచ్చు. సర్టిఫికెట్ ఇలా పొందవచ్చు మొబైల్ ఫోన్లోని డిజి లాకర్ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మార్క్స్ మెమో, మైగ్రేషన్ సర్టిఫికెట్, ఈక్వెలెన్స్ సర్టిఫికెట్, అర్హత సర్టిఫికెట్ పొందవచ్చు. అభ్యర్థులు వారి మొబైల్ ఫోన్లో డిజి లాకర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ఫోన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌తో https://digilocker.gov.in లో లాగిన్ చేయాలి. వారి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నిర్ణీత బాక్స్‌లో నింపి సబ్మిట్ చేస్తే లాకర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వివిధ రాష్ట్రాల ఐకాన్స్ ఉంటాయి, వాటిలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేస్తే అందులో ‘క్లాస్ గీఐఐ’ ఓపెన్ చేస్తే ‘బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యుకేషన్’ బ్యానర్ కనిపిస్తుంది. ఇందులోకి ఎంటర్ అయ్యి ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలంటే దానిపై ‘క్లిక్’ చేయాలి. రోల్ నంబర్/ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తయిన సంవత్సరం వంటి వివరాలు నమోదు చేసి వారి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రవేశాల గడువు మంగళవారంతో ముగుస్తోంది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరగలేదు. దీంతో మరికొంత గడువు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అడ్మిషన్లు సరిగా జరగడం లేదని జిల్లాల్లోని ఇంటర్ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా మరికొంత గడువు పొడిగించాలని ఉన్నతాధికారులను కోరారు. దీంతో క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ప్రవేశాల గడువు పెంపునకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీల్లోనే సమస్య ఉందని అధికారులు తెలిపారు. హెచ్చరికతో ప్రైవేటు కాలేజీలు అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా 3,339 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. వీటిల్లో ఇప్పటి వరకు 3,27,202 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ తీసుకున్నారు. గత ఏడాది (2022–23) కాలేజీల సంఖ్య 3,107 మాత్రమేకాగా, 4,98,699 మంది విద్యార్థులు చేరారు. దీనిని బట్టి దాదాపు 1.7 లక్షల మంది విద్యార్థులు ఇంకా చేరాల్సి ఉందని తెలుస్తోంది. వారంరోజుల క్రితం వరకూ ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నా, ప్రవేశాలను బోర్డుకు చూపించలేదు. విద్యార్థుల ప్రవేశాలు ఒకచోట, వారు చదివేది మరోచోట ఉండేలా కాలేజీలు చేస్తున్న మాయాజాలంపై ఇంటర్ బోర్డు ఉక్కుపాదం మోపడమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ‘సాక్షి’ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం స్పందించింది. అడ్మిషన్లు ముగిసే నాటికి ప్రవేశాలు చూపించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ హెచ్చరించారు. దీంతో గత వారం లక్ష వరకూ ఉన్న అడ్మిషన్ల సంఖ్య ప్రస్తుతం 2 లక్షలు దాటింది. టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత పెరిగాయి. -
‘20లోపు ఇంటర్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి’
అనంతపురం: ఏపీ ఈఏపీసెట్–2023 పరీక్ష రాసినవారు ఈ నెల 20లోపు తమ ఇంటర్ సర్టిఫికెట్లను ఏపీ ఈఏపీసెట్ స్టూడెంట్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సెట్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, కన్వీనర్ ప్రొఫెసర్ సి.శోభాబిందు శుక్రవారం తెలిపారు. ఏపీ ఈఏపీసెట్–2023లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ఈఏపీసెట్‌లో మొత్తం 2,52,717 మంది అర్హత సాధించారు. వీరిలో ఇంకా 42వేల మంది విద్యార్థులకు ఇంటర్ వెయిటేజీ ప్రకారం ర్యాంకులు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ మార్కుల జాబితాలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, తదితర బోర్డుల పరీక్షలు రాసినవారు సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు -
నియోజకవర్గ ప్రతిభావంతులకు నేడు సత్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. నియోజకవర్గస్థాయిలో విద్యార్థులను గురువారం సత్కరించేందుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్మెంట్లలో విద్యాసంస్థలున్నాయి. ఒక్కో మేనేజ్మెంట్ పరిధిలోని సంస్థల్లో పదోతరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను సన్మానిస్తారు. ఇలా నియోజకవర్గస్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులు 678 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్లో కూడా వివిధ మేనేజ్మెంట్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులు 662 మంది ఉన్నారు. విద్యారంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్, పాఠశాలకు మెమెంటో ఇవ్వడంతోపాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. నియోజకవర్గస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5 వేలు చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. ఇంటర్మీడియట్లో గ్రూప్ టాపర్‌కు రూ.15 వేలు చొప్పున ఇస్తారు. 20న రాష్ట్రస్థాయిలో.. రాష్ట్రస్థాయిలో జగనన్న ఆణిముత్యాలను ఈనెల 20న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించనున్నారు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన 42 మందిని, ఇంటర్లో మొదటి స్థానంలో నిలిచిన 28 మందిని ఆయన సన్మానించనున్నారు. పదో తరగతిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.లక్ష, రెండోస్థానంలోని వారికి రూ.75 వేలు, మూడోస్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ఇంటర్ టాపర్స్‌కు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు. 17న జిల్లాస్థాయిలో.. జిల్లాస్థాయిలో టాపర్స్‌గా నిలిచిన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను ఈ నెల 17న ఆయా జిల్లా కేంద్రాల్లో సన్మానించనున్నారు. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్మెంట్లలోని సంస్థల్లో ఒక్కో మేనేజ్మెంట్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులను సన్మానిస్తారు. ఇంటర్మీడియట్లో కూడా వివిధ మేనేజ్మెంట్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను సత్కరిస్తారు. జిల్లాస్థాయిలో పదో తరగతి విద్యార్థులు 606 మందిని, ఇంటర్ టాపర్స్ 392 మందిని సత్కరించనున్నారు. పదో తరగతిలో జిల్లా టాపర్‌కు రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.15 వేలు నగదు బహుమతి అందిస్తారు. ఇంటర్లో ఒక్కొక్కరికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తారు. -
జగనన్న ఆణిముత్యాలు.. టెన్త్‌లో 1,250 మంది.. ఇంటర్లో 1,585 మంది
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 2023 సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 1,250 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో గ్రూపునకు ఒకరు చొప్పున 1,585 మందిని ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం కింద ప్రతిభ అవార్డులతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం స్థాయిల్లో విడివిడిగా జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులను శాలువాలతో, ఆ పాఠశాలల హెడ్మాస్టర్లను శాలువ, మొమెంటోతో సత్కరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్ధులను, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురిని సత్కరించనున్నారు. అంతకు ముందు ఈ నెల 17న జిల్లా స్థాయిలో జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులను, ఏడు ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో నాలుగు గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో అత్యధిక మార్కులు సాధించిన ఒక్కరు చొప్పున నలుగురిని సత్కరించనున్నారు. ఈ నెల 15న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఎమ్మెల్యేల అధ్యక్షతన పదో తరగతిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులను, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో ప్రతి గ్రూపులో అత్యధిక మార్కులు సాధించిన ఒక్కరు చొప్పున నలుగురిని సత్కరించనున్నారు. రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలకు బహుమతులు ► పదో తరగతిలో 42 మందికి, ఇంటర్మీడియట్లో 35 మందికి ప్రతిభా అవార్డులు ►పదో తరగతిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు రూ.1,00,000, రెండో స్ధానం సాధించిన విద్యార్థులకు రూ.75,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.50,000 చొప్పున నగదు బహుమతి ► ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురేసి విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.1,00,000 జిల్లా స్థాయిలో.. ► పదో తరగతిలో 606 మందికి, ఇంటర్లో 800 మందికి ప్రతిభా అవార్డులు ► పదిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.50,000, రెండో స్థానం సాధించిన వారికి రూ. 30,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.10,000 ► ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురికి ఒక్కొక్కరికి రూ.50,000 నియోజకవర్గ స్థాయిలో.. ► పదో తరగతిలో 602 మందికి, ఇంటర్మీడియట్లో 750 మందికి ప్రతిభా అవార్డులు ► టెన్త్‌లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.15,000, రెండో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.10,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.5000లు నగదు బహుమతి ► ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000 అందరి సమన్వయంతో కార్యక్రమాలు: సీఎస్ జగనన్న ఆణిముత్యాలు సత్కార కార్యక్రమాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్లు, ఇతర అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర స్థాయి సత్కార కార్యక్రమం కోసం రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్, ఇతర ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ కమిషనర్‌కు, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌కు సూచించారు. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఇతర శాఖలను, అధికారులను సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నియోజకవర్గస్థాయిలో మండల కేంద్రంలోని ప్రభుత్వ స్కూలు లేదా కాలేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, దీనికి మండల విద్యాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా మంత్రులను సంప్రదించి సత్కార కార్యక్రమ వేదికను కలెక్టర్ ఎంపిక చేయాలని చెప్పారు. చదవండి: ఐఐటీ విద్యార్థులకు విదేశాల రెడ్ కార్పెట్