ఇంటర్‌ పరీక్షల్లో గందరగోళం | Printing Error In Inter Second Year English Paper, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షల్లో గందరగోళం

Published Thu, Mar 6 2025 5:52 AM | Last Updated on Thu, Mar 6 2025 11:32 AM

Printing error in inter second year English paper

సెకండియర్‌ ఇంగ్లిష్‌ పేపర్‌లో ముద్రణ లోపం 

పరిశీలించకుండా విద్యార్థులకు పంపిణీ

కనీసం 25 నిమిషాల సమయాన్ని కోల్పోయి ఇబ్బందిపడ్డ విద్యార్థులు 

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్ష పేపర్‌ ముద్రణ లోపం విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన రెండో సంవత్సరం ఇంగ్లిష్‌ పేపర్‌లో ఈ తప్పులు తీవ్ర గందరగోళం సృష్టించాయి. దీంతో.. విద్యార్థులు 25 నిమిషాల సమయాన్ని కోల్పోయినట్లు  తెలుస్తోంది. ఉ.9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, అరగంట తర్వాత గుర్తించిన విద్యార్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అనంతరం సమస్యను ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు విషయాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లారు. వివరాలివీ..

ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు బుధవారం ఇంగ్లిష్‌ పరీక్ష ప్రారంభమైంది. ప్రశ్నపత్రంలోని 8వ ప్రశ్నగా ‘అడ్వరై్టజ్‌మెంట్‌ చదివి కింద ప్రశ్నలకు సమాధానాలు రాయాలి’ అంటూ ఒక్క మార్కు ప్రశ్న­లు ఐదు ఇచ్చారు. అయితే, ప్రశ్నపత్రంలో ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్‌ ముద్రణ సరిగ్గా లేకపోవడంతో అందులో ఏముందో ఎవరూ గుర్తించలేని పరిస్థితి తలెత్తింది. పుస్తకంలోని ప్రింట్‌ను ఫొటో తీసుకుని నేరుగా ముద్రించడంతో అక్షరాలు కనిపించక విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. 

వివిధ జిల్లాల్లో అధికారులు ఇది గుర్తించి విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి దిద్దుబాటు చర్యలు చేపట్టా­రు. మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని అన్ని కాలేజీలకు పంపి సమస్యను సరిచేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కనిపించని అంశాలను కొన్నిచోట్ల బోర్డుపై రాసి వివరించగా, మరికొన్ని జిల్లాల్లో ప్రశ్నపత్రంలోని అంశాలను ఇన్విజిలేటర్లు విద్యార్థులకు చదివి వినిపించారు. అలాగే, 13వ ప్రశ్నగా ‘ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్‌’ కింద పోస్టాఫీస్‌ సేవింగ్‌ బ్యాంక్‌ అకౌంట్‌పై అవగాహన కోసం ఇచ్చింది కూడా విత్‌డ్రా ఫారం ఫొటోను ముద్రించడంతో అందులో ఏముందో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విభాగంలో 10 అర మార్కు ప్రశ్నలు (5 మార్కులు) ఇచ్చారు.

ఇలా ఈ రెండు ప్రశ్నల ముద్రణా లోపంతో దాదాపు 25 నిమిషాల సమయం వృధా అయిందని, అదనపు సమయం కూడా ఇవ్వలేదని విద్యార్థులు వాపోయారు. ఇక శనివారం జరిగిన ఇంటర్‌ మొదటి సంవత్సరం ఇంగ్లిష్‌ పేపర్‌ను సైతం విజయవాడలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఆలస్యంగా ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ తప్పులపై సమగ్ర విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. 

ముద్రణ సరిగ్గాలేని రెండు ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులందరికీ పూర్తి మార్కులు వేయాలని అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, అధ్యక్షుడు శిఖరం నరహరి, ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement