ఇంటర్మిడియట్‌లో కొత్త సిలబస్‌ | AP Intermediate Syllabus Changing In Andhra Pradesh, New NCERT Syllabus Introduced From Academic Year 2025-26 | Sakshi
Sakshi News home page

AP Inter Syllabus Change: ఇంటర్మిడియట్‌లో కొత్త సిలబస్‌

Published Tue, Mar 25 2025 6:25 AM | Last Updated on Tue, Mar 25 2025 9:22 AM

AP Intermediate New Syllabus Changed: Andhra pradesh

ఎన్సీఈఆర్టీ సిలబస్, సీబీఎస్‌ఈ బోధనకు శ్రీకారం 

2025–26లో మొదటి ఏడాది, 2026–27లో రెండో ఏడాదికి అమలు 

నీట్, జేఈఈకి అనుగుణంగా సిలబస్‌ 

కొత్తగా ఎంబైపీసీ గ్రూప్‌.. అన్ని గ్రూపులకు ఎలక్టివ్‌ సబ్జెక్టు సౌలభ్యం 

ఎంపీసీ, బైపీసీలో ఐదు సబ్జెక్టుల విధానం 

పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నల స్థానంలో 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మిడియట్‌ విద్యలో మార్పులు చేశారు. రానున్న విద్యా సంవత్సరం (2025–26) నుంచి ఇంటర్‌లో కొత్తగా ఎన్సీఈఆర్‌టీ సిలబస్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ఎన్సీఈఆర్టీ సిలబస్‌లో విద్యా బోధన పూర్తి చేసినందున ఇంటర్మిడియట్‌లోనూ ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీఎస్‌ఈ విధానాలను అమలు చేయనున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫస్టియర్, 2026–27లో సెకండియర్‌ విద్యార్థులకు కొత్త సిలబస్‌లో బోధన మొదలవుతుంది. అలాగే, పరీక్షల నిర్వహణ, ప్రశ్నలు సీబీఎస్‌ఈ విధానంలోకి మారాయి. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఎంబైపీసీ గ్రూప్‌ను ప్రవేశపెట్టారు. జేఈఈ, నీట్‌ పరీక్షలకు అనుగుణంగా ఎంపీపీ, బైపీసీ సిలబస్‌లోనూ మార్పులు చేశారు. వార్షిక పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభిస్తారు. తాజా మార్పులను 
ఇంటర్మిడియట్‌ విద్యా మండలి ప్రకటించింది.

ఏప్రిల్‌ 1 నుంచి జూనియర్‌ కాలేజీలు  
రాష్ట్రంలో జూనియర్‌ కాలేజీలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదే తేదీన ఇంటర్‌ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభిస్తారు. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరంలో కళాశాలలకు 235 రోజులు పనిదినాలు, 79 సెలవులు ప్రకటించారు.  

ఎలక్టివ్‌ సబ్జెక్టు విధానం
విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచుతూ ఎలక్టివ్‌ విధానం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అన్ని గ్రూపులకు పార్ట్‌–1లో ఇంగ్లిష్, పార్ట్‌–2 లో రెండో భాష (లాంగ్వేజెస్‌), పార్ట్‌–3 లో కోర్‌ సబ్జెక్టులు ఉండగా, పార్ట్‌–2లో ఎలక్టివ్‌ సబ్జెక్టు విధానం ప్రవేశపెట్టారు. ఇందులో లాంగ్వేజెస్, సైన్స్, హ్యుమానిటీస్‌ విభాగాల్లో 20 ఆప్షన్స్‌ ఇచ్చారు. ఏ గ్రూప్‌ వారికైనా ఇంగ్లిష్‌ తప్పనిసరి. రెండో భాష స్థానంలో ‘ఎలక్టివ్‌’ సబ్జెక్టుగా తెలుగు/సంస్కృతం/ఉర్దూ/హిందీ/అరబిక్‌/ తమిళం/కన్నడ/ఒరియా/ ఫ్రెంచ్‌/పర్షియన్‌ (10 భాషలు) ఉంటాయి. మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ (ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ)/ భూగోళశాస్త్రం/లాజిక్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్/చరిత్ర/సివిక్స్‌/కామర్స్‌/ఎకనామిక్స్‌ (10 సబ్జెక్టులు) ఉంటాయి. వీటిలో ఒకటి విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి.

ఐదు సబ్జెక్టులు.. 1000 మార్కులు
ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టుల విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం సైన్స్‌ గ్రూపుల్లో 2 భాషా సబ్జెక్టులు, 4 కోర్‌ సబ్జెక్టులు (మొత్తం 6 సబ్జెక్టులు), ఆర్ట్స్‌ గ్రూప్‌లో 2 భాషా సబ్జెక్టులు, 3 కోర్‌ సబ్జెక్టులు ఉన్నాయి. ఇకపై ఏ గ్రూపులో అయినా ఐదు సబ్జెక్టులే ఉంటాయి. మేథమెటిక్స్‌–ఏ, బీ పేపర్లను ఒక సబ్జెక్టుగా, బాటనీ–జువాలజీ రెండు సబ్జెక్టులను కలిపి ఒక సబ్జెక్టుగా మార్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరు సబ్జెక్టులతో ‘ఎంబైపీసీ’ గ్రూప్‌ను ప్రవేశపెడుతున్నారు. ఎంపీసీ విద్యార్థులు బోటనీ, బైసీపీ విద్యార్థులు మేథమెటిక్స్‌ తీసుకుని పూర్తి చేస్తే ‘ఎంబైపీసీ’ సర్టీఫికెట్‌ ఇస్తారు.

అన్ని గ్రూపులకు రెండేళ్లకు కలిపి 1000 మార్కుల విధానం అమల్లోకి తెచ్చారు. సైన్స్‌ సబ్జెక్టులకు థియరీకి 85 మార్కులు, ప్రాక్టికల్స్‌కు 30 మార్కులు కేటాయిస్తారు. అన్ని గ్రూపుల పరీక్షల్లోను మార్పులు చేశారు. ప్రశ్నా పత్రాల్లో వ్యాసరూప ప్రశ్నల స్థానంలో సీబీఎస్‌ఈ విధానాలకు అనుగుణంగా 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement