
రద్దు చేసిన సిద్ధార్థ సెంటర్‌కు ‘కన్వీనియెంట్’గా తిరిగి అనుమతులు
ఇదే సెంటర్‌లో కాపీయింగ్ అంటూ వర్సిటీ యంత్రాంగం హడావుడి
ఎంబీబీఎస్ మాస్ కాపీయింగ్‌కు రాచబాట వేసిన హెల్త్ యూనివర్సిటీ పరీక్షల విభాగం
కర్నూలు, కాకినాడ సెంటర్లలోనూ విచ్చలవిడి కాపీయింగ్‌కు సహకారం
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ అకడమిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు చంద్రబాబు ప్రభుత్వమే రాచబాట వేసింది. విద్యార్థుల నుంచి భారీగా ముడుపులు దండుకుని మాస్‌కాపీయింగ్‌కు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ విభాగం, ఉన్నతాధికారులు సహకారం అందించడం గమనార్హం. గతంలో రద్దయిన సిద్ధార్థ సెంటర్‌ను విద్యార్థుల కన్వీనియెంట్(అనుకూలత)ను సాకుగా చూపి విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచ్చింది.
రద్దయిన సెంటర్‌కు తిరిగి అనుమతులు ఇవ్వడానికి ముడుపులు పుచ్చుకున్న వర్సిటీ పరీక్షల విభాగం తమకు కావాల్సిన విద్యార్థుల కాపీయింగ్‌కు అడ్డంకులు సృష్టించకుండా, కాపీయింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పెద్దఎత్తున హడావుడి చేసింది. ఈ హడావుడి చూసి నిజంగానే కాపీయింగ్‌ను అడ్డుకోవడానికి చిత్తశుద్ధితో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, రిజిస్ట్రార్, ఇతర అధికారులు ప్రయత్నిస్తున్నారనే భావన కల్పించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి కాపీయింగ్‌కు అవకాశం కల్పించినవారే.. ఇలా ఎందుకు హడావుడి చేశారని ఆరా తీస్తే అవాక్కయ్యే నిజాలు వెల్లడయ్యాయి.
సిద్ధార్థలో మాస్‌కాపీయింగ్ జరుగుతున్న అంశంపై గతంలో ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం విదితమే. ‘కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్’ (సీవోసీ)పై నిమ్రా కాలేజీతో పాటు పలువురు ఫిర్యాదు చేశారు. మళ్లీ అలాంటి ఫిర్యాదు రాకుండా ఉండటానికి తనిఖీల హడావుడి చేశారు. నిజానికి పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. అవన్నీ వర్సిటీ సీవోఈ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. వారు గదిలో కూర్చుని వాటిని పరిశీలించి కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవచ్చు.
కానీ.. అలా చేయకుండా తనిఖీలంటూ హడావుడి చేసి కొద్దిమంది విద్యార్థులను మాత్రమే పట్టుకున్నారు. మిగతా కాపీయింగ్ యథావిధిగా జరగడానికి సహకారం అందించడం ఎవరూ ఊహించని విషయం. ఇన్విజిలేటర్ల నియామకం నుంచే వర్సిటీ అధికారుల ‘కుమ్మక్కు’ మొదలవుతుంది. ‘కాపీయింగ్ గురు’ చెప్పిన వారినే అక్కడ నియమిస్తారు.
డీఎంఈతో విచారణ
పరీక్షల నిర్వహణలో అవకతవకలు, కాపీయింగ్ వ్యవహారంపై వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా పరీక్షల విభాగం తొక్కిపెడుతోందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో విచారణ చేయాలని డీఎంఈనీ ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులకు డీఎంఈ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారినుంచి వివరణ వచ్చాక ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని డీఎంఈ డాక్టర్ నరసింహం వెల్లడించారు. వర్సిటీ అధికారుల కుమ్మక్కు గురించి మాత్రం విచారణ జరగడం లేదని సమాచారం.
కోడ్–డీకోడ్ మాయాజాలమూ ఉంది
కేవలం కాపీయింగ్‌కు మాత్రమే వర్సిటీ పరీక్షల విభాగం సహకరిస్తోందన్న ఆరోపణలపై విచారణ పరిమితమైతే పూర్తిస్థాయిలో నిజాలు వెలుగుచూసే అవకాశం లేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల జవాబు పత్రాలను ‘రహస్య కోడ్’తో వ్యాల్యుయేషన్‌కు పంపిస్తారు. ఈ కోడ్–డీకోడ్ బాధ్యులు ప్రైవేటు ఏజెన్సీకి వర్సిటీ పరీక్షల విభాగం అప్పగిస్తుంది. ఈ బాధ్యతల్లో ఉన్న ఏజెన్సీకి, పరీక్షల విభాగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న చీఫ్‌కి సన్నిహిత సంబంధాలున్నాయని వర్సిటీ ఉద్యోగులు చెబుతున్నారు.
తమకు కావాల్సిన విద్యార్థి జవాబుపత్రంలో కొన్ని షీట్లు మార్చడం చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారమేనని సమాచారం. ఈ అక్రమాలన్నీ వ్యవస్థీకృతంగా జరగడానికి ఆ చీఫ్ సహకారం అందిస్తున్నారని, ఈ దిశగా పోలీసు విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయనే అభిప్రాయం వర్సిటీ వర్గాల్లో ఉంది.
కర్నూలు, కాకినాడలోనూ..
రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ కాలేజీల్లో సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ–ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి సమీపంలో ప్రభుత్వ కళాశాలలో అవకాశం కల్పిస్తారు. కాకినాడ రంగరాయ, విజయవాడ సిద్ధార్థ, కర్నూలు కాలేజీ, తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలలో సప్లిమెంటరీ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. సిద్ధార్థలో కాపీయింగ్‌కు సహకరించినట్లుగానే కర్నూలు ప్రభుత్వ కళాశాల, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో విచ్చలవిడిగా కాపీయింగ్ జరిగింది.
అక్కడ ఆకస్మిక తనిఖీలు కాదు కదా.. సాధారణ తనిఖీలు కూడా వర్సిటీ అధికారులు చేయలేదు. ఆ రెండు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన వారితో వర్సిటీ అధికారులు కుమ్మక్కు కావడమే దీనికి కారణం. ముడుపులు భారీగా వసూలు చేసిన తర్వాతే వర్సిటీ అధికారులు కాపీయింగ్‌కు అనుకూలంగా వ్యవహారం నడుపుతారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కాపీయింగ్‌కు సహకరించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పడంతో వర్సిటీ అధికారుల కుమ్మక్కు ఆట సాగలేదు.