మార్కులొచ్చినా సీట్లు లేక విద్యార్థుల వేదన
తెలంగాణలో 502 మార్కులొచ్చిన ఓసీ విద్యార్థులకు ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు
ఏపీలో 512 మార్కులొచ్చిన ఎస్సీ విద్యార్థులకూ ప్రభుత్వ సీటు లేదు.. అక్కడి కటాఫ్‌లతో పోలిస్తే
బీసీ–ఏ విభాగంలో 146 మార్కులు అధికం
మూడోవిడత కౌన్సెలింగ్ పూర్తిచేసిన హెల్త్ వర్సిటీ
సీట్లు పెరగక భారీగా నష్టపోయిన మన విద్యార్థులు
బాబు సర్కారు దుర్మార్గపు తీరుతో తీరని అన్యాయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పోకడలతో మన రాష్ట్రంలో విద్యార్థులకు తీరని అన్యాయం జరిగింది. డాక్టర్ కావాలని కలలుగని రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర నిరాశే ఎదురైంది. అనేకమంది తెల్లకోటు కలలు ఛిద్రమయ్యాయి. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం ఈ ఏడాది అనుమతులను అడ్డుకోవడంతో పోటీకి తగ్గట్టుగా సీట్లు పెరగక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు.
నీట్ యూజీలో మంచి స్కోర్ సాధించినా.. ఓసీలతో పాటు బీసీ, ఎస్సీ విద్యార్థులకూ సీటు దక్కలేదు. మూడోరౌండ్ కౌన్సెలింగ్ ముగిసిన తరువాత పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో జనరల్ విభాగంలో 502 మార్కుల వరకు ప్రభుత్వ కోటా సీటు లభించింది. అదే మన రాష్ట్రంలో ఏయూ రీజియన్‌లో 513 మార్కుల (1,85,817 ర్యాంకు) వద్దే ఎస్సీ విభాగంలో సీట్ల కేటాయింపు నిలిచిపోయింది.
ఇదే ఎస్సీ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలో 433 మార్కుల వరకు సీట్లు దక్కాయి. అంటే మన దగ్గర కంటే 80 మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వ కోటా సీట్లతో ఎంబీబీఎస్ పూర్తిచేసే అదృష్టం లభించింది. పక్క రాష్ట్రంతో పోలిస్తే అత్యధికంగా బీసీ–ఏ విభాగంలో మన విద్యార్థులు 146 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ప్రభుత్వ సీటు లభించలేదు.
మంజూరైన సీట్లనూ వద్దన్న బాబు సర్కారు
వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం పులివెందుల, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పాడేరుల్లో ఒక్కోచోట 150 సీట్లతో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు రాబట్టలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఒక్క పాడేరు వైద్యకళాశాలకు మాత్రం కేవలం 50 సీట్లు దక్కాయి.
పులివెందుల కళాశాలకు 50 సీట్లు మంజూరైనా మాకొద్దని ఎన్‌ఎంసీకి ప్రభుత్వమే లేఖరాసి రద్దుచేయించింది. ప్రభుత్వ తీరుతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఈ కారణంగా మన విద్యార్థులకు జరిగిన నష్టం స్పష్టంగా కనిపిస్తోంది. సీట్లు పెరగకపోవడంతో 500 నుంచి 560 వరకు స్కోర్ చేసిన బీసీ, ఎస్సీ విద్యార్థులకు కన్వీనర్ కోటా సీటు లభించలేదు.
దీంతో పిల్లలను యాజమాన్య కోటా కింద రూ.లక్షలు వెచ్చించి చదివించలేని నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు నర్సింగ్, వెటర్నరీ, బీడీఎస్ వంటి ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. ధైర్యం చేసి లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు పంపినా వచ్చే ఏడాది రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయన్న నమ్మకంలేదని వారు చెబుతున్నారు. ప్రభుత్వమే మా తెల్లకోటు కలను ఛిద్రం చేసిందని బీసీ, ఎస్సీ, ఇతర వర్గాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడో విడత కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు
2024–25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపునకు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహించింది. విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఆదేశించారు. గడువులోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయడం కోసం ఆదివారం కూడా పనిదినంగా పరిగణించాలని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌కు సూచించారు.
ప్రిన్సిపల్స్ బదిలీ
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం కోసం కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు, వాటి బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా నిరి్మంచిన ఐదు వైద్య కళాశాలలు ప్రారంభమవ్వాల్సి ఉంది. అయితే కొత్త కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం ప్రభుత్వం వీటిలో సీట్ల కేటాయింపులను అడ్డుకుంది.
ఇప్పుడు ఆ బోధనాస్పత్రుల స్థాయిని తగ్గిస్తోంది. డీఎంఈ నుంచి సెకండరీ హెల్త్‌కు ఆస్పత్రులను అప్పగించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ పని చేసే వైద్యులను పాత కళాశాలలు, బోధనాస్పత్రులకు సర్దుబాటు చేస్తోంది. ఇదే క్రమంలో ప్రిన్సిపళ్లను, సూపరింటెండెంట్‌లను బదిలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment