
ఆరు పోస్టుల్లో ఇద్దరే అధికారులు
ఒక్కరికే చీఫ్ కమిషనర్, ముఖ్య కార్యదర్శి పోస్టు.. నాలుగు కీలక కొలువుల బాధ్యతా ఒకరికే
భూముల రీసర్వే సహా అత్యంత కీలకమైన శాఖపై నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: పరిపాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. భూముల వ్యవహారాలను పర్యవేక్షించే ముఖ్యమైన ఈ శాఖకు పూర్తి స్థాయి అధికారులను నియమించకపోవడంతో ఏ పనులూ సజావుగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూ పరిపాలన శాఖలో (సీసీఎల్‌ఏ) చీఫ్ కమిషనర్‌తోపాటు అదనపు చీఫ్ కమిషనర్, సహాయ కార్యదర్శి (ల్యాండ్స్), సహాయ కార్యదర్శి (విజిలెన్స్), అప్పీల్స్ కమిషనర్ వంటివి ముఖ్యమైన పోస్టులు. ఇవికాకుండా ఇండిపెండెంట్‌గా సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ కమిషనర్ పోస్టులు ముఖ్యమైనవి.
ఇవన్నీ ఐఏఎస్ అధికారులు నిర్వహించే పోస్టులే. అయితే, కూటమి ప్రభుత్వం ఈ పోస్టులను కేవలం ఇద్దరితోనే నడిపిస్తోంది. సీసీఎల్‌ఏగా జయలక్ష్మి ఉండగా.. మిగిలిన అన్ని పోస్టులకు మరో ఐఏఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాను బదిలీ చేసి ఆ బాధ్యతలను జయలక్ష్మికి అదనంగా ఇచ్చారు. రెవెన్యూ శాఖకు కమిషనర్, ముఖ్య కార్యదర్శి ఆమే. అలాగే రెవెన్యూ శాఖలోని మిగిలిన అన్ని ముఖ్యమైన విభాగాలకు ప్రభాకర్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు.
ఆరుగురు ఐఏఎస్ అధికారులు పని చేయాల్సిన చోట కేవలం ఇద్దరితో నడిపించడం ద్వారా రెవెన్యూ శాఖపై చంద్రబాబు నిర్లక్ష్యం చూపుతున్నారనే వాదన వినిపిస్తోంది. జిల్లా కలెక్టర్లు, డీఆర్‌ఓలు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వేలాది మంది రెవెన్యూ సిబ్బందిపై పర్యవేక్షణ, భూముల వ్యవహారాలకు సంబంధించిన ఈ శాఖపై శీతకన్ను వేయడం ద్వారా అందులో పనులు ఏవీ సజావుగా జరగడం లేదని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఏవో తప్పులు, అక్రమాలు జరిగిపోయాయని చూపించేందుకు మాత్రమే రెవెన్యూ శాఖను వాడుకుంటూ మిగిలిన వ్యవహారాలను పక్కన పెట్టేశారు. దీంతో రెవెన్యూ శాఖ వ్యవహారాలు కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంనీ నత్తనడకన సాగుతున్నాయి.