
అభిప్రాయం
ఏ శాస్త్రంలోని నూతన ఆవిష్కరణ అయినా సామాజిక శాస్త్ర పర్యావరణ గీటురాయి మీద దాని మానవీయ విలువను నిర్ధారించుకోక తప్పదు. 2004 డిసెంబర్‌లో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ (ఐసీటీ) మన బడుల్లో పాఠంగా మొదలయింది. అది మొదలు గత రెండు దశాబ్దాలలో దానికి మొలకెత్తిన చిలవలు పలవలు... ఊడలు దిగిన మ్రానులైన పరిస్థితుల్లో, మన మానసిక వైఖరులు మన మానవీయ విలువలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అన్నప్పుడు కొంచెం తేడాతో అందరం అందులో మునకలు వేయడం అయితే నిజం. మనకంటే ముందే ఈ అనుభవమున్న సంపన్న దేశాల్లో దీని పర్యవసానాలపై అధ్యయనం మొదలయింది కనుక ఈ ప్రపంచీకరణ కాలంలో ఆ కొలమానాలు మనమూ వాడుకోవచ్చు.
గత పదేళ్ళలో పెరిగిన ‘సోషల్ మీడియా’ మన మీద పెంచుతున్న ఒత్తిడితో ఏర్పడిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’లో ఇప్పుడు మనం ఉన్నాం. అదొక నూతన పర్యావరణంగా మారి, మన ఆలోచనలు అభిప్రాయాలు అందుకు అనుగుణంగా మార్చుతూ, మూడు రంగాలలో మన జీవితాల్ని అది ప్రభావితం చేస్తున్న దని ఫిబ్రవరి 2023లో ఎవాన్ కుహెన్ ఒక వెబ్సైట్‌కు రాసిన ‘వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం?’ వ్యాసంలో అంటారు.
గుర్తించిన ఆ మూడింటిలో ‘సివిల్ సొసైటీ’ (పౌరసమాజం) ఒకటి. ఈ పరిశీలన వెలుగులో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ‘పౌర సమాజం’ సంగతి ఏమిటి? మన పండితులు పామ రుల అభిప్రాయాలపై ఎటువంటి ‘సమాచార’ పర్యా వరణ ప్రభావం ఉంది. ప్రభావశీలురైన ముగ్గురు ప్రముఖులు 2025 ఫిబ్రవరిలో వెలుబుచ్చిన అభిప్రా యాలలో నుంచి వాటిపై ‘సమాచార పర్యావరణ’ ప్రభావం ఏ మేర ఉందో చూద్దాం.
ఫిబ్రవరి మొదటివారంలో ప్రభుత్వ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన ఒక సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ – ‘‘మీరు ఫిర్యాదుల పరిష్కారం మొదటి ప్రాధాన్యతగా చూడాలి, రెవెన్యూశాఖ నుంచి భూ కబ్జాలు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయి. డాక్యుమెంట్స్ ఫోర్జరీ ఎక్కువ అయిపోయింది... వీటిని మీరు ఎలా పరిష్కరిస్తారు అనేది మీకే వదిలి పెడుతున్నాను’’ అన్నారు.
ఇది విన్నాక ఈ ధోరణి మూలాలు ఎక్కడ ఎందుకు మొదలయింది వెతికితే, రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడకు మారిన 2015 తర్వాత నుంచి రాజకీయం అంటేనే ‘భూమి విలువ’ అన్నట్టుగా మారింది. ‘‘అమరావతిలో అన్నీ పోను ఎనిమిది వేల ఎకరాలు మిగులుతాయి, ఎకరం 20 కోట్లు చొప్పున అమ్మితే 160 కోట్లు వస్తాయి...’’ తరహా మాటలు అధికార కేంద్రాల నుంచి వస్తే, ‘సోషల్ మీడియా’ దానికి విస్తృత ప్రచారం ఇచ్చింది.
ఇప్పుడు తెనాలి ప్రాంతానికి చెందిన ఏ.పి. ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్’ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ కూడా విశాఖలో– ‘‘కొత్త రాష్ట్రానికి అమరావతి వంటి ‘గ్రీన్ ఫీల్డ్ కేపిటల్’ ఉండడం అవసరం’’ అంటూ పనిలో పనిగా –‘‘ఉచితాలు అనుచితం’’ అని కూడా అనేశారు. పోనీ అది నిజమనుకుందాం.
మరి వారే ‘‘బాపట్ల సమీపాన 20 ఏళ్ళనాడు ఆగిపోయిన ‘వాన్ పిక్’ ఈ పదేళ్లలో పూర్తి అయివుంటే, ‘ఉచితాలు’ తీసుకునేవారు అవి మాని అక్కడే ఏదో ఒక ‘లేబర్’ పని చేసుకుని బతికేవారు’’ అని కూడా అనొచ్చు కదా? చివరికి ఏమైంది గత పదేళ్ళలో ‘రాజధాని’ చుట్టూ ‘సోషల్ మీడియా’ వ్యాప్తి చేసిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’ కింద నలిగి కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ నిపుణుల అభిప్రాయాలు ఇటువంటి ప్రకట నల కింద సమాధి అయ్యాయి.
రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బా రావు కూడా ఇదే విశాఖ నుంచి ఉచితాలు గురించి – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటూ ఎప్పుడో పాతదైన ‘చైనా వారి చేప’ కథ చెప్పారు. అది చైనాలో నిజమేమో. ఇక్కడ ‘చేపలు’ పట్టడం నేర్పడం కోసం పెట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ఏమైందో చూశాం. అయినా – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటే, ఈ ‘ఉచితాలు’ పొందే వారు కూడా ఏమంత సంతోషంగా ఏమీ లేరు.
కారణం కళ్ళముందు సంపన్న వర్గాల వద్దకు చేరుతున్న సంపద, వారి విజయగాథలు, వైభవంగా జరిగే వారి పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ ఫంక్షన్స్... వాటి గురించి ‘సోషల్ మీడియా’ కథలుగా చెబుతుంటే వింటూ, తమకు అందే అరకొరను వాళ్ళు తూకం వేస్తున్నారు. అధికార కేంద్రాలకు దగ్గరయితే, అక్రమ ఆదాయ వనరులు ఎలా పెరుగుతాయో ‘సోషల్ మీడియా’ వారికి నిత్యం కళ్ళకు కట్టిస్తున్నది.
విషయం ఏమంటే, ప్రభుత్వ పరిపాలనలోకి ‘టెక్నాలజీ’ వచ్చాక, అవినీతికి చిల్లులున్న చీకటి మార్గాలు మూతపడి అదాయ వనరులకు గండి పడితే, ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి వనరుల్లో వెతు క్కుంటున్నారు. అభివృద్ధి మారుమూల గ్రామాలకు ప్రవేశిస్తుంటే, బయటకు వెళుతున్న మట్టి, కంకర చూస్తున్నదే.
వాటి వివరాలు ‘సోషల్ మీడియా’ 24 గంటలూ జనానికి చూపిస్తున్నది. ఈ అక్రమ లావా దేవీల చిట్టా సామాన్యుడికి అరచేతిలో ‘ఫోన్’లో దొరుకుతుంటే, ప్రభుత్వం అరాకొరా ఉచితంగా ఇచ్చే రొట్టె ముక్కను ఇవ్వాలా వద్దా? అంటూ మళ్ళీ అదే పాత చర్చ అంటే, వారి వద్ద పాండిత్యం పరిహాసం అవుతుందేమో!
జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment