
‘ఉగాది’ రోజున ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి ఎవరికీ రాని విచిత్రమైన ఆలోచన వచ్చింది. పేదరికం గురించి తీవ్ర మనోవేదన చెందుతూ, పేదరికాన్ని నిర్మూ లించేందుకు కొత్త విధానాన్ని కనుక్కున్నారు. అదే ‘పీ4’ విధానం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 2047 నాటికి పూర్తిగా పేదరికాన్ని నిర్మూలిస్తాననీ, ఇందుకు దాతృత్వమేఅత్యంత కీలకమనీ పేర్కొన్నారు. పేదలకు సహాయం చేసేలా సంపన్నుల్లో స్ఫూర్తి నింపటం పీ4 లక్ష్యమని అన్నారు. ఇది ఆచరణ సాధ్యమేనా? ప్రపంచంలో ఇటువంటి విధానంతో పేదరిక నిర్మూలన చేసిన ఉదాహరణలు ఏవైనా ఉన్నాయా?
‘పబ్లిక్, ప్రైవేట్ – పీపుల్ – పార్టనర్‌షిప్’ (పీ4) విధానంలో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, ప్రజలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అంటున్నారు. 1995లో ప్రపంచ బ్యాంకు అమలు చేసిన సంస్కరణల్లో భాగంగా ‘పీ3’ పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానాన్ని అమలు చేసి అద్భుతాలు సాధించాననీ, ఆ స్పూర్తితోనే íపీ4 రూపొందించాననీ అంటున్నారు. ఆ ‘అద్భుతాలు’ ఏమిటో మాత్రం చెప్పలేదు. ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయటంలో మాత్రం ముందు ఉన్నారు.
1995లోని పీ3లో లేని ప్రజలను అదనంగా పీ4లోఎందుకు చేర్చారో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వలేదు. బడా పారిశ్రామిక వేత్తల పరిశ్రమలకు భూములు కావాలి. భూ సేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం ఇవ్వటం పరిశ్రమాధిపతులకు ఇష్టంలేదు. పీ4లో పేదలను చేర్చటం ద్వారా వారి భూములను పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేలా చేయటం కోసమే వారిని ఇందులో చేర్చారు.
తమ పేదరికానికి కారణాలైన వాటికి వ్యతిరేకంగా పేదలు తిరుగుబాటు చేయకుండా బడా సంపన్న వర్గాలను కాపాడటం కోసం గతంలోనూ ఇలాంటి అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. ఫ్యాక్టరీ యజమానులు సంపాదించుకున్న సొమ్ము నుండి కార్మికులకు దానధర్మాలు చేయాలని మహాత్మాగాంధీ ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని దెబ్బతీయటానికి 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని పోచంపల్లిలో వినోబా భావే ప్రారంభించిన ‘భూదానో ద్యమం’ భూస్వాముల ప్రయోజనాలు కాపాడటం కోసమే! ఆచరణలో భూస్వాములు భూములు దానం చేయలేదు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే తరహాలో పీ4 విధానాన్ని ప్రకటించారు. దేశంలోని 10% ఉన్న బడా సంపన్న వర్గాలు, అట్టడుగులో ఉన్న 20% పేదలను దత్తత తీసుకుంటే పేదరికం నిర్మూలించబడుతుందని చెప్పటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పేదరికాన్ని రూపుమాపటం పాలక ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పుకొంటున్నారు. పేదలు, బడా సంపన్న వర్గం, వర్గ సంబంధాల రీత్యా శత్రు వర్గాలే గాని మిత్ర వర్గాలు కాదు.
బడా పెట్టుబడిదారులు, భూస్వాములు... కార్మికుల, గ్రామీణ పేదల శ్రమశక్తిని దోపిడీ చేసి సంపదలను కూడబెట్టారే గానీ కష్టపడి ఒక్క రూపాయి కూడాసంపాదించ లేదు. వారు అనుభవిస్తున్న సంపద అంతా వాస్తవంగా కార్మికుల, గ్రామీణ పేదలదే! అందువల్ల బడా సంపన్నులు, భూస్వాములు పేదలను దత్తత తీసుకోమని చెప్పటం ఏమిటి! వారి దాన ధర్మాలపై ఎందుకు ఆధారపడాలి? వారు సృష్టించిన సంపద మొత్తం వారికే చెందాలి. అది వారి హక్కు. ఈ హక్కును పక్కన పెట్టటమే చంద్రబాబు పీ4 విధానం.
ఒక సమావేశ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘ఒకప్పుడు నాతో పాటు ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది పేదరికం నుంచి వచ్చిన వారే. మేమందరం గ్రామాల్లోని మామూలు కుటుంబాల నుంచి వచ్చి పేదరికాన్ని జయించి ఈ స్థాయికి వచ్చా’మని చెప్పారు. గ్రామీణ పేద కుటుంబాలు అప్పుడు, ఇప్పుడు నిత్యం కష్టపడుతున్నప్పుడు, ఆ కుటుంబాలు పేదరికాన్ని జయించాలి గదా! ఎందువల్ల జయించలేక పోయాయి?
నిత్యం పేదరికంలోనే ఎందుకు ఉంటున్నాయి? పేదరికం నుంచి బయటపడాలంటే, అందుకు అనుగుణమైన సామాజిక మార్పు విప్లవాత్మకంగా జరగాలి. ఆ మార్పును అడ్డుకోవటమే పీ4 విధానం. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం తగ్గక పోగా పెరుగుతూ ఉంది. చిన్న, సన్న కారు రైతులు భూములు కోల్పోవటం, గ్రామీణ ఉపాధి తరిగిపోవటం కార ణాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి 2022– 2023లో 45 శాతం ఉండగా 2023–24 నాటికి 46.1 శాతానికి పెరిగింది.
గ్రామీణ పేదరికానికి, భూమికి విడదీయరాని సంబంధం ఉంది. సేద్యానికి భూమి ప్రధానం. ఆ భూమి పరాన్నభుక్కులైన కొద్ది మంది భూ కామందుల వద్ద బంధించబడి ఉంది. తమ శ్రమశక్తితో వివిధ పంటలు పండించే గ్రామీణ పేదలకు ఆ పంటలపై ఎటువంటి హక్కూ ఉండదు. ఎటువంటి శ్రమ చేయని భూ కామందులు ఆపంటలను తరలించుకుపోయి సంపదలను పెంచుకుంటున్నారు. పేదలు తీవ్రమైన దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామీణ పేదలకు భూమిపై హక్కు లభించినప్పుడే పేదరికం నుంచి బయటపడతారు.
పట్టణ ప్రాంతంలోని కార్మికులు, పేదలు ఉపాధికి దూరమవుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరగక పోవటం, ఉత్పత్తులు సృష్టించే కార్మికులకు పరిశ్రమల్లో భాగస్వామ్యం లేక పోవటం, పాలక ప్రభుత్వాల విధానాల వల్ల పరిశ్రమలు మూతపడి కార్మికులు నిరుద్యోగులుగా మారటం, ఫలితంగా పరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారు కూడా ఉపాధి కోల్పోవడం వల్ల పట్టణ పేదరికం పెరుగుతూ ఉంది.
తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని చంద్రబాబు చెబుతున్నారు కాబట్టి పేదరికానికి కారణాలు ఆయనకు తెలుసు. ఆ కారణాల పరిష్కారం గురించి నేడు ఆలోచించటం లేదు. నేడు చంద్ర బాబు బడా సంపన్న వర్గాల జాబితాలో ఉండటమే కాకుండా, ఆ వర్గాల ప్రతినిధిగా ఉన్నారు. నేటి వ్యవస్థను కాపాడే ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అందుకు భిన్నంగా చంద్రబాబు విధానాలు ఉండవు.
పీ4 విధానం అనేది పేదరిక నిర్మూలనకు కాక... నేటి వ్యవస్థనూ, అందులో భాగమైన బడా పెట్టుబడిదారుల, భూస్వా ముల ప్రయోజనాలనూ కాపాడుతుంది. సమాజ పరిణామక్రమంలో దోపిడీ వర్గాలు పేదలు సృష్టించిన సంపదలను దోచు కోవటమే కాకుండా, అణచివేతకు గురి చేశాయి. అంతే తప్ప వారి గురించి ఆలోచించలేదు, ఆలోచించరు కూడా! అది వారి వర్గలక్షణం. పీ4 విధానం పేదలను పేదలుగా ఉంచటం, వారి పేదరికా నికి కారణాలపై పోరాటం చేయకుండా చేయటం, బడా సంపన్న వర్గాల దానధర్మాల కోసం ఎదురు చూసేలా చేయటమే!
గ్రామీణ ప్రాంతంలో భూ సంస్కరణల ద్వారా పేదలకు భూముల పంపిణీ జరగాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి, తద్వారా గ్రామీణ ఉపాధిని పెంచాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణమైన పరిశ్రమలు నిర్మించి అందులో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. పరిశ్రమల అనుబంధంగా పట్టణ పేదలకు ఉపాధి ఏర్పడినప్పుడే దేశంలో, రాష్ట్రంలో పేదరికం పోతుంది. కానీ చంద్రబాబు పేదలకు భూములపంపిణీకి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకం. రాష్ట్ర ప్రజలే పోరాటాల ద్వారా సాధించుకోవాలి.
-వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526
-బొల్లిముంతసాంబశివరావు