కన్నీరు కార్చడమే దేశద్రోహమా? | Sakshi Guest Column On Treason | Sakshi
Sakshi News home page

కన్నీరు కార్చడమే దేశద్రోహమా?

Published Fri, Apr 11 2025 4:51 AM | Last Updated on Fri, Apr 11 2025 2:08 PM

Sakshi Guest Column On Treason

అభిప్రాయం

ఉత్తరాది రాష్ట్రాలు ఆశ్చర్యకరమైన వార్తలకు జన్మనిస్తాయి. ఉత్తర ప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగి సాఖిబ్‌ ఖాన్‌ (35)ను ఉద్యోగం నుంచి తొలగించారనేది అటువంటి తాజా వార్త. సాఖిబ్‌ ఖాన్‌ సహారన్‌పూర్‌ జిల్లా కైలాష్‌పురిలో విద్యుత్‌ సంస్థకు చెందిన సబ్‌ స్టేషన్‌లో కాంట్రాక్టు మీద లైన్‌ మన్‌గా పని చేస్తున్నాడు. మార్చి 31న ఈద్‌ నమాజ్‌ అయి పోయిన తర్వాత పాలస్తీనా జెండా పట్టుకుని ఫొటో దిగి, ఆ ఫొటోను సోషల్‌ మీడియా మీద పంచుకున్నాడు. 

ఆ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆయనను పిలిచి రెండు గంటల పాటు ప్రశ్నించి ఏ నేరారోపణలూ, కేసూ లేకుండా వదిలివేశారు. ఆయన మీద ఏ చర్యా తీసుకోకపోతే నిరసన ప్రదర్శనలు చేస్తామని స్థానిక సంఘ్‌ పరివార్‌ (Sangh Parivar) సంస్థలు పోలీసులను హెచ్చరించాయి. ఈలోగా ఈ విషయం విద్యుత్‌ శాఖ దృష్టికి వచ్చి, ఆ చర్యను దేశద్రోహ కర చర్యగా పరిగణించి, తక్షణమే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. 

అదే సమయంలో సహారన్‌పూర్‌లో అంబాలా రోడ్‌ ఈద్గాలో నమాజ్‌ ముగిసిన తర్వాత పాలస్తీనా (Palestine) జెండాను ప్రదర్శించిన కొందరు యువకుల వీడియో తమ దృష్టికి వచ్చిందని, వారిలో ఎనిమిది మందిని గుర్తించి దేశద్రోహ నేరానికి విచారణ జరపనున్నామని నగర పోలీస్‌ సూపరింటెండెంట్‌ వ్యోమ్‌ బిందాల్‌ వార్తాసంస్థలకు తెలిపాడు. ఈ యువకులు చేసిన నేరం ఏమిటి? చనిపోయిన వారికి కన్నీరు కార్చడం! 

గత ముప్పై నెలలుగా గాజా మీద ఇజ్రాయెల్‌ బాంబు దాడులు సాగిస్తున్నది. యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేసిన తర్వాత కూడా మారణహోమం కొనసాగిస్తున్నది. కళ్ళముందర ఘోరకలి సాగిపోతుంటే ఇంకేమీ చేయలేకపోయినా, ‘మీ దుఃఖం పంచు కుంటున్నాము’ అని పాలస్తీనీయుల పతాకను ప్రదర్శించడం అత్యంత మానవీయమైన, ప్రతీకాత్మక చర్య. సానుభూతి ఈ దేశంలో నేరమైపోయిన పాడు కాలానికి చేరాం.   

నిజానికి  పాలస్తీనా జెండా ప్రదర్శించడం, ఆ మాట కొస్తే స్నేహ సంబంధాలున్న ఏ దేశపు జెండానైనా ప్రదర్శించడం భారత చట్టాల ప్రకారం, ప్రత్యేకించి ‘ది ఫ్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా 2002’ ప్రకారం నేరం కాదు. దేశద్రోహం కాదు. కానీ గత రెండు సంవత్సరాలుగా, ముఖ్యంగా గాజా మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచీ పాలస్తీనా బాధితుల పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తూ ముహర్రం ఊరేగింపులోనో, ప్రార్థనల తర్వాతనో పాలస్తీనా పతాకం ప్రదర్శించిన వందల మంది మీద ఉత్తరాది రాష్ట్రాల పోలీసులు కేసులు బనాయిస్తున్నారు. కొందరి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసులు కూడా పెట్టారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఇజ్రాయెల్‌ జెండా ప్రదర్శిస్తూ ప్రదర్శనలు జరిపినవారి మీద ఎటువంటి కేసులూ లేవు.   

దేశంగా పాలస్తీనాతో, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలతో, చివరికి సాయుధ పోరాటం చేస్తుండిన పాలస్తీనా విమోచన సంస్థతో, దాని నాయకుడు యాసర్‌ అరాఫాత్‌తో భారత ప్రభుత్వానికీ, భారత దేశానికీ ఉండిన సంబంధాల నేపథ్యంలో చూస్తే ఈ కొత్త ‘దేశద్రోహకర నేరం’ ఆశ్చర్యం కలిగిస్తుంది. 

బ్రిటిష్‌ ప్రభుత్వం బాల్ఫోర్‌ డిక్లరేషన్‌ ద్వారా పాలస్తీనాలో యూదులను స్థిరపరచడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచీ భారత వలస వ్యతిరేక జాతీయోద్యమ నాయకులందరూ బ్రిటిష్‌ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ, పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడం ప్రారంభించారు. 1938లోనే ఒక వ్యాసంలో గాంధీ ‘ఇంగ్లండ్‌ ఇంగ్లిష్‌ వాళ్లకూ, ఫ్రాన్స్‌ ఫ్రెంచి వాళ్లకూ ఎలా చెందుతుందో, అదే విధంగా పాలస్తీనా కూడా అరబ్బులకు చెందుతుంది. అరబ్బుల మీదికి యూదులను రుద్దడం తప్పు, అమానుషం’ అన్నారు.  

పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ (Israel) ఏర్పాటు చేయాలనే ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానానికి 1947 లోనే భారతదేశం వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇజ్రాయెల్‌ ఏర్పాటును 1950లో ఆమోదించినప్పటికీ, 1992 దాకా దౌత్య సంబంధాలు నెలకొల్పలేదు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్‌ దురాక్రమణను ఖండిస్తూ... ‘పాలస్తీనా పాలస్తీనీయులదే’ అని అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక తీర్మానాలను సమర్థిస్తూ వచ్చింది భారతదేశం. 

ఇజ్రాయెల్‌ మీద సాయుధ పోరాటం ప్రారంభించిన పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్‌ఓ)ను ‘పాలస్తీనా ప్రజల ఏకైక, సాధికార ప్రతినిధి’గా గుర్తించి, 1974లోనే ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. 1980 నాటికి పీఎల్‌ఓతో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నది. 

1988 నవంబర్‌ స్వాతంత్య్ర ప్రకటనతో ఏర్పాటైన పాలస్తీనాను గుర్తించిన తొలి అరబేతర దేశం భారతదేశమే! గాజాలో 1996లోనే భారత ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయం స్థాపించింది. అదే సమయంలో 1990ల నుంచే ఇజ్రాయెల్‌తో కూడా భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధాలు ప్రారంభించింది. దీంతో పాలస్తీనా నాయకులలో వ్యక్తమైన అనుమానాలను కూడా భారత నాయకులు కొట్టివేస్తూ వచ్చారు. 

పీఎల్‌ఓ అధ్యక్షుడు యాసర్‌ అరాఫాత్‌ 1997 నవంబర్‌లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నో వాణిజ్య, పారిశ్రామిక సహకార, సాంస్కృతిక సంబంధాల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి. అప్పుడే అరాఫాత్‌ హైదరాబాద్‌కు కూడా వచ్చి ఇండో–అరబ్‌ భవన సముదాయానికి పునాది వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)) నుంచి గౌరవ డాక్టరేట్‌ స్వీకరించారు. 

ఈ సుహృద్భావాన్నీ, సంఘీభావాన్నీ తోసివేస్తూ, 2014 తర్వాత భారత ప్రభుత్వం అధికారికంగా తన వైఖరి మార్చుకోకుండానే, అనధికారికంగా పాలస్తీనాకు దూరంగా, ఇజ్రాయెల్‌కు దగ్గరగా జరుగుతూ వచ్చింది. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధానిగా నరేంద్ర మోదీ 2017 జూలైలో ఇజ్రాయెల్‌ వెళ్లి బెంజమిన్‌ నెతన్యాహూను కౌగిలించుకుని సాన్నిహిత్యాన్ని ప్రకటించారు. 

చ‌ద‌వండి: క‌ఠిన వాస్త‌వాల‌ను దాచేస్తారా?

అక్కడి నుంచి ఆ సంబంధాలు మరింత బలపడుతూ, 2023 అక్టోబర్‌ 27న, మారణహోమం మొదలైన ఇరవై రోజుల తర్వాత ఇజ్రాయెల్‌ దాడిని ఆపి, శాంతి ఒప్పందానికి రావాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత ప్రభుత్వం ఓటు వేయకుండా ఉండి పోయింది. మరి, అరవై వేల మరణాలకు కన్నీరు కార్చడం, సానుభూతి ప్రకటించడం దేశద్రోహకర నేరమవుతుందా?

ఎన్‌. వేణుగోపాల్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement