Saharanpur district
-
నకిలీ వార్తలు ఇలా పుడతాయా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ముస్లిం మహిళలు గోళ్ల పెయింట్ (నేల్ పాలిష్) వాడ కూడదు. అది ఇస్లాం మతానికి వ్యతిరేకం, చట్ట విరుద్ధం అంటూ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఫత్వాను జారీ చేసిందీ’ అని నవంబర్ ఐదవ తేదీన ఏఎన్ఐ (ఆసియా న్యూస్ ఇంటర్నేషనల్) చేసిన ట్వీట్ వైరల్ అవడంతో పలు న్యూస్ ఛానళ్లు, వార్తా పత్రికలు ఆ ఫత్వాను హైలెట్ చేస్తూ హల్చల్ చేశాయి. కొన్ని వార్తా ఛానళ్లు చర్చా గోష్టిలను కూడా నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్ జిల్లాలోని ఇస్లామిక్ స్కూల్ ‘దారుల్ ఉలూమ్ దియోబంద్’ ముఫ్తీ (మత గురువు) ఇష్రార్ గౌర ఈ ఫత్వాను జారీ చేసినట్లు ఓ ఫొటోతో ఏఎన్ఐ ట్వీట్ చేసింది. ఆ ఫత్వా నకిలీదని నకిలీ వార్తలను కనిపెట్టడంలో ఆరితేరిన ‘ఆల్ట్ న్యూస్’ దర్యాప్తులో తేల్చింది. ఆయన దారుల్ ఉలూమ్ దియోబంద్ మత గురువు కాకపోవడమే కాకుండా ఆ స్కూల్‌తోని ఎలాంటి సంబంధం లేదు. ఆయన సహ్రాన్‌పూర్‌లోని జమా మసీదు పాత ఇమామ్ కుమారుడు, ప్రస్తుత ఇమామ్ సోదరుడని తేలింది. ‘తమరు ఏ హోదాలో ఫత్వా జారి చేశారు ?’ అంటూ సదరు ఇష్రార్ గౌరకు ఆల్ట్ న్యూస్ ప్రతినిధి ఫోన్ చేయగా, తన పేరు ఇష్రార్ గౌర కాదని, ఇషాక్ గౌర అని, తాను 1990 దశకంలో జారీ అయినా ఓ ఇస్లాం ఫత్వా గురించి ప్రస్తావించానని, ముస్లింలు మహిళలు గోళ్లకు రంగులకు బదులుగా మెహిందీ వాడాలని ఫత్వా సూచించినట్లు చెప్పానని, తన మాటలకు తప్పుడు అర్థం ధ్వనించేలా ట్వీట్ పెట్టారని ఆయన వివరణ ఇచ్చారు. ఇదే ఏఎన్ఐ ప్రతినిధిని ప్రశ్నించగా ఎక్కడో పొరపాటు జరిగిందని, తప్పు తెలియగానే సరిదిద్దు కున్నామని చెప్పారు. 1990 దశకంలో కూడా అలాంటి ఫత్వా జారీ అయివుంటుందన్నది కూడా అనుమానమే. ఇస్లాం స్కూల్ వెబ్సైట్లో ఇంతవరకు జారీ చేసిన అన్ని ఫత్వాలు ఉన్నాయి. అందులో ఈ ఫత్వాలేదు. ఈ విషయమై దారుల్ ఉలూమ్ దియోబంద్ నిర్వాహకులను ప్రశ్నించగా వారు స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఏఎన్ఐ ట్వీట్ చేసిన ఫొటోలో ఉన్న వ్యక్తికి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనెవరో కూడా తమకు తెలియదని చెప్పారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఏఎన్ఐకి దేశవ్యాప్తంగా 50 బ్యూరోలు ఉన్నాయి. అంతటి పెద్ద సంస్థ వాస్తవాలను తెలుసుకోకుండా నకిలీ వార్తను ప్రచురించడం, ఆ నకిలీ వార్తను నమ్మి వార్తా ఛానళ్లు దానికి విస్తృత ప్రచారం కల్పించడం శోచనీయం. -
ఆక్సిజన్ అందక అంబులెన్స్‌లోనే..
సాక్షి, లక్నో: రాష్ట్ర ప్రభుత్వం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ప్రాణాలు రక్షించేందుకు తరలిస్తున్న అంబులెన్స్ లోనే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధితుడి కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన యూపీలోని సహరన్‌పూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఓ ఆస్పత్రికి ఫోన్ చేశారు. వైద్యులు ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే పేషెంట్‌ను హాస్పిటల్‌కు తీసుకొచ్చేందుకు అంబులెన్స్ ను పంపించారు. అయితే ఆసుపత్రికి తీసుకొస్తుండగా మార్గం మధ్యలోనే ఆ పేషెంట్ (45) చనిపోయాడు. ఆక్సిజన్ సిలిండర్ పంపకపోవడం వల్లే ప్రాణాలు పోయాయంటూ మృతుడి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీఎస్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ సిలిండర్ పంపామని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తారని, విచారణలో అన్నీ తెలుతాయన్నారు. ఆక్సిజన్ లేని సిలిండర్లే అంబులెన్స్ లో ఉంటున్నాయని డ్రైవర్ తెలిపాడు. హాస్పిటల్‌కు కాసేపట్లో అంబులెన్స్ చేరుకుంటుందనగా ఆక్సిజన్ అయిపోయందని మెడికల్ టెక్నీషియన్ చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీలోని పలు ఆస్పత్రల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో నెలల చిన్నారులు వేలల్లో మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. -
సహారన్పూర్లో కొనసాగుతున్న కర్ఫ్యూ
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని సహారన్ పూర్లో సోమవారం కూడా కర్ఫ్యూ కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం భూ వివాదం విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే.అయితే ఉద్రిక్తత మాత్రం ఇంకా కొనసాగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను అధికారులు పొడిగించారు. చెదురు మదురు ఘటనలు మినహా పరిస్థితి అదుపులో ఉన్నట్లు జిల్లా పోలీస్ అధికారి రాజేష్ పాండే తెలిపారు. వీలైనంత తొందరగా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఈ ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ అల్లర్లలో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధం అయ్యాయి. ఇక ముందు జాగ్రత్తగా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశామని ఉత్తరప్రదేశ్ ఏడీజీ ముకుల్ గోయల్ తెలిపారు. -
యూపీ హింసకు రాజకీయ రంగు
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ధ్వజం * అఖిలేశ్ అసమర్థతవల్లే అల్లర్లన్న బీజేపీ, కాంగ్రెస్ * ఆరెస్సెస్ హస్తం ఉందన్న మంత్రి ఆజంఖాన్ * ఘటనపై ప్రధానికి వివరించిన రాజ్‌నాథ్ న్యూఢిల్లీ/పాట్నా: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్ జిల్లాలో జరిగిన హింసాకాండ రాజకీయ రంగు పులుముకుంటోంది. ఆ అల్లర్లకు కారణం మీరేనంటూ సమాజ్‌వాదీ పార్టీపై ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ దుమ్మెత్తిపోశాయి. దానిని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను ఎస్పీ కూడా ఘాటుగా హెచ్చరించింది. అసలు అల్లర్ల వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని యూపీ మంత్రి ఆజం ఖాన్ ఆరోపించారు. రాష్ట్రంలో అశాంతి రగల్చడానికి నాగ్‌పూర్ కేంద్రంగా వ్యూహాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీపైన కూడా ఆయన విమర్శలు చేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎస్పీ నేత రాజేంద్ర చౌదరి అన్నారు. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ.. యూపీలో ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని, అందుకే మత హింస తరచూ చెలరేగుతోందని విమర్శించారు. అన్ని విభాగాల్లోనూ అఖిలేశ్ ప్రభుత్వం అసమర్థంగా ఉందన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో లోపాలే ఆ హింసకు కారణమని మండిపడ్డారు. హింసలో స్థానిక పోలీసుల వైఫల్యం ఉందని, వివాదాస్పదమైన భూమి విషయంలో ఇరు పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారమయ్యేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటి గొడవలు ప్రారంభమయ్యాయని ఆర్జేడీ నేత మనోజ్ ఝా ధ్వజమెత్తారు. శనివారం సహారన్‌పుర్‌లో ఒక వివాదాస్పద భూమి విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన హింసలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రధానిని కలసిన హోంమంత్రి.. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోడీని కలసి సహారన్‌పుర్ హింస ఘటనపై వివరించారు. 30 నిమిషాలు జరిగిన ఈ భేటీలో అల్లర్లు జరిగిన ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి తీసుకున్న చర్యలపై ప్రధానికి హోం మంత్రి వివరించినట్లు సమాచారం. అంతేగాక తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు, ఈ విషయంపై ఇప్పటికే అఖిలేశ్‌తో మాట్లాడానని రాజ్‌నాథ్ చెప్పినట్లు తెలిసింది. కాగా, అల్లర్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం అఖిలేశ్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఆదివారం ద్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతాన్ని చిత్రీకరించారు. 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగింది.