యూపీ హింసకు రాజకీయ రంగు
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ధ్వజం
* అఖిలేశ్ అసమర్థతవల్లే అల్లర్లన్న బీజేపీ, కాంగ్రెస్
* ఆరెస్సెస్ హస్తం ఉందన్న మంత్రి ఆజంఖాన్
* ఘటనపై ప్రధానికి వివరించిన రాజ్‌నాథ్
న్యూఢిల్లీ/పాట్నా: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్ జిల్లాలో జరిగిన హింసాకాండ రాజకీయ రంగు పులుముకుంటోంది. ఆ అల్లర్లకు కారణం మీరేనంటూ సమాజ్‌వాదీ పార్టీపై ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ దుమ్మెత్తిపోశాయి. దానిని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను ఎస్‌పీ కూడా ఘాటుగా హెచ్చరించింది. అసలు అల్లర్ల వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని యూపీ మంత్రి ఆజం ఖాన్ ఆరోపించారు.
రాష్ట్రంలో అశాంతి రగల్చడానికి నాగ్‌పూర్ కేంద్రంగా వ్యూహాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీపైన కూడా ఆయన విమర్శలు చేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎస్‌పీ నేత రాజేంద్ర చౌదరి అన్నారు. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ.. యూపీలో ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని, అందుకే మత హింస తరచూ చెలరేగుతోందని విమర్శించారు.
అన్ని విభాగాల్లోనూ అఖిలేశ్ ప్రభుత్వం అసమర్థంగా ఉందన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో లోపాలే ఆ హింసకు కారణమని మండిపడ్డారు. హింసలో స్థానిక పోలీసుల వైఫల్యం ఉందని, వివాదాస్పదమైన భూమి విషయంలో ఇరు పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారమయ్యేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటి గొడవలు ప్రారంభమయ్యాయని ఆర్‌జేడీ నేత మనోజ్ ఝా ధ్వజమెత్తారు. శనివారం సహారన్‌పుర్‌లో ఒక వివాదాస్పద భూమి విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన హింసలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.
ప్రధానిని కలసిన హోంమంత్రి..
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోడీని కలసి సహారన్‌పుర్ హింస ఘటనపై వివరించారు. 30 నిమిషాలు జరిగిన ఈ భేటీలో అల్లర్లు జరిగిన ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి తీసుకున్న చర్యలపై ప్రధానికి హోం మంత్రి వివరించినట్లు సమాచారం. అంతేగాక తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు, ఈ విషయంపై ఇప్పటికే అఖిలేశ్‌తో మాట్లాడానని రాజ్‌నాథ్ చెప్పినట్లు తెలిసింది. కాగా, అల్లర్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం అఖిలేశ్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఆదివారం ద్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతాన్ని చిత్రీకరించారు. 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగింది.