యూపీలో ‘ఇండియా’ మ్యాజిక్‌ అసలు కథ | The real story of India magic in UP | Sakshi
Sakshi News home page

యూపీలో ‘ఇండియా’ మ్యాజిక్‌ అసలు కథ

Published Sun, Jun 9 2024 4:07 AM | Last Updated on Sun, Jun 9 2024 4:07 AM

The real story of India magic in UP

2024 ఎన్నికల ఘట్టం ముగిసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోమారు అధికారం చేపట్టేందుకూ రంగం సిద్ధమైంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 300 కంటే తక్కువ సీట్లకే పరిమితమయ్యేందుకు ముఖ్యకారణం ఉత్తర ప్రదేశ్‌ (యూపీ)లో ‘ఇండియా’ కూటమి అత్యద్భుత ప్రదర్శనే అనడంలో సందేహం అవసరం లేదు. 

హోరాహోరీగా ఎన్నికల్లో ఇండియా కూటమి ఏకంగా 43 స్థానాలను కైవసం చేసుకోగా (సమాజ్‌వాదీ పార్టీ 37, కాంగ్రెస్‌ ఆరు) ఎన్డీయే 36 సీట్లతో (బీజేపీ 33) సర్దుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే హిందుత్వ భావజాలానికి బాగా మద్దతున్న రాష్ట్రమిది. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇది మరింత లోతుకు చేరింది. 

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీలో 2019 నాటి కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ చాలా ధీమాగానే  ఉండింది. అయితే పోలింగ్‌ శాతం తక్కువ కావడం, మోదీ అనుకూల పవనాలేవీ లేకపోవడం, స్థానికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించడం వంటి కారణాలతో బీజేపీకి గట్టి పోటీ తప్పలేదు. అయితే గత కొన్నేళ్లుగా క్షేత్రస్థాయిలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ వీటిని పెద్దగా పట్టించుకోలేదని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

రాజకీయంగా మళ్లీ పుంజుకుంటున్న దశలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటు, పప్పూ అన్న ఇమేజ్‌ చట్రం నుంచి బయటపడ్డ రాహుల్‌ గాంధీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రజల్లో... మరీ ముఖ్యంగా దళితులు, కొన్ని ఓబీసీ వర్గాల్లో పెరిగిపోయిన అసంతృప్తి; అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి... వెరసి ఈ ఫలితాలు! 
యూపీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి ప్రదర్శనకు కర్త, కర్మ, క్రియ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవే. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 2014 తరువాత మొదటిసారి ఓ నేత బీజేపీకి సవాలు విసిరే స్థితిలో కనిపించాడు. 

గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన చిన్న పార్టీలన్నింటినీ కూడగట్టి అఖిలేశ్‌ఒంటరిగానే యూపీలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను నిర్మించగలిగాడు. దళిత ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు బాబాసాహెబ్‌ వాహినిని సృష్టించాడు. వెనుకబడిన వర్గాల నేతగా తనను తాను ఆవిష్కరించుకున్న అఖిలేశ్‌ ఎన్నికల యుద్ధాన్ని కాస్తా హిందూత్వ– సామాజిక న్యాయాల మధ్య పోరుగా మార్చేశాడు. 

2024 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ డిమాండ్లను తట్టుకుని సీట్ల సర్దుబాటు చర్చలను ఫలవంతం చేయడం ద్వారా వారికి 11 సీట్లు, తన పార్టీ, వర్గానికి 62 సీట్లు కేటాయించుకునేలా చేయగలిగాడు. అంతేకాకుండా ముస్లిం– యాదవ్‌ల పార్టీ అన్న ముద్రను పోగొట్టుకునేందుకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులతోపాటు యాదవులకు కేటాయించిన సీట్లు ఐదింటికి పరిమితం చేసుకున్నాడు. మిగిలిన సీట్లన్నింటినీ అన్ని వర్గాల వారికీ కేటాయించాడు.

రాహుల్‌ గాంధీపై అప్పటివరకూ ఉన్న ప్రజాభిప్రాయం 2024 ఎన్నికల్లో గణనీయంగా మారినట్లు స్పష్టమవుతోంది. భారత్‌ జోడో యాత్ర, భారత్‌ న్యాయ్‌ యాత్రలు ఇందుకు ఉపకరించి ఉండవచ్చు. అమేథీ, రాయ్‌ బరేలీల్లో కాంగ్రెస్‌ విజయాలు దీనికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. 

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన న్యాయ్‌ గ్యారెంటీలు కూడా చాలావరకూ ప్రజాదరణకు నోచుకున్నాయి. మరీ ముఖ్యంగా జాబ్‌ గ్యారెంటీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను యాభై శాతం కంటే ఎక్కువ చేసేందుకు రాజ్యాంగ మార్పులు. ఇండియా కూటమి భాగస్వాములు కలిసికట్టుగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం కొంత ఆలస్యంగా మొదలైనప్పటికీ మే నెలలో మాత్రం దాదాపు ఆరు జరిగాయి. అన్ని సమావేశాల్లోనూ అఖిలేశ్‌ ప్రజాకర్షక నేతగా కనిపించారు. 

‘ఇండియా’ కూటమి నేతలు క్షేత్రస్థాయిలో అధికార పక్షంపై ఉన్న అసంతృప్తిని ఒడిసిపట్టుకోవడంలో విజయం సాధించారని చెప్పాలి. కులాధారిత జనగణన, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారన్న దళితుల ఆందోళన, అగ్నివీర్, ప్రశ్నపత్రాలు తరచూ లీక్‌ అవుతూండటం వంటి అంశాలను సమర్థంగా వాడుకుని అధికార పక్షానికి సవాలు విసిరారు ‘ఇండియా’ కూటమి నేతలు. మతం ప్రధానంగా సాగిన బీజేపీ ప్రచారం ప్రభావం నుంచి జనాలను తమవైపునకు మళ్లించడంలో విజయం సాధించారు. అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌లోనూ బీజేపీ ఓటమి పాలు కావడమే కాదు... విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ నేత అవదేశ్‌ సింగ్‌ దళిత వర్గానికి చెందిన వాడు కావడం గమనార్హం.

2014 నుంచి బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో తన పట్టు, ప్రాభవం రెండింటినీ కోల్పోతూ వస్తోంది. ఆ కారణంగానే జాట్‌ కులేతరులు బీజేపీవైపు ఎక్కువగా మొగ్గారు. తద్వారా యాదవుల ఆధిపత్యం నుంచి తప్పించుకోవచ్చునని ఆలోచించారు. అయితే ఎస్పీ కాంగ్రెస్‌తో జట్టు కట్టడంతో బీఎస్పీ, బీజేపీల కంటే ‘ఇండియా’ కూటమి తమకు మేలు చేయగలదన్న నమ్మకం వాళ్లకు కలిగింది. భీమ్‌ ఆర్మీ/ఆజాద్‌ సమాజ్‌ పార్టీ వైపు దళితులు మొగ్గడం వెనుక కారణమూ ఇదే. చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఏర్పాటు చేసిన ఈ పార్టీ చతుర్ముఖ పోరులోనూ నగీనా రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి విజయం సాధించింది.

యూపీలో బీజేపీ కూటమి ఓటమికి మరో బలీయమైన కారణం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రెండూ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని చర్చనీయాంశంగా చేశాయి. అధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి 2021 వరకూ యూపీ ఆర్థిక వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 1.95 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చెందింది. 

తలసరి ఆదాయ వృద్ధి ఏడాదికి 0.43 శాతం మాత్రమే. అంతకు మునుపు అంటే 2012–2017 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏడాదికి 6.92 శాతం చొప్పున పెరగ్గా 2007–2012 మధ్యకాలంలో బీఎస్పీ అధినేత్రి మాయవతి కాలంలో 7.28 శాతం చొప్పున పెరిగింది. యోగీ ఆదిత్యనాథ్‌ హయాంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైందని చాలామంది చెబుతూంటారు. అదే సమయంలో చాలామందికి యోగి బుల్డోజర్‌ రాజకీయాలు అంతగా నచ్చలేదు కూడా! 

యూపీలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా యమునా, గంగ ఎక్స్‌ప్రెస్‌ వే, సనౌటా–పుర్కాజీ ఎక్స్‌ప్రెస్‌ వే, వారణాసి – నోయిడాల మధ్య ఎనిమిది లేన్ల రహదారి వంటి అనేక భారీ ప్రాజెక్టులు మొదలయ్యాయి. అలాగే కుశినగర్, జేవార్‌ల వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికీ ప్రణాళిక సిద్ధమైంది. కానీ, ఈ రెండింటికీ బీజం పడ్డది మాయావతి కాలంలో. అఖిలేశ్‌ ఈ ఆలోచనలను కొనసాగించారు. 

మొత్తమ్మీద 2024 ఎన్నికలు హిందూత్వ భావజాలానికీ, సామాజిక న్యాయాన్ని కోరే మండల్‌ వర్గాలకూ మధ్య హోరాహోరీగానే సాగింది. రాముడి చుట్టూ తిరిగిన రాజకీయాలను కాస్తా ప్రజల జీవనోపాధి సమస్యల వైపు మళ్లించిన ఘనత ‘ఇండియా’ కూటమికి దక్కుతుంది. ఇంకోలా చెప్పాలంటే 2014 తరువాత మొదటిసారి బీజేపీ మతతత్వ పాచిక పారలేదని చెప్పాలి. 

-వ్యాసకర్త ‘మాయా, మోదీ, ఆజాద్‌: దళిత్‌ పాలిటిక్స్‌ ఇన్‌ ద టైమ్‌ ఆఫ్‌ హిందుత్వ’ రచయిత్రి (సజ్జన్‌ కుమార్‌తో కలిసి). 
- సుధా పాయీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement