తాజా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఒకటి, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి మరొకటితో... పైకి వన్ ఆల్ అనిపించాయి. రెండు చోట్లా గద్దె మీద ఉన్న పార్టీలే అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. రెండు విజయాల్లోనూ కొన్ని పోలికలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు మునుపటి కన్నా పెద్ద మెజారిటీతో విజయం సాధించాయి. అనేక కారణాలు విజయాన్ని ప్రభావితం చేసినా, ప్రధానంగా సంక్షేమ పథకాలు కీలక భూమిక పోషించాయి.
మరీ ముఖ్యంగా, మహిళలకు నగదు బదలీ పథకం గేమ్ ఛేంజరైనట్టు విశ్లేషణ. మహారాష్ట్రలో మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తూ ఏక్‌నాథ్ శిందే తెచ్చిన ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’, జార్ఖండ్‌లో అర్హులైన స్త్రీలకు నెలవారీగా వెయ్యి రూపాయల హేమంత్ సోరెన్ సర్కార్ ‘ముఖ్య మంత్రి మయ్యా సమ్మాన్ యోజన’ వారిని విజయతీరాలకు చేర్చాయి. మరిన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు రావడం ఖాయమని తేల్చేశాయి. భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేశాయి.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే కావచ్చు. కానీ, మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి సాధించిన మహా విజయం, ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి మూటగట్టు కున్న ఘోర పరాజయం మాత్రం ఆశ్చర్యపరుస్తాయి. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత దాదాపు 9.5 లక్షల ఓట్లు పెరిగాయంటూ వస్తున్న ఆరోపణల మాట ఎలా ఉన్నా, 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్కుకు కేవలం 13 తక్కువగా 132 స్థానాలు బీజేపీ గెలవడం విశేషం.
కేవలం అయిదు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 9 మాత్రమే గెల్చిన బీజేపీ, ఆ ప్రాతిపదికన ఇప్పుడు కేవలం 83 సీట్లే గెలవాలి. కానీ, అప్పటి లెక్క కన్నా మరో 49 స్థానాలు అదనంగా తన ఖాతాలో వేసుకోగలిగింది. అంటే, జూన్ నాటి ఎదురు దెబ్బల నుంచి బీజేపీ మళ్ళీ పూర్తిస్థాయిలో పుంజుకుంటే, అప్పట్లో దక్కిన కొద్దిపాటి ఉత్సాహం, ఊపును కాంగ్రెస్ చేజార్చుకుంది. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్‌లు 75 స్థానాల్లో ముఖాముఖి పోరుకు దిగితే, హస్తానికి పట్టుమని 10 దక్కడం గమనార్హం. ఇది నిర్ద్వంద్వంగా స్వయంకృతం.
కాంగ్రెస్ తప్పిదాలకు కొదవ లేదు. మరాఠీ భాషే తెలియని పెద్దలను పార్టీ పరిశీలకులుగా పంపిన ఘనత ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీది. పరిశీలకులుగానే కాదు... ప్రచారకులుగానూ బయటి జనాభాయే. వచ్చేది హంగ్ అసెంబ్లీ అంటూ పార్టీ అధిష్ఠానానికి వర్తమానం పంపి, ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయించారంటే క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
‘బటేంగే తో కటేంగే’, ‘ఏక్ హై తో సేఫ్ హై’ లాంటి నినాదాలతో జనంలో భయాన్నీ, అభద్రతనూ పెంచుతూ మహాయుతి కూటమి ప్రచారం హోరెత్తిస్తే, సరైన ప్రచార కథనాన్ని ఎంచుకోవడంలో మహావికాస్ ఆఘాడీ కూటమిలోని మూడు ప్రతిపక్షాలూ విఫలమయ్యాయి. దాదాపు 40 పైచిలుకు స్థానాల్లో ముస్లిమ్‌ల మద్దతు కోసం చూసుకొని, మెజారిటీ వర్గాలు బీజేపీ వైపు మొగ్గేలా చేశాయి. అలాగే, ‘ఇండియా’ కూటమి ప్రధాన పక్షాలు ఇతర పార్టీలను కలుపుకొని పోవడంలో, కనీసం నియంత్రించడంలో విఫలమయ్యాయి. అలా దాదాపు 17 శాతం ఓట్ షేర్ వచ్చిన ‘ఇతరులు’ కూటమి అవకాశాల్ని దెబ్బ తీశారు.
2023 నవంబర్ – డిసెంబర్‌లలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓటమికి కారణాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ వేసుకున్న అంతర్గత కమిటీలు ఇప్పటికీ తమ నివేదికలు ఇవ్వనేలేదు. ఆ పార్టీలో జవాబుదారీతనం లేకపోవడానికి ఇది ఓ మచ్చుతునక. దూరదృష్టి లేకపోవ డంతో పాటు ఉదాసీనత కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను పట్టి పడిస్తోంది. ప్రతిపక్షాలకు భిన్నంగా బీజేపీ పటిష్ఠమైన వ్యూహంతో ముందుకు వెళ్ళింది. ఆరెస్సెస్ శతవసంత వత్సరంలో అడుగిడిన వేళ మహారాష్ట్రలో కాషాయ విజయాన్ని కానుకగా అందించాలన్న సంకల్పం సైతం సంఘ్ కార్యకర్తలను లక్ష్యసాధనకు పురిగొల్పింది.
పోలింగ్ బూత్ స్థాయి దాకా వెళ్ళి వారు శ్రమించడం ఫలితమిచ్చింది. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పరిమితంగా ప్రచారం చేస్తే, ‘చొరబాటు దారుల’ బూచితో బీజేపీ భయపెట్టిన జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన దాదాపు 100 ర్యాలీలలో పాల్గొని విజయసాధనకు శ్రమించాల్సిన విధానం ఏమిటో చూపెట్టారు. ఇటీవల జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, ఇప్పుడు జార్ఖండ్‌లో జేఎంఎం భుజాల మీద ఎక్కి, హస్తం విజయకూటమిలో నిలిచింది కానీ, వ్యక్తిగతంగా అది సాధించిన సీట్లు స్వల్పమే.
ఈ ఫలితాలు ఆత్మపరిశీలన తప్పనిసరి అని కాంగ్రెస్‌కు పదే పదే బోధిస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ, అధికార బీజేపీ ఆశ్రిత పక్షపాతం లాంటి పాత పాటకు పరిమితం కాకుండా కొత్త పల్లవి అందుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. విజేతగా నిలిచిన బీజేపీ, ముఖ్యంగా మోదీ ఇప్పటికే స్వరం పెంచి, ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు. మోదీ, షాలు మళ్ళీ పట్టు బిగించారు. ఇదే ఊపులో కమలనాథులు ఉమ్మడి పౌరస్మృతి, ఒక దేశం... ఒకే ఎన్నిక, వక్ఫ్ బిల్లు వగైరాలపై వేగం పెంచవచ్చు.
బీమా రంగంలో పూర్తి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లాంటి విపరీత సంస్కరణలకూ గేట్లెత్తే అవకాశం ఉంది. మహారాష్ట్ర పీఠమెక్కే కొత్త దేవేంద్రులకూ చాలా బాధ్యతలున్నాయి. దేశానికి ఆర్థిక కేంద్రంగా, స్థూలజాతీయోత్పత్తిలో దాదాపు 14 శాతం అందించే మహారాష్ట్రలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడాలి. అవినీతి, నిరుద్యోగం, రైతాంగ సమస్యల లాంటివి ఎన్నికల ప్రచారంలో వెనుకపట్టు పట్టినా, ఇకనైనా ఆ కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. వెరసి, మహా ఫలితాల దరిమిలా అధికార, ప్రతిపక్షాలు అందరికీ చేతి నిండా పని ఉంది.
ఎన్నికల మహా పాఠం
Published Tue, Nov 26 2024 12:00 AM | Last Updated on Tue, Nov 26 2024 12:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment