
శీతలగాలులు కమ్మేసిన సమయంలోనూ దేశ రాజధాని ఎన్నికల హంగామాతో వేడెక్కుతోంది. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ పక్షాల ‘ఉచిత హామీల’ వ్యూహం ఊపందుకుంది. మహిళా ఓటర్లను కేంద్రంగా చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోలలో పార్టీలు పోటా పోటీగా వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి.
2012 నుంచి ఢిల్లీలో ఆధిపత్యం చూపుతున్న అధికార ఆప్, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీలు రెండూ ఏక తీరున ఎడాపెడా హామీలిస్తుంటే, పోగొట్టుకున్న పట్టును వెతుక్కుంటూ కాంగ్రెస్ కొత్త ఉచితాల ప్రకటనలతో ఊపిరి పీల్చుకోవాలని చూస్తోంది. ఆప్ తన మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యచికిత్స, ఆటోడ్రైవర్లకు 5 గ్యారెంటీలు, అద్దెకున్నవారికి సైతం ఉచిత విద్యుత్, నీటి పథకం వర్తింపు లాంటివి ప్రకటించింది.
బీజేపీ తన మేనిఫెస్టోలో హోలీ, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, గర్భిణు లకు రూ. 21 వేలు, ప్రతి నెలా మహిళలకు రూ. 2.5 వేలు సహా పలు హామీలిచ్చింది. ఇప్పటికే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని బీజేపీ తోసిపుచ్చకపోవడం ఢిల్లీ నమూనాను సమర్థించ డమేనని ఆప్ ఎద్దేవా చేస్తుంటే... బీజేపీ మాత్రం ఆప్ మాటలు ధయాధర్మం చేస్తున్నామన్నట్లున్నా యనీ, తమది మాత్రం సమాజ సమగ్రాభివృద్ధికై సాగిస్తున్న సంక్షేమ వాగ్దానమనీ వాదిస్తోంది. వెరసి, మాటల యుద్ధంతో 70 స్థానాల ఢిల్లీ పీఠానికి పోటీ రసవత్తరంగా మారింది.
1993 నవంబర్‌లో తొలి ఢిల్లీ శాసనసభ ఏర్పాటైంది. అప్పటి నుంచి గమనిస్తే, ప్రజా ఉద్య మాలు పెల్లుబికిన ప్రతిసారీ జాతీయ రాజధానిలో అధికారం చేతులు మారిందని విశ్లేషణ. 1998లో షీలా దీక్షిత్ అధికారంలోకి వచ్చినా, 2013లో ఆమెను గద్దె దింపి అరవింద్ కేజ్రీవాల్ పీఠమెక్కినా... ప్రతి అసెంబ్లీ ఎన్నిక ముందు ఏదో ఒక ప్రజాందోళన జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తుంటారు.
1998 నవంబర్‌లో ఎన్నికలైనప్పుడు అంతకంతకూ పెరుగుతున్న ధరలు సహా ప్రజల కోపకారణాలే ఊతంగా షీలా అధికారంలోకొచ్చారు. అంతకు కొద్దినెలల ముందు లోక్‌సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన బీజేపీ తీరా ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, 2013లో నిర్భయ కేసులో ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం, అవినీతి అంశాల ఆసరాతో, ఉచిత విద్యుత్, నీటి సరఫరా హామీలు అండగా కేజ్రీవాల్ జయకేతనం ఎగరేశారు. సంక్షేమ పథకాలతో 2015, 2020లోనూ గట్టెక్కారు.
పదేళ్ళ పైగా ‘ఆప్’ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలూ వాడుతోంది. కాంగ్రెస్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తోంది. చిత్రమేమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతున్నా అదేమీ పట్టనట్టు ఆప్, దాని అధినాయకత్వం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ ఓటర్ల మనసెరిగి ప్రవర్తించడంలో ఆరితేరిన అధికార పక్షం గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలు, తాయిలాలతో వారిని ఆకట్టుకోగలిగింది.
ఈసారి కూడా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య బీమా అందిస్తామంటూ ఆప్ భారీ వాగ్దానమే చేసింది. నిజం చెప్పాలంటే, ఇతర పార్టీలు సైతం తన దోవ తొక్కక తప్పని పరిస్థితిని కల్పించడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు. ఒకప్పుడు ‘ఎన్నికల ఉచిత మిఠాయిలు’ అంటూ ఈసడించిన ప్రధాని మోదీ సైతం చివరకు ఢిల్లీలో వాటికే జై కొట్టడం గమనార్హం. ఆప్ మళ్ళీ పగ్గాలు పడుతుందా, లేక పొరుగున హర్యానాలో అనూహ్య విజయంతో ఆశ్చర్యపరిచిన బీజేపీ ఢిల్లీలోనూ ఆ మ్యాజిక్ చేస్తుందా అన్నది ఆసక్తికరం.
చిరకాలంగా లోక్‌సభలో బీజీపీకీ, అసెంబ్లీలో ఆప్‌కూ అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఓటర్లు ఈసారీ అలాగే చేస్తారా అన్నది ప్రశ్న. ఆప్‌కు ఒకప్పుడున్న అవినీతి రహిత ఇమేజ్, సామా న్యులకు సానుకూలమనే పేరు ఇప్పుడు దెబ్బతిన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల వలలో పార్టీ నేతలు చిక్కగా, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఘర్షణతోనే పుణ్యకాలం హరించుకు పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే. ప్రతి ఎన్నికనూ జీవన్మరణ సమస్యగానే భావించే బీజేపీ ఎప్పటిలానే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకొచ్చింది.
నిరుటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వాములుగా సీట్ల పంపిణీతో చెట్టపట్టాలేసుకున్న ఆప్, కాంగ్రెస్‌లు ఈసారి పరస్పరం కత్తులు దూసుకోవడమూ విడ్డూరమే. మరోపక్క భుజాలపై పార్టీ కండువాలు మార్చిన నేతలు పలువురు కొత్త జెండాతో బరిలో అభ్యర్థులుగా నిలవడం కార్యకర్తలకూ, పార్టీ నేతలకే కాదు... ఓటర్లకూ చీకాకు వ్యవహారమే. ఇలాంటి 20 మంది నేతల భవితవ్యం ఢిల్లీ కొత్త పీఠాధిపతిని నిర్ణయిస్తుందని అంచనా. అవన్నీ ఎలా ఉన్నా ప్రధాన చర్చనీయాంశం మాత్రం ఉచిత హామీలే.
సమాజంలో అంతరాలు అంతకంతకూ అధికమవుతున్న పరిస్థితుల్లో అణగారిన వర్గాల సముద్ధరణకు చేయూత నివ్వడం సమంజసం. అయితే, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెంచి, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం దూరదృష్టి గల పాలకులు చేయాల్సిన పని. అవసరం లేని ఉచితాలపై మాత్రం అప్రమత్తంగా ఉండాలి.
ఎన్నికల జాతరలో తాత్కాలికంగా పైచేయి అనుచితమైన ఉచితాలను పార్టీలు ప్రకటిస్తే, ఆ మాటలు నీటి మీది రాతలుగా మిగిలిపోతాయి. అథవా అమలు చేసినా, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, పాలనారథం తలకిందులయ్యే ప్రమాదమూ ఉంటుంది. అభివృద్ధి మంత్రానికీ, అధికారం కోసం పప్పుబెల్లాలు పంచాలనుకొనే ఉచితాల తంత్రానికీ నడుమ పోటీలో ఢిల్లీ జనం ఎటు మొగ్గుతారన్నది ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి 8న చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment