ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమరంలో ఓటరు మనసు గెలిచేందుకు విస్తృత ప్రచారంచేసిన ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోందనే ఆలోచనలో తలము నకలయ్యాయి. మూడోసారి అధికార పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. 23 ఏళ్లుగా అధికారానికి దూరమైన బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ ఉట్టికొట్టాలని నిశ్చయించుకుంది. అందుకే కమలనాథులంతా ఏకమై మునుపెన్నడూ లేనంతగా ఎన్నికల ప్రచారం చేశారు.
ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ సైతం ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాసహా ముఖ్యనేతలతో బాగా ప్రచారం చేయించింది. ఈసారి ఓటరు మహాశయుడు ఆప్ చీపురును పైకెత్తుతాడా? బీజేపీ కమలంను అందుకుంటాడా? కాంగ్రెస్ ‘చేయి’ పట్టుకుని నడుస్తాడా? అనేది రేపు జరగబోయే పోలింగ్‌తో తేలనుంది. ఉచిత విద్యుత్, మహిళా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా నగదు జమ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఉపకార వేతనం, పెన్షన్లు, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఇస్తామని ప్రధాన పార్టీలన్నీ ఊదరగొట్టాయి.
అయితే రూ.12 లక్షల వార్షిక ఆదాయానికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించనక్కర్లేదని సాధారణ బడ్జెట్‌లో ప్రకటించి బీజేపీ పార్టీ ఢిల్లీ మధ్య తరగతి ఓటర్లను దాదాపు తనవైపునకు తిప్పుకున్నంత పనిచేసింది. ఈ ప్రకటన ఫలితాలు పోలింగ్ సరళిలో ఏమేరకు ప్రతిఫ లిస్తాయో చూడాలి మరి. రూ.10 లక్షల వార్షికా దాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండకూడదని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇన్నాళ్లూ డిమాండ్ చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతకుమించి లబ్ధి చేకూ రేలా చేసి ఓటర్లు కమలం వైపు తల తిప్పేలా చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఏఏ అంశాలు ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పాత్ర పోషించే వీలుందనే చర్చ మొదలైంది.
మధ్య తరగతి కుటుంబాలు
ఢిల్లీలోని కుటుంబాల్లో 67 శాతం కుటుంబాలు మధ్య తరగతికి చెందినవే. ఇంతటి పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతిని పార్టీలు ప్రధానంగా ఆకట్టుకునే ప్రయత్నంచేశాయి. సాధారణ బడ్జెట్‌లో ప్రకటించినట్లు రూ.12 లక్షల వార్షికాదాయంపై ట్యాక్స్‌ను తొలగిస్తే మిగతా వర్గాల కంటే ముందుగా లబ్ధి చేకూరేది ఈ మధ్య తరగతి వాళ్లకే. ఈ లెక్కన బడ్జెట్ ప్రకటన తర్వాత ఈసారి మధ్య తరగతి వర్గాలు బీజేపీకే జై కొట్టే అవకాశాలు ఒక్కసారిగా పెరిగాయి.
రెండుసార్లు అధికారంలో ఉన్న ఆప్ ప్రస్తుతం కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దీనికి ఆప్ నేతలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు ప్రధాన కారణం. ఢిల్లీ పరిధిలో మద్యం విధానంలో అక్రమాలు చేసి వందల కోట్లు కూడబెట్టారని ఆప్ నేతలపై ఈడీ అభియోగాలు మోపడం తెల్సిందే. ఈ అవినీతి మరకలను వెంటనే తొలగించుకోవడంలో ఆప్ నేతలు విఫలమయ్యారు. దిగజారిన ప్రతిష్ట ఇప్పుడు పోలింగ్‌లో పార్టీకి వచ్చే ఓట్ల సంఖ్యను దిగజారుస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ముస్లింలు, దళితులు
ఢిల్లీ రాష్ట్రంలో ముస్లింల జనాభా 12.68 కాగా దళితుల జనాభా 16.92 శాతం. దళితులు ఎక్కువగా ఢిల్లీలోని జుగ్గీలుగా పిలిచి మురికివాడల్లో నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మురికివాడలను తొలగిస్తుందన్న భయాలతో వీళ్లంతా తమకు ఆదుకుంటుందని అధికార ఆప్ పార్టీకే జై కొట్టారు. అయితే మురికివాడల జోలికి మేం రాబోమని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించడంతో వీళ్లంతా ఈసారి బీజేపీ వైపు నడవొచ్చనే మాట వినిపిస్తోంది.
రాష్ట్రంలో దశాబ్దకాలంగా అధికారంలో లేని కాంగ్రెస్‌తో పోలిస్తే ముస్లింలు ఈసారి కూడా ఆప్ వెంటే ఉండే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఆరు నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా ఎక్కువ. సీలాంపూర్ నియోజకవర్గంలో అయితే ఏకంగా సగం మంది ఓటర్లు ముస్లింలే. మాటియా మహల్ నియోజకవర్గంలో 48 శాతం మంది, ఓఖ్లాలో 43 శాతం మంది, ముస్తఫాబాద్‌లో 36 శాతం మంది, బలీమరాన్‌లో 38 శాతం మంది, బబర్‌పూర్‌లో 35 శాతం మంది ముస్లిం ఓటర్లే ఉన్నారు. 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ ఆరు స్థానాలను ఆప్ గెల్చుకుంది.
ఉచితాలు
ఉచితంగా ఇస్తామంటూ బీజేపీ, ఆప్‌లు ఎన్నికల ప్రచారం చేపట్టాయి. ఉచితంగా విద్యుత్, ఉచితంగా నీటి సరఫరా, మహిళల ఖాతాకు నగదు బదిలీ చేస్తామని ఆప్ ఉచిత హామీలు గుప్పించింది. ఆప్‌తో పోలిస్తే బీజేపీ కాస్త తక్కువ హామీలనే ఇచ్చింది. అయితే రూ.12 లక్షల వార్షికాదాయంపై ట్యాక్స్ మిన హాయింపుతో ఆమేరకు జనానికి లబ్ది చేకూరు తుందని, అది కూడా ఓ రకంగా ఉచిత హామీయేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
మహిళలు
ఢిల్లీ ఓటర్లలో 48% మంది మహిళలు ఉన్నా రు. దీంతో గెలుపు అవకాశాలను మహిళ లనూ నిర్ణయించనున్నారు. మొత్తంగా 71.7 లక్షల మంది మహిళా ఓటర్లు న్నారు. ముఖ్య మంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న నగదును రెట్టింపు చేస్తామని, నేరుగా బ్యాంక్ ఖాతాలో వేస్తామని మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. నెలకు రూ.2,100 ఇస్తామని ప్రకటించింది. మేం అధికారంలోకి వస్తే నెలకు రూ.2,500 బదిలీచేస్తామని బీజేపీ ప్రకటించింది.
ముఖ్యమంత్రి అభ్యర్థి
ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఢిల్లీ అంతటికీ తెలుసు. కేజ్రీవాల్ తప్ప ఇంకెవరు ఆ పదవికి పోటీపడట్లేరు. గతంలో బెయిల్ లభించక జైలులో ఉన్న కారణంగా ఆతిశీని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఈసారి గెలిస్తే కేజ్రీవాల్ మళ్లీ సీఎం కుర్చీపై ఆసీనులవుతారు. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఓటరుకు తెలీదు. ప్రధాని మోదీ పేరు, ఛరిష్మా మీదనే బీజేపీ ఓట్లు అడుగుతోంది. సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ము కూడా బీజేపీకి లేదని తరచూ కేజ్రీవాల్ వెక్కిరించడం తెల్సిందే.
ఫలోదీ సత్తా బజార్ ఏం చెబుతోంది?
ఈసారి ఎన్నికల్లో ఆప్ పార్టీయే ఫేవరెట్‌గా నిలుస్తోందని ‘ది ఫలోదీ సత్తా బజార్’ తన అంచనాల్లో పేర్కొంది. 2015, 2020 ఎన్నికల కంటే ఈసారి ఆప్ మరింత బలంగా ఎన్నికల బరిలో దూకిందని వ్యాఖ్యానించింది. 70 సీట్లున్న అసెంబ్లీలో దాదాపు 38 నుంచి 40 చోట్ల ఆప్ గెలుస్తుందని ఈ సంస్థ అంచనావేసింది. ఆప్ తర్వాత బీజేపీ దాదాపు 30 నుంచి 32 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరేయొచ్చని సంస్థ చెబుతోంది. కాంగ్రెస్ ఏమేరకు రాణిస్తుందనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఉనికి కోసం పోరాడుతున్న పార్టీపై సర్వే చేపట్టలేదని తెలుస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment