మహారాష్ట్రలో ఎన్నికల పర్వం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఈ 20న జరగనున్న ఎన్నికల కోసం ఇటు బీజేపీ సారథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి, అటు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష ‘మహా వికాస్ ఆఘాడీ’ (ఎంవీఏ)... రెండూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రంలో ఇప్పుడు ఉచితాల పోరు సాగుతోంది. గృహాలకు 100 యూనిట్ల మేర కరెంట్ ఉచితం, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడపిల్లలకు ఉచిత టీకాకరణ, మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా రెండు రోజులు ఋతుక్రమ సెలవుల లాంటి గ్యారెంటీలతో ఎంవీఏ ముందుకొచ్చింది.
ఫలితంగా మహాయుతి సైతం మరింత ఎక్కువ వాగ్దానాలు చేయక తప్పలేదు. దాంతో, ఎన్నికల మేనిఫెస్టోలు కలకలం రేపుతున్నాయి. ఖజానాపై భారం రీత్యా పథకాల సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది. దేశాభివృద్ధికి ఉచితాల సంస్కృతి ప్రమాదకరమన్న మోదీ సొంతపార్టీ బీజేపీ సైతం ‘మహా’పోరులో ప్రతిపక్షం బాట పట్టక తప్పలేదు. అయితే, వైరిపక్షం వాగ్దానాలు సాధ్యం కావంటూ ప్రతి పార్టీ పక్కవారిపై ఆరోపణలు చేయడమే విడ్డూరం.
మహిళలు, రైతులు, విద్యార్థులు – నిరుద్యోగులైన యువతరం, సీనియర్ సిటిజన్లు... ఇలా వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఇచ్చిన పోటాపోటీ హామీలు అనేకం. సమాజంలోని వెనుక బడిన వర్గాలను పైకి తీసుకురావడానికీ, అవసరంలో ఉన్నవారికి చేయూత అందించడానికీ సంక్షేమ పథకాలను హామీ ఇవ్వడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం తప్పు కాదు, తప్పనిసరి కూడా! అయితే, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అమలు చేయడానికి వీలే కాని వాటిని హామీ ఇచ్చినప్పుడే అసలు సమస్య. అధికారంలో ఉండగా అవసరార్థులను పట్టించుకోకుండా, తీరా ఎన్నికల వేళ మేని ఫెస్టోలతో మభ్యపెట్టాలనుకోవడం మరీ దారుణం.
ఎన్నికల వాగ్దానపత్రాలపై విమర్శలు వస్తున్నది అందుకే. ఆర్థికభారం సంగతి అటుంచితే, స్త్రీలకు తప్పనిసరి ఋతుక్రమ సెలవు లాంటివి పని ప్రదేశాల్లో వారికే ప్రతికూలంగా మారే ప్రమాదముందని జూలైలో సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయపడింది. అయినా, ఆ అంశాన్ని పార్టీలు చేపట్టడం విచిత్రమే. పని గంటల్లో వెసులుబాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర ప్రత్యామ్నాయాలను పట్టించుకోకుండా, జపాన్, స్పెయిన్, ఇండొనేసియా లాంటి చోట్ల ఆదరణకు నోచుకోని పద్ధతిని తెస్తామని హామీ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరం.
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే బలమైన ఓటరు వర్గంగా మహిళలు మారిన సంగతిని పార్టీలు గుర్తించాయి. స్త్రీలు స్వీయ నిర్ణయంతో ఓట్లేస్తున్న ధోరణి పెరుగుతోందనీ గ్రహించాయి. అందుకే, 4.5 కోట్ల మంది మహిళా ఓటర్లున్న మహారాష్ట్రలో రెండు కూటములూ వారిని లక్ష్యంగా చేసుకున్నాయి. లడకీ బెహిన్ యోజన కింద ఇస్తున్న నెలవారీ భృతిని పెంచుతామనీ, స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులకు ‘లఖ్‌పతీ దీదీ’ పథకంతో చేయూతనిచ్చి, 2027 కల్లా 50 లక్షల మందిని లక్షాధికారిణుల్ని చేస్తామనీ ‘మహాయుతి’ మాట.
ఎంవీఏ కూటమి ఏమో ‘మహా లక్ష్మి పథకం’ ద్వారా నెలవారీ ఆర్థికసాయం, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం వగైరా హామీలి స్తోంది. నిజానికి, పశ్చిమ బెంగాల్‌లో కన్యాశ్రీ, మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా యోజన... ఇలా రక రకాల పేర్లతో మహాలక్ష్మి పథకం లాంటివి ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి. ఈ తీపి మాటల్ని అటుంచితే,, మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను రెండు కూటముల పక్షాన కలసి ఈ ఎన్నికల్లో 56 మంది మహిళలే బరిలో ఉన్నారు. లెక్కలు తీస్తే, మొత్తం అభ్యర్థుల్లో స్త్రీల సంఖ్య 10 శాతమే. వెరసి, ఆడవారికి ఉచితాలిచ్చి ఓటర్లుగా వాడుకోవడమే తప్ప, చట్టసభల్లో సరైన భాగస్వామ్యం కల్పించడంలో పార్టీలకు ఆసక్తి లేదు. మహిళా రిజర్వేషన్లను పైకి ఆమోదించినా, ఆచరణలో ఇదీ దుఃస్థితి.
పార్లమెంట్‌కు అతిపెద్ద సంఖ్యలో రాజ్యసభ సభ్యుల్ని పంపే రాష్ట్రాల్లో రెండోది అయినందున మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ కీలకంగా భావిస్తోంది. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేక చట్టం చేస్తామంటూ కాషాయపార్టీ హిందూత్వ కార్డును విసురుతుంటే, ఓబీసీలు గణనీయంగా ఉన్న రాష్ట్రమైనందున కులగణన, ఉద్యోగాల రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి ఎత్తివేత లాంటి మాటలతో ఎంవీఏ సామాజిక న్యాయం నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది.
ఇక, విభజనవాద నినాదాలైన ‘బటేంగే తో కటేంగే’ (హిందువులు విడిపోతే నష్టపోతాం), ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ (కలసివుంటే భద్రంగా ఉంటాం) మధ్య రైతాంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వగైరా అసలు అంశాలు వెనక్కిపోవడమే విషాదం.
స్థూలంగా 6 జోన్లయిన మహారాష్ట్రలో ఆర్థికంగా వెనకబడ్డ విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహా రాష్ట్ర ప్రాంతానికీ – రెండు, మూడు రెట్లు తలసరి ఆదాయం ఎక్కువుండే ముంబయ్, థానే – కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలకూ మధ్య ఆలోచనలో తేడా ఉంటుంది. మొత్తం స్థానాల్లో నాలుగోవంతు పైగా సీట్లలో ఎప్పుడూ హోరాహోరీ పోరే. అలాగే, మూడోవంతు పైగా స్థానాల్లో విజేత మెజారిటీ కన్నా మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థి ఓట్ షేర్ ఎక్కువ. కాబట్టి, ఫలితాల అంచనా అంత సులభం కాదు.
రాష్ట్రాన్ని పాలించేది ఎవరన్నది ఒక్కటే కాదు... ఉద్ధవ్ ఠాక్రే, శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన అన్నదీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పునివ్వనున్నారు. వాగ్దానపర్వంలో ఏ పార్టీని ఎంత నమ్మిందీ చెప్పనున్నారు. తక్షణ ఆర్థిక సహాయం పట్ల గ్రామీణ ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ, వచ్చే ఏడేళ్ళలో రూ. 2.75 లక్షల కోట్ల అప్పు తీర్చాల్సిన రాష్ట్రంలో రేపు ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తమ హామీలను అమలు చేయగలుగుతుందా అన్నది ప్రశ్న.
ఓట్ల వేటలో వాగ్దానవర్షం
Published Thu, Nov 14 2024 3:57 AM | Last Updated on Thu, Nov 14 2024 3:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment