లాంగ్‌ లివ్‌ ద రిపబ్లిక్‌ | Sakshi Editorial On Long live the Republic by Vardhelli Murali | Sakshi
Sakshi News home page

లాంగ్‌ లివ్‌ ద రిపబ్లిక్‌

Published Sun, Jan 26 2025 1:13 AM | Last Updated on Sun, Jan 26 2025 1:13 AM

Sakshi Editorial On Long live the Republic by Vardhelli Murali

జనతంత్రం

డెబ్బయ్‌ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్‌ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్‌ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.

సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్‌ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్‌కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?

మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్‌కు చేర్చిన టీమ్‌ క్యాప్టెన్‌ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్‌ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్‌ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.

స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.

స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్‌ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్‌ అంబేడ్కర్‌ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.

ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్‌
అండ్‌ బ్యాలెన్సెస్‌లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్‌తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్‌ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.

ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్‌ స్టూవర్ట్‌ మిల్‌ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్‌ అంబేడ్కర్‌ ప్రస్తావించారు. 

ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్‌ ది స్టేట్‌’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.

ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్‌ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్‌ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.

కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.

అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.

మొత్తం జీఎస్‌టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్‌ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్‌ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.

స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ  ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.

రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్‌బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్‌బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్‌టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.

తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు గవర్నర్‌ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్‌ హార్స్‌’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్‌లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్‌ నేషన్‌ ఒన్‌ ఎలక్షన్‌’ (ఓఎన్‌ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.

ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్‌ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. 

పార్లమెంట్‌లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.

ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్‌ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. 

సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్‌ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్‌ చిరకాలం వర్ధిల్లాలి.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement