
జనతంత్రం
ఎర్ర పుస్తకం తెల్లమొహం వేసినట్లయింది. రాజ్యాంగ విధి విధానాలను కూడా ప్రైవేటీకరించబోయిన తెంపరితనానికి చెంపలు వాయించినట్లయింది. ఇష్టారీతిన పోలీసు రాజ్యాన్ని నడుపుతామంటే, పౌరహక్కుల్ని చిదిమేస్తామంటే అంగీకరించేది లేదని ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానం ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించింది.
ఇప్పుడదే హెచ్చరికను జనతా న్యాయస్థానం కూడా జారీ చేసినట్లయింది. రాష్ట్రంలో 56 మండల పరిషత్తు అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలకు, కడప జిల్లా పరిషత్తు అధ్యక్ష స్థానానికి మొన్న ఉపఎన్నికలు జరిగాయి. ఓట్లు వేసింది ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలే. వీరు క్షేత్రస్థాయి ప్రజా ప్రతినిధులు. జనం గుండె చప్పుళ్లను నిరంతరం వినగలిగేవాళ్లు. ప్రజల నాడీ స్పందనను ముందుగా పసిగట్టగలిగేవాళ్లు.
ఉపఎన్నికల్లో అధికార కూటమి పన్నిన వ్యూహం ఫలించ లేదు. విపక్షమైన వైసీపీ ఘనవిజయాన్ని నమోదు చేసింది. కడప జడ్‌పీతో సహా 40 స్థానాలను ఆ పార్టీ అవలీలగా గెలవగలిగింది. కూటమికి 10 స్థానాలు దక్కాయి. మిగిలినచోట్ల ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ టిక్కెట్‌పై గెలుపొందిన స్థానిక ప్రతినిధులు ఆ పార్టీ పక్షాన్నే నిలవడంలో వింతేముందని ఇప్పుడు కూటమి చిలుకలు పలుకుతుండవచ్చు. కానీ ఏపీలో ఈ తొమ్మిది నెలల పూర్వరంగం అర్థమైన వారికి వైసీపీ గెలుపులో వింతే కాదు, అద్భుతం కూడా కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో బలంగా వేళ్లూనుకున్న పార్టీ వైసీపీ. ఆ సంగతి కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. అందుకే కూటమి కట్టుకున్నారు. కుయుక్తులను ఆశ్రయించారు. ఎన్నికల్లో ఈ కూటమి చేసిన దుష్ప్రచారం, వెదజల్లిన విషం, పలికిన అసత్యాలు, చేసిన బూటకపు బాసలు అనే నిచ్చెనమెట్ల మీదుగా చేరుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే సంకల్పానికి అధికార కూటమి వచ్చినట్టు దాని చర్యలు నిరూపిస్తున్నాయి.
ఇటువంటి ప్రయ త్నాలు సత్ఫలితాలనివ్వవని గతంలో అనేక గుణపాఠాలు న్నాయి. అయినా అధికార మత్తులో ఉన్నప్పుడు అవి స్ఫురించక పోవచ్చు. ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు.... ... కానీ మూర్ఖుని మనసును సమాధానపరచడం మాత్రం సాధ్యంకాద’ని భర్తృహరి చెప్పిన సుభాషితం మనకు ఉండనే ఉన్నది.
ప్రభుత్వ వైఖరిని విమర్శించిన వారి మీద, ఎన్నికల హామీలను అమలు చేయలేదేమని అడిగిన వారి మీద వందలాది కేసులు నమోదయ్యాయి. టెర్రరిస్టుల మీద పెట్టాల్సిన కేసులను సోషల్ మీడియా విమర్శకుల మీద ఎందుకు పెడు తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తున్నా పోలీసు యంత్రాంగం ఖాతరు చేయడం లేదు.
రక్షక భటులే అర్ధరాత్రి పూట సివిల్ డ్రెస్సుల్లో ఇళ్లలోకి చొరబడి విమర్శకులను బరబరా లాక్కొని వెళ్తున్నారని, రాష్ట్రమంతటా తిప్పుతున్నారనీ, కుటుంబ సభ్యులకు సమా చారం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు తరచుగా వినిపి స్తున్నాయి. పోసాని కృష్ణమురళి పదేళ్ల కింద ప్రెస్‌మీట్‌లో చేసిన విమర్శలపై టెర్రరిస్టు కేసు పెట్టి జైల్లోకి నెట్టారు.
నడివీధుల్లో విపక్ష కార్యకర్తలను విచ్చుకత్తులతో నరుకుతున్న దృశ్యాల వీడియోలను చూడవలసి వచ్చింది. ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు జరిగాయి. పార్టీ ఆఫీసులను కూల్చేశారు. పంట చేల విధ్వంసం జరిగింది. పండిన తోటలను నరికేశారు. మీడియా మీద అప్రకటిత సెన్సార్‌షిప్ అమలైంది. తమకు గిట్టని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేసేలా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో వచ్చిన స్థానిక ఉపఎన్నికల సందర్భంగా కూటమి నాయకత్వం మరింత రెచ్చిపోయింది. స్థానిక ప్రతి నిధులను లొంగదీసుకోవడానికి సామ దాన భేద దండో పాయాలను ప్రయోగించారు. ప్రలోభాల ఎరలు వేశారు. కేసులు పెడతామని బెదిరించారు. ఉపాధిని దెబ్బతీస్తామని హెచ్చరించారు. పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని స్వయంగా ప్రభుత్వమే అధికార జులుమ్‌కు దిగినప్పుడు స్థానిక ప్రతినిధులను లొంగదీసుకోవడం పెద్ద విశేషమేమీ కాదు.
పైగా రాజ్యసభల్లో, శాసన మండళ్లలో అధికార హోదాలు వెలగబెట్టిన బడాబడా ఆసాములే సర్కార్ కొరడా ముందు సాగిలపడి పోయిన ఉదంతాలు కళ్లముందటే కనిపిస్తున్నాయి. స్థానిక పదవులను గెలుచుకోవడానికి అధికార పార్టీ బరి తెగించిందనీ, పలుచోట్ల ప్రతినిధులను అడ్డుకున్నారనీ, ప్రలోభపెట్టారనీ ‘సాక్షి’ మీడియానే కాదు, ‘ప్రజాశక్తి’ పత్రిక కూడా రాసింది.
ఇలా అధికార యంత్రాంగం బరితెగించి ప్రవర్తించినప్పుడు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ స్వీప్ చేయడం కష్టం కాదనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ, వైసీపీ స్థానిక ప్రతినిధులు అరుదైన ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రదర్శించారు. పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. నిర్బంధాలను ధిక్క రించి తమను నమ్మి గెలిపించిన పార్టీ పక్షానే దృఢంగా నిలబడ్డారు. తమ పదవులేమీ ప్రభావం చూపగలిగేంత పెద్దవి కాదు. అయినా సరే విశ్వసనీయతకే వారు పట్టం కట్టారు.
గోడ దూకిన బడా ఆసాములు ఈ పరిణామం తర్వాత ఎలా తలెత్తుకుంటారో చూడాలి. ‘స్టేట్ టెర్రరిజమ్’ అనదగ్గ స్థాయిలో నిర్బంధకాండను ప్రయోగించినా ఈ క్షేత్రస్థాయి ప్రతినిధులు దృఢంగా నిలవడానికి రెండు ముఖ్యమైన కారణాలు కనిపి స్తున్నాయి. మొదటిది – రెండు నెలల క్రితం పార్టీ కార్య కర్తలనుద్దేశించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం. కార్యకర్తలెవరూ అధైర్యపడవలసిన అవసరం లేదనీ, వారికి తాను అండగా నిలబడతాననీ ప్రకటించారు. జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తాడో చేసి చూపెడతానని భరోసా ఇచ్చారు.
జగన్ ప్రకటన తర్వాత గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలకు మంచి ప్రేరణ లభించిందనీ, వారు ధైర్యంగా నిలబడుతున్నారనీ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండో ప్రధాన కారణం – క్షేత్రస్థాయి వాస్తవికత. ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి చేసిన బూటకపు హామీల బండారం ప్రజ లందరికీ అర్థమైంది.
వైసీపీ సర్కార్ మీదా, జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగతంగా కూటమి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రజాశ్రేణులు ఇప్పుడు భావిస్తున్నాయి. మోసపోయామన్న భావన వారిని వెంటాడుతున్నది. ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నది. వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి భయపడటం లేదు. బహిరంగంగానే కూటమి సర్కార్‌ను విమర్శిస్తున్నారు. ఈ పరిణామం కూడా వైసీపీ కార్యకర్తలు ఎదురొడ్డి నిలబడేందుకు దోహదపడింది.
జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూటమి సర్కార్ తన ధోరణిని మార్చుకోకపోగా అదే అసత్య ప్రచారాన్ని మరింత ఎక్కువగా ఆశ్రయిస్తున్నది. తేలిపోయిన ఆరోపణల్నే మళ్లీ మళ్లీ ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అప్పుల లెక్కల్ని గుర్తు చేసుకుంటూ జనం నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
శనివారం నాడు జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అలవాటు ప్రకారం అప్పుల కథను మరోసారి వినిపించారు. ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లున్న అప్పు, గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లుగా మారి, బడ్జెట్ ప్రసంగంలో ఏడు లక్షల కోట్లుగా రూపాంతరం చెంది, ఆవిర్భావ సభలో తొమ్మిదిన్నర లక్షల కోట్లుగా పరిణామం చెందింది.
అప్పుల కథతోపాటు అసలు విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. ‘‘బయట నుండి (ప్రభుత్వంలోకి రాకముందు) చూసినప్పుడు ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయవచ్చని అనుకున్నా, ఇప్పుడు చూస్తే తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పుంది. దీనిపై వడ్డీ కట్టాలి. ఇప్పుడు సంక్షేమాన్ని అమలుచేస్తే మధ్యలోనే ఆగిపోతుంది.
కనుక ముందుగా అభివృద్ధి చేసి, వచ్చే ఆదాయంతో సంక్షేమం చేద్దా’’మని ఈ సభలో చెప్పుకొచ్చారు.ఈ తూచ్ మంత్రాన్ని ఆయన ఆవిర్భావ సభలో మాత్రమే చెప్పలేదు. ఈ వార్షిక బడ్జెట్‌లో కూడా ఆయన దీన్ని పొందు పరిచారు. కాకపోతే అంకెల్లో చెప్పడం వల్ల సరిగ్గా అర్థం కాలేదు. ‘సూపర్ సిక్స్’గా పేర్కొన్న ఆరు అంశాలను ఆయన చెప్పి నట్టుగా అమలు చేస్తే 70 వేల కోట్ల పైచిలుకు నిధులు అవసరమవుతాయని అంచనా.
అయితే బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం 17 వేల కోట్లు మాత్రమే చూపెట్టారు. కేటాయింపు చూపినంత మాత్రాన అమలు చేస్తారని అర్థం కాదు. గత బడ్జెట్‌లో కూడా ‘తల్లికి వందనం’, ‘అన్నదాతా సుఖీభవ’ పథకాలకు అరకొర కేటాయింపులు చూపెట్టారు. కానీ,అందులో అణా పైసలు కూడా ఖర్చుపెట్టలేదన్నది జనం అనుభవంలోకి వచ్చిన సత్యం.
మొన్నటి మంగళవారం జోలెతో పాడుకున్న వేలంతో కలిపి తొమ్మిదిన్నర మాసాల్లో బాబు సర్కార్ ఒక లక్షా 52 వేల కోట్ల పైచిలుకు అప్పులు చేసి జాతీయ రికార్డును నెలకొల్పింది. ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు 98,088 కోట్లయితే, ష్యూరిటీ సంతకం పెట్టి కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 23,700 కోట్లు, ఇక రాజధాని పేరుతో ఇప్పటివరకు చేసిన అప్పు 31,000 కోట్లు. వెరసి 1,52,788 కోట్లు.
ఇంతటి జగదేక అప్పారావు ప్రభుత్వం జగన్ సర్కార్‌ను అప్పులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేయబూనడాన్ని దాష్టీకం అనాలో, దగుల్బాజీతనం అనాలో తెలుసుకోవాలి. ఈ అప్పుల చిట్టా వ్యవహారం ఇక ఎంతమాత్రమూ దాచేస్తే దాగేది కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇస్తున్న సమాచారాన్ని బట్టి, కాగ్ రిపోర్టుల ఆధారంగా, బడ్జెట్ పత్రాల సాక్షిగా జనంలోకి వాస్తవాలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిందన్న ప్రచారాన్ని ఇప్పుడెవ్వరూ నమ్మడం లేదు.
జగన్ ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరిగిందనే మాట చంద్రబాబుకు ఊతపదంగా మారింది. చివరికి కలెక్టర్ల సమా వేశంలో కూడా ‘గత ప్రభుత్వం విధ్వంసం చేసింద’ని మాట్లా డారు. ఇలా కలెక్టర్ల సమావేశాన్ని రాజకీయాలకు వాడుకున్న ముఖ్యమంత్రి ఈయన తప్ప మరొకరు ఉండకపోవచ్చు. తాను చెప్పిందే వేదం, తన పచ్చ కోడి కూస్తేనే సమాచారం తెలిసేది అనే భ్రమల్లోంచి ఆయనింకా బయటపడలేదు. పదేపదే అబద్ధాన్ని వల్లెవేస్తే అది నిజమైపోతుందనే పాతకాలపు గోబెల్స్ థియరీని పట్టుకొని వేళ్లాడుతున్నారు. ఇప్పుడు విధ్వంసం గురించి ఎక్కువ మాట్లాడితే జనం రికార్డుల్ని తిరగేస్తారు.
విధ్వంసం ఎవరిదో వికాసం ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుంటారు. సమాచారం ఇప్పుడు ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. అది ప్రజల హక్కు.పౌరుల భావప్రకటనా స్వేచ్ఛపై శుక్రవారం నాడు సర్వో న్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అధికార మత్తులో జోగుతున్న మన వ్యవస్థలకు కనువిప్పు కావాలి. భావ ప్రకటనా స్వాతంత్య్రం లేనినాడు రాజ్యాంగం హామీ పడిన గౌరవ ప్రదమైన జీవన హక్కు సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది.
ఈ హక్కును రక్షించడంలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు హితవు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ అనే కాంగ్రెస్ ఎంపీ పెట్టిన పోస్టుపై గుజరాత్ పోలీసులు పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ తీర్పుపై సంపాదకీయం రాసిన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ‘కేసును కొట్టివేయడంలో ఆశ్చర్యం లేదు. అసలు సుప్రీంకోర్టు దాకా ఈ కేసు రావడమే దిగ్భ్రాంతిని కలిగిస్తు న్నద’ని వ్యాఖ్యానించింది.
ప్రతాప్‌గఢీ పెట్టిన పోస్టుకూ,ఆంధ్రాలో ప్రేమ్ కుమార్ అనే దళిత యువకుడి సోషల్ మీడియా పోస్టుకూ సారూప్యతలున్నాయి. కానీ ఆ యువకుడిని మన పోలీసు యంత్రాంగం ఎంతగా వేధించిందో తెలిసిందే. ఇప్పటి కైనా పోలీస్ యంత్రాంగం జీ హుజూర్ పద్ధతుల్ని విడిచి పెట్టక పోతే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని గ్రహిస్తే మంచిది. పోలీసు యంత్రాంగానికే కాదు... రెడ్‌బుక్ వంటి గ్రంథాల రచయితలకు కూడా సుప్రీం వ్యాఖ్యలు వాతలు పెట్టినట్టే!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com