
నాడు బరితెగింపు..నేడూ దందా కొనసాగింపు
2014–19 మధ్య యథేచ్ఛగా దోపిడీ
ఖజానాకు గండికొట్టి.. అస్మదీయులకు దోచిపెట్టి రూ.25 వేల కోట్లను మించిన అక్రమాలు
తమ పార్టీకి చెందిన, సన్నిహితుల డిస్టిలరీలకు అనుమతి
ఐదు డిస్టిలరీల నుంచే 50% పైగా మద్యం కొనుగోళ్లు
పవర్ స్టార్, లెజెండ్ అంటూ ఊరూ పేరులేని బ్రాండ్లను తెచ్చిందీ చంద్రబాబే.. దీనికితోడుగా ఊరూరా బెల్ట్ షాప్‌లతో మద్యాన్ని ఏరులై పారించారు
ఎమ్మార్పీ ఇష్టారీతిన పెంపు, సిండికేట్ దందా రూ.20 వేల కోట్లు!
చీకటి జీవోలతో ఎగవేసిన పన్ను ఏటా రూ.1,300 కోట్లకు పైనే.. గతంలోనే సీఐడీ దర్యాప్తులో పచ్చ ముఠా దందా బట్టబయలు
భారీఎత్తున అక్రమాలకు పాల్పడి.. ఇప్పుడు హడావుడి
సిట్ వేసి వీరంగం.. తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం
ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతినివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ఐదేళ్ల పాలనలో మద్యం విధానంపై వినూత్న సంస్కరణలు..
దశలవారీ మద్య నియంత్రణ విధానం పారదర్శకంగా అమలు
ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్‌కు చరమగీతం
అందుకే టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గణనీయంగా తగ్గిన అమ్మకాలు..
అమ్మకాలు తగ్గితే డిస్టిలరీలు కమీషన్లు ఇస్తాయా?
అయినా కుట్రపూరితంగా.. అక్రమ కేసు నమోదు
టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు.. అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి ప్రభుత్వం కుతంత్రాలు
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై కూటమి సర్కారు సారథి, సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే.. రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడికీ బ్రాండ్ అంబాసిడర్ ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్య విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది.
ఐదేళ్ల పాటు పాదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా.. అసలు మద్యం దందా ఘనాపాఠి చంద్రబాబే అన్నది మరుగునపరచాలన్నది పన్నాగం. కానీ, టీడీపీ మద్యం సిండికేట్ మహా దోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులు ఇచ్చి.. టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి.. ఊరూరా బెల్ట్ దుకాణాలు తెరిచి.. ఊరూపేరు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టి.. మూడు బార్లు ఆరు దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే.
ఈ క్రమంలో చీకటి జీవోలతో కనికట్టు చేశారు.. 2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేల కోట్ల పన్ను రాబడికి గండికొట్టారు. సిండికేట్ ద్వారా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధానంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్‌ను రూపుమాపింది. దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేసింది.
కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతినివ్వ లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమీషన్లు ఇస్తాయి. కానీ, తగ్గితే కమీషన్లు ఇవ్వవన్నది ఎవరైనా ఠక్కున చెప్పే వాస్తవం. కానీ, కుట్రపూరితంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కమీషన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాతిపెట్టిన ప్రైవేట్ మద్యం సిండికేట్ భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం తవ్వి తీసి ప్రజలపైకి వదిలింది. యథేచ్ఛగా దోపిడీకి బరితెగిస్తోంది. అందుకే.. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు.. చంద్రబాబు మద్యం దోపిడీ సమగ్ర కుట్రను చాటేందుకు.. మద్యం మాఫియాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసిన విధానాన్ని చెప్పేందుకు.. ప్రస్తుతం మళ్లీ పేట్రేగుతున్న మద్యం దందాను తెలియజేస్తోంది ‘సాక్షి’.
» 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా.. వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఈ విషయమై.. రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా.
» చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
5 డిస్టిలరీల నుంచే.. ముసుగులో చంద్రబాబు దందా
డిస్టిలరీలతో కుమ్మక్కయి కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015–19 మధ్య ఇలా కేవలం ఐదు డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50 శాతానికిపైగా కొనుగోళ్లు చేశారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో...
» 2017–18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో రూ.4,122.28 కోట్లు ఐదు డిస్టిలరీలలకే ఇవ్వడం గమనార్హం. పెర్ల్ డిస్టిలరీకే రూ.1,374.79 కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. పెర్నోడో రిచర్డ్ ఇండియా లిమిటెడ్‌కు రూ.548.03కోట్లు, ఎస్వీఆర్ డిస్టిలరీస్‌కు రూ.395.1 కోట్లు, అలైడ్ బ్లెండర్స్–డిస్టిలరీస్‌కు రూ.457.86కోట్లు, ఎస్వీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రూ.319.57కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు.
» 2018–19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.4,765.75 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం మూడు డిస్టిలరీలకే ఏకంగా రూ.2,244.44కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం.
» పెర్ల్ డిస్టిలరీస్‌కు అత్యధికంగా రూ.1,462.41కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. సెంటిని బయో ప్రొడక్ట్స్‌కు రూ.638.52కోట్లు, ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ రూ.143.51 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా కేవలం ఈ మూడు డిస్టిలరీల నుంచే రూ.47.09 శాతం మద్యం కొనుగోలు చేశారు.
బార్లలోనూ అదే బరితెగింపు..
చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుపై 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపారు. సెపె్టంబరు 9న వినతిపత్రం సమర్పిస్తే దానికి 9 రోజులు ముందుగానే సెపె్టంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి.
బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబరు 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబరు 3న సంతకం చేయగా సీఎం హోదాలో చంద్రబాబు 2015 డిసెంబరు 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం.
డిస్టిలరీలన్నిటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే
మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న 2019–24లో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. 2014 నవంబరులో జీవో నంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎౖక్సైజ్2) డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
కేబినెట్‌కు చెప్పకుండానే..
2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు ఎక్సైజ్ కమిషనర్ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఓ నోట్ ఫైల్‌ను పంపారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు పేర్కొనలేదు. కానీ, అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ, ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు.
ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్ ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే.. 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్‌లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు.
‘పవర్ స్టార్’, ‘లెజెండ్’లను తెచ్చింది ఎవరు?
పవర్ స్టార్, లెజెండ్.. ఇవేవో టీడీపీ కూటమిలోని నాయకుల పేర్ల ముందు ఉండే బిరుదులు కావు. మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు.. ఊరూ పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లలో కొన్ని ..
ప్రెసిడెంట్ మెడల్:
ఈ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ ఉత్పత్తులకు 2017 జూన్ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల విస్కీలకు 2018 అక్టోబరు 26న అంగీకారం తెలిపారు.
రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతిచ్చింది. బీరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 13న అప్పటి టీడీపీ ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చింది.
అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?
టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..
» మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
» మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా?
» విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా?
» మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
»దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?
» 2014 - 19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?
» మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా?
» ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా?
» ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా?
వైఎస్సార్‌సీపీ హయాంలో..
» 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది.
» లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది.
» 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది.
» మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది.
» మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది.
» మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.
లబ్ధి పొందిన చంద్రబాబు బినామీలు, సన్నిహితులు వీరు
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు తండ్రి ఈయన. టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం.
2014లో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆయన డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్ అప్పటి టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందింది.
