
ఏదేమైనా హిందీని అందరికీ నేర్పించి తీరాలన్న సంకల్పం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మహారాష్ట్రలో తాజాగా రాజుకుంటున్న వివాదాన్ని చూసైనా బీజేపీ తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు... దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలని కావొచ్చు హిందీని బలవంతంగా రుద్దే విధానాన్ని అంగీకరించబోమని ప్రకటించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దక్షిణాదిన దుమారం రేపారు. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, మరేదైనా భాష ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి చేసే నూతన విద్యావిధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో స్టాలిన్ దాన్ని తప్పుబట్టారు.
అదింకా పూర్తిగా చల్లారక మునుపే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకూ మూడో భాషగా హిందీని తప్పనిసరి చేయటమే ఆ నిర్ణయం సారాంశం. ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి భాషలు మరాఠీ, ఇంగ్లిష్ మాత్రమే. కానీ జాతీయ విద్యావిధానం చెబుతున్నట్టు ‘ఏదైనా మరో భాష’ కూడా తప్పనిసరి గనుక హిందీని ఆ రెండింటితో జత చేశామని ప్రభుత్వం అంటున్నది.
సహజంగానే మహారాష్ట్రలో ఇది వివాదాన్ని రేకెత్తించింది. ‘మేం హిందువు లమేగానీ... హిందీ అవసరం లేద’ంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) ముంబై నగరంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టింది. నిజానికి ఎంఎన్‌ఎస్ అయినా, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) అయినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా అయోమ యంలో పడ్డాయి. ఎంఎన్‌ఎస్ ఏర్పడి ఇరవయ్యేళ్లు కావొస్తున్నా ఇంతవరకూ ఆ పార్టీ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయింది.
యూబీటీగా చీలకముందు శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఏక్‌నాథ్ షిండే రూపంలో వచ్చిపడిన విపత్తుతో పార్టీ నిలువునా చీలిపోవటమే కాక, అధికారాన్ని కూడా కోల్పోయింది. జనం సానుభూతి చూపిస్తా రనుకుంటే అదీ జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిండా ఆర్నెల్లు కాలేదు. కనుక విపక్షాలు ఏం చేయటానికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర సర్కారు విపక్షాలకు ఆయుధాన్ని అందించింది.
తమిళనాడులో స్టాలిన్ హిందీ వివాదాన్ని రేకెత్తించినప్పుడు కేంద్రం తన విధానాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ఒక మాట చెప్పింది. మూడో భాషగా హిందీయే నేర్పాలని తాము పట్టుబట్టడం లేదని, దేశ భాషల్లో దేన్నయినా ఎంపిక చేసుకోవచ్చని అన్నది. కానీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇస్తున్న వివరణ చూస్తే అందుకు భిన్నంగావుంది. నూతన విద్యావిధానంలో భాగంగా స్థానిక భాష, ఇంగ్లిష్‌తోపాటు హిందీని కేంద్రం తప్పనిసరి చేసిందని, దాన్నే తాము అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ వివరణ సహజంగానే తమిళనాడులో పాలక డీఎంకేకు అందివచ్చింది. మూడో భాషగా ‘మరేదైనా’ నేర్చుకోవచ్చన్న నిబంధన ఆంతర్యమేమిటో మహా రాష్ట్ర నిర్ణయం బట్టబయలు చేసిందని ఆ పార్టీ అంటున్నది. దేశంలో హిందీని ఏదో విధంగా దొడ్డిదోవన అనుసంధాన భాషగా చేయాలన్నదే కేంద్రంలోని ఎన్డీయే పాలకుల ఉద్దేశమని విమర్శి స్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రంనుంచి ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. వాటిని ఎప్పటికప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తమిళనాడు వ్యతిరేకిస్తూనే వచ్చాయి.
తమిళనాడు మాదిరే మహారాష్ట్రలో కూడా భాషాభిమానం బాగా ఎక్కువ. దాన్ని అన్నివిధాలా ఉపయోగించుకుందామని ఠాక్రే సోదరులు భావిస్తున్నట్టు కనబడుతోంది. సొంత అన్నదమ్ములు కాకపోయినా ఇద్దరూ శివసేనలో కలిసి పనిచేసేవారు. 2005లో వారిమధ్య పొరపొచ్చాలు బయల్దే రాక పార్టీ అధినేత బాల్ ఠాక్రే ఇద్దరి మధ్యా రాజీకి ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. 2006లో రాజ్ ఠాక్రే ఎంఎన్‌ఎస్ స్థాపించారు.
మొదట్లో యూపీ, బిహార్‌లనుంచి వలస వచ్చేవారి వల్ల స్థానికుల ఉపాధి దెబ్బతింటున్నదని, వారు దాదాగిరీ చలాయిస్తున్నారని ఆరోపిస్తూ నడిపిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత దుకాణాల బోర్డులన్నీ మరాఠిలో ఉండాలంటూ సాగించిన ఉద్యమం కూడా ఆ తోవలోనే నడిచింది. ఇవిగాక మరాఠీ ఆత్మగౌరవం పేరిట చాలా ఉద్యమాలు నడిపినా రాజ్ ఠాక్రేకు కలిసిరాలేదు.
ఇప్పుడు బలవంతంగా హిందీ రుద్దుతున్నారన్న అంశంపై సాగించే ఉద్యమానికి స్పందన ఏమాత్రం వస్తుందన్నది చూడాలి. మహారాష్ట్రకు రావా ల్సిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తన్నుకుపోవటాన్ని తప్పుబడుతూ నిరుడు లోక్‌సభ ఎన్నికల సమ యంలో తాను నిలదీసినప్పుడు రాజ్ కలిసిరాలేదని, అదే జరిగుంటే ఇవాళ కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఉండేది కాదని ఉద్ధవ్ వాదన.
తమ మధ్య కేవలం చిన్న చిన్న అపోహలు మాత్రమే ఉండే వని ఉద్ధవ్ అంటుంటే... అసలు సోదరులిద్దరూ విడిపోయిందెక్కడని యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఠాక్రే సోదరుల ప్రకటనలు వారిద్దరూ మళ్లీ కలిసి పనిచేయబోతు న్నారన్న సంకేతాలిస్తున్నాయి. అది బీజేపీ మనుగడను దెబ్బతీస్తుందా లేదా అన్నది చూడాలి.
అయితే పాలకులు మేల్కొనాల్సిన సమయం వచ్చింది. 1963 నాటి అధికార భాషల చట్టం, దానికి 1967లో తీసుకొచ్చిన సవరణలు గమనించి మసులుకుంటే భాషా వివాదం తలెత్తదు. అధి కార లావాదేవీలన్నిటా ఇంగ్లిష్, హిందీ వినియోగించాలని, హిందీ మాతృభాషగా లేని రాష్ట్రాలతో ఇంగ్లిష్‌లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాలని చట్టం స్పష్టంగా చెబుతున్నప్పుడు అందరూ హిందీ నేర్చుకు తీరాలని శాసించటం సరికాదు. దేశ సమైక్యత, సమగ్రత పేరిట దాన్ని తలకెత్తుకుంటే అందుకు విరుద్ధమైన ఫలితాలొస్తాయి. మహారాష్ట్ర పరిణామాలు ఆ సంగతిని చాటుతున్నాయి.