Mother tongue
-
అన్ని భాషలు సమానం... హిందీ మరింత సమానం!
దేశంలో ఇప్పుడు హిందీ వివాదం రగులుకుంది. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ దక్షణ భారతదేశంలో హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుం బిగించారు. తమిళనాడులో పెరియార్ ఇవీ రామసామి నాయకర్ కాలం నుండే హిందీ వ్యతిరేకతకు చాలా చరిత్ర వుంది. స్టాలిన్ పిలుపు మీద దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పంది స్తాయో వేచి చూడాలి. మనకు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, రాష్ట్ర భాష తెలుగు (Telugu) అనే ఒక తప్పుడు అభిప్రాయం సామాన్యుల్లోనేగాక విద్యావంతుల్లోనూ కొనసాగుతోంది. ఏపీ తెలుగు, తెలంగాణ (Telangan) తెలుగు రెండూ వేరే భాషలు, ప్రజలు వేరే జాతులవారు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళుగా కొందరు కొనసాగిస్తు న్నారు. అది ఆ యా సమూహాల ఉనికివాద కోరికలు కావచ్చు. ఇవిగాక ఈ రెండు రాష్ట్రాల్లోనూ చెరో పాతిక భాషలు మాట్లాడే సమూహాలున్నాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో గోండి, కోయ, కొంద, కువి, కోలామీ, పెన్గొ, మంద, యానాది, లంబాడ, సవర (Savara Language) తదితర చిన్న సమూహాలు ఓ పాతిక వరకు ఉంటాయి. అధికార భాషల ప్రాబల్యంలో చిన్న సమూహాలు చితికి పోతాయి; వాళ్ళ భాషలు అంతరించిపోతాయి. భాష కూడ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లాంటిది. తనకన్నా కింద ఉన్న కుల సమూహాన్ని అణిచివేసే సమూహాన్ని అంతకన్నా పైనున్న కుల సమూహం అణిచివేస్తుంటుంది. చిన్న సమూహాలు తమ మాతృభాషను వదులుకోవాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఒక భాష అంతరించిపోవడం అంటే ఒక జాతి తన సంస్కృతీ సంప్రదాయాలనూ, తను సృష్టించినకళాసాహిత్యాలనూ కోల్పోవడమే అవుతుంది. అంటే ఆ జాతి ముందు జీవన్మృతిగా మారిపోతుంది. ఆ తరు వాత అంతరించిపోతుంది. బ్రిటిష్ ఇండియా మతప్రాతిపదిక మీద ఇండియా–పాకిస్తాన్‌గా చీలిపోయినట్టు మనకు తెలుసు. అయితే, ఒకేమత సమూహం అయినప్పటికీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదిక మీద విడిపోయిందని మనకు గుర్తు ఉండదు. మనుషులకు భాష ప్రాణమంత ముఖ్యమైనది. యూరోప్ దేశాలన్నింటిలోనూ క్రైస్తవ మతసమూహాల ఆధిక్యత ఎక్కువ. అయినప్పటికీ, అవి అన్ని దేశాలుగా విడి పోవడానికి ప్రధాన కారణం భాష. సంస్కృతాన్నిసంఘపరివారం దైవవాణిగా భావిస్తుంది. తాము నిర్మించ తలపెట్టిన ‘హిందూరాష్ట్ర’లో సంస్కృతం జాతీయ భాషగా ఉంటుందనేది ఆ సంస్థ అభిప్రాయం. అంతవరకు దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా కొనసాగించాలని వారి ఆలోచన. జాతీయ భాష మీద చర్చ రాజ్యాంగ సభలోనే జోరుగా సాగింది. మనకు అందుబాటులో ఉన్న భాషల్లో ఏదో ఒకదాన్ని జాతీయ భాషగా చేస్తే అది మిగిలిన భాషల్ని మింగేస్తుందని చాలా మంది తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలు 22 భాషలకు గుర్తింపు ఇచ్చినప్పటికీ ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని భాషలూ సమానమే. మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న భాషలే తెలుసు. బోడో, డోగ్రీ, మైథిలి, సంథాలి తదితర భాషలకు కూడ రాజ్యాంగంలో స్థానంఉందని మనం తరచూ గుర్తించం. హిందీ జాతీయ భాష కాదు; అది కేంద్ర ప్రభుత్వానికి అధికార భాష మాత్రమే. హిందీ సరసన ఇంగ్లీషును కూడ అనుసంధాన భాషగా గుర్తిస్తున్నారు. జనాభాను బట్టి లోక్‌సభ స్థానాలు నిర్ణయం అవుతాయని మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచే సమయంలోనూ జనాభా, లోక్‌సభ సీట్లు తదితర అంశాలు ప్రాతిపదికగా మారుతాయి. అదీగాక, త్వరలో లోక్‌సభ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగబోతోంది. ఉత్తరాది స్థానాలు మరింతగా పెరిగి దక్షిణాది స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు కొందరు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అంచేత ఇది భాషా సమస్య మాత్రమే కాదు; రాజకీయార్థిక సమస్య. ఎవర్ని ఎవరు పాలించాలనే ప్రాణప్రదమైన అంశం ఇందులో ఉంది. 1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన... మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది.‘యానిమల్ ఫార్మ్’ వ్యంగ్య నవలలో జార్జ్ ఆర్వెల్ ఒకచోట విరోధాభాసాలంకారం ప్రయోగిస్తాడు. ఫార్మ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న పందుల సామాజిక వర్గం ‘జంతువులన్నీ సమానం; కానీ, పందులు మరింత సమానం’ అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి విరోధాభాసాలంకారాన్ని తరచూ ప్రయోగిస్తున్నది. రాష్ట్రాలన్నీ సమానం కానీ, హిందీ బెల్టు మరింత సమానం. ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా సమానం అంటున్నది. ఇప్పుడు ‘భాషలన్నీ సమానం; కానీ, హిందీ మరింత సమానం’ అంటూ కొత్త పాట మొదలెట్టింది.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
తెలుగు మాధ్యమంలో చెప్పేదెవరు?
సాక్షి, హైదరాబాద్: మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంటోంది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు దీనిపై సూచనలు చేసింది. సాంకేతిక విద్య సహా అన్ని ఉన్నత విద్య కోర్సులకు స్థానిక భాషల్లో పుస్తకాలు అందించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్టు చెబుతోంది. అయితే రాష్ట్రంలో తెలుగు మీడియం పరిస్థితిపై రెండు నెలల క్రితం రాష్ట్ర విద్యాశాఖ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా స్కూల్ స్థాయిలో తెలుగు మీడియం పరిస్థితి అంతంత మాత్రంగానే తేలింది. తెలుగు మీడియంలో బోధించడం ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందిగానే ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంగ్లిష్ వాడుక భాషగా మారడం, కొత్తతరం ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంతో తెలుగు బోధనలోనూ ఇంగ్లిష్ పదాలు దొర్లుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యను తెలుగులో బోధించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై నిపుణులతో కమిటీ వేసే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చూపంతా ఆంగ్ల మాధ్యమం వైపే.. రాష్ట్రంలో తెలుగు మీడియం కన్నా ఇంగ్లిష్ మీడియం వైపే ప్రజలు మొగ్గుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కేవలం 0.6 శాతం మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇది 6.7 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో 41,628 ప్రభుత్వ, ప్రైవేటు బడులు ఉండగా.. వాటిలో 59 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.ప్రభుత్వ బడుల్లో ఒకటి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 22,63,491 మందికాగా.. ఇందులో 4,08,662 మంది (18 శాతం) మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో 34,92,886 మంది చదువుతుంటే... అందులో 20,057 మంది (0.57 శాతం) మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉండటం గమనార్హం. ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న 62,738 మందిలో 8,960 మంది మాత్రమే తెలుగు మీడియం వారు. ఇంగ్లిష్ ముక్కలొస్తే చాలంటూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదివించాలనే భావిస్తున్నారని విద్యాశాఖ పరిశీలనలో తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో 2023 నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా... ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇంగ్లిష్ నేర్చుకుని, మాట్లాడటం వస్తే చాలన్న భావన కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. మరోవైపు టెన్త్, ఇంటర్ తర్వాత దొరికే చిన్నా చితక ఉద్యోగాలకూ ఆంగ్ల భాష ప్రామాణికంగా మారిందని.. దీనితో ప్రైవేటు బడుల్లో ఆంగ్ల మాధ్యమం కోసం పంపుతున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లోనూ తెలుగు మీడియం కంటే ఆంగ్ల మాధ్యమంలో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాతృభాషలో విద్యా బోధన ఉండాలన్న కేంద్ర సూచనలపై పీటముడి పడుతోంది. తెలుగు మీడియంలో చేరేవారెవరు, బోధించేవారెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
రెండో గొంతు
మనదైనది ఏదో వ్యక్తం చేయడానికి మనదైన భాష ఒకటి ఉండాలనుకుంటాం. కానీ భాష చిత్రమైంది. ఒక్కోసారి అనుకున్న మాట వెంటనే తట్టదు. ఇంకో సందర్భంలో ఆ ఒక్కమాటకు పది మాటలు కనబడి గందరగోళ పరుస్తాయి. రెండు సందర్భాల్లోనూ మనిషి మూగ కావడం గమనార్హం. ఇదంతా భాష సమస్య కాదేమో; మన లోపలి భావానికి అనుగుణంగా భాష మనల్ని ఇలా ఒంటరిగా మాట తోడులేకుండా నిలబెట్టే స్థితిని కల్పిస్తుందేమో! భావం అనేది చాలా సంక్లిష్టమైంది కదా మరి! దాన్ని భాషలోకి తేవాలని అనుకున్నప్పుడు, ఎంతో తెలుసు అనుకున్నది కూడా, ఏ కొసను అందుకోవాలో తెలియక తికమక పరుస్తుంది. ఒక తేనెతుట్టె ఏదో లోపల కదిలినట్టయి గందరగోళం తలెత్తుతుంది. అనుకున్న వ్యక్తీకరణ గాడి తప్పుతుంది. భావాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష అయితే కావాలో అదే అవరోధంగా మారడం తమాషా కదా! మరి దానికేమిటి దారి? సంజ్ఞలైతే పనికిరావు. కాబట్టి మళ్లీ భాషే దిక్కు. పోనీ, ఇంకేదో భాష అయితే? అందులో మనకు అంతగా ప్రవేశం లేనిదైతే? ఒక్కోమాటా వాక్యంగా పేర్చుకునేదైతే? నిజంగా అలా రాయడం సాధ్యమా? ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న కొందరు రచయితలు ‘తమది కాని’ భాషలో సాహిత్యం సృజించారు. 1978లో బేస్‌బాల్ గేమ్ చూస్తున్నప్పుడు, ఆటగాడు బంతిని బలంగా కొట్టిన బ్యాట్ శబ్దం టోక్యో శివార్లలోని ‘జింగు’ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించిన ఒకానొక క్షణాన ఇరవైల్లో ఉన్న హరూకీ మురకామీకి ఉన్నట్టుండి తానూ రాయగలనని అనిపించింది. ఆ క్షణం ఆయనలో ఏదో ఎల్లలు లేని సృజనావేశం తన్నుకొచ్చింది. దాన్ని అలాగే పోనీయకుండా కొన్ని నెలలు శ్రమించి, రాత్రుళ్లు కుస్తీపట్టి జపనీస్ భాషలో మొదటి నవల రాయడానికి ప్రయత్నించాడు. అంతా అయ్యాక చదివితే ఆయనకే నచ్చలేదు. దీనికి కారణం – తన మాతృభాషలో ‘పశువుల కొట్టంలో పశువులు క్రిక్కిరిసినట్టుగా’ ఆలోచనలు రొద పెట్టడమే! దీనివల్ల ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు. ‘ఒకరి భావాలను అలవోకగా ఒక క్రమంలో పెట్టడం గురించి మాట్లాడటం సులభమేగానీ, అలా చేయడం అంత సులభం కాదు. బొత్తిగా అప్పుడే రాయడం మొదలుపెట్టిన నా లాంటివాడికి అది మరింత కష్టం. కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి, నేను చేయాల్సివచ్చిన మొదటి పని నా రాతప్రతుల కుప్పనూ, ఫౌంటెన్ పెన్ నూ వదిలించుకోవడం! అవి నా ముందు ఉన్నంతసేపూ నేనేదో ‘సాహిత్యం’ లాంటిదాన్ని రాస్తున్నట్టనిపించింది. వాటి స్థానంలోకి నా పాత అలవెటీ టైప్‌రైటర్‌ను అల్మారా లోంచి తెచ్చాను. తర్వాత, ఒక ప్రయోగం లాగా, నా నవల ప్రారంభాన్ని ఇంగ్లీష్‌లో రాయాలని నిర్ణయించుకున్నాను. ఎటూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదనిపించింది?’ అంటూ మురకామీ తాను తన జపనీస్‌ను కాదని ఆంగ్లంలో రాయడానికి పూనుకోవాల్సి వచ్చిన నేపథ్యం చెబుతాడు. అయితే, ఆంగ్లం ఆయనకేమీ మంచినీళ్ల ప్రాయం కాదు. ఈ భాష పరిమితి వల్ల సంక్లిష్ట వాక్యాలు రాయడం కుదరదు. ఆ ఉన్న కొద్దిపాటి పదసంపద, వ్యాకరణాలనే ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ‘మై కిచెన్ టేబుల్ ఫిక్షన్ ’ ధోరణిగా వర్ణించే ఆయన రచనలు అలా మొదలయ్యాయి. ఈ ధోరణిలో వచ్చిన ‘హియర్ ద విండ్ సింగ్’ నవలిక మురకామీని అమాంతం పైకి ఎత్తేసింది. కృత్యాదిలోనే మురకామీ అవస్థ పడ్డాడు. కానీ ఝుంపా లాహిరిది ఇంకో కథ. లండన్ లో పుట్టి, అమెరికాలో పెరిగిన భారత(బాంగ్లా) సంతతి ఝుంపా ‘ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాలడీస్’ నవలకు ‘పులిట్జర్’ గెలుచుకుంది. ‘నేమ్‌సేక్’తో మరింత పేరొచ్చింది. ఉన్నట్టుండి తన నలభై ఐదేళ్ల వయసులో ఇటాలియన్ లో రాయాలని నిర్ణయించుకుంది. కొత్త భాషలో రాయడంలో ఒక స్వేచ్ఛ ఉంది అంటారామె. ‘పర్ఫెక్టుగా ఉండనక్కరలేని స్వేచ్ఛ’. న్యూయార్క్‌లో కొన్ని ఇటాలియన్ పాఠాలు విన్న అనుభవం ఉంది. కానీ ఆ భాష కోసమే 2015లో ఆమె కుటుంబంతో సహా రోమ్కు వెళ్లి, కొన్నేళ్లు ఉండివచ్చింది. తర్వాత మూడు పుస్తకాలు ఇటాలియన్ లో వెలువరించింది. తర్వాత అవి ఆంగ్లంలోకి వచ్చాయి. సహజంగానే ఇటాలియన్ లో రాయడమేంటని చాలామందే ఆమెను ప్రశ్నించారు. ఒక్కొక్క పదం, వాక్యం ద్వారా వ్యక్తీకరణను కూడగట్టుకొని కొత్త లోకపు ద్వారంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందానంటుంది. పాత, కొత్త ప్రపంచాల మధ్య అదొక సవాలు కూడా! ‘ఇటాలియన్ భాష నా జీవితాన్నేమీ మార్చలేదు; అది నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది; మరో అదనపు జీవితం’. తన అసంబద్ధ రచన ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ద్వారా ఖ్యాతినొందిన శామ్యూల్ బెకెట్ పుట్టుకతో ఐరిష్‌వాడు అయినప్పటికీ ఫ్రెంచ్ను తన రచనాభాషగా ఎంచుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణాలు సాధారణంగా రచయితలు కోరుకునే లక్షణాలకు పూర్తి విరుద్ధమైనవి. తన మాతృభాషకు దూరం కావడం అనేది, ఒక ముసుగును చించుకోవడంతో సమానంగా చూశాడు. ఫ్రెంచ్‌లో (పరాయి భాష) మాత్రమే ఒక శైలి లేకుండా రాయడం సాధ్యమవుతుందన్నాడు. అలాగైతేనే తనకు తగిన వనరులు లేకుండా పోతాయన్నాడు. అందువల్లేనేమో, ఆయన ప్రసిద్ధ ‘మినిమలిస్ట్’ రచయిత కాగలిగాడు. వేర్వేరు కారణాల వల్ల తమ మాతృభాషలకు దూరమైన రచయితలు ఎందరో ఉన్నారు. పరిస్థితులు వారికి అలాంటి పరీక్ష పెట్టాయి. ఆ వేదన ఇక్కడ అప్రస్తుతం. కానీ భాష అనేదాన్ని ఒక అవరోధంగా పెట్టుకుని రాయాలనుకోవడం దానికదే ఒక సవాలు. ప్రాణవాయువును మరీ ఎక్కువగా పీల్చకుండా పొదుపుగా వాడుకుంటూ బతికే యోగసాధన లాంటిది అది. -
మేథ్స్‌లో మనోళ్లు తగ్గుతున్నారు
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఇటీవల కాలంలో గణితంలో గాడితప్పుతున్నట్లు జాతీయ విద్యా, పరిశోధన మండలి (ఎన్సీఈఆర్టీ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల్లో 49 శాతం మంది కనీస సామర్థ్యాలు చూపలేకపోతున్నారని సర్వే పేర్కొంది. ప్రధాన రాష్ట్రాల్లో విద్యార్థుల మాతృ భాషల అభ్యసనతోపాటు గణితం సామర్థ్యాన్ని మెరుగుపరచాలని ఎన్సీఈఆర్టీ సూచించింది. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 90 వేల మంది విద్యార్థుల సామర్థ్యాలను మదించి ఎన్సీఈఆర్టీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో తెలంగాణలో 180 స్కూళ్లకు చెందిన 1,500 మందికిపైగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించింది. బేసిక్స్ కూడా అంతంతే.. ఈ అధ్యయనం నివేదిక ప్రకారం... ప్రాథమిక విద్య చదువుతున్న వారిలో చాలా మంది బేసిక్స్‌లోనూ బాగా వెనుకబడ్డారు. టెన్త్ విద్యార్థుల్లో రెండంకెల లెక్కలకూ తడుముకొనే పరిస్థితి ఉంది. కరోనా కాలంలో విద్యార్థులు ఎల్రక్టానిక్ పరికరాలకు అతుక్కుపోవడం, స్వయం సామర్థ్యం పెంపు దెబ్బతినడానికి కారణమైంది. ఏ చిన్న లెక్కకైనా క్యాలిక్యులేటర్, ఆన్లైన్లో వెతుక్కొనే పద్ధతికి అలవాటయ్యారు. 8–10 తరగతుల విద్యార్థులు కాగితంపై లెక్కజేయడానికి అవసరమైన దానికన్నా రెండింతల సమయం తీసుకుంటున్నారు. మాతృభాషలో చదవలేని వారు 19 శాతం ఉన్నట్లు తేలింది. పట్టుమని పది పదాలు తప్పులు లేకుండా చదవగలిగిన వారు 6 శాతం, 20 పదాలు చదవిన విద్యార్థులు 13 శాతం ఉన్నారు. ఇక 70 పదాలు తప్పులు లేకుండా చదవగలిగే వాళ్లు 12 శాతమే ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మూడో తరగతి వరకూ కనీసం అంకెలు కూడా గుర్తించలేని పరిస్థితి కనిపిస్తోంది. రెండంకెల కూడికలు, తీసివేతలు కూడా చేయలేని స్థితిలో 43 శాతం మంది మూడో తరగతిలో ఉన్నారని సర్వేలో గుర్తించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎన్సీఈఆర్టీ కేంద్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రాలు ఎలాంటి చర్యలు అనుసరిస్తాయనే విషయమై స్పష్టత ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలనూ కోరింది. టీచర్ల కొరతా కారణమే ప్రభుత్వ పాఠశాలల్లో 18 సబ్జెక్టులను ఇద్దరు ఉపాధ్యాయులతో బోధిస్తున్నారు. ఉపాధ్యాయులకు బోధనకన్నా బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. పైగా ఈ పనులకే కచ్చితత్వం ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేథ్స్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు సరైన ప్రతిభ చూపే అవకాశం లేదు. దీనిపై విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. – పి.రాజాభాను చంద్రప్రకాశ్, అధ్యక్షుడు, రాష్ట్ర గెజిటెడ్ హెచ్ఎంల సంఘం -
‘లెక్క’ తప్పుతోంది!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి తర్వాత తెలంగా ణ సహా వివిధ రాష్ట్రాల్లో పాఠశాల స్థాయిలో విద్యా ర్థుల అభ్యసన దిగజారుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా గణితంలో 49 శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు కనబర్చలేకపోతు న్నారని జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సర్వేలో వెల్లడైంది. ప్రధాన రాష్ట్రాల్లో మాతృభాషలతోపాటు గణిత సామర్థ్యంపై ఈ అధ్య యనం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 10 వేల ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 90 వేల మంది విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించగా రాష్ట్రం నుంచి 180 స్కూళ్లకు చెందిన 1,500 మందికిపైగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించా రు. ఈ అధ్యయనం ప్రకారం కరోనా తర్వాత చదవ డం, రాయడం విద్యార్థుల్లో పూర్తిగా సన్నగిల్లింది. మాతృభాషలో కనీసం చదవలేని పరిస్థితి ఉన్నవాళ్లు 19 శాతంగా తేలారు. పట్టుమని పది పదాలు తప్పు లు లేకుండా చదవగలిగిన వారు 6 శాతం, 20 పదాలు చదవిన వాళ్లు 13 శాతమే ఉన్నారు. ఇక 70 పదాలు తప్పులు లేకుండా చదవగలిగే వాళ్లు 12 శాతంగా తేలారు. లెక్కల్లో బేసిక్స్ కూడా తెలియని విద్యార్థులు ఎక్కువమంది ఉన్నారు. ముఖ్యంగా మూడవ తరగతి వరకూ కనీసం అంకెలు కూడా గుర్తించలేని పరిస్థితి కనిపించింది. రెండంకెల కూడి కలు, తీసివేత లు కూడా చేయలేని స్థితిలో 43 శాతం విద్యార్థులు మూడో తరగతిలో ఉన్నట్లు సర్వే గుర్తించింది. గతేడాది రాష్ట్ర విద్యాశాఖ జరిపిన పరిశీల నలో సైతం గణితంలో సగం మందికిపైగా టెన్త్ విద్యా ర్థులు క్లిష్టమైన లెక్కలు చేయలేకపోతున్నారని వెల్లడైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంజనీ రింగ్ విద్య వరకూ వచ్చే విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించే అవకాశాలున్నాయని నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మాతృభాషలో శాస్త్ర, సాంకేతిక పదాల అర్థాలు
న్యూఢిల్లీ: ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక పదాలకు ఇకపై మాతృభాషలో సులభంగా అర్థాలు తెలుసుకోవచ్చు. జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ (సీఎస్టీటీ) దాదాపు 30 లక్షల పదాలు, వారి అర్థాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ఒక వెబ్సైట్, యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల శాస్త్ర, సాంకేతిక విద్యను మాతృభాషలు, ప్రాంతీయ భాషల్లో బోధించడం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, అనువాదకులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. శాస్త్రీయ, సాంకేతిక పదాలు, వాటి అర్థ వివరణలను గూగుల్‌లో మాతృభాషలో తెలుసుకోవచ్చు. shabd.education.gov.nic అనే వెబ్సైట్లో ఈ వివరాలు త్వరలో కనిపించనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వెబ్సైట్, యాప్ ప్రారంభం కానుంది. మెడిసిన్, లింగ్విస్టిక్స్, పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ తదితర విభాగాల పదాలు, అర్థాలు ఇందులో ఉంటాయి. విద్యను సాధ్యమైనంత మేరకు మాతృ భాషలు, స్థానిక భాషల్లో బోధించాలని జాతీయ విద్యా విధానం నిర్దేశిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ.. అన్ని స్థాయిల్లో భారతీయ భాషలను ప్రోత్సహించాలని పేర్కొంటోంది. ప్రస్తుతం 22 అధికారిక భాషల్లో పదాల అర్థాలను వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భాషల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఎస్టీటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ గిరినాథ్ ఝా చెప్పారు. పుస్తకాల ప్రచురణ కోసం సీఎస్టీటీని కేంద్రం 1961లో ఏర్పాటు చేసింది. -
Teachers Day 2022: మాతృభాషలో బోధనతో ప్రతిభకు పదును
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిలషించారు. మాతృభాషలో బోధిస్తే పిల్లల్లో సైన్స్, సాహిత్యం, సామాజిక శాస్త్రాలకు సంబంధించి నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాఠ్యాంశాలను వారు సులువుగా అర్థం చేసుకోగలుగుతారన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో పాఠశాల, ఉన్నత విద్యలో భారతీయ భాషలకు ప్రాధాన్యం లభించిందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తమ గ్రామం నుంచి కాలేజీలో చదువుకునేందుకు వెళ్లిన మొదటి బాలికగా నిలవడం వెనుక ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహమే కారణమని చెప్పారు. వారికి తానెంతో రుణపడి ఉంటానన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము 46 మంది ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు అందజేశారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. -
కెనడా పార్లమెంట్లో కన్నడలో ప్రసంగం! వైరల్
మాతృభాష కనుమరుగైపోతుంది.. మాతృభాషలో మాట్లాడాలి.. ఆంగ్లం అవసరమే కానీ మాతృభాషను విస్మరించవద్దు.. అంటూ రకరకాల స్పీచ్‌లతో హోరెత్తించడం చూశాం. కేవలం మాతృభాష దినోత్సవం రోజున మాత్రమే ఈ మాతృభాష మీద ప్రేమ ఉప్పొంగుతుందే తప్ప తర్వాత షరా మాములే. కానీ ఒక కెనడా ఎంపీ పార్లమెంట్లో తన మాతృభాష కన్నడలో ప్రసంగించి ఔరా అనిపించుకున్నాడు. అంతేకాదు మాతృభాషకు ఇవ్వాల్సిన గౌరవం ఇది అని గొంతెత్తి చెప్పాడు. వివరాల్లోకెళ్తే....కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంట్లో కన్నడలో మాట్లాడి పలువురి హృదయాలను గెలుచుకున్నారు. ఈ మేరకు ఆయన కెనడా పార్లమెంట్లో మాట్లాడుతూ...భారతదేశం వెలుపల ప్రపంచంలోని ఏ పార్లమెంట్లోనైనా కన్నడ మాట్లాడటం ఇదే మొదటిసారి. కెనడా పార్లమెంట్లో తన మాతృభాష కన్నడలో ప్రసంగించటం చాలా ఆనందంగా ఉంది. ఐదు కోట్ల మంది కన్నడిగులకు ఇది గర్వకారణం. అని చెప్పారు. అంతేకాదు కవి కువెంపు వ్రాసిన గీతాన్ని స్వరపరిచిన డాక్టర్ రాజ్‌కుమార్ పాటలోని “ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ కన్నడిగే” అంటూ ఆయన ఆ ప్రసంగాన్ని ముగించారు. చంద్ర ఆర్య కెనడా పార్లమెంట్‌కి 2015లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2019లో రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్నారయ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. I spoke in my mother tongue (first language) Kannada in Canadian parliament. This beautiful language has long history and is spoken by about 50 million people. This is the first time Kannada is spoken in any parliament in the world outside of India. pic.twitter.com/AUanNlkETT — Chandra Arya (@AryaCanada) May 19, 2022 (చదవండి: అయ్యా ఎమ్మెల్యే సారూ అదేం పని.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్) -
వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సాక్షి ఉత్తరాఖండ్(హరిద్వార్): హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్‌ను భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలోని ప్రజలు తమ ‘వలసవాద మనస్తత్వాన్ని’ విడిచిపెట్టి, తాము భారతీయులం అని గర్వపడటం నేర్చుకోవాలని కోరారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుందని ఇక లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని పూర్తిగా స్వస్తి పలకాలని పిలుపు నిచ్చారు. ‘దేశంలో విద్యా మాధ్యమంగా.. విదేశీ భాషను విధించి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేశారని ఆరోపించారు. ఆ విద్యా విధానం మనల్ని మనం తక్కువ జాతిగా చూసుకోవడం నేర్పింది. మన స్వంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరించేలా చేసింది. దేశీయంగా కూడా మన ఎదుగుదలను మందగించేలా చేసింది. ఈ విద్యా విధానానికి సంబంధించిన విద్యను కొంతమందికే పరిమితం చేసింది. దీని వల్ల అధిక జనాభా విద్యాహక్కును కోల్పోతోంది’ అని అన్నారు. మన వారసత్వం, మన సంస్కృతి, మన పూర్వీకుల గురించి మనం గర్వపడటమే కాక మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్లాలన్నారు. మనం అనేక భారతీయ భాషలను నేర్చుకోవడమే కాక మాతృభాషను ప్రేమించాలని తెలిపారు. జ్ఞాననిధి అయిన మన గ్రంధాలను తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకోవాలని చెప్పారు. అన్ని గ్యాడ్జెట్ నోటిఫికేషన్లు సంబంధిత రాష్ట్ర మాతృభాషలో విడుదలయ్యే రోజుకోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. మీ మాతృభాష మీ కంటి చూపు లాంటిదని విదేశీ భాషపై ఉన్న జ్ఞానం మీ కళ్లద్దాలు లాగా ఉండాలని అభివర్ణించారు. భారతదేశ నూతన విద్యా విధానానికి భారతీయకరణ ప్రధానమైనదని మాతృభాషల ప్రోత్సాహానికీ అధిక ప్రాధాన్యతనిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాల సిలబస్‌లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెడతామని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు విద్యను కాషాయికరణం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డాయి. దీంతో వెంక్యనాయుడు బీజేపీ అన్నదాంట్లో తప్పేముందంటూ గట్టి కౌంటరిచ్చారు. మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న తత్వాలైన సర్వే భవంతు సుఖినాః (అందరూ సంతోషంగా ఉండండి) , వసుధైవ్ కుటుంబకం (ప్రపంచం ఒకే కుటుంబం) వంటివి నేటికీ మన విదేశాంగ విధానానికి మార్గదర్శకాలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు. (చదవండి: అమిత్ షాతో భేటీ పచ్చి అబద్ధం.. బీజేపీలో చేరేదే లే!) -
సగర్వంగా మాతృభాషలో మాట్లాడండి
న్యూఢిల్లీ: ప్రజలు సగర్వంగా తమ మాతృభాషల్లోనే మాట్లాడుకోవాలని ప్రధాని మోదీ కోరారు. భాషల సంపన్నతలో మనకు సాటి మరెవరూ లేరన్నారు. ప్రజాదరణ పొందిన పలు భారతీయ గీతాలను వివిధ భాషల్లో వీడియోలుగా రూపొందించి, వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దేశ భిన్నత్వాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు. జాతీయ గీతం సహా పలు భారతీయ గీతాలకు అనుగుణంగా పెదాలు కదుపుతూ(లిప్ సింకింగ్) తయారు చేసిన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టాంజానియాకు చెందిన కవలలు కిలి పౌల్, నీమాలను ఆయన ఉదహరించారు. ఆదివారం ప్రధాని ‘మన్‌కీ బాత్’లో దేశ ప్రజలద్దేశించి మాట్లాడుతూ ఇటీవల జరుపుకున్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ పైమాటలన్నారు. దేశంలో 121 మాతృభాషలుండగా, వీటిలో 14 భాషలను కోటి మందికి పైగా ప్రజలు నిత్యం మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీకి మూడో స్థానం దక్కిందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన తర్వాత కూడా చాలా మంది దేశవాసుల్లో ఇప్పటికీ వేషభాషలు, ఆహార పానీయాలకు సంబంధించి అపోహలు, అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నూతన విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు కృషి జరుగుతోందన్నారు. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, టాంజానియా మాజీ ప్రధాని ఒడింగా కూతురు రోజ్మేరీ వంటి వారు మన ఆయుర్వేద విధానం పట్ల మక్కువ పెంచుకున్నారన్నారు. దేశంలో ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు ఆయుష్ శాఖను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ప్రధాని మోదీ.. పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించేందుకు, వివిధ రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సును పెంచినట్లు చెప్పారు. ట్రిపుల్ తలాక్ వంటి సామాజిక దురాచారాలనూ రూపుమాపాం. ట్రిపుల్ తలాక్‌పై చట్టం తీసుకువచ్చాక దేశంలో ట్రిపుల్ తలాక్ కేసుల్లో 80% తగ్గుదల కనిపించిందన్నారు. మార్పు కోరుతూ మహిళలు ముందుకు రావడమే ఈ పరిణామానికి కారణమైందన్నారు. అస్సాంలోని కోక్రాఝర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లలో పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు జరుగుతున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
మాతృభాషను వదులుకోవద్దు..
కవాడిగూడ (హైదరాబాద్): మాతృభాష సంరక్షణ కోసం నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. మాతృభాషాదినోత్సవాలు జీవనోత్సవాలు కావాలని.. తల్లి భాష కోసం, తల్లి నేల కోసం ఏ స్థానంలో ఉన్నా మాతృభాషను వదలం అని ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ స్టడీ సర్కిల్లో అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ సభను నిర్వహించారు. తెలుగు భాషా చైతన్య సమితి, తెలుగుకూటమి, తెలంగాణ రచయితల సంఘం, లక్ష్య సాధన ఫౌండేషన్, మహిళా భారతి, గోల్కొండ సాహితీ కళాసమితి, పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిదారెడ్డి మాట్లాడుతూ.. చదువు లక్ష్యం నెరవేరినప్పుడే భాష బతుకుతుందని అన్నారు. భాషను బతికించేది ప్రజలు కవులు అని పేర్కొన్నారు. మాతృభాషలో చదివిన వారికి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తెలంగాణ రచయిత సంఘం అ«ధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ భాషను పరిరక్షించడానికి మాండలిక నిఘంటువు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజిని దేవి, తెలుగు కూటమి అధ్యక్షుడు కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
మాతృ భాషలో వాదనలు తప్పు కాదు
సాక్షి, అమరావతి: హైకోర్టులో మాతృ భాషలో వాదనలు వినిపించడం కోర్టును అవమానించడం ఏ మాత్రం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తను ఇంగ్లిష్‌లో అడిగిన ప్రశ్నకు ఓ న్యాయవాది తెలుగులో సమాధానం ఇచ్చినందుకు ఆగ్రహించిన సింగిల్ జడ్జి రూ.25 వేలు ఖర్చుల కింద చెల్లించాలంటూ ఆ కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. విశాఖలో ఓ భవన నిర్మాణం అనుమతుల విషయమై అగనంపూడికి చెందిన గురు భాస్కరరావు 2019లో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. న్యాయమూర్తి పిటిషనర్ విచారణార్హతపై ఓ ప్రశ్న అడిగారు. అప్పటివరకు ఇంగ్లిష్‌లోనే వాదనలు వినిపిస్తూ వచ్చిన న్యాయవాది.. తెలుగులో స్పందిస్తూ.. ‘తమరు పేజీ నెంబర్ 18, 19 ఓసారి చూడండి’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో తెలుగులో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించడమేనంటూ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఆ పిటిషన్‌ను కొట్టేశారు. ఆ వెంటనే సదరు న్యాయవాది బేషరతు క్షమాపణలు కోరారు. తెలుగులో చెప్పిన సమాధానాన్ని పట్టించుకోవద్దంటూ.. తిరిగి ఇంగ్లిష్‌లో విన్నవించారు. అయినా న్యాయమూర్తి వినిపించుకోకుండా రూ.25 వేల జరిమానాను 4 వారాల్లో హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు. ధర్మాసనం ముందు అప్పీల్ వేసిన పిటిషనర్ జరిమానా చెల్లించాలనడంపై పిటిషనర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా, ఇటీవల ఇది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మొత్తం విషయం తెలుసుకున్న ధర్మాసనం.. ‘కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఈ అప్పీల్‌ను తేల్చాలని పిటిషనర్ కోరడం లేదు. అందువల్ల మేం కూడా ఈ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే, న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే తెలుగులో చెప్పారు. అంతే తప్ప ఆ న్యాయవాది కేసు మొత్తాన్ని తెలుగులో వాదించలేదు. హైకోర్టులో కార్యకలాపాలు జరిగే భాష ఇంగ్లిష్. అయితే మాతృభాషలో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించడం ఎంత మాత్రం కాదు. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని చెప్పారు. -
ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) రాసే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షను ఇకపై మాతృభాషలోనే రాయొచ్చు. కంప్యూటర్ ఆధారిత జేఈఈ (మెయిన్)ను వచ్చే ఏడాది నుంచి పలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎన్ఈపీ విజన్‌ను దృష్టిలో పెట్టుకొని జేఈఈ(మెయిన్) టెస్టును పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎక్కువ స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు రమేశ్ పోఖ్రియాల్ గురువారం ట్వీట్ చేశారు. జేఈఈ(మెయిన్) ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష పెట్టాలని పలు రాష్ట్రాల నుంచి చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుజరాతీ భాషలో జేఈఈ(మెయిన్) నిర్వహిస్తూ ఇతర భాషలను విస్మరించడం పట్ల గత ఏడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విద్యా శాఖ వివరణ ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం కోరడం వల్లే గుజరాతీ భాషలో పరీక్ష నిర్వహిస్తున్నామని, 2021 నుంచి 11 ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ(మెయిన్) ఉంటుందని వెల్లడించింది. జేఈఈ(మెయిన్) ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించే రాష్ట్రాల భాషను ఇందులో చేర్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ అడ్మిషన్ టెస్టు నిర్వహిస్తున్నారు. అలాంటి భాషల్లో మెయిన్ ఉంటుందని సమాచారం. -
మాతృభాష నేర్చుకుంటున్నా!
షూటింగ్స్ లేని ఈ లాక్డౌన్ వేళ తన మాతృభాష సింధీ నేర్చుకుంటున్నానని చెబుతున్నారు హీరోయిన్ తమన్నా. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే– ‘‘ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నందువల్ల తెలుగు, తమిⶠభాషలను బాగానే మాట్లాడగలుగుతున్నాను. హిందీ కూడా వచ్చు. కొన్ని కారణాల వల్ల నా మాతృభాష సింధీపై ఇప్పటివరకు సరైన పట్టు సాధించలేకపోయాను. ఈ లాక్డౌన్ సమయంలో సింధీ భాషను నేర్చుకుంటున్నాను. మా అమ్మగారితో ప్రస్తుతం ఆ భాషలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. సాంప్రదాయ వంటకాలను నేర్చుకుంటున్నాను. అలాగే మా అమ్మగారి సాయంతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన పెంచుకుంటున్నాను. వృత్తిపరంగా బిజీగా ఉండటం వల్ల నేనెక్కువగా ఇంట్లో ఉండలేదు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండటం నాకు కాస్త కొత్తగా ఉంది. మా తమ్ముడు (ఆనంద్) న్యూయార్క్‌లో ఉండిపోయాడు. తను కూడా మాతో ఉండి ఉంటే మరింత బాగుండేదనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
ఆంగ్లంపై మోజుతో మాతృభాషపై నిర్లక్ష్యం
మాదాపూర్: ఆంగ్ల భాషపై మోజుతో మాతృభాషపై ఆసక్తి చూపడం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత పదవులను అధిరోహించేందుకు ఆంగ్లంపైనే మక్కువ చూపించడం సరికాదని, మాతృభాషలో పట్టుసాధిస్తే ఏ భాషలోనైనా రాణించవచ్చని హితవు పలికారు. మాదాపూర్ సైబర్ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం విశ్వనాథ సాహిత్య పీఠం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పుస్తకాల అనువాదం ఎంతో కీలకమైందని, అనువదించేటప్పుడు భావం మారిపోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొంతమంది మహాత్ముల చరిత్రలను అన్ని భాషల్లోకి అనువాదించాలని, అప్పుడే ప్రపంచానికి వారి గొప్పతనం తెలుస్తుందని చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’నవలలో గాంధేయవాదం ఉందన్నారు. ఈ సమావేశం ముగింపు సందర్భంగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదువు, విద్య రెండు వేర్వేరు అంశాలని, పరీక్షలు, పట్టాల కోసం నేర్చుకునేది చదువని, జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు లోతుల వరకూ వెళ్లి విషయాలను అధ్యయనం చేయడం సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం విద్య అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సి.మృణాళినికి విశ్వనాథ అవార్డును ఉపరాష్ట్రపతి అందించారు. వైదేహీ శశిధర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో విశ్వనాథ సాహిత్య పీఠం చైర్మన్ డాక్టర్ వెల్చాల కొండల్రావు, శాంతా బయోటెక్నిక్స్ సంస్థ హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డిలతో పాటు పలువురు సాహిత్యకారులు పాల్గొన్నారు. -
విద్యారంగం తోడ్పాటుతోనే గ్రామీణాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: విద్యారంగం తోడ్పాటుతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుందని.. అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి సాధించినట్లవుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. మహత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ (ఎంజీఎన్సీఆర్ఈ) ఆధ్వర్యంలో నయ్ తాలిమ్ (పని విద్య)పై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెండ్రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో వెంకయ్య పాల్గొని ప్రసంగించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు ఉన్నత విద్యా సంస్థలు ఇతోధిక కృషి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. సిలబస్‌లో మార్పులు అవసరం రైతుల స్థితిగతులు, పంటలు, వాటికి లభిస్తున్న ధరలు, గ్రామీణ పరిస్థితులు, నిజ జీవితం ఏంట న్నది భవిష్యత్తు తరాలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా సిలబస్ మార్పులు చేయాలన్నారు. గ్రామీణ విద్యా వ్యవస్థ బలోపేతానికి విద్యా రంగం చర్యలు చేపట్టాలని, అప్పుడే వలసలు ఆగిపోతాయన్నారు. పట్టణీకరణ వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నీతిఆయోగ్, మీడియా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. తాను ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టానన్నారు. అందుకే గడిచిన 16 నెలల్లో యూనివర్సిటీలు, పరిశోధన, సాంకేతిక విద్యా సంస్థలు, వ్యవసాయ స్థితిగతులు, సాంస్కృతిక సంస్థలు, పారిశ్రామిక రంగాలు, ఎన్జీవోలతో తరచూ సమావేశం అవుతున్నట్లు చెప్పారు. యువతకు నైతిక విలువలు, పని విద్య, పర్యావరణ పరిరక్షణ, శానిటేషన్ అంశాలపై ప్రత్యేక అవగాహన అవసరమని విద్యా సంస్థలు ఆ దిశగా కృషి చేయాలన్నారు. మాతృభాష మరవొద్దు: భాషలెన్ని నేర్చుకున్నా మాతృభాషను మరువొద్దని వెంకయ్య అన్నారు. మాతృభాష మన కళ్లు అయితే ఇతర భాషలు కళ్ల జోడులాంటివని చెప్పారు. ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే కొనసాగేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ విద్యాభివృద్ధికి ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. గ్రామాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. రూరల్ మేనేజ్మెంట్ను తప్పనిసరి చేయాలన్నారు. సదస్సుకు దేశంలోని 102 వర్సిటీలు, 17 సెంట్రల్ వర్సిటీల విద్యావిభాగం అధిపతులు, ప్రొఫెసర్లు, వైస్ చాన్స్లర్లు హాజరయ్యారని సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంజీఎన్సీఆర్ఈ చైర్మన్ ప్రసన్నకుమార్ తెలిపారు. గ్రామీణ విద్యకు సంబంధించిన పాఠ్య పుస్తకాల రూపకల్పనకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. -
మరింత కచ్చితంగా ఫేస్బుక్ అనువాదం
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచంలోని అన్ని భాషల యూజర్లకు ఫేస్‌బుక్‌ను మరింత దగ్గర చేసేందుకుగాను సంస్థ తన భాషా అనువాద (లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్) విభాగాన్ని పటిష్ట పరిచింది. కృత్రిమ మేథస్సు సాంకేతికతను ఉపయోగించి ఇతర భాషల్లో పెట్టే ఫేస్‌బుక్‌లోని పోస్టులు, కామెంట్లను కచ్చితంగా, తక్కువ సమయంలో వారివారి మాతృభాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయగలిగే నూతన అప్డేట్ను సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఫేస్బుక్లో అందుబాటులో ఉన్న అనువాద వ్యవస్థ కొన్ని భాషల్లోని పోస్టులను మాత్రమే యూజర్లకు సులువుగా అర్థమయ్యే విధంగా ట్రాన్స్‌లేట్ చేయగలవు. అయితే ఉర్దూ, బర్మీస్ లాంటి పలు భాషలను ట్రాన్స్‌లేట్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి వాటిని అధిగమించేందుకు గాను మెషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్‌లోకి వికిపీడియా లాంటి వెబ్‌సైట్‌ల్లోని వేర్వేరు భాషల్లో ఉన్న పెద్ద పెద్ద వ్యాఖ్యాలను అప్లోడ్ చేసింది. దీంతో ఇతర భాషల్లోని పోస్టులు, కామెంట్లను యూజర్లు తమకు కావాల్సిన భాషల్లో చూసుకునేలా నూతన వ్యవస్థ ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది. -
మాతృభాషలోనే మాట్లాడాలి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడిని మాన్యుడిగా మార్చేది విశ్వవిద్యాలయమేనని తెలుగు విశ్వవిద్యాలయ చాన్స్‌లర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన తెలుగు విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవానికి ఆయన హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మాతృభాష అందరూ నేర్చుకోవాలని, మాతృభాషలోనే మాట్లాడాలని అన్నారు. విదేశీయులు మాతృభాషలోనే మాట్లాడటానికి ప్రాధాన్యత ఇస్తారని, మాతృభాషలో మాట్లాడటానికి సిగ్గు పడకూడదని తెలిపారు. తెలుగు వర్సిటీ నుంచి పట్టాలు పొందిన విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి గ్రామాలకు వెళ్లి.. అక్కడి ప్రజలకు మన సాహిత్యం, సంస్కృతి, లలిత కళలు, వారసత్వ సంపద గురించి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులందరికీ సామాజిక సేవ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. స్వచ్ఛత అభియాన్ కింద కాలనీలను దత్తత తీసు కుని పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విదేశీయుల నుంచి యోగా గురించి తెలుసుకుంటున్నామని, మన సంస్కృతి గురించి మనమే తెలుసుకుని ఆచరిస్తే మంచిదన్నారు. ఈ సందర్భంగా స్నాతకోత్సవ ముఖ్య అతిథి ఆచార్య రవ్వా శ్రీహరిని గవర్నర్ సత్కరించారు. -
మన మాతృభాషలు 19,569...!
భారత్‌లో వివిధ భాషలు, మాండలికాలు, యాసలు కలిపి మొత్తం 19,569 మాతృభాషలు మాట్లాడు తున్నారు. ప్రస్తుతం దేశ జనాభా 121 కోట్ల పైచిలుకే ఉంది. అయితే పదివేలు అంతకు మించిన సంఖ్యలో ప్రజలు మాట్లాడితేనే వాటిని భాషలుగా గుర్తిస్తున్నారు. దేశంలోని భాషలను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చిన 22 భాషలు, ఈ షెడ్యూల్లో చేర్చని 99, తదితర భాషలను రెండు భాగాలుగా వర్గీకరించారు. ఈ ›ప్రాతిపదికన ప్రస్తుతం భారత్‌లో మొత్తం 121 భాషలున్నాయని జనాభా గణన తాజా విశ్లేషణలో స్పష్టమైంది. మొత్తం జనాభాలో 96.71 శాతం మంది షెడ్యూల్లో చేర్చిన 22 భాషల్లో ఏదో ఒక భాష, 3.29 శాతం మంది మిగిలిన భాషలు మాట్లాడుతున్నారు. అనేక ఆసక్తికర అంశాలు... 2011 జనాభా లెక్కల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడుతున్న మాతృభాషలకు సంబంధించి సేకరించిన ఈ గణాంకాల్లో అనేక ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఒక కుటుంబంలో రక్తసంబంధీకులే కాకుండా సంబంధంలేని వ్యక్తులు లేదా ఈ రెండింటి మిశ్రమం కలగలిసే అవకాశం ఉన్నందున...కుటుంబంలోని ప్రతీ సభ్యుని మాతృభాష ఏమిటనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఈ నివేదిక విడుదల చేసిన భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ విభాగం పేర్కొంది. తాము రోజువారి ఉపయోగించే భాషా మాధ్యమాలు, మాతృభాషలకు సంబంధించి జనాభా గణన సందర్భంగా వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. అయితే తాము మాట్లాడే లేదా విద్యాబోధన కొనసాగిస్తున్న భాషనే మాతృభాషగా కొందరు పేర్కొన్నా వాస్తవంగా వారి భాష లేదా యాస వేరేది ఉంటోంది. జనాభా లెక్కల సేకరణ సందర్భంగా ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. 2001 జనాభా గణన సందర్భంగా ఉన్న 22 షెడ్యూల్ భాషలే 2011 లెక్కల్లోనూ కొనసాగాయి. గతంలో 100 నాన్ షెడ్యూల్ భాషలుండగా, 2011 లెక్కలకు వచ్చేసరికి సిమ్టే, పర్షియన్ మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయి వాటిని మినహాయించారు. అయితే మావో భాష మాట్లాడేవారు పదివేల కంటే పెరగడంతో ఇందులో చోటు దక్కింది. 8వ షెడ్యూల్లో చేర్చిన 22 భాషలివే... అస్సామీ, బాంగ్లా, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరి, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ,ఒడియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్ధూ, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ... భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో తొలుత 14 భాషలకు చోటు లభించింది. ఆ తర్వాత 1967లో సింధీ, 1992లో కొంకణి, మణిపూరి, నేపాలీ, 2004లో బోడో, డోగ్రీ, మైథిలీ, సంథాలీ ఈ జాబితాలోకి వచ్చి చేరాయి. -
దేశ భాషలందు చిక్కిపోతున్న తెలుగు...!
దేశంలోని అత్యధికులు సంభాషించే మాతృభాషల్లో తెలుగు మూడోస్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. తెలుగు స్థానాన్ని మరాఠి భర్తీచేసి మూడోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా గణనలో భాగంగా దేశంలోని మాతృభాషలకు సంబంధించి తాజాగా వెల్లడైన వివరాలను బట్టి ఈ అంశం వెల్లడైంది. మొత్తం జనాభాలో 96.71 శాతం మంది దేశంలో గుర్తించిన 22 భాషల్లో ఏదో ఒక భాషను తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు. మిగతా 3.29 శాతం మంది ఇతర భాషలను తమ భాషగా ఎంపికచేసుకున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 7.19 శాతం మంది (మొత్తం దేశజనాభాలో) తెలుగును తమ మాతృభాషగా ఎంచుకున్నారు. అదే 2011 లెక్కలకు వచ్చేప్పటికీ అది 6.93 శాతానికి తగ్గిపోయింది. అదేసమయంలో మరాఠి మాతృభాషగా ఎంపిక చేసుకున్న వారు 6.99 శాతం నుంచి 7.09 శాతానికి వృద్ధి చెందారు. ఈ విధంగా తెలుగును మరాఠి భాష అధిగమించింది. తెలుగు మాట్లాడేవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితం కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోనూ ఉన్నారు. హిందీ టాప్...సంస్కృతం లాస్ట్ దేశ జనాభాలో హిందీని మాతృభాషగా ఎంచుకుంటున్న వారు మాత్రం గణనీయంగా పెరిగారు. 2001 లెక్కల ప్రకారం 41.03 శాతమున్న వీరి సంఖ్య 2011 నాటికి 43.63 శాతానికి పెరిగింది. హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాషగా బాంగ్లా (బెంగాలీ) కొనసాగుతోంది. గతంలో 8.11 శాతమున్న బాంగ్లా మాట్లాడే వారి సంఖ్య తాజా లెక్కల్లో 8.3 శాతానికి పెరిగింది. దేశంలో గుర్తించిన (రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చిన) 22 భాషల్లో సంస్కృతం మాత్రం ఈ విషయంలో చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బోడో, మణిపురి, కోంకణి, డోగ్రీ భాషలు మాట్లాడే వారి కంటే కూడా ఈ భాషను తక్కువమంది మాట్లాడుతున్నారు. కేవలం 24,821 మంది మాత్రమే సంస్కృతాన్ని తమ మాతృభాషగా పేర్కొన్నారు. రెండున్నరలక్షల మందికి ఇంగ్లిష్... మన దేశంలో మాతృభాషగా గుర్తించని ఇంగ్లిష్‌ను (షెడ్యూల్డ్ లాంగ్వేజేస్‌లో చేర్చని) మాత్రం 2.6 లక్షల మంది తాము మొదట మాట్లాడే భాష(ఫస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్)గా పేర్కొనడం విశేషం. ఇంగ్లిష్ మాతృభాషగా ఉన్నవారు లక్ష మందికి పైగా మహారాష్ట్రలో నివసిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక నిలుస్తున్నాయి. మనదేశంలో గుర్తింపు పొందని భాషల్లో రాజస్థాన్‌లోని కోటి మందికి పైగా భిలి / భిలోడి భాష మాట్లాడుతున్నారు. గోండీ భాషను 29 లక్షల మంది సంభాషిస్తున్నట్టు 2011 జనాభా గణన సమాచారాన్ని బట్టి వెల్లడైంది. గతంలోని జనాభా లెక్కల ప్రకారం ఆరోస్థానంలో ఉన్న ఉర్థూ కాస్తా ప్రస్తుతం ఏడోస్థానానికి పడిపోయింది. మొత్తం 4.74 శాతం మాట్లాడేవారితో గుజరాతీ భాష ఆరోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే... భాష మాతృభాష మాట్లాడేవారు మొత్తం జనాభాలో శాతం హిందీ 52,83,47,193 43.63 బాంగ్లా 09,72,37,669 08.30 మరాఠి 08,30,26,680 07.09 తెలుగు 08,11,27,740 06.93 తమిళం 06,90,26,881 05.89 -
మాతృభాష.. ఘోష !
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెబుతారు. మాతృభాషపై మమకారం రోజురోజుకు తగ్గిపోతోం ది. తెలుగుభాష మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అందరూ ఆంగ్లం వైపే పరుగులు పెడుతున్నారు. అమ్మ భాషకన్నా పరాయిభాషపైనే ప్రేమ పెంచుకుంటున్నారు. కాన్వెంట్ చదువుపై మనసు పెడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో తెలుగు భా ష మనుగడ ప్రశ్నార్థకంలో పడిపోయే సూచనలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో దేశంలో రెండో అతిపెద్ద భాషగా విరాజిల్లిన తెలుగు ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. మాతృభాషా పరి రక్షణకు చట్టం తెచ్చి దాన్ని ఆచరణలో పెడితేనే తెలు గుభాష ప్రాభవాన్ని కాపాడిన వారమవుతాం. కెరమెరి : తెలుగు మాధ్యమం ప్రాభవం నానాటికీ తగ్గిపోతోంది. పాఠశాల విద్యకు ప్రభుత్వం ప్రతి ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఉచితంగా చదువులు చెప్పడంతో పాటు అవసరమైన పుస్తకాలు ఇతర సామగ్రిని ఇవ్వడం, మధ్యాహ్న భోజనం అందించడం తదితర కార్యక్రమాలతో పాఠశాల విద్య పటిష్టానికి కృషి చేస్తుంది. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులున్నారు. మండలంలో 75 ప్రాథమిక పాఠశాలలు, 4 ప్రాథమికోన్నత పాఠశాలలు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు 6తో కలిపి మొత్తం 91 పాఠశాలలున్నాయి. ఇందులో 6150 మంది విద్యార్థులున్నారు. చాలామంది విద్యార్థులు సంవత్సరం మధ్యలోనే చదువు మానేస్తుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మరోవైపు వీధికొక్కటి చొప్పున పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు పాఠశాలలు కొత్త ఎత్తులతో విద్యార్థులను ఆకర్శిస్తున్నాయి. కొన్ని మినహా చాలా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఉత్తీర్ణతలో వెనుక బడుతున్నాయి. దీంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల తల్లితండ్రులు సైతం ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో మాతృభాషా తెలుగు మనుగడ ప్రమాదకర పరిస్థితిలో పడుతోంది. ప్రైవేటుకు ధీటుగా తయారు చేయాలి. తెలుగుమాధ్యమంలో చదివితేనే.. ప్రభుత్వం తెలుగు మాధ్యమంలో చదువుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులనే నిబంధన తీసుకురావాలి. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో చదువుతూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో మార్పు తీసుకురావాలి. అప్పుడే మాతృభాషపై మమకారం పెరుగుతుంది. ఉపాధి కోసమైనా తెలుగు మాధ్యమంలో చేరే అవకాశముంటుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నర్సరీ తరగతులు ప్రారంభించాలి ప్రభుత్వం పాఠశాలల్లో నర్సరీ తరగతులను ప్రవేశ పెడితే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను సునాయాసంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే ముందు నుంచే కసరత్తును ప్రారంభించాల్సి ఉంది. తెలుగు మాధ్యమంలోనే విద్యాబో ధన సాగించాలనే నిబంధన పెట్టాలి. ఆంగ్ల మాధ్యమం పై ఉన్న ఆసక్తిని తగ్గించాలి. తెలుగులోనే విరివిగా అవకాశాలు కల్పించే విధంగా చట్టాలు రూపొందించాలి. చైతన్యం పెరగాలి.. బడులు బాగా పని చేయాలంటే త ల్లి తండ్రుల్లో చైతన్యం పెరగాలి.విద్యార్థుల ప్రగతి, చదువు విధానం ఎప్పటి కప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉన్నప్పడు ఉపాధ్యాయునిపై బాధ్యత పెరుగుతుంది. కాని పోషకులు మాత్రం ఎక్కడా సహకరించడం లేదు. క నీసం సమావేశాలకు పిలిస్తే కూడా రావడం లేదు. – ఎం శ్రీనివాస్, డీటీఎఫ్, మండల ప్రధాన కార్యదర్శి కెరమెరి -
మాతృభాషతోనే సృజనాత్మకత
‘సాక్షి’తో ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ - ఆంగ్లం కంటే మాతృభాష మరింత ఎక్కువ అవసరం - నేను హైస్కూల్ వరకు కన్నడ మాధ్యమంలోనే చదువుకున్నా.. - ఒక డాలర్ ఖర్చుతో చేసే పరికరాన్ని అర డాలర్‌తో చేసేవాడే ‘ఇంజనీర్’ మల్లు విశ్వనాథరెడ్డి (సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో) కర్ణాటకలోని హసన్‌లో పుట్టిపెరిగిన ఎ.ఎస్.కిరణ్‌కుమార్ అంతరిక్ష శాస్త్రవేత్త (స్పేస్ సైంటిస్ట్)గా దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తి స్తున్న ఆయన ప్రాథమిక, మాధ్యమిక విద్య ను మాతృభాష కన్నడంలోనే చదివారు. 4 దశాబ్దాల ‘ఇస్రో’ ప్రయాణంలో ఎన్నో మై లురాళ్లను దాటారు. మార్స్ మిషన్ మొద లు చంద్రయాన్ వరకు ఇస్రో మైలు రాళ్లలో భాగస్వామ్యం గణనీయమైనదే. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసు కెళ్లిన పీఎస్ఎల్వీ–సీ37 విజయంతో దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా ఆకాశమంత ఎత్తులో నిలిపిన ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్ కుమార్ శనివారం విజ్ఞాన్ వర్సిటీ స్నాతకో త్సవంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చా రు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు... సాక్షి: అంతరిక్ష శాస్త్రవేత్తగా మారడానికి విద్యార్థి దశలో మీకు స్ఫూర్తినిచ్చిన సంఘటనలు ఉన్నాయా? ఎ.ఎస్.కె.: ఆకాశం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. నక్షత్రాలు, వాటి తీరును చూస్తూ ఏదో తెలియని అనుభూతిని పొందే వాడిని. అంతరిక్షంపై చిన్నప్పటి నుంచే అంతులేని ఆసక్తి కలిగిం ది. ఏడో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి స్కూల్లో ‘వ్యూ మాస్టర్’ చూశాను. వస్తువులను ‘త్రీ డైమెన్షన్’లో చూపించడానికి దాన్ని వాడతాం. అది నాలో ఎంతో ఉత్సుకతను రేపింది. చిన్నప్పుడు మేం ఒక పెంకుటింట్లో ఉండేవాళ్లం. ఇంటి పై కప్పునకు ఒక రంధ్రం ఉండేది. సూర్యకిరణాలు అందులో నుంచి ఇంట్లోకి పడేవి. తలుపులన్నీ మూసి ఇంట్లో చీకటి చేసేవాడిని. అప్పుడు చూస్తే ఓవర్‌హెడ్ ప్రొజెక్షన్ లాగా ఉండేది. అది కూడా బాల్యంలో చిత్రంగా అనిపించేది. అంతరిక్షంపై ఆసక్తిని మరింత పెంచింది. మీరు మాతృభాషలో చదువుకున్నారా? హైస్కూల్ వరకు మాతృభాష కన్నడంలోనే చదువుకు న్నాను. తర్వాత ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనసాగింది. బెం గళూరు నేషనల్ కాలేజీ నుంచి డిగ్రీ ఫిజిక్స్(ఆనర్స్) చదివాను. ఎలక్ట్రానిక్స్‌లో పీజీ పూర్తిచేశా. ఐఐఎస్సీ నుంచి ఎంటెక్ చేశాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలన్నీ ఇంగ్లిష్ మీడియంలోకి మారిపోతున్నాయి. దీనిపై మీరేమంటారు? ఆలోచనల్లో సృజనాత్మకత, స్వేచ్ఛను మాతృభాష ఇస్తుంది. మరో భాషలో చదివితే ఈ అవకాశం ఉండదు. మాతృ భాషను నిర్లక్ష్యం చేయడం విషాదం. ఇంగ్లిష్ కూడా అవసరమే. కానీ, మాతృభాష అంతకు మించి అవసరం. మాతృభాషను నిర్లక్ష్యం చేయొద్దు. రెండింటి మధ్య సమతుల్యం అవసరం. 1963లో ఇస్రో ప్రయోగించిన రాకెట్‌ను సైకిల్‌పై తీసుకెళుతున్న ఫోటో ఒకటి ఇప్పటికీ పత్రికల్లో వస్తోంది. ఆ దశ నుంచి 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించే దశకు ఇస్రో చేరింది. ఈ అద్భుత విజయాలను ఎలా చూడాలి? భారతదేశం అట్టడుగుస్థాయి నుంచి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించి ప్రపంచానికి చూపించింది. తొలి లాంచింగ్ వెహికల్ అసెంబ్లింగ్ ఒక చర్చిలో జరిగింది. తొలి ఉపగ్రహం తయారీ బెంగళూరులోని ఇండస్ట్రియల్ షెడ్లో జరిగింది. వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ సామర్థ్యాన్ని, మేధోసంపత్తిని పెంచుకుంటూ పోయారు. అద్భుత విజయాలు సాధించారు. తదేక దీక్షతో ప్రయాణం కొనసాగిస్తే లక్ష్యం చేరువవుతుంది. సరికొత్త రంగాల్లో విభిన్న అవకాశాలు అందివస్తాయి. ఇస్రో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? తొలి రోజుల్లో అంతరిక్ష రంగానికి సంబంధించిన పరిజ్ఞానం మన దేశానికి పరిమితంగానే ఉండేది. ఏది ఎలా పూర్తి చేయాలో తెలిసేది కాదు. వనరులూ పరిమితమే. విదేశాల నుంచి పరి జ్ఞానాన్ని తెచ్చుకొనే(కొనుక్కొనే) అవకాశం లేకపోడమే వరంగా మారింది. స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోగలిగాం. ఇస్రో ప్రస్తుతం ఎలాంటి నూతన పరిజ్ఞానం సాధించే దిశగా అడుగులు వేస్తోంది? పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, క్రయోజనిక్ ఇంజన్.. ఇప్పటికే సాధిం చాం. ఇందులోనే మరింత ఉత్తమ పరిజ్ఞానాన్ని సంపాదించే దిశ గా ప్రయత్నాలు సాగిస్తున్నాం. లాంచింగ్ వెహికల్‌ను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ‘రీయూజబుల్’ లాంచింగ్ వెహికల్‌ను వినియోగించడానికి రంగం సిద్ధమవుతోంది. వాతావరణంలో సహజంగా ఉండే ఆక్సిజన్‌ను ఇంధనంగా వాడుకొనే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్(విద్యుత్ చోదక శక్తి)ని ఉపగ్రహాల్లో ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాం. కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి ఉపగ్రహాలు రూపొందిస్తున్నాం. ఇస్రో చైర్మన్‌గా వచ్చే రెండేళ్లలో మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాలేమిటి? 1.ఇస్రో పనితీరులో వేగాన్ని సుస్థిరం చేసుకోవడం. వేగాన్ని పెంచుతూ మరిన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పం పించడం. దీనికి పారిశ్రామిక రంగం సహాయాన్ని తీసుకోవడం. 2. దేశంలో పలు రంగాల్లో సామర్థ్యాల పెంపునకు అంతరిక్ష పరి జ్ఞానాన్ని మరింత మెరుగ్గా ఉపయోగించడానికి అనుకూలమైన అప్లికేషన్లు రూపొందించడం. 3. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలు చూపించి ‘ఇస్రో’కు ‘గ్లోబల్ స్పేస్మార్క్’ సృష్టించడం. మార్స్ మిషన్, చంద్రయాన్ ప్రాజెక్టుల బడ్జెట్ కంటే హాలీవుడ్ భారీ సినిమాల బడ్జెట్ ఎక్కువని చలోక్తులు వినిపిస్తు న్నాయి. అంతరిక్ష పరిజ్ఞానాన్ని సామాన్యుడికి చేరువ చేసే దిశగా దీన్ని చూడొచ్చా? పరిమిత వనరులతోనే లక్ష్యాన్ని చేరుకోవడం ఇస్రో తొలి అడుగుల్లోనే నేర్చుకుంది. దేశంలో కమ్యూనికేషన్ విప్లవానికి ఇస్రో వాస్తవరూపం ఇచ్చింది. తుపానుల గమనాన్ని ముందుగా గుర్తించడం, దేశం మొత్తాన్ని అనుసంధానం చేయడం.. సుసాధ్యం చేసింది. త్వరలో ‘నావిగేషన్ శాటిలైట్’ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది. అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికే కాకుండా అంతరిక్ష శాస్త్రంలో పరిశోధనలకూ ఇస్రో పెద్దపీట వేస్తోంది. ఇస్రో సాధిస్తున్న విజయాలు ప్రజలు, రైతులకు ఎలా ఉపయోగపడతాయి? 11 రకాల పంటల దిగుబడి అంచనాలను పంట కోయకముందే చెబుతున్నాం. కరువునూ అంచనా వేయగలుగుతున్నాం. ‘సాయిల్ హెల్త్’ను అంచనా వేసి, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపకల్పనకు ఇస్రో ఇస్తున్న డేటా ఉపయోగప డుతుంది. ఇస్రో రూపొందించిన జియో ఫ్లాట్‌ఫాం ‘భువన్’ అందిస్తున్న సమాచారం ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఏపీ, తెలంగాణలో వేల సంఖ్యలో ఇంజనీర్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు రావడం లేదు ‘ఇంజనీర్’కు ఉండాల్సిన నైపుణ్యాలు ఏమిటి? ఒక డాలర్ ఖర్చుతో చేయగలిగిన పరికరాన్ని రెండు డాలర్లు ఖర్చు చేస్తే మూర్ఖుడు కూడా తయారు చేయగలడు. అర డాలర్‌తోనే పని పూర్తి చేసేవాడే ‘ఇంజనీర్’. ఇంజినీర్లకు వినూత్నంగా ఆలోచించే శక్తి ఉండాలి. ఆలోచనల్లో నవ్యత ఉండాలి. లోతైన విషయ పరిజ్ఞానం ఉండాలి. క్లిష్టమైన సవాళ్లను అధిగమించడానికి సులవైన మార్గాలను సూచించే సామర్థ్యం ఉండాలి. -
అమ్మా! కథ చెబుతావా?
ఇంట్రెస్టింగ్ మదర్‌టంగ్‌ను పిల్లలు నేర్చుకునేది పుట్టిన తర్వాత కాదు, తల్లి కడుపులో ఉన్నప్పుడే. వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మనం ఆడియో టేప్ వింటూ ఆనందించినట్లే కడుపులో ఉండే బిడ్డ కూడా తల్లి మాటలను వింటూ ఆనందిస్తుంటుంది. తల్లితో మాట్లాడే వాళ్ల గొంతులను కూడా గుర్తు పడుతుంది. ఆ కొత్త గొంతులు తల్లితో మాట్లాడుతున్నాయనీ తెలుసుకుంటుంది. తల్లి మాటలు ఏ భాషలో సాగుతుంటే... కడుపులో బిడ్డ ఆ భాషతో కనెక్ట్ అవుతుంది. కడుపులో అభివృద్ధి చెందుతున్న పిండం తల్లి అవసరాలను తెలుసుకుంటుంది, ఆందోళనలనూ గ్రహిస్తుంది. తల్లి కథల పుస్తకం తీసుకుని పెద్దగా చదివి వినిపిస్తే కడుపులో నుంచే కథలు వింటూ ఆనందంగా కదులుతుంది. ఒక అధ్యయనంలో ప్రసవానికి ఆరు వారాల ముందు అంటే దాదాపుగా ఎనిమిదవ నెల రెండు వారాలు నిండిన తర్వాత రోజుకు రెండు సార్లు కథ చదివి వినిపించారు కొందరు తల్లులు. ఆ పాపాయిలు పుట్టిన మూడు రోజుల నుంచే ఆ కథలను టేప్రికార్డర్లో వింటూ మళ్లీ మళ్లీ వినాలని తహతహలాడారు. కథ ఆగితే పాలు తాగడం ఆపి మరీ చెవులు రిక్కించారట ఆ బుజ్జాయిలు. ప్రముఖ గిటారిస్టు మిఖాయిల్ ఈ సంగతిని నిర్ధారించారు కూడా. తన కొడుకు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తన గిటార్‌కు కనెక్టయ్యాడని, పుట్టిన నెలలోనే గిటార్ శబ్దం వినిపిస్తే బాగా పరిచయం ఉన్నట్లు ముఖం పెట్టి, చెవి రిక్కించేవాడని చెప్పాడు. -
మాతృభాషకు మరణ శాసనం
రెండో మాట అసలు విషయం–తెలుగు భాషకు ఎట్టకేలకు విశిష్ట భాషా ప్రతిపత్తి దక్కిందని పరమానంద భరితులమవుతున్న సందర్భంలో, మద్రాసు హైకోర్టులో ఒక తమిళుడు మన భాషా ప్రతిపత్తికి అడ్డుతగలడానికి ప్రయత్నించి విఫలమైనందుకు సంతోషిస్తున్న సమయంలో కూడా మనం విశ్రమించలేక పోతున్నాం. ఎందుకంటే, ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణల కత్తుల బోనులో ‘ప్రభుత్వం’ అనే శక్తి చిక్కుబడిపోయింది. మాతృభాషను పెంచుకోవాలి, అన్యభాషల్ని గౌరవించాలి. ‘ప్రపంచ భాషల పాలపుంతలో ప్రతి అక్షరమూ, ప్రతి పదమూ ఒక నక్షత్రమే. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతరించిపోతున్న వందలాది భాషల సంరక్షణ, ఉద్ధరణ ఉమ్మడి బాధ్యతగా అందరూ భావించవలసిన తరుణం వచ్చింది.’ – ఐక్య రాజ్యసమితి విద్యా సాంస్కృతిక మండలి ఆదేశం ప్రభుత్వ మునిసిపల్ పాఠశాలలన్నింటిలోనూ తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నం. 14 ఉత్తర్వును జారీ చేసింది. ఒక్క 2016–17 విద్యా సంవత్సరంలో పదవ తరగతికి మాత్రం ఈ జీవో వర్తించదు. చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్టు, ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమానికి చీడపీడలు పట్టించడానికి రెండు తెలుగు రాష్ట్రాల పాలకులూ కారకులు కావడమే విషాదం. మన మాతృభాషతో ఉన్న మాధ్యమాన్ని నవనవంగా పెంచుకుంటూ, వాక్కును నిత్య వాడకంలో సునిశితం చేసుకుంటూ తెలుగును అభివృద్ధి చేసి, పరిరక్షించవలసిన వాస్త వాన్ని వారు నిర్దాక్షిణ్యంగా నిరాకరిస్తున్నారు. ప్రపంచీకరణ మత్తు ఐక్య రాజ్యసమితి సకాలంలో చేసిన హెచ్చరికలను కొందరు పాలకులు పట్టిం చుకోకపోవడానికి కారణం ఉంది. మార్కెట్ దోపిడీ ఆర్థిక వ్యవస్థకు ఆంగ్లో– అమెరికన్ సామ్రాజ్య పెట్టుబడి వ్యవస్థలు తెర తీసి, వర్ధమాన దేశాలను ప్రపంచీకరణ మత్తులోకి దించడంతో పలు సమూహాల మాతృభాషల మీద ఇంగ్లిష్ పెత్తనం తీవ్రమైంది. వేల ఏళ్లుగా ఉనికిలో ఉన్న స్థానిక భాషల మనుగడ ప్రశ్నార్థకం కావడం దాని ఫలితమే. విస్తృత ప్రపంచీకరణ నేప థ్యంలో ఆంగ్ల మాధ్యమం ఎంత వి«ధ్వంసానికి కారణమవుతున్నదో ప్రపంచ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే, విశ్లేషణల వల్ల సులభంగానే అవగతమవు తోంది. వివిధ దేశాలకు చెందిన 600 మాతృభాషల వృద్ధిక్షయాల గురించి చేసిన విస్తృత అధ్యయనమది. మాతృభాషకు ఆఫ్రికా ఖండమే జన్మనిచ్చిం దని కూడా వారు నిర్ధారించారు. ఆ ఖండంలో రాతియుగం నాటి ప్రజలు వాడిన మాండలీకం కూడా అదేనని కనుగొన్నారు. ఆ భాషకు కనీసం లక్ష ఏళ్ల క్రితం లిపి ఏర్పడి ఉంటుందని మొదట భావించినా, నిజానికి అది మరింత పురాతనమైనదేనని తేల్చారు. అయితే భాషలు దేనికవే వివిధ ఖండాలలో స్వతంత్రంగా కూడా స్థిరపడ్డాయి. 70 వేల సంవత్సరాల నాడే ఆఫ్రికా ఖండం నుంచి మిగిలిన భూభాగాలకు వలసలు జరిగాయనీ, అయితే అన్ని ప్రపంచ భాషలూ ఏకైక పురాతన భాష నుంచి జాలువారినవేనని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంతోనే దేశీయ భాషల మనుగడను ఆంగ్లం హరించివేయడాన్ని ఎవరూ సమ్మతించలేకపోతున్నారు. ఇప్పుడు జనాభా రీత్యా చైనా ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం. అయినా పురాతన చరిత్ర కలిగిన పలు భాషలకు మంగళం పాడిన ఆంగ్లం సహా, ఇతర దేశీయ భాషల మీద చైనీస్ (మండారిన్) ఆధిపత్యం చలాయిం చజాలదు. కానీ ఇంగ్లిష్ మాదిరిగానే వ్యాపార, వలస భాష కాగలదు. ఈ తెలివిడితోనే అమెరికా, బ్రిటన్, జర్మనీలు చైనీస్‌ను శరవేగంగా నేర్పడానికి ఐదేసి వందల పాఠశాలలను ప్రారంభించిన సంగతిని విస్మరించరాదు. ఏ దేశమైనా ఆర్థికంగా బలోపేతమై దూసుకువచ్చినా, ఆ దేశ భాష మన దేశీయ మాతృభాషల స్థానాన్ని తొలగించి నిలబడలేదు. కాగా ఈ చారిత్రక సత్యాన్ని దేశీయ భాషలు మాట్లాడే ప్రాంతాలు త్వరగా గుర్తిస్తే మంచిది. పూర్తిగా పరాయి భాషను నెత్తిన పెట్టుకుని మాతృభాష మూలాలకు ఏ రీతిలో చేటు చేస్తున్నామో అప్పుడే అర్థమవుతుంది. ఆ మూలాలకు చేటు కలగని వ్యూహ రచనలో మాతృ ప్రతిపత్తిపైన సాధికారతను పునఃప్రతిష్టించుకోవాలి. అంతా ఇంగ్లిష్‌లోనే ఉందట మార్కెట్ లేదా సంత రాజకీయాలతో తమ ఆర్థిక గుత్తాధిపత్యాన్ని విస్తరిం చుకోవడానికి ఆంగ్లో–అమెరికన్లు ప్రపంచీకరణ ద్వారా వర్ధమాన దేశాల గ్రామసీమలను తమ సరుకులతో నింపడానికి ఇంగ్లిష్ మాధ్యమం ద్వారానే ‘వల’పన్నవలసి ఉంటుంది. మన చేతలను కట్టడి చేసి, మన బుద్ధులను శాసిస్తూ, మన దుస్తులను మార్చేసే సూత్రం మెకాలే విద్యా విధానం ద్వారా తెల్లవాడు ప్రవేశపెట్టాడు. అందుకే, ‘మన దుస్తులకూ, మన అలవాట్లకూ, మన తిండికీ అలవాటు పడిన భారతీయుడు మనకు శాశ్వతంగా లొంగి ఉంటాడు’ అంటూ మెకాలే ప్రకటించగలిగాడు. ఇంగ్లిష్ మాధ్యమాన్ని ఇప్పుడు మళ్లీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో కూడా ప్రవేశపెట్టడా నికి చెబుతున్న కారణం కూడా చిత్రంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ నిర్ణయం కొద్దిమంది విద్యార్థుల కోసమే గానీ, అసంఖ్యాక గ్రామీణ, పట్టణ ప్రాంత పేద విద్యార్థుల అభివృద్ధి కోసం కాదు. ‘విద్యార్థులు, ఉపాధ్యా యులు, సాధారణ ప్రజానీకం యావత్తూ ఆంగ్ల మాధ్యమాన్నే ఉత్సాహంగా సమర్థిస్తున్నారు. అన్ని మునిసిపల్ పాఠశాలల్లోను విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సును విధిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని తల్లితండ్రులు, ఉపా ధ్యాయులు కోరుకోవడం వల్ల ఆ మాధ్యమాన్ని ప్రవేశపెట్ట వలసి వచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దిద్దడంలో ఆంగ్ల బోధనా మాధ్యమం అత్యంత కీలక పాత్ర వహిస్తుంద’ని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా జీవో (ఎంఎస్ నం.14)లో నిస్సిగ్గుగా ప్రకటించారు. మాతృభాషా రక్షణ ధ్యేయంతో అంతకు ముందు తీసుకువచ్చిన జీవో 86 దీనితో అటకె క్కింది. ఈ అనాలోచిత నిర్ణయం వెనుక చంద్రబాబుతో పాటు అసంఖ్యాక విద్యా సంస్థల సూత్రధారి కూడా ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. గతంలో ప్రాథమిక విద్య అన్ని దశలలోను, ప్రభుత్వ సంస్థలపైన త్రిభాషా సూత్రం మేరకే నామఫలకాలన్నీ (మొదట మాతృభాష, తరువాత హిందీ, ఆంగ్లం) ఉండేవి. ఇక ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలలోను విద్య, భాష లకు సంబంధించి సరైన విధానం లేదని స్పష్టమవుతోంది. అసలు తెలుగు మాధ్యమంలో చదివేవారికి ఇంగ్లిష్ రాదని అనుకోవడం తెలివి తక్కువతనం. మాతరమంతా ఆంగ్లాంధ్రాలు రెండూ వచ్చినవారే. వీరిలో బహు భాషా వేత్తలు కూడా ఉన్నారు. ఇప్పుడు మాత్రం పోటీ పరీక్షలకు తయారుచేసే మిడిమిడి భట్టీయ జ్ఞానంతోనే తృప్తిపడుతున్నారు. ఇప్పుడు పోటీ పరీక్షలకు విద్యార్థుల్ని ‘రాపిడి’ పెట్టే లక్ష్యంతో తెలుగు మీడియంకే ఎసరు పెడు తున్నారు. తెలుగు మీడియం రద్దు నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలూ, మేధావులూ వ్యతిరేకించడం అందుకే. ఈ దేశంలో పార్లమెంటు తోగానీ, ఉన్నతాధికార గణాలతోగానీ, సంబంధిత సంస్థాగత నిపుణులతో గానీ నిమిత్తం లేకుండా నియంతలాగా సొంత నిర్ణయాలు తీసుకుని ఒక నాయకుడు తేరుకోలేని గందరగోళం మధ్య రకరకాల దారులు తొక్కుతుం డగా, మరొక రాష్ట్ర పాలకుడు ‘సహవాస దోషంతో’ నిరంకుశుడిగా ప్రజా మోదం లేని, చర్చకు ఆస్కారం లేని నిర్ణయాలతో ముందుకు సాగుతూం డటం దేశానికీ, రాష్ట్రాలకే అనర్థం. ప్రపంచీకరణ విధానాలను, ప్రజా వ్యతిరేక సంస్కరణలను పాలకులు బేషరతుగా నెత్తి కెక్కించుకున్న తరువాతనే స్థానిక పోటీ పరీక్షలలోనూ, కేంద్ర స్థాయి సివిల్ పబ్లిక్ పరీక్షలలోనూ మాతృ భాష లలో జవాబులు రాసే, రాయించే అవకాశాలను లేకుండా చేశారు, లేదా జీవశక్తిని పిండివేశారు. కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో, పారిశ్రామిక సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం గత 30 సంవత్సరాలుగా సెలక్షన్ కమిషన్ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రాలలో ఒకటైనప్పటికీ, హిందీ తర్వాత తెలుగు భాష రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నప్పటికీ ఈ నియా మకాల్లో ఆంధ్రుల సంఖ్య కేవలం ఒక్కశాతం. పై సంస్థల్లోనేకాక, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఇతర ప్రభుత్వ సంస్థల్లోనూ, సర్వే ఆఫ్ ఇండియా, ఓఎన్ జీసీ, ఇండియన్ ఎయిర్‌లైన్స్, భారత్ సంచార్ నిగమ్ వగైరాలలో కేంద్ర సెలక్షన్ కమిషన్ అభ్యర్థుల నియామకాలు చేస్తుంది. కానీ అందుకు జరిపే పరీక్షల్ని హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితం చేయడంవల్ల హిందీయేతర భాషా రాష్ట్రాల ప్రజలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని ప్రధానమంత్రులూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పట్టించుకోవడం లేదు. పరాయి భాష తురాయి కాదు అసలు విషయం–తెలుగు భాషకు ఎట్టకేలకు విశిష్ట భాషా ప్రతిపత్తి దక్కిం దని పరమానందభరితులమవుతున్న సందర్భంలో, మద్రాసు హైకోర్టులో ఒక తమిళుడు మన భాషా ప్రతిపత్తికి అడ్డుతగలడానికి ప్రయత్నించి విఫల మైనందుకు సంతోషిస్తున్న సమయంలో కూడా మనం విశ్రమించలేక పోతున్నాం. ఎందుకంటే, ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణల కత్తుల బోనులో ‘ప్రభుత్వం’ అనే శక్తి చిక్కుబడిపోయింది. ఫలితంగా తెలుగువాడి శ్వాసనూ, భాష ఎదుగుదలనూ విద్యాసంస్థల్లో దాని పురోగతినీ తెలుగు ఏలి కలే అడ్డుకొంటున్నారు. మాతృభాషను పెంచుకోవాలి, అన్యభాషల్ని గౌర వించాలి. ఏ మీడియంలో చదువుకోవాలో తేల్చవలసింది పాలకులూ తల్లిదం డ్రులూ కాదు, విద్యార్థులే. ఇక్కడొక సంగతి. ప్రసిద్ధ నటుడు బల్రాజ్ సాహనీ (పంజాబీ) విశ్వకవి రవీంద్రుణ్ణి ఉడికించడం కోసం సంభాషణకు దిగాడు: టాగూర్ అడిగారు, ‘ఇంతకీ నీదేభాష?’ ‘పంజాబీయేగానీ, అందులో చెప్పు కోదగిన సొగసు లేదు. అందుకనే ఇంగ్లిష్ రాస్తాను’ అన్నాడు బల్రాజ్. ‘నీవు పంజాబీని కించపరుస్తావా? గురునానక్ లాంటి మహాకవిని, గ్రంథకర్తను పంజాబీ భాషా సౌందర్యానికి హారతులందించిన విశిష్ట వ్యక్తిని కాదంటావా? తప్పు తప్పు. ఎంత ఇంగ్లిష్‌లో రాసినా నీది పంజాబీ మాధుర్యం సోకగల రచన కాదు. నా రచనలన్నీ మొదట బెంగాలీలోనేగానీ, ఇంగ్లిష్‌లో కాదు. నేను బెంగాలీ నుంచే ఇతర భాషల వారి కోసం ఇంగ్లిష్‌లో చేస్తానేగానీ.. ఎంత లేదన్నా తల్లిభాష తల్లిభాషే, పరాయి భాష ఎంత తురాయి కట్టుకున్నా పరా యిదే సుమా!’’ అన్నాడు విశ్వకవి. సీనియర్ సంపాదకులు, ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
మాతృభాషపై పట్టు సాధించాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జాతి సంస్కృతి, కళల వారసత్వాన్ని అందించేది భాషేనని, మాతృభాషపై పట్టుసాధించే దిశగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ 2 సాల్మన్ రాజకుమార్ పేర్కొన్నారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా తెలుగుభాషోద్యమ సమితి ఆధ్వర్యంలో మాతృభాషలో విద్యాబోధన– ఆవశ్యకతపై శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భాషా, సంస్కృతి వేరు కాదని, జాతి అస్తిత్వం, గౌరవాన్ని కాపాడేది మాతృభాషేనన్నారు. అనంతరం ఓఎస్డీ పెంచలరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుభాషకు ప్రాధాన్యమిచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలను జరపాలన్నారు. చిన్నారుల తెలుగుభాషోద్యమ సమితి ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడు గణేష్‌బాబు, నెల్లూరు జిల్లా భాషోద్యమ సమితి గౌరవాధ్యక్షుడు చలంచర్ల భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బద్దిపూడి శీనయ్య, కోశాధికారి పైడాల కొండమ్మ, కళాకారులు ఆరి విజయకుమార్, పార్వతీశం, నాగరాజు, నరసింహం, తదితరులు పాల్గొన్నారు. -
మాతృభాషతోనే బంగారు తెలంగాణ
అవసరమైన వనరులు, వసతులు కల్పించడంద్వారా విద్యాలయాలను సముద్ధరించకుండా ఆదరాబాదరాగా కేజీ నుంచి పీజీ విద్యను ఆంగ్లమాధ్యమంలో జరుపుతామని పాలకులు ప్రకటించడం, దానికోసం సన్నాహాలు చేయడం, బాహాటంగా ప్రకటనలు చేయడం అప్రజాస్వామికమే కాదు.. అది చట్టవిరుద్ధం కూడా అవుతుంది. ఒకప్పటి నిజాం జమానా హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఉర్దూను పరిపాలనా భాషగా శాసనపరంగా నిర్ణయించి దానికనుగుణంగా ఉర్దూను బోధనాభాషగా చేపట్టారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బి. రామకృష్ణారావు హయాంలో తెలుగును పరిపాలనాభాషగా శాసన పరంగా నిర్ణయించి తదనుగుణంగా తెలుగు భాషను బోధనా మాధ్యమంగా చేపట్టి ఆనాటి ఉర్దూ భాష ద్వారా విద్యాబోధన చేస్తున్న ప్రభుత్వ రంగ విద్యాల యాలన్నీ తెలుగు మాధ్యమంలోకి మార్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వపరంగా కేజీ నుంచి పీజీ వరకు ఇకపై ఇంగ్లిష్ మాధ్యమంలోనే విద్యాబోధన జరుగుతుందని పదేపదే ప్రకటించారు. ఈ మధ్యే తెలుగు మీడియం పాఠ్యాంశాలను ఇంగ్లిష్ మీడి యంలోకి మార్చే ప్రక్రియలు కూడా చేబడుతున్నారని సమాచారం. కానీ తెలుగు మీడియంను ఇంగ్లిష్ మీడి యంలోకి మార్చాలంటే మొదట శాసనసభలో దానిపై చర్చించి శాసనపరమైన నిర్ణయం తీసుకోవాలి. దానికి మొట్టమొదట తెలుగును పరిపాలనా భాషగా వదిలివే యాలి. అలాగే ఉర్దూ కూడా అధికార భాష కనుక దాన్ని కూడా వదిలివేయాలి. తర్వాతే ఇంగ్లిష్‌ను అధికార భాషగా శాసనపరంగా నిర్ణయించి ప్రకటించాలి. పరిపాలనా రంగానికి చెందిన ఇంత పెద్ద నిర్ణ యాన్ని ప్రభుత్వపరంగా తీసుకోవడానికి ముందు ప్రజా భిప్రాయం కోసం ఒక ఒపీనియన్ పోల్ లాంటిది నిర్వ హించాలి. అంతకంటే ముందుగా, అత్యధికులు పరిపా లనా భాష గురించి, దానికి అనుబంధమైన విద్యా బోధన గురించి ఎలాంటి భావాలు వ్యక్తపరుస్తారో మౌఖిక చర్చల ద్వారా, లిఖితపూర్వక సర్వేల ద్వారా ప్రభుత్వం తెలుసుకోవాలి. వరంగల్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర తెలుగు మాధ్యమ పరిరక్షణోద్యమ సమాఖ్య సభలో ఈ విషయంపై లోతుగా చర్చించింది. ఇంగ్లిష్ మీడియంను తీసుకురావడానికి ముందుగా విద్యార్థుల విద్యాప్రమా ణాలు పెరగడానికి అనేక లోటుపాట్లతో నడుస్తున్న ప్రభుత్వ విద్యాలయాలన్నింటినీ వనరులు, వసతులు, అధ్యాపకులరీత్యా సరిదిద్దిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే విద్యాప్రమాణాలు మరింత తగ్గుతాయని, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని సమాఖ్య హెచ్చరించింది. అలాంటివేవీ చేయకుండా ఆదరాబాదరాగా కేజీ నుంచి పీజీ విద్యను ఇకపై ఆంగ్లమాధ్యమంలో జరుపు తామని ప్రకటించడం, దానికోసం సన్నాహాలు చేయడం, బాహాటంగా ప్రకటనలు చేయడం అప్రజా స్వామికమే కాదు.. అది చట్టవిరుద్ధం కూడా అవుతుంది. ఇలాంటి నిర్ణయాలు సరికావని ప్రభుత్వం దృష్టికి, ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకు రావడానికి విస్తృత చర్చలు, సర్వే లేదా ఒపీనియన్ పోల్ వంటిది నిర్వహించి వాటికనుగుణంగా శాసనాలు చేయాలని, అంతవరకు కేజీ నుంచి పీజీ విద్యను తెలుగు లోనే కొనసాగించాలని సమాఖ్య డిమాండ్ చేసింది. ఇంగ్లిష్ మీడియం కంటే తెలుగు మీడియం బహుజను లకు మంచిదని ఈ వ్యాసకర్త ఇప్పటికే అనేక వ్యాసాలు రాసి, ప్రచురించారు. భాషా మాధ్యమంలో మార్పులు చేయడానికి ముందుగా ప్రభుత్వం చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై శిథిలావస్థలో ఉన్న అనేకానేక ప్రభుత్వ విద్యాలయాలను వెంటనే పునరుద్ధరించడం తక్షణ కర్తవ్యం. అంతేకాని తెలుగు మాధ్యమం కంటే కష్టమైన ఇంగ్లిష్ మీడియం చేపట్టడం సరైంది కాదు. అంతవరకు ఇప్పుడున్న తెలుగు మాధ్యమాన్నే కొనసాగిస్తూ, ప్రైవేట్ రంగ విద్యాలయాలకు నిర్దేశించే గుర్తింపు నిబంధనలను ప్రభుత్వరంగ విద్యాలయాలకు కూడా తు.చ. తప్ప కుండా వర్తించజేస్తూ వాటిని పాటించకపోతే రెండిం టిపై సమానంగా చర్యలు తీసుకోవాలి. నిర్దేశిత నిబంధ నలను అన్ని విద్యాలయాలు కచ్చితంగా పాటించడానికి పకడ్బందీగా పర్యవేక్షణ అమలు చేయవలసి ఉంటుంది. జూన్ 25-27 తేదీల్లో వరంగల్‌లో తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్ ఆధ్వర్యాన తెలం గాణలో తెలుగు మాధ్యమ విద్యాబోధనపై వివిధ స్వచ్ఛంద సంస్థలు సమావేశమై తెలంగాణ రాష్ట్ర తెలుగు మాధ్యమ పరిరక్షణోద్యమ సమాఖ్యగా ఏర్పడినాయి. అంపశయ్య నవీన్, సుప్రసన్నాచార్య, అనుమాండ్ల భూమయ్య, కె. యాదగిరి, కోదండరామారావు, ఈ వ్యాస రచయిత తదితరులు పాల్గొన్న ఈ సమావేశం ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తేవాలని కొన్ని ప్రతి పాదనలు కూడా చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతి జిల్లాలోని విద్యా, సామాజిక సాంస్కృతిక లక్ష్యా లతో స్థాపితమైన రాజకీయేతర స్వచ్చంద సంస్థల సహకారంతో ఈ ఉద్యమాన్ని అందించాలని, ప్రతి జిలా కేంద్రంలో జిల్లా పరిరక్షణోద్యమ శాఖను స్థాపించి, అడపాదడపా చర్చాగోష్టులు జరిపి అవసరమైన కార్య క్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. అలాగని సమాఖ్య ఇంగ్లిష్ భావనను వ్యతిరేకిం చడం లేదు. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని మాత్రమే వ్యతిరేకిస్తోంది. కేంద్ర, ప్రైవేట్ రంగ విద్యాలయాల్లో కూడా తెలుగు, ఇంగ్లిష్ మాధ్య మాల్లో విద్యాబోధన జరపాల్సి ఉంది. కేసీఆర్ బోధనా మాధ్యమం గురించి ఇంతవరకు తీసుకున్న నిర్ణయా లను ఆపి సావధానంగా వాటి గురించి చర్చించాలి. - డాక్టర్ వెల్చాల కొండలరావు వ్యాసకర్త కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర తెలుగు మాధ్యమ పరిరక్షణ సమాఖ్య మొబైల్ : 98481 95959 -
మాతృభాషకు ఆదరణ తగ్గుతోంది
ఆవేదన వ్యక్తం చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషకు ఆదరణ తగ్గుతోందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడా భాషా పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టడంలేదని ఆయన మండిపడ్డారు. అమెరికాలో మాత్రం తెలుగు భాష వెలుగొందుతోందని పేర్కొన్నారు. శనివారం ఫిలడెల్ఫియాలో ఏర్పాటైన ‘పాఠశాల’ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు భాషా, సంస్కృతులను నేర్పించడంలో ముందంజలో ఉన్నారని, అమెరికాలో ‘పాఠశాల’ వంటి ప్రత్యేక శిక్షణా సంస్థలను దీని కోసం ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు. మాతృ భాష పట్ల ప్రవాసాంధ్రులు చూపుతున్న శ్రద్ధ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రముఖ పాత్రికేయులు నరిసెట్టి ఇన్నయ్య మాట్లాడుతూ అమెరికాలో తెలుగువారు నిర్వహించే ఉత్సవాలకు అక్కడి స్థానికులను కూడా ఆహ్వానించాలని కోరారు. యార్లగడ్డ దంపతులను స్థానిక ప్రవాసాంధ్రులు, పాఠశాల సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు పొట్లూరి రవి నిర్వహించారు. -
మాతృభాషకు పరాభవం
♦ ఇంటర్ ఫలితాల తీరు.. ♦ అధిక శాతం తెలుగు పరీక్ష ఫెయిల్ ♦ ఆర్ట్స్ కంటే సైన్స్ గ్రూప్‌ల్లో ఉత్తీర్ణత మెరుగు సాక్షి, సిటీబ్యూరో: తెలుగు నేలపై మాతృభాషకు పరాభవం ఎదురైంది. అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలుగు భాషా పత్రంలో ఫెయిలయ్యారు. తెలుగు భాషా కంటే.. ఇంగ్లిష్, సంస్కృతం పేపర్లలోనే చాలా మెరుగ్గా విద్యార్థులు నెగ్గడం విశేషం. అంతేగాక సైన్స్ కంటే.. ఆర్ట్స్ గ్రూప్‌లకు చెందిన విద్యార్థులే అధికంగా ఫెయిలయ్యారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ఫలితాల తీరు ఇదే రీతిలో ఉంది. శుక్రవారం ప్రకటించిన జంట జిల్లాల ఇంటర్ ఫలితాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర అంశాలు స్పష్టమయ్యాయి. తెలుగు భాషా పేపర్లోనూ జంట జిల్లాల విద్యార్థులు చతికిలబడ్డారు. ఆ భాష పట్ల ఉన్న చులకన భావమే వారి కొంప ముంచిందని విద్యావేత్తలు చెబుతున్నారు. మాతృభాషపై మమకారం పెంచుకోవాలని, లేదంటే భాష ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ తెలుగు భాషా పేపర్లో 15.49 శాతం విద్యార్థులు తప్పారు. ఇంగ్లిష్‌లో 5.83 శాతం, సంస్కృతంలో 4.42 శాతం, హిందీలో 7.59 శాతమే ఫెయిలయ్యారు. రంగారెడ్డి జిల్లాలో తెలుగులో 11.90 శాతం, ఇంగ్లిష్‌లో 5.10, సంస్కృతంలో 4.08, హిందీలో 4.56 శాతం తప్పారు. ఫస్టియర్ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థులు అమ్మభాషలో అధిక శాతం బోల్తా పడ్డారు. ఏకంగా 27.21 శాతం మంది ఫెయిలవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో సైతం 19 శాతం నమోదైంది. ఆర్ట్స్‌లో వెనుకంజ.. ప్రకటించిన ఫలితాల్లో సైన్స్ గ్రూప్ విద్యార్థులతో ఆర్ట్స్ విద్యార్థులు పోటీ పడలేకపోయారు. చాలామంది గణితం, జీవశాస్త్రం, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తదితర సబ్జెక్టులంటే భయంతో.. ఆర్ట్స్ గ్రూప్‌లను ఆశ్రయిస్తున్నారు. తీరా ఫలితాల్లో బోల్తాపడుతున్నారు. సెకండియర్ ఫలితాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఫలితాల తీరు ఇలాగే ఉంది. సైన్స్ కంటే.. ఆర్ట్స్ విద్యార్థులు ఏడెమినిది రెట్లు అధికంగా ఫెయిలయ్యారు. హైదరాబాద్ జిల్లాలో సైన్స్ సబ్జెక్టుల్లోనూ అధిక శాతం ఫెయిలయ్యారు. అధికంగా గణితం 2బిలో 23 శాతానికి పైగా అనుత్తీర్ణత నమోదైంది. -
అమ్మ భాషంటే కంటగింపా?
రెండో మాట ‘ఒక భాషను నిత్యం వాడుకలో పెట్టుకోనప్పుడు, సంభాషణల్లో, తమ భాషీయుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలలో మాతృభాషను వాడే వారి సంఖ్య అధికంగా తగ్గిపోతున్నప్పుడు లేదా తన భాషను ఒక తరం మరొక తరానికి వారసత్వంగా అందించగల స్థితిలో లేనప్పుడూ ఆ భాష ఉనికి కాస్తా ప్రమాదంలో పడినట్లే లెక్క’ అని యూనెస్కో చాటింది. అందుకని తక్షణం జరగవలసిన పని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు అన్న తేడా లేకుండా రెండింటా మాతృభాషా మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేయాలి. ‘‘తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో పిల్లలకు ప్రావీణ్యంగల ఉపాధ్యాయులు తల్లి భాషలో బోధించడమే ఉత్తమమైన విధానమని భాషా నిపుణులు భావిస్తున్నారు. అయినా, తల్లిదండ్రుల దృష్టి వేరే విధంగా ఉండి తమ పిల్లల్ని ఇంగ్లిష్ భాషా మాధ్యమంలో బోధిస్తున్న స్కూళ్లలోనే పెద్ద సంఖ్యలో చేరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లి భాషైన తె లుగును పక్కకు నెట్టేసి ఇంగ్లిష్‌ను ముందుకు నెడుతున్నారు. 2013-2016 మధ్య ఇంగ్లిష్ మాధ్యమంలో ఎస్ఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 60 వేలకు పెరిగితే అదే సమయంలో తెలుగు మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్నా వారి సంఖ్య 40 వేలకు పడిపోయింది! ’’ వార్తలు (28-2-2016) దాదాపు 3,000 సంవత్సరాల చరిత్ర ఉండే తెలుగు జాతి తన మాతృ భాషను ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల, పట్టభద్ర, పట్టభద్రానంతర విద్యా స్థాయిలలోనూ, వ్యవహారశైలిలోనూ కాపాడుకోలేక పోవడానికి కారణమేమై ఉంటుందని పైన తెల్పిన విపరిణామం ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు జవాబు సరిగ్గా 13 ఏళ్లనాడే, ఈ మాసంలోనే ఐక్యరాజ్య సమితి విద్యా, సాంస్కృతిక శాఖ చేసిన ప్రకటనలో దొరుకుతుంది! 21వ శతాబ్దం ముగిసిపోయే నాటికే విభిన్న చరిత్రలు గల అనేక ప్రపంచ దేశాల మాతృభాషలకు ‘కాలం మూడబోతోందని’ ఆ సంస్థ హెచ్చరించి ఉందని మరచిపోరాదు. ఎందుకంటే, సామ్రాజ్య పెట్టుబడిదారీ వ్యవస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాల మధ్య నలిగిపోతున్నందున, ఆ వ్యవస్థలను బతికించుకోవాలంటే ఆ సంక్షోభాల వలలోకి బడుగు వర్ధమాన స్వతంత్ర దేశాలను కూడా లాగాలి! తమ సరుకులను ఈ దేశాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేసి ఆ ‘సంతల’ స్వాధీనం ద్వారా రాజకీయ పెత్తనం మరి కొన్నేళ్లు నిలబెట్టుకోవడానికి ‘‘సరళీకృత’’ ఆర్థిక విధానాలను ప్రపంచంపై అవి రుద్దాయి. ‘తాటితోనే దబ్బనం’ అన్నట్టు ఈ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దేశాలు లాభాల వేటలో భాగంగా వర్ధమాన దేశాల ప్రజల భాషా మాధ్యమాన్ని కూడా (ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టి) మార్చి వేయాలి. అమ్మ భాషలకు అంగ్రేజీ గండం ఈ పరిణామం ఫలితంగానే క్రమక్రమంగా 7,000 ప్రపంచ భాషలలో సగానికి పైగా అంతరించాయనీ, కింది స్థాయిలో ఇంగ్లిష్ మాధ్యమం వ్యాప్తి వల్ల మాతృ భాషల ఉనికి మూలాలే దెబ్బ తినబోతున్నాయనీ ‘‘యునెస్కో’’ నిపుణుల పారిస్ సమావేశం హెచ్చరించింది. ఇంగ్లిష్ మాధ్యమం వల్ల మాతృభాషా మాధ్యమానికి, జాతుల తల్లి భాషలకు ప్రమాదం ఉండబోదని ‘విశాల హృదయం’తో భావించేవారు ఇప్పటికైనా తమ అభిప్రాయాన్ని మార్చుకొనక తప్పదని గ్రహించాలి. మన దేశానికి చెందిన విద్యాధిక శ్రేణులలోని కొందరు సహా అనేక దేశాల భాషా నిపుణులు, ఆచార్యులు, పాఠ్య ప్రణాళిక పరిశోధకులు పరభాషా మాధ్యమాన్ని ‘వ్యాపార’ కళగా చూడగల్గుతున్నారు. 2013-2016 మధ్య గత నాలుగేళ్ల వ్యవధిలోనే ఎస్ఎస్సీ ఇంగ్లిష్ మాధ్యమంలో చదివేవారి సంఖ్య పెరుగుతూ, ప్రభుత్వ తెలుగు స్కూళ్లలో తెలుగు మాధ్యమం కనుమరుగైపోవటం ఆందోళనకరం. మన పాత తరాల విద్యావంతులంతా ఉభయ భాషలూ నేర్చినవారే. ఎస్ఎస్సీతో విద్యాభ్యాసం ముగించిన పెద్దలు కూడా ఈనాటి పోస్ట్ గ్రాడ్యుయేట్ల కన్నా ఇంగ్లిష్‌లో పరిశుద్ధంగా మాట్లాడగలుగుతున్నారు. వారు తెలుగు భాషా మాధ్యమంలో మాధ్యమిక విద్యను అభ్యసించడం అందుకు ఒక ప్రధాన కారణం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇది గుర్తించి... ప్రాథమిక, మాధ్యమిక దశల్లోనే గాక, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దశల్లో కూడా (ఇంజనీరింగ్, మెడిసిన్‌తో సహా) విద్యార్థులు మాతృభాషా స్పృహను కోల్పోకుండా కన్నడ సజీవశక్తిగా వర్ధిల్లే కనీస ఏర్పాట్లు చూసుకున్నారు. ‘పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను’ భాషాపరమైన పరాయీకరణకు అలవాటు పడిన పాలకులకు, వారి పనుపున డూడూ బసవన్నలుగా ఉనికిని కాపాడుకునే కొందరు విద్యావేత్తలకు ఒక పాఠంగా యునెస్కో.. మాతృభాషల ప్రాధాన్యాన్ని ఇలా నినాదంగా వినిపించ వలసి వచ్చింది. ‘నేను నా అభిమాన భాషనే మాట్లాడతా/నేనిలా ఉన్నానంటే నా భాషే కారణం/మా తల్లి భాషలోనే మా బిడ్డలకు నేర్పుతాం/ అసలు తామంటూ ఎవరో తెలియడం వారికి అవసరం గనక ’’! అంతే కాదు. ‘నవాజో’ జాతి పెద్దలు తమ పిల్లలకు మనిషి ఉనికి రహస్యాన్ని తెలుపడానికి ఉపయోగించే ఈ సామెతను కూడా అది 13 ఏళ్ల క్రితమే ఇలా ప్రచారంలో పెట్టింది. ‘నీవు శ్వాసించకపోతే గాలి లేనట్లే/నీవు నీ భాషలో మాట్లాడకపోతే ఈ ప్రపంచం లేనట్లే’! ఫ్రెంచి పదాలను వాడుకోకుండా పరాయి భాషా పదాలను వాడితే ఫ్రెంచ్ ప్రభుత్వం భారీ జరిమానా విధిస్తుందట. అలాగే మెక్సికన్లలో తల్లి భాషలోగాక, ఎరువు తెచ్చుకున్న భాషలో మాట్లాడితే నీ పేగు బంధాన్ని ఎక్కడ పాతిపెట్టావురా? అని ఎద్దేవా చేస్తారట. పానుగంటి లక్ష్మీనరసింహారావు సాక్షి వ్యాసాల ద్వారా తల్లి భాషను ఎందుకు నిర్లక్ష్యం చేయరాదో, చేస్తే రాబోయే నష్టాలేమిటో చాలా వ్యంగ్యంగా చెప్పారు. ‘‘ఆంగ్లేయ భాష యేల చదువుకొంటివని నేను అధిక్షేపించను. ఇంతకన్న అధిక జ్ఞానమును కూడ నీవు ఆ భాషలో సంపాదింపుము. ఆంగ్లేయ భాషయే కాదు. ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకొనుము. నీ భాషకు వన్నె పెట్టుకొనుము. కానీ, ఆంధ్రుడివై ఉండియు ఆంధ్ర భాషలో ఆ అని నోరే మెదపలేనివాడవు కావద్దు. నాయనలారా, మనమెంత లక్షాధికారులమైనను, కోటీశ్వరులమైనను మన బతుకులు ముష్టి బతుకులే గాని మరియొకటి కాదు. ఈ ముష్టి దేవులాటలో వారి ఇంగ్లీష్ మాటలు కూడా ఎందులకు? ఆ ఏడుపేదో మాతృభాషతోడనే ఏడ్చిన మంచిది కాదా? మన ఏడుపు సహజంగానూ, సొంపుగానూ, స్వతంత్రముగానూ ఉండునే. ఏడుపులో కూడా మనకీ అస్వతంత్రత ఏమి ఖర్మము? పుట్టుక చేతనే కాక, బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత, ఆంధ్రులని అనిపించుకొనుడు’’ అని ఆయన హితవు చెప్పాడు. ‘‘అన్యభాషలు నేర్చి ఆంధ్రభాష రాదని సకిలించే ఆంధ్రుడా చావవెందుకురా’’ అని ప్రజాకవి కాళోజీ ధర్మాగ్రహంతో ప్రశ్నించాడు. తాజాగా కవి ఛాయారాజ్ ‘‘నా ప్రేమ, నా అభిమానం, మిత్రులకు అర్థం కావాలి/నా ఆగ్రహం, నా ఆవేశం శత్రువులకు అర్థం కావాలి/నా శ్రమ, నా శక్తీ నా భాషలోనే వ్యక్తం కావాలి/పుట్టుక దగ్గర, చావుదగ్గర పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను’’! అందుకే ఈ మాతృభాషా రసాయనిక ప్రక్రియను అర్థం చేసుకున్న తర్వాతనే గాంధీ, విశ్వకవి రవీంద్రుడూ మాతృభాషలో పాలన, మాతృభాషలో బోధన, మాతృభాషలో న్యాయ స్థానాల తీర్పుల అవసరం గురించి నొక్కి చెప్పవలసి వచ్చింది. మళ్లీ మాతృ భాషా ఉద్యమం ఒకనాడు గిరీశం (కన్యాశుల్కం) తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు మీద ఖాతరీ లేదండీ అని ఫిర్యాదు చేశాడు గానీ, ఇప్పటి తెలుగోళ్ల పాలనలో కూడా ఇంగ్లిషు మాధ్యమం బడుల్లోనే కాదు, తెలుగు బడుల్లో కూడా వానాకాలం చదువులేననే అభిప్రాయం ప్రబలంగా ఉంది. ఉపాధ్యాయుల శిక్షణలోనూ అదే ధోరణి. ఉపాధి మిషపైన, టెక్నాలజీ పేరిట, ఇళ్లలో తల్లిదండ్రుల ధోరణీ ఇదే అమ్మా, నాన్న పదాలను భాషా మ్యూజియం వస్తువులుగా మార్చాం. తెలుగువాడు తన మాతృభాషా పరిరక్షణ కోసం నేటికి ఎందుకింత తపన పడవలసి వస్తోందో, ఉద్యమాలు చేయవలసి వస్తోందో ఒక్కసారి దృష్టి సారించాల్సి ఉంది. ఒకనాడు ఇంగ్లిష్ భాషపై గ్రీకు, లాటిన్ ఫ్రెంచ్ భాషల పెత్తనాన్ని వదిలించుకోవడానికి ఇంగ్లండ్ ప్రజలకు 300 సంవత్సరాలు పట్టిందని మరవరాదు. నేడు మనమూ అలాంటి దుస్థితిలోనే ఉన్నాం. దేశీయ భాషల ఉన్నతిని, విద్యా, పాలనా స్థాయిల్లో మాతృభాషల వాడకాన్ని విస్తృతం చేయడానికి పాలకులు శ్రద్ధ చూపక పోవడానికి అసలైన కారణం ఉంది. బ్రిటిష్ పాలకుల విధానాలను వ్యతిరేకించేవారిపైన దేశద్రోహ నేరాన్ని (సెడిషన్) మోపడానికి కారకుడైన లార్డ్ మెకాలే దొరే గుమాస్తాగిరీ విద్యా విధానానికి పాదులు తీస్తూ (మినిట్ ఆఫ్ డిసెంట్) ‘మా తిండికి, మా వేషభాషలకు అలవాటు పడిన భారతీయులు మా ఇంగ్లిష్‌వారికి శాశ్వతంగా బానిసలుగా పడి ఉంటారు’ అన్నాడు. ఈ ప్రకటనకు మనం ఇప్పుడు ఆమోద ముద్ర వేస్తున్నామా? అందుకే ఒక భాషను కోల్పోవడమంటే దాని చుట్టూ అల్లుకున్న ప్రకృతిని, సంస్కృతిని, పద సంపదనూ కోల్పోవడమేనని ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు కోడై కూస్తున్నారు. ఈ విషయంలో యునెస్కో మరొక అమూ ల్యమైన హెచ్చరికను కొసమెరుపుగా పేర్కొనక తప్పదు. ‘ఒక భాష తాలూకు భాషీయులు ఆ భాషను నిత్యం వాడుకలో పెట్టుకోనప్పుడు, సంభాషణల్లో, తమ భాషీయుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలలో మాతృ భాషను వాడే వారి సంఖ్య అధికంగా తగ్గిపోతున్నప్పుడు లేదా తన భాషను ఒక తరం మరొక తరానికి వారసత్వంగా అందించగల స్థితిలో లేనప్పుడూ ఆ భాష ఉనికి కాస్తా ప్రమాదంలో పడినట్లే లెక్క’ అని చాటింది. అందుకని తక్షణం జరగవలసిన పని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు అన్న తేడా లేకుండా రెండింటా మాతృభాషా మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేయాలి. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు.. abkprasad2006@yahoo.co.in -
ఇంగ్లిష్‌లో మాట్లాడలేదని...!
గువాహటి: మాతృభాషలో మాట్లాడటమే ఈ చిన్నారుల నేరమైంది. ఆంగ్లంలో మాట్లాడాలన్న నిబంధనను ఉల్లంఘిస్తారా అంటూ ఏకంగా 13 మంది విద్యార్థులను తీవ్రంగా శిక్షించింది ఓ ప్రైవేటు పాఠశాల. ఈ ఘటన అసోం రాజధాని గువాహటిలో బుధవారం జరిగింది. గువాహటిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 13 మంది విద్యార్థులు మాతృభాష అస్సామీలో మాట్లాడినందుకు స్కూల్ యాజమాన్యం కన్నెర్రజేసింది. తమ స్కూల్లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలన్న నిబంధనను ఉల్లంఘించినందుకు ఆ విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా అడ్డుకుంది. దాదాపు 90 నిమిషాలపాటు నిలిపి ఉంచింది. కాథలిక్ ఆధ్వర్యంలోని స్కూల్లో జరిగిన ఈ ఘటనపై అసోం జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. మాతృభాషలో మాట్లాడినందుకు విద్యార్థులను శిక్షించిన ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనపై ఏడు రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రతిమ రంగ్‌పిపిని ఆదేశించినట్టు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎం అంగముత్తు తెలిపారు. అన్ని ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రాథమిక భాషగా అస్సామీని తప్పకుండా బోధించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. -
క్యాథరిన్‌కు మాతృభాష రాదట
మలయాళీ కుట్టికి మాతృభాషే తెలియదట. కథానాయిక లకు కే రళ పుట్టినిల్లుగా మారిందనవచ్చు. మలయాళం మాతృభాషగా కలవారు భారతీయ సినీపరిశ్రమ నంతా అల్లుకుపోతున్నారన్నది ఎవరూ కాదనలేని నిజం. ముఖ్యంగా దక్షిణాది చిత్రసీమలో ఈ బ్యూటీస్దే హవా అనవచ్చు. అసిన్, నయనతారల నుంచి యువ తారలు క్యాథరిన్ ట్రెసా,కీర్తీసురేష్ వరకూ పలువురు దక్షిణాదిలో కథానాయికలుగా తమ సత్తా చాటుకుంటున్నారు. ఇక క్యాథరిన్ ట్రెసా విషయానికి వస్తే మెడ్రాస్ చిత్రంతో కోలీవుడ్‌కు, ఇద్దరమ్మాయిలతో చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. విశాల్‌తో నటించిన కథాకళి చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది.ఈ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లోనూ నటించింది. ఆ సన్నివేశాలతో యువత గుండెల్లో గిలిగింతలు పెట్టి వారి అభిమానాన్ని పొందేస్తానని తెగ సంబర పడిపోయిందట.అయితే ఆమె ఆశలకు సెన్సార్ కత్తెర వేయడంతో చాలా నిరాశలో మునిగిపోయిందన్నది పక్కన పెడితే మలయాళ వంశానికి చెందిన క్యాథరిన్ ట్రెసాకు మాతృభాష మినహా కన్నడం, హింది, ఇంగ్లిష్ లాంటి భాషలన్నీ తెలుసట.అదేమిటని అడిగితే తాను పుట్టి పెరిగింది దుబాయ్‌లోనని బదులిచ్చింది. -
ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టం కావాలి
* భోపాల్ రిటైర్డ్ ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ ఉద్బోధ * ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా సమాజాభివృద్ధికి పాటుపడాలని భోపాల్‌కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ ఉద్బోధించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో ఆంగ్ల భాషతోపాటు మాతృభాషలో కూడా బోధన ఉండాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ రూపశిల్పి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన నాల్గో స్మారకోపన్యాసంలో కార్పొరేటీకరణ-ప్రకృతి వనరులు-విద్య అనే అంశంపై ఆయన ప్రసంగించారు. విద్యా హక్కు అందరికి ఉండాలని, విద్యాబోధన పద్ధతులు మారాలని ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ అన్నారు. అంబేడ్కర్ స్పూర్తితో జయశంకర్ పోరాడారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ రూపకర్తగా నిలిచారని కొనియాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రజలను చైతన్యం చేయటంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ముందుండాలన్నారు. రాష్ట్ర నవ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ విద్యారంగ నిర్మాణంలో మార్పులు అవసరమన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. తెలంగాణ కోసం పరితపించిన జయశంకర్ ఆశయాల సాధన కోసం మనమందరం కృషి చేయాలన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజల త్యాగాలను కొందరు భోగాలుగా అనుభవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ వి.శివలింగ ప్రసాద్, విద్యావంతుల వేదిక స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మల్లెపల్లి లక్ష్యయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు పాల్గొన్నారు. -
కళ్లద్దాలు ఉన్నాయని...?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) తేనె లొలుకు తెలుగుకు అవమానం. తెలుగుజాతి తలదించుకోవాల్సిన సందర్భం. మాతృభాషాభిమానులకు మింగుడు పడని వాస్తవం. అన్యభాషపై మోజుతో అమ్మభాషను నిర్లక్ష్యం చేస్తున్న వైనం.. వెరసి విద్యాలయాల్లో మాతృభాష ఆదరణ కోల్పోతోంది. ఆంగ్ల వ్యామోహంలో పడి తల్లి భాషను నిర్లక్ష్యం చేస్తున్న నేటి తరం తెలుగులో నెగ్గుకురాలేక పోవడం నివ్వెరపరుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు తెలుగు పరీక్షలో ఫెయిల్ అయ్యారన్న చేదునిజం అమ్మభాషాభిమానులను అవాక్కయ్యేలా చేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో 30.78 శాతం, రంగారెడ్డి జిల్లాలో 37.26 శాతం మంది విద్యార్థులు తెలుగులో తప్పారు. ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగులో ఫెయిల్ కావడం దిగ్భ్రాంత పరుస్తోంది. ఆంగ్లంలో పోల్చుకుంటే (11శాతం) అమ్మభాషలో ఫెయిలయిన వారి సంఖ్య అధికంగా ఉండడం ఆవేదన కలిగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పరిస్థితి కాస్త అటుఇటుగా ఇలాగే ఉంది. తెలుగు సబ్జెక్టులో తప్పుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే తల్లి భాషను మనమెంత నిర్లక్ష్యం చేస్తున్నామో అర్థమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషకు ముప్పు ఏర్పడింది. అన్యభాషను నెత్తికెత్తుకుని అమ్మ భాషకు ద్రోహం చేస్తున్నాం. తమిళులు, కన్నడిగులు కన్నతల్లి కంటే ఎక్కువగా భాషను సాకుతుంటే మనం మాత్రం చంపేస్తున్నాం. తెలుగులో చదవడం, సంభాషించడం నమోషీగా భావిస్తున్నాం. తల్లి భాషలో మాట్లాడితే టీచరమ్మలతో తన్నులు తినే విచిత్ర పరిస్థితి ఒక్క తెలుగు నేలపైనే ఉంది. కళ్లద్దాలు ఉన్నాయని కళ్లు పొడుచుకున్న చందంగా తయారైంది తెలుగువారి పరిస్థితి. అమ్మ భాషలో చదివితే ఆంగ్లం రాదన్న అపోహతో పిల్లలపై బలవంతంగా అన్యభాషను రద్దుతున్నారు. మాతృభాషలో అభ్యసిస్తే విషయ పరిజ్ఞానం పెరగడంతో మానసిక వికాసం వృద్ధిచెందుతుందన్న వాస్తవాలను పెడచెవిన పెడుతున్న మమ్మీ-డాడీలు ఇంగ్లీషు చదువులను 'కేజీ'ల కొద్ది మోయిస్తున్నారు. దీనికితోడు పాలకుల ఉదాసీన వైఖరి మాతృభాష పాలిట మరణశాసనంగా మారింది. పోటీ ప్రపంచంలో బహు భాషా పరిజ్ఞానం కావాల్సిందే. కానీ నేల విడిచి సాము చేసినట్టుగా అమ్మ భాషను వదిలేసి అన్యభాషలను అందలమెక్కించడం అవివేకం. భాష మాయమైతే జాతి జాడ మిగలదు జాగ్రత్త! - పి. నాగశ్రీనివాసరావు -
మాతృభాషకు అపచారం
ఇన్ బాక్స్ ప్రజాస్వామ్యం వచ్చిన తరువాత స్థానికుల భాషలోనే అన్ని లావాదే వీలు జరగాలని విజ్ఞులు భావిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దేమిటి? తెలుగువారంతా జీతాలు ఇచ్చి మరీ ఆంగ్ల భాషకు పట్టం కడు తున్నారు. పైగా ఇలాంటి మౌలిక అంశాలపై దిశానిర్దేశం చేయవలసిన న్యాయస్థానాల నుంచి కూడా తెలుగుభాషకు న్యాయం లభించడం లేదు. హైకోర్టుతో సహా అన్ని స్థాయిలలోను కోర్టులు, అన్ని ఇతర ప్రభు త్వశాఖలు, పోలీసుస్టేషన్లు, ఆఖరికి శాసనసభ, మండలి, సచివాలయా లలోను ఆంగ్లమే రాజ్యమేలుతోంది. ఇంగ్లిష్‌లోనే తెలుగు రాష్ట్ర పాలన సాగుతోంది. రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమైన ఈ ప్రక్రియ 2-6-2014 నుంచి మొదలైంది. ఇంగ్లిష్‌లోనే దరఖాస్తులు, వినతులు స్వీకరిస్తున్నా రు. అధికారభాషా చట్టం-1966ను పూర్తిగా పక్కనపెట్టారు. చాలామం దికి అర్థంకాని ఆంగ్లంలోనే కోర్టులు కూడా తీర్పులను వెలువరిస్తు న్నాయి. వాదులు, ప్రతివాదులు, న్యాయవాదులు అంతా తెలుగులో తమ గోడు వెళ్లబోసుకుంటూంటే, వాటి మీద తీర్పు ఆంగ్లంలో రావడం ఎంతవరకు న్యాయం? ఇంత జరుగుతున్నా మన ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతున్నారు. నిజానికి ఈ విషయంలో చైతన్య వంతులు కావలసింది ప్రజలే. మాతృభాషకు న్యాయం చేయలేని ప్రజా ప్రతినిధులను పదవులకు రాజీనామా చేయించాలి. ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా తెలుగుకు పట్టం కట్టాలని కోరుతున్నాను. పి. గంగునాయుడు శ్రీకాకుళం తెలంగాణ గాంధీకి నివాళి స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి, జాతిపిత గాంధీ బాటలో, ఆయన నేతృత్వంలో అనేక ఉద్యమాలలో పాల్గొని, ముఖ్యం గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి మరణం తీరనిలోటు. తెలంగాణ ఉద్యమా నికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి, సాకారమైన తెలం గాణ రాష్ట్రాన్ని కనులారా వీక్షించిన యోధుడు కృష్ణ మూర్తి. నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ పోరా టానికి ఎక్కడ తెలంగాణ నినాదం కనిపించినా పరి గెత్తే మనిషి వీరు. 1968లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసి తెలంగాణ వాదులను ఏకం చేయడం లో వారు చేసిన కృషి ఎనలేనిది. తెలంగాణ తొలి ఉద్యమంలో స్వర్గీయ జయశంకర్‌తో కలసి అనేక ఉద్యమాలలో పాల్గొని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై, వివక్షతపై ప్రసంగించిన వ్యక్తి కృష్ణ మూర్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా తెలంగాణ ప్రజల మదిలో జీవితాంతం ఉంటారు. అమర్ రహేగా తెలంగాణ గాంధీ.. కామిడి సతీష్ రెడ్డి పరకాల, వరంగల్ జిల్లా భద్రాద్రిపై చిన్నచూపేలా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాష్ట్రంలోని దేవాలయాలకు వరాలు ప్రకటిస్తున్నా రు. రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రా నికి 100 కోట్లు ప్రకటించడంతోపాటు కేరళ వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకోసం శబరిమలలో, అజ్మీర్ దర్గా వెళ్లే ముస్లిం భక్తుల కోసం రాజస్థాన్ లోని అజ్మీ ర్లో వసతి గృహాలు నిర్మిస్తాననడం హర్షణీ యం. కానీ మరికొద్ది రోజుల్లో శ్రీరామనవమి రాబోతోంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో స్వామివా రికి పట్టువస్త్రాలు సమర్పించే కేసీఆర్ ఇంత వరకు భద్రాచలం రాములవారి ఆలయానికి అభి వృద్ధి నిధులు ప్రకటించకపోవడం గర్హనీయం. ఇప్ప టికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని భద్రాద్రి రాముల వారి దేవస్థానానికి నిధులు ప్రకటించి స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించాలని యావ న్మంది భక్తుల ఆకాంక్ష. భద్రాద్రి రామన్న ఆలయా న్ని అభివృద్ధి చేయడమంటే చారిత్రక స్థలాన్ని అభి వృద్ధి చేయడమని కూడా గమనించాలి. కలకొండ నరేష్ కుమార్ పరకాల, వరంగల్ నష్టపరిహారం చెల్లించాలి తెలంగాణ నూతన రాష్ట్రంలో ఖరీఫ్, రబీ కాలాల లో సరైన విధంగా వర్షాలు కురవక చాలా మంది వ్యవసాయ రైతులు పంటలు వేసి నష్టపోయారు. పంట చేలు వర్షాల లేమి కారణంగా ఎడారిగా మారి పోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో, తెలంగాణ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. ఇటీ వల అధికారులు నామమాత్రంగా నివేదికలు తయారు చేసి ఇచ్చిన నష్టపరిహారం పంపి ణీపై ప్రభుత్వంలో కదలికలు కనిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రైతుల కష్టా లను ప్రభుత్వాలు నెరవేర్చుతాయని గంపె డాశతో రైతులు ఉన్నారు. ఇటు సంపూర్ణంగా వ్యవ సాయ రుణాలు మాఫీ లేక డబ్బులు కడితేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకుల వారు పేర్కొనడం రైతులను మరింతగా కష్టాల్లోకి నెటుతుంది. కనీసం పంట నష్ట పరిహారమైనా అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్న కోటి ఆశలతో రైతులు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ పంట నష్టపరిహారం అందించి కరువు కాలంలో రైతులకు అండగా నిలవాలి. వి.నవనీతరావు మద్నూర్, నిజామాబాద్ ఫ్లెక్సీలతో బేజార్ నగరంలో ప్రతీ ఒక్క కార్యానికి అది ఏరకమైన కార్యక్రమమైనా సరే రోడ్లపై పెద్ద పెద్ద బోర్డులు నగరంలో అక్కడా ఇక్కడా అనిలేకుండా ఎక్కడప డితే అక్కడ వెలుస్త్తున్నాయి. ప్రధాన కూడళ్లలో అయితే సిగ్నల్స్ కనిపించక వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నా మన నగర పాలక అధికా రులు మాత్రం కాసుల కోసం ఆశపడి యథేచ్ఛగా ైలెసైన్సులు జారీచేయడం శోచనీయం. వీటివలన నిఘా కెమెరాలకు కూడా ఆటంకం కలుగుతోంది. ఇప్పుడు ఫ్లెక్సీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. పుట్టిన రోజు వేడుక నుంచి ఇంకా అది ఇది అనిలేకుండా అన్ని కార్యక్రమాలకు, అన్ని రాజకీయ పార్టీల వాళ్లు ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. ఇదివరలో ఇవి కూలి పోయి ప్రాణాలు పోయిన ఘటనలు జరిగాయి. అయినా మళ్లీ అదే తంతు. ఇటీవల దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందించి వీటిని తొలగించమని అధికా రులను ఆదేశించినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే తొలగించాలి. శోంఠి విశ్వనాథం హైదరాబాద్ కన్నీటి పర్యంతమవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాలవల్ల వృ ద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి నెలనుంచి తపాలా కార్యాలయాల ద్వారా పింఛన్ల పంిపిణీ ప్రారంభమైంది. అయితే లబ్ధిదారుల వేలిముద్రలు బయోమె ట్రిక్ యంత్రాలలో నమోదు కాకపోవడం, ఆధార్ నంబర్లు గల్లంతు తదితర కారణాలతో వేలాది మందికి పింఛన్లు ఇవ్వలేదు. దీంతో వారంతా పింఛను కేంద్రాలవద్దే మండుటెండలో పడిగాపులు కాయవలసివస్తోంది. కొన్ని ప్రాంతాలలో అయితే గత నెల పిం ఛన్లు అందుకున్న వారి పేర్లు ఈసారి జాబితాలో లేకపోవడంతో వారంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పింఛన్ల పంపిణీ తయారైందని లబ్ధిదారులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆధార్ కార్డులతోనే 5 నెలలు సజావుగా పింఛన్లు అం దజేసి, ఇప్పుడు మళ్లీ బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయడం వెనుక ఏదో గూడుపుఠాని ఉందని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యం గా నడుము సహకరించక, పైకి లేవలేక, వంగలేక పింఛను అందుకోవ డానికి వచ్చే వృద్ధుల కష్టాలు చూస్తే ఎవరైనా చలించక మానరు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మానవతాదృష్టితో ఆలోచించి అర్హులైన లబ్ధిదా రులందరికీ యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయాలి. దేవాంగ రామకృష్ణ సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా గంగ సరే.. కాలువల మాటో గంగా గోదావరి నదుల ప్రక్షాళనను కేంద్ర ప్రభుత్వం చూసుకుం టుంది. ఒకవేళ ఆ నదుల ప్రక్షాళన విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనా నష్టం లేదు. ఎందుకంటే ఆ పని ప్రకృతే చేస్తుంది. జీవనదులన్నింటికీ ప్రతి సంవత్సరం కచ్చితంగా వరదలు వస్తాయి. అంతవరకు ఆ నదుల్లో పేరుకుని పోయి ఉన్న చెత్తా చెదారం, కాలు ష్యం సముద్రంలోకి వెళ్లిపోతుంది. ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ గ్రామీణ ప్రాంతాలకు తాగు, సాగు నీరందిస్తున్న కాలువల ప్రక్షాళనపై దృష్టి పెట్టాలి. దేశంలోని కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండి పోవటమే కాకుండా, తూడు, గుర్రపు డెక్కతో పూర్తిగా మూసుకుపోయాయి. అలాగే దారుణంగా ఆక్రమణలకు గురై కనీసం నీరు రావటం లేదు. వెళ్లటం లేదు. కాలువలలో పూడిక తీయకపోవడం వల్ల వ్యవసాయానికి ఎంత నష్టం జరుగుతున్నదో కూడా ఆలోచించాలి. కాలువలతో పాటు పంట కాలువల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించడం అవసరం. గోదావరి జిల్లాలలో కాలువల మరమ్మతులు సక్రమంగా చేపట్టే ప్రక్రియ చాలా కాలం నుంచి ఆగి పోయింది. దీని వల్ల సేద్యంతో పాటు, చౌకగా సాగే రవాణా కూడా కుంటుపడుతోంది. ఇన్ని నష్టాలు ఉన్నాయి. ముందుగా కాలువల ప్రక్షాళన చేపట్టండి! విశ్వతేజ చంద్రవరం, ప.గో.జిల్లా -
బచ్పన్ లాంగ్వేజ్
భాష ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే బలమైన సాధనం. నాలుగు భాషలు వస్తే చాలు... ప్రపంచంలో ఏ మూలైనా బతికేయొచ్చు. ఈ సూత్రం ఆధారంగానే పని చేస్తున్నాయి ప్రస్తుతం నగరంలోని పాఠశాలలు. మాతృభాషకు తోడు ఏదో ఒక సెకండ్ లాంగ్వేజ్‌తో సరిపెట్టకుండా విదేశీ భాషలనూ నేర్పిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో ఉన్న ఈ పద్ధతిని ఇప్పుడిప్పుడే స్టేట్ స్కూల్స్ సైతం ప్రవేశపెట్టాయి. పిల్లల భవిష్యత్‌ని మించిన ది ఇంకేమీ లేదంటున్న తల్లిదండ్రులు కూడా మల్టీ లింగ్యువల్ స్కూల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు! ..:: కోట కృష్ణారావు, సనత్‌నగర్ ఉన్నత చదువుల కోసం ప్రతి ఏటా నగరం నుంచి విదేశాలకు పయనమవుతున్న వాళ్లు లెక్కకుమించి. అక్కడ అందరూ ఎదుర్కొనేది భాషా సమస్య. ఆయా దేశాల భాషలు రాకపోవడం, ఇంగ్లిష్ తెలిసినా... ఇక్కడ మాట్లాడే పద్ధతి, అక్కడి విధానానికి చాలా వ్యత్యాసం ఉండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వివిధ దేశాలకు చెందిన భాషలను నేర్పేందుకు ప్రత్యేక లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు నగరంలో వెలిశాయి. అక్కడికి వెళ్లాక ఇబ్బంది పడటంకంటే ముందుగానే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం బెటరని భావించి నగరంలోని విదేశీ లాంగ్వేజ్ సెంటర్లలో వేలకు వేలు పోసి చిన్ననాటే శిక్షణ తీసుకుంటున్నారు. బాల్యంలోనే బహుళ భాషలు... చిన్నతనంలోనే విదేశీ భాషలు నేర్పించడం వల్ల ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నాయి పాఠశాలలు. అదీగాక చిన్న పిల్లల్లో గ్రాహకశక్తి ఎక్కువ. బాల్యంలో నేర్చుకున్న భాషను ఎన్నటికీ మరిచిపోలేరు. అందుకే పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే విదేశీ భాషలకు బీజం వేస్తున్నారు. నగరంలోని ఓక్రిడ్జ్, కేంద్రీయ విద్యాలయం, చిరెక్, బచ్పన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటివి ఎప్పటి నుంచో ఫారిన్ లాంగ్వేజెస్‌ను సహ పాఠ్యాంశాలుగా చేర్చాయి. దాదాపు అన్ని సీబీఎస్ఈ పాఠశాలలు సెకండ్ లాంగ్వేజ్‌గా విదేశీ భాషలను ప్రవేశపెట్టాయి. ఒక్కో పాఠశాలలో ఒకటి లేదా రెండు విదేశీభాషల బోధనను తప్పనిసరి చేస్తున్నాయి. ఇందుకోసం ఆయా భాషల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులను సైతం నియమిస్తున్నాయి. ఈ ఫారిన్ లాంగ్వేజెస్ సంస్కృతి ఇప్పుడిప్పుడే స్టేట్ పాఠశాలలకు విస్తరిస్తోంది. కొన్ని స్కూళ్లు సెకండ్ లాంగ్వేజ్‌గా ఏదో ఒక విదేశీ భాషను తప్పనిసరి చేయగా, మరికొన్ని స్కూళ్ళలో విద్యార్థుల ఆసక్తిని బట్టి ప్రత్యేక తరగతుల ద్వారా ఆయా భాషలను నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ తరువాత జర్మన్ భాషను సిటీ చిన్నారులు ఎక్కువగా నేర్చుకుంటున్నారు. ‘ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. ఈ క్రమంలో విదేశీ భాషలు సైతం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ముఖ్యంగా జర్మన్ టెక్నాలజీ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఉద్యోగావకాశాలు కూడా బాగా పెరిగిపోయాయి. దాంతో తమ పిల్లలకు జర్మన్ లాంగ్వేజ్‌ను నేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. చిన్నతనం నుంచే భాష నేర్చుకుంటే ఎంతో సులువుగా ఉంటుంది’ అంటున్నారు కేంద్రీయ విద్యాలయంలో జర్మన్ లాంగ్వేజ్ టీచర్‌గా పని చేస్తున్న ప్రీతమ్. కష్టమైనా... ఇష్టమే... అదనంగా ఒక భాష తెలిసిందంటే... అవకాశాలు మరిన్ని పెరిగిన ట్టే. మంచి ఎప్పుడైనా ఆహ్వానించదగిందే... విదేశీ భాషలున్న స్కూల్స్ తెలుసుకుని మరీ పంపుతున్నామంటున్నారు తల్లిదండ్రులు. ఇష్టపూర్వకంగా చదువుతున్న సబ్జెక్ట్ కావడంతో విద్యార్థులు కూడా అంత భారంగా భావించడం లేదు సరికదా ఆసక్తిగా నేర్చుకుంటున్నారని చెబుతున్నారు ఉపాధ్యాయులు. ప్రస్తుతం నగరంలోని స్కూళ్లలో ఎక్కువగా జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్ భాషలు నేర్పిస్తున్నారు. భవిష్యత్ కోసం... మా పాఠశాలలో విద్యార్థులకు స్పానిష్, ఫ్రెంచ్ నేర్పిస్తున్నాం. ఫ్రెంచ్ భాషకు ఆ దేశానికి చెందిన ప్రావీణ్యుడినే నియమించాం. అకడమిక్‌లో ఆ భాషలపై శిక్షణ కోసం ప్రత్యేక తరగతులు కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఉపయోగపడుతుంది. విదేశీ భాషల పట్ల తల్లిదండ్రులూ మక్కువ చూపుతున్నారు. తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. - హేమ చెన్నుపాటి, వైస్ ప్రిన్సిపాల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, గచ్చిబౌలి కొత్తగా ఉంది... నేను జర్మన్ నేర్చుకుంటున్నా. అక్కడక్కడ ఇంగ్లిష్ పదాలు ఉన్నా జర్మన్ లాంగ్వేజ్ డిఫరెంట్. పాఠశాలలో నేర్చుకున్న జర్మన్ గురించి మా సోదరులకు చెబుతూ ఎంజాయ్ చేస్తాను. నిత్యం మాట్లాడుకునే విషయాలను ఆ భాషలో ఏమంటారో తెలుసుకోవడం కొత్తగా ఉంది. జర్మన్ నేర్చుకోవడం చాలా ఈజీ కూడా!. - నిహిత, నాల్గో తరగతి, బచ్పన్ స్కూల్ -
న్యాయస్థానాల్లో తెలుగేదీ?
ప్రస్తుతం న్యాయస్థానాల్లో దాఖలయ్యే దావాలు, అర్జీలు వాటి కి జవాబులు, ఫిర్యాదులు, కక్షిదారులు, వారి సాక్షుల సాక్ష్యా లు, తీర్పులు నూటికి నూరు శాతం ఆంగ్లంలోనే ఉంటున్నాయి. దీనివల్ల కక్షిదారులు తమ వ్యాజ్యాలలో ఏమి జరుగుతున్నదో, ఏమి నమోదవుతున్నదో స్వయంగా తెలుసుకోలేక నష్టపోతు న్నారు. తాను చెప్పదలచిన, చెప్పిన అంశం యథాతథంగా రాశారో లేదో స్వయంగా తెలుసుకునే అవకాశం కక్షిదారునికి లేకుండా పోతున్నది. ఆంగ్లంలో నమోదైన సాక్ష్యాలను, సాక్షుల మాతృభాషలో చదివి వినిపించి సరిగా ఉన్నదని నిర్ధారణ చేసుకునే యంత్రాంగం లేనం దున నమోదైన సాక్ష్యాలపై సాక్షులు, కక్షిదారు అయో మయంగా సంతకాలు చేసి వస్తున్నారు. హిందీ రాష్ట్రా ల్లోని న్యాయస్థానాల్లో హిందీని, తమిళనాడు రాష్ట్రంలో తమిళాన్ని, కర్ణాటక రాష్ర్టంలో కన్నడాన్ని వాడుతున్నా మన రాష్ట్రం లో తెలుగును వాడటం తప్పుగా, చిన్నతనంగా, నామోషీగా భావించే న్యాయమూర్తులు న్యాయవాదులు, సిబ్బంది ఉన్నా రు. సామాన్య ప్రజల కోసం, సామాన్యుల భాషను న్యాయస్థా నాల్లో ఎందుకు వాడరు? న్యాయస్థానాల్లో తెలుగు వాడకం అత్యవసరం కాదా? బ్రిటిష్ పాలన వారసత్వంగా వచ్చిన ఇంగ్లిష్ వాడకాన్ని ఇకనైనా న్యాయస్థానాల నుంచి తొలగిస్తే చాలా మంచిది. కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై -
ఇంటర్ సంస్కృతం పేపర్-2లో మాతృభాషలో సమాధానాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకున్న విద్యార్థులు పేపర్-2లోని ప్రశ్నలకు సమాధానాలను మాతృభాషలో రాసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్-2లోని 1, 2, 3 ప్రశ్నలకు విద్యార్థులు వారి మాతృభాష, లేదా వారు ఎంచుకున్న భాషలో సమాధానాలు రాయవచ్చని వివరించారు. 2015 మార్చి పరీక్షలనుంచి అమలయ్యే ఈ విధానం అయిదేళ్లపాటు కొనసాగుతుందని తెలిపారు. -
ఎదగనీ నవతరం చెట్టై, తల్లిభాషే తల్లివేరై !!
పద్యానవనం: చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టు దట్టి సందెతాయెతలును సరిమువ్వ గజ్టెలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు! ఎప్పుడో చిన్నప్పటి పద్యం. ఇంకా గుర్తుందంటే, దాని బలం అలాంటిది. తరాల తరబడి ఈ పద్యం జనం నాలుకల మీద నాట్యమాడుతోందంటే ఏదో మంత్రశక్తి ఈ పద్యంలో దాగుంది. చాలా చిన్నపుడు మా అక్కలో, కానిగిబడి పంతులో... సర్కారు పంతులో... సరిగ్గా గర్తులేదు కానీ, ఎవరో నేర్పించారు. ఇంకా చాలా నేర్పించారు. అందులో కొన్ని గట్టిగా స్థిరపడిపోయాయి. కొన్ని కాలక్రమంలో ఎగిరిపోయాయి. ‘ఛుక్ ఛుక్ రైలూ వస్తుంది... అందరు పక్కకు జరగండి... ఆగీనాక ఎక్కండి.... జోజో పాపా ఏడవకు.... లడ్డూ మిఠాయి తినిపిస్తా....హోటల్ కాఫీ తాగిపిస్తా!’ అని కూడా నేర్పించారు. ఇది నాతో పాడించినపుడు, నాకెంత ఆనందమో! నేర్పించిన వాళ్ల ముఖాలూ వెలిగిపోయేవి. నాకన్నా ఎక్కువ ఆనందం నాకు నేర్పించిన వాళ్లకు కలిగిందని, నేను పెద్దయి పిల్లలకి నేర్పినపుడు అర్థమైంది. చిన్ని కృష్ణుడ్ని చేరి కొలిచే సంగతెలా ఉన్నా, చిన్న చిన్న పిల్లల్ని మాత్రం చాలా మందికి ఇటువంటి పాటలు, పద్యాలతో నే చేరువైన మాట మాత్రం నిజం. ‘పాటలు, పద్యాలు పాడుకుందాం రండి’ అని ఓ జనరల్ కాల్ ఇస్తే, కొందరొచ్చేవారు. ఇంకొందరు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. దూరంగా ఉండి గమనించే వారు. చిన్న పిల్లల్ని మచ్ఛిక చేసుకొని ఒక్కో పదం పలికిస్తూ పాటలు, పద్యాలు పాడిస్తుంటే, అంతవరకు రామని మొరాయించిన వాళ్లు కూడ ఒక్కరొక్కరే వచ్చి చేరేది. వాళ్లలో వాళ్లకు పోటీ పెడితే ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఆ వాతావరణం! మాతృ భాష మాధుర్యమది. మెదడు వికసించే బాల్య దశలో తల్లి భాషలో చెప్పే అంశాలు బలంగా నాటుకొని జీవితకాలం పాటు వార్ని ప్రభావితం చేస్తాయి. ‘చందమామ రావే! జాబిల్లి రావే! కొండలెక్కి రావే! గోగుపూలు తేవే!’ అని కౌసల్య పాడుతూ గోరుముద్దలు తినిపిస్తుంటే, ముద్దలు మింగుతూ రాముడు కేరింతలు కొట్టేవాడని చదువుకున్నాం. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, రష్యా, జపాన్ ఇలా అభివృద్ధి చెందిన ఏ దేశం తీసుకున్నా... శైశవ దశలో వారికి విద్యా బోధన జరిపించేది మాతృభాషలోనే! ప్రతి ప్రగతికాముక దేశంలోనూ బాల్యంలో బలమైన, ప్రభావవంతమైన ముద్ర వేసేది తల్లి భాష, ఆ భాషలో చెప్పే తేలికపాటి విషయాలే అన్నది సశాస్త్రీయంగా దృవపడిన విషయం. తెలుసో? తెలియదో? చాలా మంది తెలిసీ తెలియనట్టు నటిస్తున్నారో? ఇంగ్లీషు చదువుల మోజులో పడి తెలుగుభాషను నిరాదరణకు గురి చేస్తున్నారు. ‘మా వాడికి తెలుగు ముక్క రాదు, తెలుసా!’ అని గర్వంగా చెప్పుకునే తలిదండ్రులున్నారు. ‘జానీ జానీ....? ఎస్ పప్పా! ఈటింగ్ షుగర్....? నో పప్పా! టెల్లింగ్ లైస్...? నో పప్పా! ఓపెన్ యువర్ మౌత్....? హ్హ హ్హ హ్హ!!’ చక్కటి ఇంగ్లీష్ రైమ్. అలతి అలతి పదాలవటం వల్లో, విషయపరంగా తండ్రీకొడుకుల నడుమ సాగే సున్నితమైన దోబూచులాట అవటం వల్లో... ఇంగ్లీషు భాష చలామణిలో ఉన్న ప్రతిచోటా ఇదొక హిట్! అలాంటి సాహితీ సృజన తెలుగులోనూ విరివిగా జరగాలి. మారుతున్న కాలమాన పరిస్థితుల్ని బట్టి పిల్లల అభిరుచుల్ని పరిగణనలోకి తీసుకొని చిన్న చిన్న మాటలు, పదాలతో... పాటలు, పద్యాలు కోకొల్లలుగా పుట్టుకురావాలి. భాష కొంత గ్రాంథికమైనపుడు ‘చేతవెన్న ముద్ద....’ పుట్టి ఉంటుంది. తర్వాత్తర్వాత పిల్లల కోసం చక్కటి తెలుగు గేయాలు, పాటలు రాలేదని కాదు. ‘‘బాలు బాలు- పెద్ద బాలు, కాళ్లు లేవు చేతులు లేవు, పొట్టనిండ తిను ఎగురు దుంకు!’’ లాంటి తేలిక మాటల గేయాలు, పద్యాలు కూడా వచ్చాయి. ‘‘బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెడితివి? రాజుగారి తోటలోన తిరగ వెళ్తిని, రాజుగారి తోటలోన ఏమి చేస్తివి? తోటలోని మంచి పూల సొగసు చూస్తిని, సొగసు చూస్తే రాజు గారు ఊరకుండిరా? తోటమాలి కొట్టవస్తె తుర్రుమంటిని’’ లాంటి గేయాలు ఏ ఇంగ్లీషు రైమ్స్కి తీసిపోనివిగా పిల్లల్ని ఆకట్టుకున్నాయి. ఉద్యోగ-ఉపాధి అవకాశాల కోసం, విశ్వనరులుగా ఎదగడం కోసం పిల్లలకు ఇంగ్లీషు నేర్పండి, తప్పులేదు. మంచి విద్యావకాశాల కోసం ఇంగ్లీషు మాధ్యమంగానే కోర్సులు చదివించండి అభ్యంతరం లేదు. అదే సమయంలో, మేధో-వ్యక్తిత్వ వికాసానికి తల్లి భాషనూ నేర్పించండి. అంటే, విధిగా రాయడం, చదవటం వచ్చేలా చేసే ప్రక్రియ ఓ ఉద్యమంలా సాగాలి. అందుకు బాల్యమే మంచి సమయం. తల్లిదండ్రులారా కొంచెం చొరవ చూపండి. - దిలీప్‌రెడ్డి -
ఆదాయానికి అనువైన మార్గం.. అనువాదం!
అప్‌కమింగ్ కెరీర్ ఒక భాషలో ఉన్న ప్రాచీన సాహిత్యాన్ని, విలువైన గ్రంథాలను చదవాలంటే ఆ భాషను స్వయంగా నేర్చుకోవాల్సిన పనిలేదు. మాతృభాషలోకి తర్జుమా చేసిన పుస్తకాలను చదివితే సరిపోతుంది. అనువాదం ద్వారా ప్రపంచ సాహిత్యం అన్ని భాషల ప్రజలకు చేరువవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో అనువాదానికి గిరాకీ పెరుగుతోంది. గ్రంథాలు ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనువాదకులకు(ట్రాన్స్‌లేటర్స్) డిమాండ్ నానాటికీ విస్తృతమవుతోంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకున్నవారికి దేశవిదేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే ట్రాన్స్లేషన్ కోర్సుల్లో చేరే ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోంది. అవకాశాలు.. పుష్కలం ప్రపంచీకరణతో అన్నిదేశాల మధ్య వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. కార్పొరేట్, బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో అడుగుపెడుతున్నాయి. అక్కడ కార్యకలాపాల నిర్వహణకు స్థానిక భాషలు తెలిసినవారిని నియమించుకుంటున్నాయి. రవాణా, పర్యాటక రంగాల్లో అనువాదకులకు భారీ డిమాండ్ ఉంది. ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మాస్ కమ్యూనికేషన్, రిలీజియన్ వంటి వాటిలో అవకాశాలకు కొదవే లేదు. విదేశీ భాషలను నేర్చుకొనేవారి సంఖ్య పెరుగుతుండడంతో ట్రాన్స్లేటర్లకు ఫారిన్ లాంగ్వేజ్ టీచర్లుగా ఉపాధి లభిస్తోంది. బోధన, శిక్షణపై ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లోనూ ఫ్యాకల్టీగా స్థిరపడేందుకు వీలుంది. ట్రాన్స్లేషన్ కోర్సును పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సులువుగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆంగ్లంతోపాటు జర్మనీ, ఫ్రెంచ్ వంటి భాషలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఆయా భాషలను నేర్చుకున్నవారికి ఎన్నో రంగాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయి. అనువాదాన్ని కెరీర్‌గా మార్చుకున్నవారికి ఉద్యోగాలు, ఉపాధి పరంగా ఢోకా ఉండదని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. కావాల్సిన లక్షణాలు: అనువాదం అనేది ఒక సృజనాత్మక కళ. అది ఒక్కరోజులో వచ్చేది కాదు. నిరంతర సాధనతోనే పాఠకులు మెచ్చే అనువాదం సాధ్యమవుతుంది. ఈ రంగంలో పనిచేయాలంటే భాషలపై అనురక్తి ఉండాలి. అందులో లోటుపాట్లను తెలుసుకోవాలి. ఒక గ్రంథంలోని భావం మారిపోకుండా దాన్ని మరో భాషలోకి తర్జుమా చేసే నేర్పు సాధించాలంటే నిత్యం నేర్చుకొనే తత్వం ఉండాలి. వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ట్రాన్స్‌లేషన్‌లో అవి ప్రతిఫలించాలి. అర్హతలు: మనదేశంలో పలు విద్యాసంస్థలు ట్రాన్స్లేషన్ స్టడీస్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. దూర విద్యా విధానంలోనూ కోర్సులున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. ఇందులో ఉన్నత విద్యనభ్యసించినవారికి మంచి అవకాశాలుంటాయి. వేతనాలు: అనువాదకులకు అనుభవం, పనితీరును బట్టి వేతనాలు లభిస్తాయి. ఇంటర్ప్రిటేటర్స్కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియారిటీని బట్టి నెలకు రూ. 50 వేలకుపైగానే పొందొచ్చు. ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్లకు డాక్యుమెంట్ ఆధారంగా ఆదాయం ఉంటుంది. ఫుల్‌టైమ్ ట్రాన్స్‌లేటర్లు ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు పైగా అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.efluniversity.ac.in ద్రవిడియన్ యూనివర్సిటీ. వెబ్సైట్: www.dravidianuniversity.ac.in ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్. వెబ్సైట్: www.ntm.org.in యూనివర్సిటీ ఆఫ్ లక్నో. వెబ్సైట్: www.lkouniv.ac.in యూనివర్సిటీ ఆఫ్ పుణె. వెబ్సైట్: www.unipune.ac.in అన్ని భాషల్లో అవకాశాలు ‘‘ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ భాషల అనువాద నిపుణులకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం సాహిత్య రంగంలో పుస్తకాల అనువాదానికే పరిమితం కాకుండా శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ వీరి అవసరం పెరుగుతోంది. ఇంటర్ప్రిటేటర్స్గా కూడా పనిచేయొచ్చు. ఒక వ్యక్తి సంభాషణను అప్పటికప్పుడు అనువాదం చే సేవారే ఇంటర్‌ప్రిటేటర్స్. వీరికి అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలున్నాయి. దాదాపు అన్ని భాషల్లో ట్రాన్స్లేటర్స అవసరం ఉంటుంది. ప్రధానంగా ఇంగ్లిష్‌తోపాటు యూరోపియన్ భాషలు నేర్చుకున్న వారికి అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ తదితర భాషల నుంచి తొలుత ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేస్తుండడమే దీనికి కారణం. తర్వాతే ఇంగ్లిష్ నుంచి మాతృభాషల్లోకి అనువదిస్తున్నారు’’ - డా. కె. వెంకట్‌రెడ్డి, రిజిస్ట్రార్, ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ, హైదరాబాద్ -
టిబెట్ స్వేచ్ఛాగానం
నిషిద్ధ ప్రాంతంగా మారిన మాతృభూమికి వెళ్లేందుకు సరిహద్దులు దాటిన కవి అతడు. సరిహద్దులకు ఆవల తన మాతృభూమి దుస్థితిని కళ్లారా చూసి చలించి, స్వేచ్ఛాగానాన్ని ఎలుగెత్తి వినిపిస్తున్న కవి అతడు. భారత్‌లో స్థిరపడ్డ ప్రవాస టిబెటన్ల కుటుంబంలో పుట్టాడు టెన్జిన్ సన్‌డ్యూ. చదువు సంధ్యలన్నీ భారత్‌లోనే. చెన్నైలో చదువు పూర్తి చేసుకున్నాక, మిత్రుల నుంచి సేకరించిన విరాళాలతో స్వస్థలమైన టిబెట్ వెళ్లాడు. చైనా సరిహద్దు పోలీసులకు పట్టుబడి, లాసా జైలులో గడిపాడు. చైనా పోలీసులు అతడిని తిరిగి భారత్‌కు పంపేశారు. టిబెట్ స్వేచ్ఛ కోసం విద్యార్థి దశ నుంచే టెంజిన్ కవిత్వం రాస్తున్నాడు. టిబెట్ స్వేచ్ఛా పోరాట కార్యకర్తగా పనిచేస్తున్నాడు. దేశ విదేశాల్లో విరివిగా కవితా పఠన కార్యక్రమాల్లో పాల్గొంటున్న టెన్జిన్, సోమవారం హైదరాబాద్ వచ్చాడు. అవర్ సేక్రెడ్ స్పేస్‌లో తన కవిత్వాన్ని వినిపించాడు. టెన్జిన్ స్వేచ్ఛాగానాన్ని ఆలకించిన శ్రోతలు మంత్రముగ్ధులయ్యారు. - సాక్షి, సిటీప్లస్ -
పరభాషను ఒడిసిపట్టి.. వైవిధ్య కొలువు తలుపుతట్టి!
విదేశీ భాషలను నేర్చుకోవడంలో ముందుంటున్న నగర యువత మాతృభాష.. మనిషి మేధో వికాసానికి విలువైన వారధి! అలాంటి అమ్మ భాష ఆసరాగా విద్యా సుమాలను అందుకుంటూ, పరభాషలో ప్రావీణ్యం పెంచుకుంటోంది భాగ్యనగరం యువత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ.. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చుతున్న వేళ.. విదేశీ భాషా నైపుణ్యాలున్న వారికి కార్పొరేట్ ప్రపంచం ఆకర్షణీయ వేతనాలతో స్వాగతం పలుకుతోంది. అందుకే విదేశీ భాషను ఒడిసిపట్టి, వైవిధ్యమైన కొలువును చేజిక్కించుకుంటామంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్.. ఐటీ రంగంలో దూసుకెళ్తుతున్న నగరం. అనేక విదేశీ కంపెనీలు భాగ్యనగరంలో ప్రవేశించి వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేసుకుంటున్నాయి. ఇక్కడి కంపెనీలు కూడా విదేశీ కంపెనీలతో జతకడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు, ప్రాజెక్టుల అప్పగింత వంటి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు విదేశీ భాషా నైపుణ్యాలున్నవారు అవసరమవుతున్నారు. విదేశాల్లో చదువుకొని అక్కడే కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకున్నవారు అధికమయ్యారు. ఇలాంటి వారు కూడా ఫారెన్ లాంగ్వేజ్‌లను నేర్చుకుంటున్నారు. నగరానికి చెందిన భార్యభర్తలు ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. ఓ కంపెనీలో గత రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రముఖ కంపెనీ అడోబ్‌కు దరఖాస్తు చేసుకుంటే.. జర్మన్ భాషా పరిజ్ఞానం కలిగిన భార్యకు కంపెనీని నుంచి ఆఫర్ వచ్చింది. దాంతో భర్తకు కూడా జర్మనీ నేర్పించే పనిలో పడింది ఆ ఇల్లాలు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏలు చదివి ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్స్‌కు ఫ్రెంచ్, జర్మనీ, జపనీస్, ఇటాలియన్, స్పానిష్ లలో ఏదో ఒక భాష వచ్చి ఉండటం కెరీర్ ఉన్నతికి, మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకోవడానికి దోహదపడుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నగరంలోని పలు సంస్థలు విదేశీ భాషలకు సంబంధించి వివిధ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. అదనపు అర్హత: ఒక్క ఐటీ కంపెనీల్లోనే కాదు.. బ్యాంకింగ్, విద్య, వైద్యం తదితర రంగాల్లో ఉద్యోగాలు సంపాదించేందుకు విదేశీభాషా నైపుణ్యాలు అదనపు అర్హతగా ఉపయోగపడతాయంటున్నారు ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రొఫెసర్లు. కర్నూలు జిల్లా నుంచి నగరానికి వచ్చిన అనంతరాములు స్నేహితులతో కలిసి ‘లాటిన్’ నేర్చుకున్నాడు. విదేశీ బ్యాంకు హైదరాబాద్‌లో శాఖను ప్రారంభించి, ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. ఓ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూకు వచ్చిన వారితో పోల్చితే రాములుకు తక్కువ మార్కులు వచ్చినా, లాటిన్ భాష ప్రత్యేకత ఉన్న ఆయన్నే ఉద్యోగం వరించింది. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చిన యువతకూ విదేశీ భాషలు ఉద్యోగ అవకాశాలకు ఆయువుపట్టుగా మారుతున్నాయి. అవకాశాలు ఇలా: విదేశీ భాష కోర్సులను పూర్తిచేసిన వారిలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్లేషన్. విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు, వ్యాపార నివేదికలు, ఒప్పంద పత్రాలు వంటి వాటిని తర్జుమా చేసేందుకు ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. ఒకరి మాటలను అనువదించి మరొకరికి అప్పటికప్పుడు వినిపించడమే ఇంటర్‌ప్రెటర్స్ పని. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలకు ఇంటర్‌ప్రెటర్స్ అవసరం ఉంటుంది. సదస్సులు, ఒక దేశ వాణిజ్య బృందం మరొక దేశంలో పర్యటించే సమయంలోనూ ఈ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే క్రమంలో విమానయాన, పర్యాటక, ఆతిథ్య సంస్థలు ఉద్యోగ నియామకాల్లో విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. విదేశీ భాషల కోర్సులు పూర్తిచేసిన వారికి మరో ఉపాధి వేదికగా బోధన రంగం ఉంటోంది. విదేశీ భాషలను నేర్చుకోవాలనుకుంటున్న ఔత్సాహికులు ఎక్కువ కావడంతో.. ఫ్యాకల్టీకి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆయా సంస్థలు.. తమ దగ్గర కోర్సులు పూర్తిచేసిన వారికి, వెంటనే భారీ వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం పలు కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు విదేశీ భాషల కోర్సులను నిర్వహిస్తున్నాయి. విదేశీ భాషల్లో పట్టు సాధించినా, పూర్తిస్థాయి ఉద్యోగంపై ఆసక్తి లేని వారు ఫ్రీలాన్సింగ్ ద్వారా అధిక మొత్తాలను ఆర్జిస్తున్నారు. సొంతంగా భాష శిక్షణ కేంద్రాలను, ట్రాన్స్‌లేటింగ్, ఇంటర్ప్రెటింగ్ సేవల సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. దూరవిద్యలో: విదేశీ భాషలు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఇఫ్లూ ‘ది స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్’ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ, విదేశీ భాషలను నేర్పిస్తోంది. విదేశీ భాషలు నేర్చుకునేందుకు అవసరమైన పుస్తకాలను సైతం విక్రయిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని జర్మనీ సాంస్కృతిక సంస్థ గోథె జంత్రం (ఎౌ్ఛ్టజ్ఛ్డ్ఛ్టిటఠఝ) జర్మన్ భాషను, అలియన్స్ ఫ్రాంచైజ్ ఫ్రెంచి భాషలో కోర్సులను అందుబాటులో ఉంచాయి. విద్యార్థుల రోజువారీ చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా ఉదయం, సాయంత్రం బ్యాచ్‌లను నడుపుతున్నాయి. దోమలగూడలోని రామకృష్ణమఠం ఆధ్వర్యంలోని ‘వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్’.. ఏటా జనవరి, జూన్, సెప్టెంబరు నెలల్లో విదేశీ భాషల తరగతులను నిర్వహిస్తోంది. ఇక్కడ సంస్కృతం, హిందీతో పాటు ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచి, జపనీస్, స్పానిష్ వంటి విదేశీ భాషలను నేర్పుతున్నారు. ఔత్సాహికులు తమకు అనువైన సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. గతేడాది ఇక్కడ విదేశీ భాషలు నేర్చుకునేందుకు నాలుగు వేల మందికిపైగా ఆసక్తి కనబరచడం విశేషం. ఫీజులు: విదేశీ భాషలు నేర్చుకునేందుకు స్థాయిలనుబట్టి (లెవెల్ 1, లెవెల్ 2..) ఫీజులు వసూలు చేస్తున్నారు. సంస్థను బట్టి ఈ ఫీజులు రూ.1200 నుంచి రూ.5 వేల వరకు ఉంటున్నాయి. జర్మన్, ఫ్రెంచ్ భాషలకు అధిక ఫీజులుంటున్నాయి. ప్రముఖ సంస్థలు: హైదరాబాద్‌లో ప్రధాన క్యాంపస్‌ను కలిగిన ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి.. విదేశీ భాషల కోర్సుల నిర్వహణలో మంచి పేరుంది. ఇఫ్లూ.. జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్ వంటి భాషల కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఏ, ఎంఏ స్థాయిలో కోర్సులను అందిస్తోంది. రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో పీహెచ్డీ కూడా ఉంది. వెబ్సైట్: www.efluniversity.ac.in రామకృష్ణమఠం: జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషల తరగతులు నిర్వహిస్తోంది. వెబ్సైట్: www.rkmath.org గోథె జంత్రం (Goethe-zentrum): జర్మన్లో ఎక్స్టెన్షివ్, ఇంటెన్షివ్ తదితర కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.goethe.de అలియన్స్ ఫ్రాంచైజ్: ఫ్రెంచ్ భాషలో శిక్షణ ఇస్తోంది. వెబ్సైట్: www.alliancefranchise.org విదేశీభాషపై పట్టు సులభమే ఇతర భాషలను నేర్చుకోవటమంటే.. వారి సంస్కృతీ, సంప్రదాయాలను అర్థంచేసుకోవటమే. కేవలం ఉద్యోగావకాశాలకేకాకుండా.. ఆయా దేశాల ప్రజల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, చరిత్ర తెలుసుకునే గొప్ప అవకాశం. ఇఫ్లూలో యూజీ నుంచి పీహెచ్ డీ వరకూ కోర్సులున్నాయి. ఇవిగాకుండా బయటి విద్యార్థుల కోసం సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. వీటికి జనవరి-ఏప్రిల్, ఆగస్టు-నవంబరు నెలల్లో క్లాసులు ప్రారంభిస్తుంటాం. ప్రపంచీకరణ ప్రభావంతో విదేశీభాషలు నేర్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలకు ఢోకాలేదు. ఇఫ్లూలో బీఏ ఫైనలియర్లో ఉన్నప్పుడే ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. టెలిమార్కెటింగ్, బీపీవో, బ్యాంకింగ్, విదేశీ మంత్రిత్వశాఖ, దుబాసీలుగా మంచి అవకాశాలున్నాయి. ఫ్రెంచి, జర్మన్, స్పానిష్, అరబిక్, జపనీస్ భాషలకు మంచి క్రేజ్ ఉంది. వీటిలో ఫ్రెంచ్, జర్మన్లదే హవా అని చెప్పాలి. ఇంగ్లిషును తేలిగ్గా నేర్చుకునే ఇక్కడి విద్యార్థులు మరికొంత శ్రమిస్తే.. విదే శీభాషలు అలవోకగా నేర్చుకోవచ్చు. -వెంకటరెడ్డి, రిజిస్ట్రార్(ఇఫ్లూ) -
తెలుగులో బోల్తా పడ్డారు!
- టెన్త్‌లో గణితం తర్వాత మాతృభాషలోనే ఎక్కువ మంది ఫెయిల్ - కేవలం 15 వేల మందికే ఇంగ్లీష్‌లో ఏ1 గ్రేడ్ సాక్షి, హైదరాబాద్: ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థుల కొంప ముంచింది గణితమే. లెక్కలు రావడం లేదు సరే అనుకున్నా మాతృభాషలో గట్టెక్కలేక చతికిల పడ్డ విద్యార్థులూ ఎక్కువగానే ఉన్నారు. లెక్కలు తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు తప్పింది తెలుగులోనే. పదో తరగతి ప్రథమ భాషలో తెలుగు/హిందీ/ఉర్దూ తీసుకోవడానికి అవకాశం ఉం ది. రాష్ట్రంలో ప్రథమభాషగా తెలుగు తీసుకున్న వి ద్యార్థుల సంఖ్య ఎక్కువ. తర్వాత స్థానం ఉర్దూ తీసుకున్న వారిది. గణితంలో గరిష్టంగా 6.17 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కాగా 4 శాతం మంది ప్రథమ భాషలో గట్టెక్కలేకపోయారు. మాతృభాషలో ఫెయిల్ అయిన వారి శాతం గతేడాది కంటే 0.65 శాతం ఎక్కువగా ఉంది. మాతృభాష కాని ద్వితీయ భాష(తెలుగు/హిందీ)లో కనిష్టంగా 1.73 శాతం మంది విద్యార్థులే ఫెయిల్ అయ్యారు. ద్వితీయభాష ఉత్తీర్ణత మార్కులు 18 కావడం కూడా ఉత్తీర్ణత శాతం పెరగడానికి కారణమని భావిస్తున్నారు. ఇంగ్లిష్ మహాకష్టం మన విద్యార్థులకు ఇప్పటీకీ మింగుడుపడని సబ్జెక్టు ఇంగ్లిషే. ఆంగ్లంలో 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పాసయితే.. అందులే 1.44 శాతం మంది అంటే కేవలం 15,328 మందికే ఏ1 గ్రేడ్ వచ్చింది. లెక్కల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయి ల్ అయినా ఆంగ్లంతో పోలిస్తే లెక్కల్లో ఏ1 గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. -
మళ్లీ ‘మాధ్యమ’ వివాదం!
సంపాదకీయం: ప్రాథమిక పాఠశాలల స్థాయిలో బోధన ఎలా ఉండాలి? అది మాతృభాషలో ఉంటే మంచిదా, ఇంగ్లిష్‌లోనా అనే వివాదం చాలా పాతది. లేలేత వయసు పిల్లలకు బుద్ధి వికాసానికైనా, గ్రహణ శక్తికైనా, ధారణకైనా...ఇంకా చెప్పాలంటే అభివ్యక్తీకరించడానికైనా మాతృభాష ను మించిన ఉత్తమ సాధనం లేదని విద్యారంగ నిపుణులు చెబుతారు. నిజానికి మాతృభాషపై పట్టు సాధించిన విద్యార్థే ఇంగ్లిష్‌తోసహా ఏ భాషనైనా సులభంగా నేర్చుకోవడం సాధ్యమవుతుందన్న అభిప్రాయ మూ ఉంది. బోధనా భాష ఏవిధంగా ఉండాలన్న అంశంలో తల్లిదం డ్రులపైగానీ, విద్యా సంస్థలపైగానీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునివ్వడంతో ఈ చర్చ మరోసారి ఎజెండాలోకి తెచ్చింది. ప్రభుత్వ గుర్తింపును ఆశించే ప్రతి విద్యా సంస్థలోనూ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకూ విధిగా కన్నడ మాధ్యమంలోనే బోధన ఉండాలని 1994లో కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఇంగ్లిష్ మాతృభాషగా ఉన్న విద్యార్థులకు తప్ప మిగిలినవారందరికీ ఈ నోటిఫికేషన్ వర్తిస్తుందని తెలిపింది. కొన్నేళ్లక్రితం ఈ నోటిఫికేషన్‌ను అనుసరించని అనేక విద్యాసంస్థల గుర్తింపును ప్రభుత్వం రద్దుచేసింది కూడా. భాషాభిమానం అధికంగా ఉండే కన్నడ గడ్డ ఈ తీర్పుతో సహజంగానే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నది. రచయితలు, కవులు, కళాకారులు, భాషాభిమానులు ఏకమై తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలుచేయాలని, అవసరమైతే తీర్పును వమ్ముచేయడానికి రాజ్యాంగ సవరణకు కూడా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. వాస్తవానికి బోధనకు సంబంధించి త్రిభాషా సూత్రాన్ని అనుస రించమని 2005లో ఆమోదించిన జాతీయ పాఠ్య ప్రణాళికా నమూనా సూచించింది. అదే సమయంలో మాతృభాషే ఉత్తమ బోధనా మాధ్య మమని కూడా తెలిపింది. చెప్పాలంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టి వేసిన నోటిఫికేషన్ దానికి అనుగుణమై నదే. దాని ప్రకారం నాలుగో తరగతి వర కూ కన్నడ మాధ్యమాన్ని తప్పనిసరి చేసినా అయిదో తరగతి నుంచి ఎలాంటి ఆంక్షలూ ఉండవు. విద్యార్థి తల్లిదం డ్రులు కోరుకున్న మాధ్యమంలో బోధన చేయవచ్చు. తరచిచూస్తే ఇందులో ఆక్షేపించదగ్గదేమీ కనబడదు. చిన్న వయసు పిల్లలపై అంతవరకూ పరిచయంలేని ఇంగ్లిష్ రుద్దడంవల్ల వారి మనోవికాసా నికి అది ఆటంకంగా మారుతుంది. మాతృభాషలో ఎంతో కొంత నేర్చుకున్నాక మాత్రమే ఇంగ్లిష్ మాధ్యమాన్ని అమలు చేయవచ్చున న్నది కర్ణాటక సర్కారు ఆలోచన. అయితే, ఇందులో మరికొన్ని కోణాలు ఇమిడి ఉన్నాయి. ఒక మాధ్యమాన్ని మాత్రమే బోధించాలని విద్యా సంస్థలపై ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చునా... అలా విధించే ఆంక్షలు విద్యాసంస్థల ఏర్పాటుకు పౌరులకుండే హక్కులను హరించ డంలేదా... బోధనా మాధ్యమాన్ని ఎంచుకోవడానికి విద్యార్థుల తల్లి దండ్రులకుండే స్వేచ్ఛను ఇది ఆటంకపరచడం కాదా వంటి ప్రశ్నలు తలెత్తుతాయి. వీటన్నిటినీ మించి భాషాపరంగా మైనారిటీలుగా ఉండే వారు ఈ నోటిఫికేషన్ కారణంగా అన్యాయానికి గురయ్యే అవకాశం ఉండదా అనేది మరో ప్రశ్న. ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రేతర ప్రాంతాలనుంచి ఉపాధి కోసం వచ్చేవారు తమ పిల్లలను వారికి పరిచ యంలేని కన్నడ మాధ్యమంలోనే చదివించాల్సి ఉంటుంది. అంటే... మాతృభాషలో విద్యాబోధన జరగాలని పట్టుబట్టేవారు ఇంగ్లిష్‌కు సం బంధించి ఏ అభ్యంతరాన్నయితే చెబుతున్నారో...రాష్ట్రేతర ప్రాంతాల వారు కూడా కన్నడ మాధ్యమానికి ఆ రకమైన అభ్యంతరమే చెబుతున్నారు. మాతృభాషలో బోధన ఉంటేనే పిల్లల అవగాహనా శక్తి వికసిస్తుం దన్న నిపుణుల అభిప్రాయంతో సుప్రీంకోర్టు విభేదించడంలేదు. విద్యా సంస్థను గుర్తించడానికి దాన్నొక షరతుగా విధించడాన్నే ప్రశ్నిస్తున్నది. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగకరమని చెబుతు న్నది. మాతృభాషలో బోధించాలన్నది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని, దాన్ని అమలు చేయాలన డంలో రాజ్యాంగ విరుద్ధత ఏమున్నదని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తు న్నది. ఎక్కడైనా 30 శాతంమందికి పైగా విద్యార్థులు పరాయిభాషలో విద్యాభ్యాసం చేస్తుంటే వారి మాతృభాష ఉనికి ప్రమాదంలో పడిందని తెలుసుకోవాలని పదేళ్లక్రితం యునెస్కో సంస్థ హెచ్చరించింది. మాతృ భాషలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని సూచించింది. ఇంగ్లిష్ బోధనామాధ్యమంగా చదువుకునే విద్యార్థులతో మాతృభాషలో చదువుకునే విద్యార్థులు చదువులోనూ, ఉపాధి అవకాశాల్లోనూ కూడా పోటీపడలేకపోతున్నారని అయిదేళ్ల క్రితం ఈ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తూ సుప్రీంకోర్టు అభిప్రాయప డింది. పేదవర్గాల్లో చాలామంది ఈ ధోరణిని గుర్తించే తమ పిల్లలకు ఇంగ్లిష్ చదువులు నేర్పించాలని తహతహలాడుతున్నారు. తమలా తమ పిల్లలు బతకకూడదనుకుంటే ఇది తప్పనిసరని వారు భావిస్తు న్నారు. ప్రాథమిక స్థాయిలో బోధనా మాధ్యమంగా మాతృభాషను ఉంచుతూనే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులకు కల్పిస్తే ఇలాంటి వివాదాలుండవు. దీనికి తోడు ఇంగ్లిష్ బోధనా మాధ్యమంగా ఉండేవారికి మాతృభాషను ఒక సబ్జెక్టుగా నేర్చుకోవడం తప్పనిసరి చేయడం... మాతృభాష బోధనామాధ్యమం ఉన్నవారికి ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా పరిచయం చేయడంలాంటి చర్యలు తీసుకోవాలి. బోధనామాధ్యమం ఎలా ఉండాలన్న అంశాన్ని స్వీయ భాషాభిమాన కోణంలోనుంచి మాత్రమే చూస్తే సమస్యకు పరిష్కారం లభించదని అందరూ గుర్తించాలి. -
మాతృభాష తప్పనిసరి కాదు
* బోధనా భాషను ఎంచుకునే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని స్పష్టీకరణ * కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేసిన రాజ్యాంగ ధర్మాసనం న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: ప్రాథమిక విద్యాభ్యాసానికి గాను పాఠశాల ల్లో మాతృభాషను ప్రభుత్వం తప్పనిసరి చేయజాలదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భాషాపరమైన అల్ప సంఖ్యాకులపై బలవంతంగా స్థానిక మాతృ భాషను రుద్ద కూడదని తెలిపింది. రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. ప్రాథమిక విద్యను నేర్చుకునేందుకు మాతృ భాషను తప్పనిసరి చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు విధిగా కన్నడ మీడియంలోనే బోధించాలని 1994లో కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు సవాలు చేశాయి. హైకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తొలుత ఇద్దరు సభ్యుల సుప్రీం బెంచ్ ముందుకు ఈ అంశం వచ్చింది. సదరు బెంచ్ గత ఏడాది జూలైలో.. పిల్లల అభ్యున్నతిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుందని తెలియజేసింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న అంశం ప్రస్తుత తరమే కాకుండా భవిష్యత్ తరాల ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్ లోధా నేతృత్వంలో న్యాయమూర్తులు ఎ.కె.పట్నాయక్, ఎస్.జె.ముఖోపాధ్యాయ, దీపక్ మిశ్రా, ఎస్.ఎం.ఐ.కలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. రాజ్యాంగంలోని 350 ఏ ప్రకారం.. కేవలం మాతృభాషనే బోధనా మాధ్యమంగా ఎంచుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేయజాలదని పేర్కొంటూ తీర్పు చెప్పింది. విద్యార్థికి మరింత ప్రయోజనకరమనే కారణంతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా బలవంతం చేయజాలదని స్పష్టం చేసింది. మాతృభాషను తప్పనిసరి చేయడం విద్యా ప్రమాణాలపై ఏ విధంగానూ ప్రభావం చూపించదని, పైగా రాజ్యాంగంలోని అధికరణాలు 19(1)(ఏ), 19(1)(జీ) కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు ప్రభావం చూపుతాయని ధర్మాసనం పేర్కొంది. ప్రాథమిక పాఠశాలలో బోధన కోసం భాషను ఎంచుకునే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని స్పష్టం చేసింది. -
మాతృభాషను మరువొద్దు
చెన్నై, సాక్షిప్రతినిధి: ఉమ్మడి తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వారి సేవలు అనంతమని గవర్నర్ కె.రోశయ్య పేర్కొన్నారు. ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన తెలుగు నాట తెలుగువారి త్రిసంగ మహోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ తిరుమల నాయకర్, వీరపాండ్య కట్ట బ్రహ్మన్ వంటి మహామహులు తెలుగువారా, తమిళులా అనే విచక్షణను పక్కనపెట్టి వారు ఉమ్మడి తమిళనాడు రాష్ట్రానికి అందించిన సేవలు గుర్తు చేసుకోవాలని అన్నారు. తమిళనాడులోని తెలుగువారు మాతృభాషపై అభిమానం పెంచుకోవాలని, ఇతర భాషల పట్ల ద్వేషభావం కూడదని హితవుపలికారు. తెలుగువాడిగా అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకోవడం సమర్థనీయమని, అలాగే మాతృభాషను మాత్రం మరువరాదని అన్నారు. విదేశాల్లో తెలుగు వారి ఐక్యత మెండుగా ఉంటుందని, అటువంటి ఐక్యతను తమిళనాడులో కూడా చూడాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలుగువారికి స్థలంపై జయ హామీ: తమిళనాడులో స్థిరబడిన తెలుగువారు ఆంధ్రా భవన్ వంటి నిర్మాణాలకు స్థలం కావాలంటూ తనను కలిశారని తాను సీఎం జయతో మాట్లాడి కేటాయించిన స్థలం అనుకూలంగా లేకపోవడంతో పెండింగ్ పడిందని గవర్నర్ అన్నారు. స్థలం కోసం తెలుగు సంఘాల వారు అప్పుడప్పుడు అడిగి వదిలేస్తున్నారని చురకవేశారు. తప్పనిసరిగా స్థల కేటాయింపులో చొరవచూపుతానని జయ హామీ ఇచ్చినట్లు గవర్నర్ తెలిపారు. త్రిసంగ మహోత్సవం పేరిట జరిగిన ఈ కార్యక్రమం నిజంగా ఒక పర్వదినం వంటిదన్నారు. ప్రతిభతోనే గౌరవం సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ మనిషికి గౌరవం ప్రతిభ, సామర్థ్యం వల్లనే వస్తుందని అన్నారు. ఐకమత్యం వల్లనే గుర్తింపు కూడా లభిస్తుందని తెలుగువారికి సూచించారు. తమిళనాడులో నాలుగేళ్లపాటు తాను చదువుకున్నందున తమిళ భాషపై గౌరవం, తెలుగు భాషపై ప్రేమ ఉందని చెప్పారు. తెలుగు వారు అనేక కారణాలతో విడిపోవడం నేర్చుకున్నారే గానీ, కలిసి ఉండడం తెలుసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు తమిళుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఉన్నదని, అయితే రాజకీయ విన్యాసాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తాయని వ్యాఖ్యానించారు. సినీ నేపథ్య గాయకులు ఎస్.పి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తమిళనాడులో ఉంటున్న తెలుగువారు తెలుగు మాట్లాడేందుకు సిగ్గుపడరాదని కోరారు. ఇళ్లలో తెలుగు మాట్లాడండి, తెలుగు వాడని చెప్పుకునేందుకు గర్వించండని అన్నారు. జనాభా సేకరణకు వచ్చే ప్రభుత్వ సిబ్బందికి తాము తెలుగు వారమని స్పష్టంగా నమోదు చేసుకోవాలని కోరారు. మహోత్సవం చైర్మన్ డాక్టర్ సి.ఎం.కె.రెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం మీద లింగ్విస్టిక్ మైనారిటీలు తమిళనాడులోనే ఎక్కువని, అందులోనూ తెలుగు వారు 25 శాతంగా ప్రథమ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. అనాదిగా తమిళనాడులో స్థిరపడిన వారిని మైనారిటీలు అని సంబోధించరాదని గతంలో జస్టిస్ పటాస్కర్ చెప్పారని, అయితే ఇది కార్యాచరణకు నోచుకోలేదన్నారు. తమిళనాడులోని వ్యవసాయ వర్శిటీకి తెలుగువాడైన జీడీ నాయుడు పేరును పెట్టి తొలగించారని, ఇందుకు తెలుగువారి అనైక్యతే కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు, సీనియర్ సిటిజన్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, నటి శారద, నల్లి కుప్పుస్వామి శెట్టి, జయ గ్రూప్ ఛైర్మన్ ఎ.కనకరాజ్, మహోత్సవం ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.మనోహరన్, కోశాధికారి రంగరాజన్, సంయుక్త కోశాధికారి ఆర్.నందగోపాల్, టామ్స్ అధినేత గొల్లపల్లి ఇజ్రాయిల్, సినీ నటి కుట్టి పద్మిని తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు సినీ నేపథ్యగాయకులు, సంగీత దర్శకులు జి.ఆనంద్ వారి స్వరమాధురి లైట్ మ్యూజిక్ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. ఇందులో డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మనో, బి.వసంత, సిలోన్ మనోహర్, ఎస్.పి.శైలజ తదితరులు పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. సభ విజయవంతం తెలుగువారి ఖ్యాతిని ఎలుగెత్తి చాటే రీతిలో సాగిన మహోత్సవం విజయవంతమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తెలుగువారు తరలివచ్చారు. వాహనాలు, రైళ్లలోను తరలివచ్చిన తెలుగు కెరటాల నడుమ నెహ్రూ స్టేడియం కిక్కిరిసింది. ఆ పరిసర మార్గాలు తెలుగు వెలుగుతో వికసించాయి. -
మాతృభాషపై మమకారం పెంచుకోవాలి
మంత్రి రామలింగారెడ్డి ఘనంగా ‘తెలుగు’ సంక్రాంతి సంబరాలు బెంగళూరు, న్యూస్‌లైన్ : మాతృభాషపై మమకారం పెంచుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. స్థానిక వయ్యాలికావేల్‌లో తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘సంక్రాంతి సంబరాలు’లో ఆయన ప్రసంగించారు. హిందూ సంప్రదాయాల్లో పండుగలకు కొదవ లేదని, సంక్రాంతి సంబరాలకు తనను ఆహ్వానించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. పండుగ సందర్భంగా తెలుగు వారందరూ ఒకే చోట కలవడం ఆనందదాయకమని అన్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా మాతృభాషను మరవరాదని సూచించారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లోని భాషలపై కూడా మమకారం పెంచుకోవాలని కోరారు. కృష్ణదేవరాయ భవనం ఆధునీకీకరణ కోసం సమితి సభ్యుల అభ్యర్థన మేరకు నిధులు అందించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు మాట్లాడుతూ... తెలుగు భాషకు శాస్త్రీయ హోదా కల్పించినప్పటికీ భాషాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేయకపోవడం బాధాకరమని అన్నారు. కన్నడ భాషాభివృద్ధికి కర్ణాటక ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని గుర్తు చేశారు. ఇందుకు కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ. 320 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఇలాంటి కృషి మరే రాష్ర్టంలోనూ లేదని అన్నారు. కర్ణాటక రాష్ట్రాభివృధ్దిలో తెలుగు వారి కృషి అపారమన్నారు. అనంతరం ఉత్సవాలను గోపూజతో మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. 11.30 నుంచి 1గంట వరకు చిన్నపిల్లల వివిధ వేషాధారణ పోటీలు ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం ప్రముఖ జానపద కళాకారులు మాలూరు డీఆర్ రాజప్ప, చింతామణి మునిరెడ్డి బృందం జానపద గీతాలు ఆధ్యంతం ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో తొలి మూడు స్థానాలు సాధించిన ఉషా, స్వాతిశ్రీ, శ్రుతికు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు, సమితి ఉపాధ్యక్షుడు ఎస్ఆర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఎ.కె.జయచంద్రారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి సహకరించిన కృష్ణం నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, డి.గణేష్ శంకర్, టి.వేణుగోపాల్, లోకనాథనాయుడు తదితరులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు బత్తుల అరుణాదాస్, ఎస్ఆర్ నాయుడు, సీపీ శ్రీనివాసయ్య, శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్, సి.చెన్నారెడ్డి, ఆర్. ఆదికేశవులు నాయుడు, సమితి మాజీ అధ్యక్షుడు జెఎస్ రెడ్డి పాల్గొన్నారు. -
మాతృభాషతోనే మనోబలం
సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మాతృభాషలో విద్యాబోధనే ఉత్తమం. దీనివల్ల ఆయా సబ్జెక్టులపై సమగ్రమైన అవగాహన కలుగుతుంది. ఆంగ్ల మాధ్యమంతో అభివృద్ధి అనేది తల్లిదండ్రుల అపోహ మాత్రమే’ అని రాజీవ్ విద్యామిషన్ స్టేట్ ప్రాజెక్ట్ డెరైక్టర్ వి.ఉషారాణి అన్నారు. ‘టీచ్ ఫర్ ఇండియా’ సంస్థ నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యావిధానాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. హైదర్‌గూడలోని ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఉషారాణి... అన్ని తరగతులకు వెళ్లి విద్యార్థులతో సంభాషించారు. టీచ ర్లు పాఠాలు చక్కగా చెబుతున్నారా. మధ్యాహ్న భోజనం రుచిగా ఉం టుందా.. అందరికీ యూనిఫారాలు ఇచ్చారా... అంటూ ఆరా తీశారు. నోట్‌బుక్‌లను పరిశీలించి, పలు అంశాలపై విద్యార్థులను ప్రశ్నించా రు. పదోతరగతి విద్యార్థులు తెలుగు సరిగా చదవలేకపోతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో 70 మంది విద్యార్థుల గైర్హాజరీపై ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న తరగతి గదుల నిర్మాణం సకాలంలో పూర్తి చేయకపోవడడంపై ఆర్వీఎం పీవోను వివరణ కోరారు. అనంతరం ఉషారాణి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘టీచ్ ఫర్ ఇండి యా’ నగరంలోని 19 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేస్తుందన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. యూనిఫారాలందని విద్యార్థులకు వెంటనే పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆర్వీఎం హైదరాబాద్ జిల్లా ప్రాజెక్టు అధికారి సుబ్బారాయుడు, డిప్యూటీ ఈవో సురేష్, ‘టీచ్ ఫర్ ఇండియా’ ప్రతినిధులు సాహిల్ సూద్, రవితేజ పాల్గొన్నారు. -
మాతృభాష అమ్మలాంటిది
బనశంకరి,న్యూస్‌లైన్ : మాతృభాష అమ్మలాంటిదని, అలాంటి భాషను మనం మరువరాదని ప్రముఖ కన్నడ కవి విమర్శకుడు డాక్టర్ ఎన్ఎస్. లక్ష్మీనారాయణభట్ అన్నారు. శనివారం బన శంకరి మూడవస్టేజ్లోని ఐటీఐ లేఔట్లో ఉన్న శ్రీకృష్ణ విద్యాసంస్థలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణభట్ ప్రారంభించి మాట్లాడుతూ... వేదిక బృహస్పతి లాంటిదైతే, సభ సరస్వతి వంటిదన్నారు. పిల్లలకు అమ్మ మొదటి గురువు అని, అమ్మకు పిల్లలపై ఉన్న మమకారం వర్ణించలేమన్నారు. మాతృభాషతో పాటు ఇతర భాషల పట్ల అభిమానం కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులపై విద్యార్థులు గౌరవభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఉత్తమ సమాజాన్ని నిర్మించడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అనంతరం విధాన పరిషత్ సభ్యుడు ఆర్వీ.వెంకటేశ్ మాట్లాడుతూ... సమాజంలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని, ఉపాధ్యాయులు ఇష్టంతో విద్యార్థులకు బోధన చేయాలన్నారు. అనంతరం శ్రీకృష్ణ విద్యసంస్థల చైర్మన్ డాక్టర్ ఎం.రుక్మాంగదనాయుడు మాట్లాడుతూ... ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తనకు గురువు అయిన డాక్టర్ ఎన్ఎస్.లక్ష్మీనారాయణభట్ను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ విద్యాసంస్థ ఉపాధ్యాయలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారి ఖుషి సర్వేపల్లి రాధాకృష్ణన్‌పై చేసిన ప్రసంగం అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో శ్రీకృష్ణ విద్యాసంస్థల వైస్ చైర్మన్ జలజానాయుడు, శ్రీకృష్ణ విద్యాసంస్థ డెరైక్టర్ మనోహర్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శాంతలా, సైన్స్ విభాగం ప్రిన్సిపాల్ గోపాల్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
తల్లిభాషను బతికించుకుందాం
పాలమూరు, న్యూస్‌లైన్: తెలుగు భాష గొప్పదనా న్ని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అన్నిస్థాయిల్లో నూ మా తృభాషకు ప్రాధాన్యతనివ్వాలని కలెక్ట ర్ ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. గిడుగు రా మ్మూర్తి జ యంతిని పురస్కరించుకొని గతనెల 29న వా యిదా వేసిన మాతృభాషా దినోత్సవం కార్యక్రమాన్ని సోమవారం జిల్లా సాంసృ్కతిక మండలి ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మంది రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ ముఖ్య అ తిథిగా హాజరై ప్రసంగించారు. ప్ర పంచ తెలుగు భాష సదస్సు లు చేపట్టిన నాటినుంచి జిల్లాలో తె లుగు అమలు పై ప్రత్యేక దృ ష్టి నిలిపామన్నారు. అధికారిక ఉ త్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరుగుతున్నాయ ని, ప్ర భుత్వ పనితీరు, ఆయా పథకాలు, ఇతర అంశాలను అన్ని శాఖలను సంబంధించిన సమాచారాన్ని తెలుగులో అందించనున్న ట్లు పేర్కొన్నా రు. వ్యవహారిక భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా అధికారులు తెలుగు అమలు ఎంతవరకు ఆచరించారన్నది ప్రశ్నగా మారిందన్నారు. రాష్ట్ర స్థాయిలో, ఇతర రాష్ట్రాలకు సమాచారాన్ని అందించే సందర్భంలో తప్ప ప్రభుత్వ కా ర్యాలయాల్లో తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలపై జిల్లాస్థాయిలో సమీక్ష జరుపనున్నట్లు తెలిపారు. ప దోతరగతి విద్యార్థులకు తెలుగులోనే తక్కువ మార్కులు రావడంతో అయోమయం నెలకొం దని, తెలుగు పండితులు భాషా ప్రాధాన్యత దృష్ట్యా పదో తరగతిలో విద్యార్థులందరూ క చ్చితంగా ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు. తె లుగు పత్రికలు, మాధ్యమాలు పెరిగిపోతున్నా తెలుగు భాష అమలులో మాత్రం వెనుకబడి పోతున్నామని, స్థానిక మాండలికాల్లో మా ట్లాడే విధంగా చిన్నారులకు కథల రూపంలో తర్ఫీదునివ్వాలని, చదవడం, రాయడం, మాట్లాడటం వంటి ప్రక్రియల ద్వారా విద్యార్థులు భాషపై పట్టు సాధిం చేలా కృషి చేయాలన్నా రు. జిల్లాలోని సాహిత్య సంపదను కాపాడుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని, అందులో భాగంగానే పాలమూరు యూనివర్సిటీ వద్ద పెద్దస్థాయిలో గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి, పల్లెర్ల రామ్మోహన్రావు, ఆచార్య ఎస్వీరామారావు, డీఆర్వో రాంకిషన్, డీపీఆర్వో మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పలువురికి పురస్కారం గత విద్యా సంవత్సరం పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. వారిలో ఎస్.శివ, జి.నరేశ్, యాస్మిన్ బేగం, జె.ప్రభాకర్‌రెడ్డి, స్వప్న, ఎం.రమేశ్‌కుమార్, ఉమాదేవి, ఈడ్గిస్వాతి, గానం శిరీష, ఎం.రమాదేవి, కుర్వ క్రిష్ణ, ఎం.తేజస్విని, బొల్లారం శ్రావణి, కుందెన కిశోర్ గౌడ్ ఉన్నారు. జిల్లాలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన పలు సాహితీ, కళా సేవా సంస్థల ప్రతినిధులకు కూడా సేవా పురస్కారాలు అందజేశారు. -
తెలుగు భాషను మరవొద్దు ఎస్పీ రమేష్
నరసాపురం రూరల్, న్యూస్‌లైన్: పరభాషల్లో ప్రావిణ్యం సంపాధించడం ముఖ్యమేనని, అయినా మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని ఎస్పీ ఎం.రమేష్ విద్యార్థులకు సూచించారు. నరసాపురం మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పాతనవరసపురంలో చిన్నారులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఏమి చదువుతున్నావ్ అని ఒక విద్యార్థిని ఎస్పీ ప్రశ్నించగా ఫోర్త్ క్లాస్ చదువుతున్నానని సమాధానమిచ్చాడు. దీనిపై స్పందించిన ఆయన నాల్గో తరగతి చదువుతున్నానని తెలుగులో చెప్పాలని సూచించారు. ప్రతిజ్ఞ వచ్చా అని బాలుడ్ని ప్రశ్నించారు. ఇండియా ఈజ్ మై కంట్రీ అంటూ బాలుడు ప్రారంభించగా మధ్యలో ఆపి తెలుగులో చెప్పమని కోరారు. సమీపంలోని విద్యార్థులెవ్వరూ తెలుగులో ప్రతిజ్ఞ చె ప్పేందుకు ప్రయత్నించలేదు. అడ్డాల ఏసురాజు అనే బాలుడు తెలుగులో ప్రతిజ్ఞ చెప్పాడు. సంతోషించిన ఎస్పీ ఏసురాజుకు చిరు బహుమతి ఇచ్చారు.