అమ్మా! కథ చెబుతావా?
ఇంట్రెస్టింగ్
మదర్‌టంగ్‌ను పిల్లలు నేర్చుకునేది పుట్టిన తర్వాత కాదు, తల్లి కడుపులో ఉన్నప్పుడే. వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మనం ఆడియో టేప్ వింటూ ఆనందించినట్లే కడుపులో ఉండే బిడ్డ కూడా తల్లి మాటలను వింటూ ఆనందిస్తుంటుంది. తల్లితో మాట్లాడే వాళ్ల గొంతులను కూడా గుర్తు పడుతుంది. ఆ కొత్త గొంతులు తల్లితో మాట్లాడుతున్నాయనీ తెలుసుకుంటుంది. తల్లి మాటలు ఏ భాషలో సాగుతుంటే... కడుపులో బిడ్డ ఆ భాషతో కనెక్ట్ అవుతుంది.
కడుపులో అభివృద్ధి చెందుతున్న పిండం తల్లి అవసరాలను తెలుసుకుంటుంది, ఆందోళనలనూ గ్రహిస్తుంది. తల్లి కథల పుస్తకం తీసుకుని పెద్దగా చదివి వినిపిస్తే కడుపులో నుంచే కథలు వింటూ ఆనందంగా కదులుతుంది. ఒక అధ్యయనంలో ప్రసవానికి ఆరు వారాల ముందు అంటే దాదాపుగా ఎనిమిదవ నెల రెండు వారాలు నిండిన తర్వాత రోజుకు రెండు సార్లు కథ చదివి వినిపించారు కొందరు తల్లులు. ఆ పాపాయిలు పుట్టిన మూడు రోజుల నుంచే ఆ కథలను టేప్‌రికార్డర్‌లో వింటూ మళ్లీ మళ్లీ వినాలని తహతహలాడారు.
కథ ఆగితే పాలు తాగడం ఆపి మరీ చెవులు రిక్కించారట ఆ బుజ్జాయిలు. ప్రముఖ గిటారిస్టు మిఖాయిల్ ఈ సంగతిని నిర్ధారించారు కూడా. తన కొడుకు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తన గిటార్‌కు కనెక్టయ్యాడని, పుట్టిన నెలలోనే గిటార్ శబ్దం వినిపిస్తే బాగా పరిచయం ఉన్నట్లు ముఖం పెట్టి, చెవి రిక్కించేవాడని చెప్పాడు.