
దేశంలో ఇప్పుడు హిందీ వివాదం రగులుకుంది. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ దక్షణ భారతదేశంలో హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుం బిగించారు. తమిళనాడులో పెరియార్ ఇవీ రామసామి నాయకర్ కాలం నుండే హిందీ వ్యతిరేకతకు చాలా చరిత్ర వుంది. స్టాలిన్ పిలుపు మీద దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పంది స్తాయో వేచి చూడాలి.
మనకు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, రాష్ట్ర భాష తెలుగు అనే ఒక తప్పుడు అభిప్రాయం సామాన్యుల్లోనేగాక విద్యావంతుల్లోనూ కొనసాగుతోంది. ఏపీ తెలుగు, తెలంగాణ తెలుగురెండూ వేరే భాషలు, ప్రజలు వేరే జాతులవారు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళుగా కొందరు కొనసాగిస్తు న్నారు. అది ఆ యా సమూహాల ఉనికివాద కోరికలు కావచ్చు. ఇవిగాక ఈ రెండు రాష్ట్రాల్లోనూ చెరో పాతిక భాషలు మాట్లాడే సమూహాలున్నాయి. ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌లో గోండి, కోయ, కొంద, కువి, కోలామీ, పెన్గొ, మంద, యానాది, లంబాడ, సవర తదితర చిన్న సమూహాలు ఓ పాతిక వరకు ఉంటాయి. అధి కార భాషల ప్రాబల్యంలో చిన్న సమూహాలు చితికి పోతాయి; వాళ్ళ భాషలు అంతరించిపోతాయి. భాష కూడ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లాంటిది. తనకన్నా కింద ఉన్న కుల సమూహాన్ని అణిచివేసే సమూహాన్ని అంతకన్నా పైనున్న కుల సమూహం అణిచివేస్తుంటుంది. చిన్న సమూహాలు తమ మాతృభాషను వదులుకోవాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఒక భాష అంతరించిపోవడం అంటే ఒక జాతి తన సంస్కృతీ సంప్రదాయాలనూ, తను సృష్టించినకళాసాహిత్యాలనూ కోల్పోవడమే అవుతుంది. అంటే ఆ జాతి ముందు జీవన్మృతిగా మారిపోతుంది. ఆ తరు వాత అంతరించిపోతుంది.
బ్రిటిష్ ఇండియా మతప్రాతిపదిక మీద ఇండియా–పాకిస్తాన్‌గా చీలిపోయినట్టు మనకు తెలుసు. అయితే, ఒకేమత సమూహం అయినప్పటికీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదిక మీద విడిపోయిందని మనకు గుర్తు ఉండదు. మనుషులకు భాష ప్రాణమంత ముఖ్యమైనది. యూరోప్ దేశాల న్నింటిలోనూ క్రైస్తవ మతసమూహాల ఆధిక్యత ఎక్కువ. అయినప్పటికీ, అవి అన్ని దేశాలుగా విడి పోవడానికి ప్రధాన కారణం భాష. సంస్కృతాన్నిసంఘపరివారం దైవవాణిగా భావిస్తుంది. తాము నిర్మించ తలపెట్టిన ‘హిందూరాష్ట్ర’లో సంస్కృతం జాతీయ భాషగా ఉంటుందనేది ఆ సంస్థ అభిప్రాయం. అంతవరకు దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా కొనసాగించాలని వారి ఆలోచన. జాతీయ భాష మీద చర్చ రాజ్యాంగ సభలోనే జోరుగా సాగింది. మనకు అందుబాటులో ఉన్న భాషల్లో ఏదో ఒకదాన్ని జాతీయ భాషగా చేస్తే అది మిగిలిన భాషల్ని మింగేస్తుందని చాలా మంది తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలు 22 భాషలకు గుర్తింపు ఇచ్చిన ప్పటికీ ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని భాషలూ సమానమే. మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న భాషలే తెలుసు. బోడో, డోగ్రీ, మైథిలి, సంథాలి తదితర భాషలకు కూడ రాజ్యాంగంలో స్థానంఉందని మనం తరచూ గుర్తించం. హిందీ జాతీయ భాష కాదు; అది కేంద్ర ప్రభుత్వానికి అధికార భాష మాత్రమే. హిందీ సరసన ఇంగ్లీషును కూడ అనుసంధాన భాషగా గుర్తిస్తున్నారు. జనాభాను బట్టి లోక్ సభ స్థానాలు నిర్ణయం అవుతాయని మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఆదా యాన్ని రాష్ట్రాలకు పంచే సమయంలోనూ జనాభా, లోక్‌సభ సీట్లు తదితర అంశాలు ప్రాతిపదికగా మారుతాయి. అదీగాక, త్వరలో లోక్‌సభ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగబోతోంది. ఉత్తరాది స్థానాలు మరింతగా పెరిగి దక్షిణాది స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు కొందరు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అంచేత ఇది భాషా సమస్య మాత్రమే కాదు; రాజకీయార్థిక సమస్య. ఎవర్ని ఎవరు పాలించాలనే ప్రాణప్రదమైన అంశం ఇందులో ఉంది.
1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతి పాదన... మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది.
‘యానిమల్ ఫార్మ్’ వ్యంగ్య నవలలో జార్జ్ ఆర్వెల్ ఒకచోట విరోధాభాసాలంకారం ప్రయోగిస్తాడు. ఫార్మ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న పందుల సామాజిక వర్గం ‘జంతువులన్నీ సమానం; కానీ, పందులు మరింత సమానం’ అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి విరోధాభాసాలంకారాన్ని తరచూ ప్రయోగిస్తున్నది. రాష్ట్రాలన్నీ సమానం కానీ, హిందీ బెల్టు మరింత సమానం. ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా సమానం అంటున్నది. ఇప్పుడు ‘భాషలన్నీ సమానం; కానీ, హిందీ మరింత సమానం’ అంటూ కొత్త పాట మొదలెట్టింది.
-డానీ
వ్యాసకర్త సమాజ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment