opinion
-
జనాన్ని కాలుష్యంలో ముంచెత్తుతారా?
డిసెంబర్ 19న జరగనున్న ఎన్టీపీసీ 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ జీవించే హక్కుకే వ్యతిరేకం. దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్ టీఎస్టీపీపీ 4,000 మెగా వాట్ల (మె.వా.) విస్తరణలో భాగంగా రెండోదశలో 3గీ800 మె.వా. స్థాపనకు, విద్యుత్పత్తికి పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) పెద్దపల్లి కలెక్టర్ ఆధ్వర్యంలో నియమానుసారం... ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది. కేవలం 13 కి.మీ. దూరంలో గోదావరి నది పక్కన మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఎస్సీసీఎల్ సొంత 1,200 మె.వా. థర్మల్ ప్లాంట్‌కు తోడుగా రామగుండం ఎన్టీపీసీలోని 4,200 మెగా వాట్లకు ఇది నూతన స్థాపిత సామర్థ్య ప్రతిపాదన. కొత్తగా టీజెన్‌కో రామగుండంలో 1,200 మెగావాట్లు, సింగరేణి వారు జైపూర్‌లోనే మరో 1,200 మెగావాట్ల విస్తర ణకు ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రజామోదంతో ఈ పరిశ్రమల ప్రతిపాదనలన్నీ కార్యరూపానికి వస్తే... కేవలం 13 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు ఆధార విద్యుదుత్పత్తి సామర్థ్యం (10,200 మె.వా.) ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర కాలుష్య కేంద్రంగా మారుతుంది.రాక్షసి బొగ్గు, విద్యుత్తు ప్లాంట్లు, సిమెంటు, ఎరువుల పరిశ్రమలన్నీ దేశాభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. వీటికోసం స్థానికంగా రామగుండం, కమాన్‌పూర్, మంచిర్యాల మండలాల్లో సేకరించిన 90,000 ఎకరాల భూమికి ఇప్పుడున్న మార్కెట్ ధరలతో పోల్చితే అత్యంత స్వల్ప పరిహారం సమర్పించారు. ఈ 15 కి.మీ. పరిధిలోని దాదాపు 3 లక్షల పైచిలుకు కుటుంబాలలోని 12 లక్షల మంది ప్రజలు తమ శాశ్వత జీవనాధార వ్యవసాయ, ఉపాధులను కారు చౌకగా త్యాగం చేశారు. అయినా స్థానిక యువతకు భూములు కోల్పోయిన కారణాన పరిహారంగా పట్టుమని 100 ఉద్యోగాలు కూడా అందలేదు. ఈ పచ్చినిజాన్ని అసత్యమని ఎవ్వరైనా అనగలరా?విద్యుత్ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం క్రిటికల్, సూపర్, అల్ట్రా సూపర్, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల ఇంధన దహన సామర్థ్యం 35– 40 శాతం లోపే కదా! దూర ప్రాంతాల థర్మల్ విద్యుత్ స్టేషన్లకు బొగ్గు రవాణా చేసే ఖర్చు ఆదా చేయడానికి రామగుండం నుండి 13 కిలోమీటర్ల పరిధిలో 10,200 మె.వా. సాంద్ర స్థాయిన థర్మల్ విద్యుత్పత్తి చేయ డాన్ని, చౌకధరకు (యూనిట్ 12 రూపాయలు) విద్యుత్పత్తి చేసే నెపంతో అనుమతించడమంటే... రామగుండం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో 21,000 మెగావాట్లకు సమానమైన ఉష్ణరాశితో, పరిసరాలను వేడిచేసే హీటర్లతో నిరంతరాయంగా మంటలు పెట్టినట్టే కదా?భారత ప్రభుత్వ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, నవరత్న ఎన్టీపీసీ సంస్థ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారందరూ కలసి స్థానిక ప్రజారోగ్యాలను, జీవన నాణ్యతను రాజ్యాంగ నియమాలను పణంగా పెట్టి ఈ విస్తరణ చేపట్టడం సబబేనా? 15 కిలోమీటర్ల పరిధిలోని పర్యావరణ కాలుష్య మోతాదు తీవ్రతను పరిగణనలోకి తీసుకొన్న తర్వాతే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, ఎమ్ఓఎఫ్ఈసీసీ వారు కొత్త పరిశ్రమలకు, పాతవాటి విస్తరణలకు అనుమతులివ్వా లని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్నెలా విస్మరించారు?సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అధిక లాభాపేక్షతో 706 చ.కి.మీ. విస్తీర్ణంలో అధిక సాంద్ర పారిశ్రా మికీకరణ చేపట్టడమే కదా! తక్కువ స్థలంలో ఎక్కువ ఒత్తిడితో, మనుషులు, జంతువులు కనీసం జీవించలేని పరిస్థితులను సృష్టిస్తున్న వైనాన్ని ప్రశ్నించడం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కే కదా! పక్కనే పారుతున్న గోదావరి నది నీరు నాణ్యతా ప్రమాణాల్లో ఏ, బీ, సీ, డీ కేటగిరీలు దాటి హెచ్ కేటగిరీలోకి చేరింది. ఈ నీరు కనీసం జంతువులు తాగడానికి కూడా పనికి రాదు. 1,465 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే గోదావరిని అతి ఎక్కువగా కలుషితపరిచేది, ట్రీట్మెంట్ చేయకుండా రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి మైన్స్ వాడుకొని వదిలేస్తున్న వ్యర్థ జలాలు. ఇందుకు కారణం అది కాదని, పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చెప్పగలరా?ప్రజారోగ్య సంరక్షణార్థం ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్లు విధిగా థర్మల్ స్టేషన్ల నిర్వహణలో అంతర్భాగంగా నిర్మించాలి. పర్యావరణంలోకి విడుదలవుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను 2022 నాటికే నివారించవలసిందిగా భారత సుప్రీంకోర్టు కఠినమైన డెడ్‌లైన్ విధించింది. ఇంతవరకు దేశంలో ఎన్నో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వీటి నిర్మాణం ప్రారంభమే కాలేదు. ఉన్నవి కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.ఎన్టీపీసీ వెబ్సైట్లో స్పష్టంగా చెప్పిన ప్రకారం... 76,531 మె.వా. విద్యుదుత్పత్తి కోసం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 17,794. ఒక మెగా వాట్ విద్యుదుత్పత్తికి ఆరుగురికి ఉద్యోగం కల్పిస్తామని ఎన్టీపీసీ సంస్థ ప్రారంభంలో చెప్పారు. ప్రస్తుత ప్రతిపాదిత 2,400 మెగావాట్లకు 96 మందికి ఉద్యో గాలిస్తామని ఈఐఏ రిపోర్ట్ ‘సోషల్ ఇంపాక్ట్’ సెక్షన్లో చెప్పారు. అంటే, 25 మెగావాట్ల స్థాపనకు ఒక ఉద్యోగాన్ని కల్పించగలుగుతారట. రేపు ఆచరణలో ఏం చేస్తారో తెలియదు.చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?ఈ ప్రాంతంలో స్థానికంగా ప్రతిపాదిత ప్లాంట్‌కు 15 కి.మీ. పరిధిలోని పరిసర ప్రాంతాలలో 12 లక్షల జనాభా ప్రతీ క్షణం పీల్చుకుంటున్న సాధారణ గాలి నాణ్యతా ప్రమాణం 45కు దిగువన ఉందనీ, ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు దిగువన, ధ్వని తీవ్రత 50 డెసిబల్స్‌కు దిగువన ఉన్నాయనీ... అంటే అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని అవాస్తవ సమాచారాన్ని నివేదికలో సమర్పించి, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ద్వారా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందారు. మరిన్ని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజాభిప్రాయ సేకరణకు రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టుకు పూనుకుంటున్నది.ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టులో సుప్రీంకోర్టు ఆర్డర్లు, పర్యావరణ చట్టాలు తెలియనట్లు అమాయక రీతిలో 10 కి.మీ. పరిధిలో సర్వే చేసినామని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిన ప్రాంతంలో... గాలి నాణ్యత 48 ఏక్యూఐ కన్నా దిగువన ఉన్నట్టు, ధ్వని తీవ్రత 40 డెసిబెల్స్ కన్నా తక్కువ ఉన్నట్టు, స్థానికంగా అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లు రాయడం పచ్చి అబద్ధాలే.చదవండి: మళ్లీ తెరపైకి రెండో రాజధాని?నిరూపిత శాస్త్ర సాంకేతిక సత్యాల పరిమితిలో విషయాలను అర్థం చేసుకోవాలి. రామగుండం ఎన్టీపీసీ– టీఎస్ఎస్టీపీపీ ప్రతిపాదిత 2,400 మె.వా. విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయదలచిన వేదికపై ఈ విషయాలన్నీ కలెక్టర్ గారు అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి చొరవ చూపాలి.ఇదివరకే జంతువులు, మనుషులు జీవించడానికి వీలుకాకుండా పరిసరాలు అధిక సాంద్ర పారిశ్రామికీకరణ వల్ల విధ్వంసమైపోయాయి. అందుకే జల, వాయు, ఘన వ్యర్థాల కాలుష్యాన్ని పరిహరించాలి. గాలి నాణ్యతను మెరుగుపరచాలి. సర్వత్రా కలుషితమైన భూగర్భ జలాలనూ, గోదావరి నదినీ మెరుగుపరిచే అన్ని చర్యలూ తీసుకోవాలి. ఇకముందు సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ పరి శ్రమలనే ఈ కాలానికి కావలసినవిగా గుర్తించాలి. దేశాభివృద్ధి కోసం అంతటా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిర్మించాలి.- ఉమామహేశ్వర్ దహగామపర్యావరణ నిపుణులు -
అలాంటి చిల్లర కవులు ఎక్కువయ్యారు!
విద్యకు సాటి వచ్చే ధనం లేదనేది సుభాషితం. కాని నేటి వ్యాపార యుగంలో ధనం అన్ని రంగాలనూ శాసిస్తున్నట్టే... విద్య మీద కూడా ఆధిపత్యాన్ని చలాయిస్తూ దాన్ని అంగడి సరుకుగా దిగజారుస్తోంది. నేడు సాధారణ డిగ్రీలు మొదలుకొని విద్యారంగంలో అత్యున్నత అర్హతలకు సంబంధించిన పట్టాల వరకు కొనగలిగిన స్తోమత ఉన్నవారికి లభించడం ఈ దుఃస్థితికి నిదర్శనం.ముఖ్యంగా విదేశాలలోనూ, ఉత్తర భారతదేశంలోనూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాలు విక్రయిస్తున్న ఈ డిగ్రీలను ప్రచార వ్యామోహం గల సంపన్నులు తమ పేర్లకు అలంకారాలుగా తగిలించుకొని, అవి తమ ప్రతిభాచిహ్నాలుగా చాటుకుంటున్నారు. ఊరేగింపులు, అభినందన సభలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకొని అవి తమ కీర్తి కిరీటాలుగా జనాన్ని భ్రమపెడుతున్నారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి తనకో విదేశీ సంస్థ డాక్టరేట్‌ను ఇవ్వజూపితే ‘డాక్టరేట్ ఇంత తేలికా?’ అని నిజాయతీగా వ్యాఖ్యానించడమే కాదు, తెచ్చుకున్న ఆ డాక్టరేట్ బిరుదును ఎప్పుడూ తన పేరు ముందు, కనీసం ‘నవ్విపోదురు గాక’ పుస్తక రచయితగా కూడా ఉపయోగించలేదు. అలా ప్రలోభాలకు లొంగకుండా అర్హత లేని బిరుదులను తోకలుగా ఉపయోగించని వారు అరుదు. నకిలీ విద్యార్హతలతో ఆత్మవంచనకు, పరవంచనకు పాల్పడుతున్న పెద్దమనుషులే ఎక్కువ.డాక్టరేట్ల సంతర్పణకు కాణాచులుగా మన విశ్వవిద్యాలయాలను చెప్పుకోవాలి. పీహెచ్డీ పట్టాల కోసం పరిశోధనలు ఉద్యోగాలకో, పదోన్నతులకో అవసరం కావడంతో నాటి ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఈ జాతరలో పరిశోధక విద్యార్థులు అడ్డదారులను వెతు క్కుంటుంటే పర్యవేక్షకులు వారి కోర్కెలకు అనుగుణంగా తోడ్పడి లబ్ధి పొందుతున్నారు. ‘కాదేదీ కవిత కనర్హం’ అన్నట్లు పరిశోధన ఆవశ్యకత లేని, కేవలం ‘మెథడాలజీ’ చట్రంలో ఇమిడ్చి పీహెచ్డీ పట్టాను పొందే సులభమైన, ఎందుకూ పనికిరాని అంశాన్ని పరిశోధక విద్యార్థికి సూచించడం... విద్యార్థి ఆర్థికంగా ఆశపెడితే సిద్థాంత గ్రంథాన్ని తామే అన్నీ రాసి ఇవ్వడం కొందరు పర్యవేక్షక గురువులు చేస్తున్న నిర్వాకాలు. విశ్వవిద్యాలయాల వెలుపల సిద్ధాంత గ్రంథ రచనకు ధరను మాట్లాడుకొని రాసిపెట్టడం వృత్తిగా కలిగిన నిరుద్యోగ మేధావులు కూడా ఉండడంతో కొందరు పరిశోధకులు వారు అడిగిన డబ్బిచ్చి శ్రమ పడకుండా ‘డాక్టర్లు’ అనిపించుకుంటున్నారు.తెలుగే కాదు, ఆంగ్లం, హిందీ వంటి ఇతర భాష ల్లోనూ, సాంఘిక విజ్ఞాన శాస్త్ర విభాగాల్లోనూ పరిశోధనల స్థాయి భిన్నంగా లేదు. కొందరు ప్రబుద్ధులు ఎలాగోలా ‘పీహెచ్డీ’ అనిపించుకుంటే చాలని పూర్వుల కృషిని కొల్ల గొట్టి రాసిన సిద్ధాంత గ్రంథాలకు కూడా అయ్యవార్ల ఆశీస్సులతో ఆమోద ముద్రను వేయించుకొని ‘మమ’అంటున్న సందర్భాలు కూడా లేక పోలేదు. అయితే పరిశోధనలన్నీ కాకి బంగారం బాపతేననీ, యోగ్యతకూ నిజాయతీకి స్థానం లేదనీ అనడం కువిమర్శే అవుతుంది. విశ్వవిద్యాలయాలు వివిధ రంగాలలో– ప్రతిభామూర్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్లను, కళాప్రపూర్ణ వంటి బిరుదులనూ ప్రకటించడం ఆనవాయి తీగా వస్తోంది. అయితే వాటిని కానీ, కొన్ని ప్రామాణిక సంస్థలు ఇస్తున్న బిరుదులను కానీ విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, పుట్టపర్తి, సినారె, ఆరుద్ర వంటి దిగ్దంతులెవరూ ఎప్పుడూ, ఎక్కడా భుజకీర్తులుగా వినియోగించుకోలేదు. ఏనుగులపై ఊరేగించినా, గురుతుల్యుల చేత గండ పెండేరాలతో సన్మానింపబడినా వారు వాటిని స్వోత్కర్షగా వాడుకోలేదు. కానీ నేడు కీర్తి కాంక్షతో అభినవ కృష్ణదేవరాయలం అనుకునే కవి పోషకులు, ‘అంతా కవులము కామా’ అనుకునే చిల్లర కవులు ఎక్కువయ్యారు. చదవండి: ఇది మాయ కాక మరేమిటి?వారు ఆశ్రిత కవులకు ‘కవిరత్న’, ’కవిశేఖర’, ‘కవితిలక’ వంటి బిరుదులను ప్రదానం చేసి శాలువాలను కప్పడం... వీరు మరునాడు స్థానిక పత్రికలలో ఆ సత్కారాల గురించి ఘనంగా రాయించుకోవడం ప్రహస నమైపోయింది. ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కొందరు స్థానిక కవులకు ‘గౌరవ డాక్టరేట్’లను కూడా ప్రదానం చేస్తున్నాయి. కొంతనయం– పద్మ పురస్కారాలను కూడా ప్రకటించడం లేదు! ఏ హక్కు, అధికారం లేకుండా ఎవరు పడితే వారు ఇలా బిరుదులనివ్వడం, ప్రతిభాశూన్యులైన కవులు కూడా వాటిని అలంకారాలుగా ప్రదర్శించడం సమాజానికి హానికరం. దీనికి నియంత్రణ అవసరం!చదవండి: ఎవరిని ఎలా పిలవాలి?ఇటీవల ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్‌కు బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు ‘గౌరవ డాక్టరేట్’ను ప్రకటిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించడమే గాక ‘అవసరమనుకుంటే ‘నేను థీసిస్‌ను సమర్పించి డాక్టరేట్ తీసుకుంటాను కాని ఉచితంగా కాదు’ అని వ్యాఖ్యానించడం అభినందనీయం. ఆదర్శవంతులు ముఖ్యంగా రాజకీయ, చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు ఎటువంటి ప్రలోభాలకూ లోను కాకుండా గౌరవ డాక్టరేట్ల ప్రత్యేకతను కాపాడుతారని ఆశిద్దాం.- పైడిపాలవిశ్రాంత తెలుగు ఉపన్యాసకులు -
మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?
గత నలభై సంవత్సరాలుగా మూసీ నది మృత్యుగానం వినిపిస్తోంది. 1997లో ఈ వ్యాసకర్త మూసీ కాలుష్యం తీరు తెన్నులపై, దాని పరివాహక ప్రాంతంలోని గ్రామాలపై కాలుష్య ప్రభావం గురించి రాసిన పరిశోధనా వ్యాసంలోని అంశాలు... ఆ ప్రాంత ప్రజలను కదిలించాయి. ముఖ్యంగా ఎదులాబాద్ గ్రామ ప్రజలు చేసిన పోరాటం మరువలేనిది. మేధాపట్కర్, గజేంద్రసింగ్లు కూడా మూసీ కాలుష్యం, దాని ప్రభావం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఉద్యమానికి సంఘీబావం ప్రకటించారు. విషపూరిత రసాయనాలతో, మానవ, పశువుల విసర్జనాలతో నిండిన ఈ కలుషిత నీరే అత్యధిక ధాన్య (వడ్లు) ఉత్పత్తికి దోహదపడింది. నిజాం రాచరిక పాలన కాలంలో నిర్మించిన 23 కత్వల (చిన్న ఆనకట్టలు) ద్వారా 25 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఏర్పాటు జరిగింది. నేడు సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.‘పిలాయిపల్లి కాల్వ’, ‘బునాది గాని కాల్వ’ అనే రెండు కొత్త కాలువల నిర్మాణం ఇటీవల జరిగింది. అంటే అవే 23 కత్వల కింద ఆయకట్టు దాదాపు పదమూడు రెట్లు పెరిగిందన్నమాట! ఇదెలా సాధ్యమైనట్టు? 1925లో జంట నగరాలకు తాగునీటి సరఫరా రోజుకు 23 మిలి యన్ గాలన్స్గా ఉండేది. అది క్రమంగా పెరుగుతూ ఈ రోజు రమారమి 600 మిలియన్ గాలన్స్గా ఉంది. ఇందులో 80 శాతం నీరు వాడిన తర్వాత తిరిగి మూసీలో కలుస్తోంది. ఈ కలుషిత నీరే నదిని జీవనదిగా మార్చింది. ఈ నీరే పైన ఉదహరించిన 2 లక్షల ఎకరాల వరి సాగుకు మూలం. లక్షలాది టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఎందరికో పని దొరుకు తోంది. అదే సమయంలో కాలుష్య జలాల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.హానికరమైన రసాయనాలతో నిండిపోయిన నది ఉపరితల జలాలు, భూగర్భజలాలు, ఆహార గొలుసంతా విషతుల్యమయింది. బియ్యం, పాలు, కాయగూరలు దేనికీ మినహాయింపు లేదు. బాధ్యతా రహితంగా కంపెనీలు రసాయన వ్యర్థాలను ట్రీట్మెంట్ చేయకుండా నదులు, చెరువులు, వాగుల్లోకి వదిలి వేస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. జంట నగరాల చుట్టూ ఉన్న కంపెనీలు విడుదల చేస్తున్న వ్యర్థాలు మూసీనే కాకుండా వందకు మించిన చెరువులకు కూడా మరణ శాసనం లిఖిస్తున్నాయి. నిజానికి ఇవ్వాళ దేశంలో చాలా నదుల స్థితి ఇదే. తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిమిత వనరులను జాతి శాశ్వతంగా కోల్పోయే ముప్పు పొంచి ఉందన్న భారత సైన్స్ సంస్థ బాధ్యులు డాక్టర్ రామచంద్ర ప్రభు హెచ్చరికల్ని ప్రభుత్వాలు ఇంక ఎంత మాత్రం ఉపేక్షించటానికి వీలులేదు.జల వనరుల కాలుష్యం వల్ల ఏటా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు ‘నీతి ఆయోగ్’ లెక్క గట్టింది. ఈ మధ్యనే విడుదలయిన నదుల నీటి నాణ్యత ఇండెక్స్‌లో మూసీ నది నీటిలో ఆక్సిజన్ స్థాయులను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయులు 1–4 మధ్యన ఉండాల్సింది... నల్లగొండ జిల్లా వివిధ ప్రాంతాలలో 13, 15 స్థాయులుగా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలలో 258 నదులపై స్విస్ సంస్థ ఒకటి ఔషధ కాలుష్యంపై అధ్యయనం చేసింది. 2022 సంవత్సరంలో ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యంగా మారిన నదులలో మూసీ నది 22వ స్థానంలో ఉంది. నదిలో 48 రకాల రసాయన అవశేషాలు ఉన్నట్టు ఆ పరీక్షలలో తేలింది. ఈ రసాయనాల వల్ల మనుషులు వివిధ రకాల క్యాన్సర్, మూత్ర పిండాల వ్యాధులు, చర్మ వ్యాధులు, అబార్షన్లు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, గొంతునొప్పి వంటి రోగాల బారిన పడతారని తెల్చింది. ఈ రోగాల ముప్పు అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉంది. ప్రజలు, పశు పక్ష్యాదుల ఆరోగ్యాలకు ముంచుకొస్తున్న ముప్పు నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడటాన్ని అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ ప్రక్షాళన, సుందరీకరణ చేసి తీరుతామని చెప్పటం ఒక శుభ పరిణామం. ఈ విషయంలో సీఎం సీరియస్‌గానే ఉన్నారనే విషయం స్పష్టంగానే కపిస్తోంది. అందుకు ఆయనను అభినందించాలి.చదవండి: నీటి యుద్ధాలు రానున్నాయా!అయితే ఈ సమస్యపై అధికార ప్రతిపక్షాల మధ్య సాగు తున్న వాదోపవాదాలు కొంత గందరగోళానికి దారి తీశాయి. దానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ప్రాజెక్టుపై తన కార్యచరణను తలకిందులుగా మొదలు పెట్టడమే కాకుండా హైడ్రాతో ముడిపెట్టింది. దాంతో నదిలో ఉన్న నివాసాల తొలగింపు మొదలైంది. ఇక్కడ రెండు విషయాల పట్ల ప్రభుత్వం స్పష్టంగా ఉండాలె. ఒకటి నది ప్రక్షాళన అయితే, రెండోది నది ప్రాంత సుందరీకరణ. ఈ రెండింటినీ ఏక కాలంలో చేపట్టాల్సిన అవసరం లేదు. ఏది ముందు ఏది తర్వాత అనేది ప్రశ్న. జవాబు స్పష్టమే! ముందు ప్రక్షాళన, తర్వాతే సుందరీకరణ. నది ప్రక్షాళన కోసం చేయాల్సిందేమిటి? కంపెనీల నుంచి వెలువడే హాని కరమయిన రసాయనాలను, మావన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నదిలోనికి వదలొద్దు. వ్యర్థాల శుద్ధి కోసం సమగ్రమైన ప్రణాళిక అవసరం. పెట్టుబడి, పట్టుదల నిజాయితీతో కూడిన కార్యాచరణ ఎంతో అవసరం. ఇదొక దీర్ఘకాలిక ప్రణాళిక. నదికి మొలసిన ఈ నారీ పుండ్లను తొలగిస్తేనే సుందరీకరణ సాధ్యం.చదవండి: ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?ఈ సుందరీకరణకు ముందు జరగాల్సింది చాలా ఉంది. ముందు నది వైశాల్యాన్ని తేల్చాలి. దాని వాస్తవిక వైశాల్యం ఎంత ? భారీ వరద వస్తే ఎంత ఎత్తున పారుతుందో (నది పారు ప్రాంతం) గుర్తించాలి. దాని లోపల నివాసాలు ఉన్నట్లయితే తొలగించాల్సిన/సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ భూసేకరణ చట్టం యొక్క అవసరం ఏర్పడుతుంది. నిర్వాసితుల పునరావాసానికి, వారి ఆర్థిక సామాజిక, సాంస్కృతిక పునర్నిర్మాణానికి 2013 చట్టాన్ని పాటించాలి, ఇంకా మెరుగుపర్చుకోవాలి. నది ప్రక్షాళన, సుందరీకరణ ఎంత ముఖ్యమో ప్రజల జీవితాలు అంతకన్నా ముఖ్యం. ప్రాజెక్టు పేరుతో ఇప్ప టికే ఉన్న ఒక ఆర్థిక, సామాజిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నా మన్న స్పృహ ప్రభుత్వానికి ఉండాలె. అప్పుడే కూల్చిన వ్యవస్థను పునర్నిర్మించడానికి ఆలోచనాపరంగా అడ్డంకులు ఉండవు. ప్రకటించిన ప్రాజెక్టులను ప్రజాగ్రహం మూలంగా వెనుకకు తీసుకోవాల్సిన అవసరం రాదు. ప్రభుత్వానికి ఈ విషయంలో సరైన సలహాలు అవసరం.- ఆచార్య కట్టా ముత్యం రెడ్డి ప్రెసిడెంట్, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ -
ఈ తిరుగుబాట్లు ఎందుకు జరిగాయంటే...
సరిగ్గా నాలుగు నెలల కిందట బంగ్లాదేశ్ ప్రధాని నివాసంలో కనిపించిన దృశ్యాలే ఇవాళ సిరియా అధ్యక్ష భవనంలో కనిపిస్తున్నాయి. ప్రజా ఆగ్రహానికి గురై షేక్ హసీనా దేశాన్ని వీడిన వెంటనే ఆమె ప్రధానమంత్రి అధికారిక నివాసంలో తిరుగు బాటుదారులు దాడిచేసి ఇంటిని లూటి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే సీన్ సిరియా అధ్యక్ష భవనంలో రిపీట్ అయ్యింది. ఆ దేశ నియంత బషీర్ అల్ అసద్ తిరుగుబాటుదారుల దాడికి దేశాన్ని వీడారు. ఆ వెంటనే అధ్యక్ష భవనంలోకి తిరుగుబాటుదారులు జొర బడి కనిపించిన వస్తువులను ఎత్తుకెళ్లటం చూస్తున్నాం. సిరియా అధ్యక్షుడిగా రెండున్నర దశాబ్దాల పాటు ఆ దేశాన్ని ఏలిన బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.సిరియా దాదాపు 13 ఏళ్లుగా అంతర్యుద్ధంతో సతమతం అవుతూనే ఉంది. దీనిలో ‘తిలాపాపం తలా పిడికిడు’ అన్నట్లు రష్యా, అమెరికా వంటి దేశాల పాత్రను కూడా మరిచిపోకూడదు. అసద్ తండ్రి హఫీజ్ 1970లో తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్నారు. ఆయన మరణానంతరం అసద్ అధికారంలోకి వచ్చారు. అంటే ఏకంగా 54 ఏళ్ళుగా అసద్ కుటుంబ నియంతృత్వ పాలనలోనే సిరియా మగ్గి పోయింది. ఉగ్రవాదాన్ని, అంతర్యుద్ధాన్ని కట్టడి చేయ లేకపోవటం ప్రజాస్వామిక విధానాలను దరిదాపుల్లోకి రానీయకపోయిన ఫలితాన్ని అసద్ ఇవాళ చవిచూస్తున్నారు. దేశాన్ని వదిలి రష్యా నీడన ఆశ్రయం పొందుతున్నారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన హయాత్ తహరీర్ ఆల్ షామ్ (హెచ్‌టీఎస్) సంస్థను ఐక్యరాజ్య సమితి గతంలోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న అబూ మహమ్మద్ అల్–జులానీ ఒకప్పుడు అల్ ఖైదా ఉగ్రవాది. అంటే సిరియా దేశంలో నియంతృత్వం అంతరించే సూచనలు కనుచూపు మేరలో కనిపించకపోగా... ఆ దేశ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.సిరియా, బంగ్లాదేశ్ పరిస్థితులను ఒకే గాటన కట్టలేకపోవచ్చు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు రేగి అవి హింసాత్మంగా మారటంతో పరిస్థితి చేయి దాటిపోయింది బంగ్లాదేశ్‌లో. హసీనా ప్రభుత్వం కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే నిర్ణయం తీసు కున్నా... అప్పటికే ఆమె నిరంకుశ వ్యవహారశైలి పట్ల ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకత ఒక్కసారిగా ఎగిసిపడింది. ఆమె దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. ఈ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ మత ఛాందస దిశగా అడుగులు వేయటం ఆందోళనకరమైన అంశం. నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో అక్కడి హిందూ మైనార్టీలపై దాడులు, చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్లు వీటికి సంకేతాలు.కాస్త వెనక్కి వెళితే... రెండేళ్లు వెనక్కి వెళితే 2022 జూలైలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సా కూడా ఇదే విధంగా పెట్టేబేడా సర్దుకుని ఉన్నపళంగా దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తటంతో తిరుగుబాటుదారులు అధ్యక్ష భవనంపై దాడి చేశారు. అదే సమయంలో ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసానికి కూడా నిప్పు పెట్టారు. ప్రజాగ్రహానికి తలొంచి రణిల్ సైతం ఆ రోజు రాజీనామా చేయక తప్పలేదు. ఇక సిరియా లాంటి తిరుగుబాటును 2021 ఆగష్టులో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చవిచూశారు. దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభం, ఉగ్రవాదం, అంతర్యుద్ధాలకు కేంద్రంగా మారిన అఫ్గానిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ నియంతలా పాలన చేశారు. చివరకు తాలిబాన్ల దాడిని ఎదుర్కోలేక దేశం విడిచి పారిపోయారు. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇస్లాం చట్టాల పేరుతో ఏ విధంగా మానవ హక్కులను కాలరాస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తూనే ఉంది.చదవండి: ఆ వ్యతిరేకత మనకు కలిసొచ్చేనా?ఈ నాలుగు దేశాల్లో సంక్షోభాలకు కారణాలు వేర్వేరు కావచ్చు, తీవ్రతల్లో తేడాలు ఉండొచ్చు. కాని ఫలితం మాత్రం ఒకటే. అంతే కాదు, పర్యవసానాల్లోనూ సారూప్యత కనిపిస్తోంది. శ్రీలంక మినహాయిస్తే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, సిరియాల్లో మత ఛాందసవాదమే రాజ్యమేలేటట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఆ యా దేశాల ప్రజలకే కాదు ప్రపంచానికి సైతం ప్రమాదకరం.- రెహానా బేగం రాష్ట్ర సమాచార కమిషనర్, ఏపీ -
ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదయిన సందర్భంలో అన్ని వర్గాల్లోనూ చర్చ చాలా లోతుగానే జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తొలి పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తమ ఆకాంక్ష లకు అనుగుణంగా లేదని చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు. తెలంగాణ కోసమే ఒక రాజకీయ పార్టీ స్థాపించి, తెలంగాణ పేరుతో ప్రతినిత్యం తన రాజకీయం నడిపించిన కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు శాశ్వతంగా పట్టం కట్టలేదనీ, కట్టరనీ ఏడాది క్రితం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి.నిజానికి 2014 ఎన్నికల్లో కేసీఆర్‌కు పట్టం కట్టిన ప్రజలు 2019 ఎన్నికలలోపే ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తూ వచ్చారు. ఇది కనిపెట్టిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలతో (2019) పాటు అసెంబ్లీ ఎన్ని కలు జరిగితే మోదీ సునామీలో అధికారం కోల్పోవడం ఖాయం అని ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇతర వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. అందుకే ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ తనదైన టక్కు టమార విద్యలతో 2018 లోనే అసెంబ్లీకి ప్రత్యేకంగా ఎన్నికలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగి ఉంటే అదే స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండేది. రెండవ దఫా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళనుంచి తెలంగాణ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. తెలంగాణలో అనుకోకుండా దుబ్బాక నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నిక ఈ వ్యతిరేకత చూపించడానికి తొలి వేదిక అయ్యింది. సొంత జిల్లా సిద్దిపేటలో అటు గజ్వేల్, ఇటు సిరిసిల్లకు మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు బీజేపీ తరఫున నిల బడిన నన్ను గెలిపించడం దీనికి నిదర్శనం.ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు... ఏడాది కాలంగా సరిగ్గా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నది. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన మేనిఫెస్టోలో 42 పేజీలలో వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మారి ఏడాది కూడా గడవక ముందే తెలంగాణలో కొత్త సర్కారుపై తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకతలు మొదలయ్యాయి.కేసీఆర్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ‘ఆరు గ్యారెంటీల’ పేరుతో అలవి కాని హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కి... ఇప్పుడు ప్రజలపై స్వారీ చేస్తోంది రేవంత్ సర్కార్. 6 గ్యారంటీలలో నెర వేర్చినవి కూడా అరకొరగా మాత్రమే ఉండటం గమ నార్హం. ప్రజలకు అవసరం లేని... పేర్లలో మార్పు, విగ్రహాలలో మార్పు చేయడం మాత్రమే ప్రజా పాలనకు నిదర్శనమా? తెలంగాణ తల్లి విగ్రహం మలిదశ ఉద్యమంలో ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ప్రజల మన సుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహం మార్పు చేయడం వల్ల ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉన్నదా? నిజానికి తల్లి... దేవతతో సమానం. అట్లాంటి తెలంగాణ తల్లిని దేవత రూపంలో ఉండకూడదని కాంగ్రెస్ సర్కార్ అనుకోవడమే వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. మార్పు చేసిన విగ్రహం కూడా తెలంగాణలో బలిదానాలకు మూల కారణమైన సోనియా గాంధీ పుట్టిన రోజున ఆవిష్కరణ చేయడం తెలంగాణ ఆత్మగౌరవ వంచనగా భావించాల్సిందే. ‘అన్ని బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం’ అని ప్రమాణ పత్రంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ... కేవలం ‘పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు’ల్లో మాత్రమే ఆడపడుచులు ప్రయాణించడానికి అర్హులని అవమా నిస్తోంది. ఇలా ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టు మిట్టాడుతోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు అవుతాయని ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి.చదవండి: వ్యవసాయాన్ని పండుగ చేశాం!అత్తాకోడళ్ళతో సహా కుటుంబంలోని మహిళలందరికీ ఇస్తానన్న నెలకు రూ. 2,500 ఎక్కడకు పోయినాయి? వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అని... ఇప్పుడు కేవలం కొన్ని రకాల సన్న ధాన్యాలకు ఇస్తా మని చెప్పడం మోసం చేయడం కాదా? రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి, తర్వాత ‘షరతులు వర్తిస్తాయ’ని కార్పొరేట్ తరహా మోసం చేసిన ప్రభుత్వం ఇది. ‘రైతు భరోసా’ పెంచి కౌలు రైతులకు కూడా 15 వేల రూపా యలు ఇస్తామని ముఖం చాటేసిన గొప్ప సర్కారు ఇది. అందుకే మేనిఫెస్టోలో ఉన్న 42 పేజీలపై ప్రజాక్షేత్రంలో చర్చకు రావాలి. వారు అమలు చేశామని చెప్పుకుంటున్న హామీలపై కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరన్న విషయాన్ని రుజువు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిపక్షంలో ఎన్నికల వరకు కూడా ప్రజలు తిరుగుబాటు చేయకుండా నిలిచే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. తిరుగుబాటు సహజ గుణంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఇది కొత్త కూడా కాకపోవచ్చు.- రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ సభ్యులు -
ఆ నిర్ణయంతో అమెరికాకే నష్టం.. ట్రంప్ భయం అదే!
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్, ‘తాను 2025 జనవరి 20న అధికారం చేపట్టిన వెంటనే అమెరికాతో వాణిజ్యం చేస్తున్న మూడు అగ్రభాగ దేశాలైన చైనా, కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలను విధిస్తానని’ చెప్పారు. చైనాపై ఇప్పటి వరకూ ఉన్న 60 శాతం సుంకాలతో పాటుగా అదనంగా 10 శాతం, కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలను విధిస్తానని ప్రకటించారు. అమెరికా సరిహద్దు వెంబడి అక్రమ మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయనీ, అనధికార వలసదారుల ప్రవేశానికి ప్రతిస్పందనగా తాజా చర్యలు తీసుకోబోతున్నాననీ నవంబరు 26 నాడు ప్రకటించారాయన. తాజాగా నవంబరు 30న ఏకంగా బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలను విధిస్తానని ప్రపంచం విస్తుపోయేలా ప్రకటించారు. ‘బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ దేశాలు) డాలరుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, ప్రత్యామ్నాయ కరెన్సీకి కృషి చేస్తే... బ్రిక్స్ దేశాలు అద్భుతమైన, శక్తిమంతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థతో వాణిజ్య సంబంధాలకు వీడ్కోలు చెప్పాలి. డాలరును వ్యతిరేకించననే నిబద్ధత ఈ దేశాల నుంచి మా కవసరం’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు.2023లో ప్రపంచ దేశాలతో మొత్తం 773 బిలియన్ల (77,300 కోట్ల డాలర్లు) వాణిజ్య లోటుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ జబ్బుపడి ఉంది. కేవలం బ్రిక్స్ దేశాలతోనే 43,350 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును అమెరికా కల్గి ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనాతో 279 బిలియన్లు (27,900 కోట్ల డాలర్లు), మెక్సికోతో 15,200 కోట్ల డాలర్లు, చిన్న దేశమైన వియత్నాంతో 10,400 కోట్ల డాలర్ల వాణిజ్యలోటును కలిగి తన కృత్రిమ డాలరు మారకపు విలువతో పబ్బం గడుపుకుంటోంది. బ్రిక్స్ దేశాల నుంచి దిగుమతులను నిషేధిస్తే... ఆ దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే తయారీ వస్తువులను వర్తమాన దేశాలకు, యూరప్‌కు మళ్లించే అవకాశాలుంటాయి. అమెరికాలోని వస్తు ఉత్పత్తి రంగం వెనుకబడి ఉంది. స్వదేశీ డిమాండును ఇప్పుడున్న అమెరికాలోని పరిశ్రమలు తీర్చలేవు. అందువల్ల వస్తు ధరలు విపరీతంగా పెరగవచ్చు. బ్రిక్స్ దేశాలు కొత్త మార్కెట్లను వెతుక్కుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం దిశకు మరలవచ్చు. డాలరు ఏకఛత్రాధిపత్యం కోసం అమెరికా తీసుకొంటున్న చర్యలకు ప్రత్యామ్యాయంగా ఇప్పటికే 3 దశాబ్దాల నుండి యూరో కరెన్సీని ఐరోపా యూనియన్ ప్రవేశపెట్టింది. చైనా, రష్యాలు పరస్పరం తమ కరెన్సీలతోనే వాణిజ్యం చేసుకొంటున్నాయి.2వ ప్రపంచ యుద్ధంలో నష్టపోని అమెరికా ఆయుధ అమ్మకాలతో విపరీతమైన బంగారు నిల్వలను పోగు చేసుకొంది. 1944 జులై నుంచి ‘బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్’ అనే అంతర్జాతీయ ద్రవ్యసంస్థను ఏర్పాటు చేసుకుంది. దాని ద్వారా 44 దేశాల మద్దతుతో డాలరును అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా ఏర్పాటు చేసుకొని 1971 వరకూ బంగారం ఆధారిత డాలరుగా కొనసాగించింది. వాస్తవానికి తన వద్దనున్న బంగారు నిల్వలకు పొంతన లేకుండా డాలరు నోట్లను ముద్రించుకొంటూ ఆధిపత్యం చలాయించింది. ప్రస్తుతం అమెరికా వద్ద 8,133.46 టన్నుల బంగారు నిల్వలున్నాయి. ఈ నిల్వలను అమ్మితే వచ్చే 69,100కోట్ల డాలర్లతో అమెరికా సుమారు 36 లక్షలకోట్ల రుణాలను ఎలా తీరుస్తుంది?1971 మేలో జర్మనీ డాలరుతో తెగతెంపులు చేసుకొని బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ నుంచి బయటపడిన 3 నెలల్లోనే అనూహ్యమైన ఆర్థిక పురోభివృద్ధి సాధించింది. డాలరుతో పోల్చుకొంటే జర్మన్ మార్కు 7.5 శాతం వృద్ధి రేటు సాధించింది. వెనువెంటనే ప్రపంచ దేశాలన్నీ డాలరు విలువను బంగారం విలువతో సరిపెట్టమని డిమాండు చేశాయి. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు జర్మన్ బాటలో పయినించటంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అమెరికా బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ ఆధిపత్యాన్ని కోల్పోయింది. 1971లో (ప్రెసిడెంట్ నిక్సన్ షాక్‌గా పిలవబడే) బంగారు నిల్వతో డాలరు విలువను రద్దు చేసుకొని నేటి ‘డాలర్ ఫియట్ ఫ్లోటింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రస్తుతం ట్రంప్ విధిస్తానన్న వాణిజ్య ఆంక్షలతో బ్రిక్స్ కరెన్సీ ఏర్పడి... రానున్న కాలంలో డాలర్, యూరోలతో పోటీపడినా ఆశ్చర్యపోనవసరంలేదు. అదీగాక రష్యా, చైనా, భారత్ దేశాలు వాణిజ్యపరంగా ఐక్యమైతే ప్రపంచ దిశనే మార్చే అవకాశం ఉంది. ఒకప్పటి ప్రపంచాన్ని తమ కరెన్సీలతో ఆధిపత్యం చలాయించిన దేశాలన్నీ ఇప్పుడు అత్యంత బలహీనమైన ఆర్థికదేశాలుగా మిగిలాయి. అమెరికా కూడా ఈ తరహా దేశంగా మిగులుతుందని ట్రంప్ భయం. పరిస్థితులును పసిగట్టిన ట్రంప్ వాణిజ్య సుంకాలతో ఈ కృత్రిమ డాలరు విలువను నిలబెట్టాలని అనుకుంటున్నారు.- బుడ్డిగ జమిందార్కె.ఎల్. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
ఈ చర్య మతసామరస్యానికి శరాఘాతం!
అజ్మీర్ దర్గాకు సంబంధించిన వార్తలు ముస్లింలకు మాత్రమే బాధ కలిగిస్తాయనుకుంటే పొరపాటు. తరతరాలుగా హిందువులు ఆ దర్గాలో ఆరాధనలు జరుపుతున్నారు. ‘చాదర్’ సమర్పిస్తు న్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా ‘గరీబ్ నవాజ్’ అని పిలుచుకునే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఎదుట మొక్కులు తీర్చుకుంటున్నారు. భారత దేశంలోని ముస్లింలు, హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్రాన్ని ప్రతి రోజూ 1.5 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. భారతీయ ముస్లింలలో అత్యధికులు అజ్మీర్ దర్గాను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు. అజ్మీర్ దర్గా భారతదేశంలోని ముస్లింలకు మక్కా లాంటిదని పలువురు భావిస్తారు. అజ్మీర్ ఖ్వాజాను ‘హిందూస్థాన్ కే వలీ’ లేదా ‘హింద్ వలీ’ అని పిలుస్తారు.కాని ఇటువంటి ఈ సామరస్య కేంద్రం ఇప్పుడు వార్తల్లో అనవసర కారణాలతో నిలవడం బాధాకరం. భారతదేశంలో బాబ్రీ తర్వాత సాగుతున్న హైందవ సంస్కృతి ఆనవాళ్ల వెతుకులాట మసీదుల చుట్టూ ఇంతకాలం ఉండగా... ఇప్పుడు దర్గాలకు చేరడం, అదీ కోట్లాది మంది సెంటిమెంట్‌గా భావించే అజ్మీర్ దర్గాకు చేరడం ఆందోళన కలిగించే అంశం. చినికి చినికి గాలివాన అయినట్టుగా ఇది ఎక్కడకు చేరబోతున్నదో పాలకులకూ, ఈ వివాదాన్ని రేపుతున్నవారికీ అంచనా ఉందా? ఈ వివాదాన్ని లేపేవారు భారతీయ హిందూ– ముస్లింల మధ్య ఎడతెగని అనిశ్చితి, ఘర్షణ, విభజన, ద్వేషం ఆశిస్తున్నారా? ఒక దేశంలో కలిసిమెలిసి ఉండవలసిన రెండు ప్రధాన మతాలు నిత్యం ఘర్షణల్లో ఉంటే ఆ దేశ ప్రగతి ఏ రీతిలో కొనసాగుతుందనేది మనలో ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి.అయోధ్యలో ప్రార్థనా స్థలంపై జరిగినట్లుగా అజ్మీర్‌లో దీర్ఘకాలంగా పోరాటం లేదు. ఇది మసీదు వంటి బహిరంగ ప్రదేశం కాదు. ఇది సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి. అజ్మీర్ దర్గాపై ఎటువంటి న్యాయపోరాటం లేనప్పుడు, 800 ఏళ్ల సూఫీ సాధువు సమాధి వద్ద యంత్రాలు, గునపాలు చేరడం చట్టవిరుద్ధం. హిందూసేన కోర్టు సహాయంతో అజ్మీర్ ఖ్వాజా దర్గాను సర్వే చేయాలనుకుంటోంది. ఈ సర్వేను నిలిపివేయాలని ఈ దేశంలో బాధ్యతగల పౌరులెవరైనా ఆశిస్తారు. తాజ్‌మహల్, కుతుబ్మినార్ల విషయంలో చేసినట్లుగా అజ్మీర్ దర్గా సర్వేను తిరస్కరించాలి. వివాదాలు లేని చోట వివాదాలు సృష్టించవలసిన అవసరం ఏమిటని గౌరవనీయమైన పెద్దలు ముందుకు రావాలి.హిందూ ముస్లింలకు ఇది దర్గా అని తెలుసు. ఇది రెండు మతాలకు చెందినది కాబట్టి వారు దానిని ఒకే దృష్టితో చూశారు. భక్తులు అక్కడ సంతోషంగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారిని భంగపరచి దేశవ్యాప్తంగా ఎందుకు హింసను ప్రేరేపించాలి? శివలింగం ఉందా... లేదా ఉందని వెలికితీయడానికీ, లేదా లేకపోయినా ఉందని వాదించడానికీ పవిత్రమైన 800 సంవత్సరాల నాటి సూఫీ సాధు సమాధిని అన్వేషించడం 140 కోట్ల జనాల మనోభావాలను దెబ్బతీసినట్లే. దర్గా హిందువులు– ముస్లింల మధ్య వారధిగా నిలుస్తుంది. ఈ వంతెనను దెబ్బ తీస్తే, హిందువులు – ముస్లింల మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేసినట్లే. ఇలా చేసి చివరికి ఏమి సాధించబోతున్నారు?గత పాఠాలు బోధించడం, అవగాహన పెంపొందించడంలో చరిత్రకు దాని విలువ ఉంది. ప్రజలను విభజించడానికి లేదా శాంతికి భంగం కలిగించడానికి చరిత్రను ఆయుధంగా వాడకూడదు. చరిత్రను తవ్వకూడదు. చరిత్రకు దానిదైన విలువ ఉంటుంది. చరిత్ర గతిలో గడిచిపోయిన విషయాలను కొన్నింటిని వర్తమానంలోకి తెచ్చినప్పుడు అవి మనం కోరే వ్యాఖ్యానాలు, ఫలితాలు మాత్రమే ఇవ్వవు. తేనెతుట్టెను కదిల్చి తేనెటీగలను ఒక వరుస క్రమంలో ఎగిరి వెళ్లమని కోరడం లాంటిది ఇది. సమాజంలో అన్ని మతాలకూ, వారి పవిత్ర స్థలాలకూ గౌరవం అవసరం. సామరస్యాన్ని కాపాడుకోవాలంటే విశ్వాసం విభజితం కాకుండా ఏకం కావాలని గుర్తించాలి. ఈ మతాతీత ప్రదేశాలు గౌరవం, ఐక్యతలకు సంబంధించిన స్థలాలుగా ఉండాలి.చదవండి: ఒక అపరిచితుడి దయగత రెండు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ‘మేము కొన్ని పరిస్థితుల్లో ప్రకృతికి విరుద్ధంగా బాబ్రీ మసీదు సమస్యను లేవనెత్తాము. ఇప్పుడు ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు మరలా ప్రతిరోజూ మసీద్–మందిర్ గొడవలు దేనికని? ఎందుకు అనవసర గొడవలు సృష్టిస్తు న్నారు? ప్రతీ మసీదులో శివలింగం ఉందని వాదించడం సరైనది కాదు. విధానం వేరైనప్పటికి మసీదుల్లో ముస్లింలు చేస్తున్నది కూడా దైవ ఆరాధనే. వారు మనవాళ్ళే, బయట నుండి ఏమి రాలేదు. ఇది అందరూ అర్థం చేసుకోండి’ అని చెబుతూనే వస్తున్నారు. కానీ, జరుగుతున్నది వేరు.సూఫీ సాధువు సమాధి కింద శివలింగం ఉందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. హింసను ప్రేరేపించడానికి అలాంటి కల్పనలను వదిలివేయాలి. భాగవత్ మాటలను గౌరవించమని హిందూ సోదరులకు విజ్ఞప్తి. అలాగే ముస్లిం సోదరులు కూడా సంయమనం పాటించాలి. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ కలిసి నడుద్దాం. భారతదేశ జెండాను ప్రపంచంలో ఉన్నత శిఖరాల్లోకి ఎగరవేద్దాం. మేరా భారత్ మహాన్ హై! జై హింద్!!- జహారా బేగంసామాజిక కార్యకర్త (ఇండియా/యు.ఎస్.ఎ) -
ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు!
కనీస మద్దతు ధరల చట్టం... దశాబ్దాలుగా రైతులు కంటున్న కల! ప్రపంచంలో గుండు సూది నుంచి విమానం వరకు ఏ వస్తువు కైనా ధరను నిర్ణయించే అధికారం వాటిని ఉత్పత్తి చేసే వారికే ఉంటుంది. కానీ ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసే పంటలకు ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకు లేదు. రిటైల్ ధరలలో మూడో వంతు కూడా సాగు దారులకు దక్కని దుస్థితి కొనసాగు తోంది. రైతులు పండించే పంట ఉత్పత్తులపై ఆధారపడి జీవించే దళారులు, టోకు, రిటైల్ వ్యాపారులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వర్గాలు మాత్రం కోట్లు గడిస్తు న్నారు. వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసే కెచప్, మసాలా వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్టులకు ఎమ్మార్పీలు ఉంటాయి. వాటికి ప్రాథమిక ముడి సరుకైన రైతు పండించే పంటలకు ఉండవు. అదే విషాదం!ఏటా పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే తెగుళ్లు, పురు గులు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్ మాయాజాలం కారణంగా పంట కోతకొచ్చే నాటికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. పంట సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ డాక్టర్ స్వామినాథన్ కమిటీ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. వాస్తవానికి 23 పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)తో చట్టబద్ధత కల్పించాలనీ, ఈ విషయాన్ని ప్రభుత్వం రైతుల ఆర్థిక కోణంలో చూడాలనీ రైతులు కోరుతున్నారు. అయితే ఇందుకు ఏమాత్రం తలొగ్గని కేంద్రం ఏటా 10–15 పంటలకు మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోంది. ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే కేంద్రంపై ఏటా రూ. 12 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని నీతి అయోగ్ చెబుతున్న విషయాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి ముఖం చాటేస్తోంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయనం ప్రకారం... డెయిరీ రంగంలో పాడి రైతులు తమ ఉత్పత్తులకు రిటైల్ ధరలలో 60–70 శాతం పొందగలు గుతున్నారు. మాంసం రిటైల్ ధరలో 60 శాతం పొందుతున్నారు. టమోటా రైతులు 33 శాతం, ఉల్లి రైతులు 36 శాతం పొందుతున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లకు 31 శాతం, మామిడి పండ్లకు 43 శాతం, బత్తాయి, కమల వంటి పండ్లకు 40 శాతం పొందుతున్నారు. మార్కెట్లో కిలో రూ. 50–75 మధ్య పలికే బియ్యం (ధాన్యం) పండించే రైతులకు మాత్రం ఆ ధరలో కనీసం 10–20 శాతం కూడా దక్కని దుఃస్థితి నెలకొంది.రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77 జాతీయ నమూనా సర్వే వెల్లడిస్తోంది. ఈ సర్వే ప్రకారం దేశంలో సన్నకారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4 వేలకు మించిలేదు. ఆదాయాలు పెరగకపోవడంతో వారి రుణభారంలో తగ్గుదల కనిపించడంలేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక, రుణ భారం తట్టుకోలేక రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు ఏటా పెరుగు తున్నాయి.చదవండి: నీటిలో తేలియాడే రాజధానా?స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గడచిన 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా... కేంద్రం ప్రకటించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడమే కాదు... మార్కెట్లో ధర లేని సమయంలో ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’ కింద మద్దతు ధర దక్కని ఉత్పత్తులను కొను గోలు చేసి మద్దతు ధర దక్కేలా కొంత మేర కృషి చేయగలిగింది ఏపీలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గ్రామస్థాయిలో ఏర్పాటైన ఆర్బీకే వ్యవస్థ, రైతులకు వెన్నుదన్నుగా నిలవగా, వాటికి అనుబంధంగా దాదాపు రూ. 16 వేల కోట్ల అంచనా వ్యయంతో కోల్డ్ స్టోరేజ్‌లు, కలెక్షన్ రూములు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు బీజం పడింది. మద్దతు ధరల నిర్ణయం, కల్పన, అమలు కోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఏపీ ఫామ్ ప్రొడ్యూస్ సపోర్టు ప్రైస్ ఫిక్సేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టు–2023’కు రూపకల్పన చేసింది. కానీ అధికారుల తీరు వల్ల అసెంబ్లీలో చట్టరూపం దాల్చలేక పోయింది.చదవండి: విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంఏపీ తయారు చేసిన చట్టాన్ని మరింత పకడ్బందీగా జాతీయ స్థాయిలో తీసుకొస్తే రైతులకు ఎంతోమేలు జరుగుతుంది. ఈ విషయంలో జాప్యం చేసే కొద్దీ మద్దతు ధర దక్కని రైతులు వ్యవసాయానికి మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత వ్యవసాయ దారుల్లో 60 శాతం మంది లోటు ఉత్పాదకత కారణంగా సాగును వదలి వేయాలని నిర్ణయించుకున్నట్లు దేశంలోని 21 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఓ జాతీయ సర్వే సంస్థ ఇటీవల తేల్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు వేసి ఈ రంగాన్ని బలోపేతం చెయ్యాలి.- తలకోల రాహుల్ రెడ్డి మార్కెట్ ఎనలిస్ట్, కన్సల్టెంట్ -
తెలంగాణ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల మరణాలు ఆగేదెన్నడు?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో వరుసగా ఆహారం కలుషిత మైన (ఫుడ్ పాయిజన్) సంఘటనలు, విద్యార్థుల మరణాలు కొనసాగున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాన్నీ, సౌకర్యాల కల్పనలో వైఫల్యాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘటనలన్నిటికీ రాష్ట్ర సర్కారే భాధ్యత వహించాలి. ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలవ్వగా, 42 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయి. వీరిలో ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యంతో మరణించిన వారు, బలవన్మరణానికి పాల్పడినవారూ, అనుమానాస్పదంగా మృతి చెందినవారూ ఉన్నారు.ఇదే ఏడాది ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు, శానిటరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్ళలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదని గుర్తించారు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని తెలిసింది. ఎక్కడ కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపండ్లు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ళ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. వంటశాలలు రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిలువచేస్తున్నారనీ, మరుగుదొడ్లు– బాత్రూంలలో కనీస శుభ్రత లేదనీ, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదనీ తేలింది. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతోంది. నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్టోబర్ 30వ తేదీన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసి డెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మార్చి నెల నుంచి నవంబర్ 15 వరకు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా... 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆగస్టు 22న భువనగిరిలోని ఈ గురుకులాన్ని ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్’ బృందం సందర్శించినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు.చదవండి: విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. పిల్లలకు నాణ్యమైన చదువు దూరం!ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసు కోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్‌లను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి – యువజనులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు వివిధ రూపాలలో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి.– కోట ఆనంద్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు -
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే... మానవీయంగా!
మహా నగరాలకు ఒక ప్పుడు త్రాగు నీటిని అందించిన స్వచ్ఛమైన జల ప్రవాహాలు ప్రస్తుతం కనీసం పుక్కిలించడానికి కూడా వీలులేని కాలుష్య జలాలుగా కదులు తున్నాయి. ఉద్యోగ, ఉపాధి తదితర బతుకు తెరువు కోసం అసంఖ్యాక జనావళి నగరాలకు తరలి రావడంతో మహానగరాలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నాయి. పారిశ్రామిక కాలుష్యం, జన జీవనం అందించే దైనందిన కాలుష్యం... నదీ, నదాలలో కలుస్తున్నాయి. పల్లెల నుంచి నగరాల వరకు జనం నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నిరుపేద జనసామాన్యం నివాస స్థలాలు, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాల కోసం తపిస్తూ మురికివాడల కాలుష్య కూపాలలో మృత్యుసంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనం ఆరోగ్యం, సంక్షేమం గురించి కార్యాచరణ దృష్ట్యా మురుగునీటి పారుదలపై దృష్టి సారించవలసి వస్తోంది.ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దుర్గంధపూరిత కాలుష్య ప్రవాహం కలిగిన మూసీ పునరుజ్జీవం తెరపైకి తెచ్చింది. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)... అక్రమ కట్టడాలనే వంకతో పేదలు కష్టించి నిర్మించుకొన్న మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లు కూల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఆగ్రహంతో ప్రభుత్వ అమానవీయతపై విరుచు కుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ కొరియా సియోల్ నగరం నమూనాలో పథకం అమలుకు ఆలోచిస్తోంది. మూసీ జలాల ప్రక్షాళనను పర్యాటక ఆదాయాభివృద్ధికి ముడి పెట్టడం ప్రతిపక్షాల విమర్శలకు దారి తీస్తోంది.గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి ఆను కొని ఉన్న సబర్మతి నది... నగరానికి ఒకప్పుడు త్రాగునీటిని అందించి క్రమేపీ మురికి కాలువగా మారింది. అయితే నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దృఢ దీక్షా సంకల్పంతో మళ్లీ కాలుష్యరహిత జలవాహినిగా రూపొందింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగాలి.రెండు దశాబ్దాల క్రితం సబర్మతీ ప్రక్షాళన ప్రాజెక్ట్ చేపట్టక ముందే... గుజరాత్ ప్రభుత్వం, పది వేల కుటుంబాలకు పునరావాసం కల్పించింది. అహ్మదాబాద్‌లో 11.5 కి.మీ. పరిధిలో క్రమేపీ చేపట్టిన అభివృద్ధి పథకాలు సబర్మతీ నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దాయి. 1917 నాటి సబర్మతీ ఆశ్రమం, మహాత్ముని స్మృతి చిహ్నంగా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందింది.తెలుగు రాష్ట్రాలు గోదావరి, కృష్ణా వంటి భారీ నదుల వరదకే కాకుండా... బుడమేరు, మానేరు వంటి వాగులు, ఉపనదులకూ వచ్చే వరదలూ; నగరాలను ఆనుకుని ప్రవహించే నదుల కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాధినేతలు ఆ నదులను బాగుచేయడం ద్వారా ఆ యా ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని సాధించి ఆదాయం పొందడం తప్పు కాదు. అయితే ఈ అభివృద్ధి పేరుతో నిరుపేదలను బజారుపాలు చేసి కన్నీళ్ల సముద్రంలో ముంచడం సమంజసం కాదు.చదవండి: అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని నగర రూపకల్పనలో లండన్, సింగపూర్ వంటి నమూనాల ప్రస్తావన ఉంది. తెలంగాణ మూసీ రివర్ ఫ్రంట్‌లో సబర్మతిని గుర్తు చేసే ‘బాపు ఘాట్’ ప్రస్తావన ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని అపురూప అత్యున్నత గాంధీజీ శిలా విగ్రహం నెలకొల్పే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు... ఇబ్బడిముబ్బడి సుస్థిర పర్యాటక రంగ ఆదాయాన్ని ఆశిస్తోంది. ఏది ఏమైనా ప్రతి రోజూ సుమారు 200 కోట్ల లీటర్ల నగరాల మురికినీరు, అంతకంటే ప్రమాద భరితమైన పారిశ్రామిక రసాయన వ్యర్థాల కాలుష్య జలాలతో లక్షలాది జనానికి మృత్యు స్పర్శ అందించే మూసీ కాలుష్యాన్ని నిర్మూలించే పునరుజ్జీవ సత్సంకల్పం సాధ్యం చేయగలిగితే, జన జీవన సౌభాగ్యానికి కంకణం ధరించినట్టే!- జయసూర్యసీనియర్ జర్నలిస్ట్ -
అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలు– ‘లోకాయుక్త’ మానవ హక్కుల కమిషన్, సీబీఐ కోర్టు, ఉన్నత ‘లా’ విద్యాసంస్థలు వంటి వాటిని అక్కడ నుంచి ‘అమరావతి’కి తరలిస్తున్నట్టు, స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో... గత పదేళ్ల పరిణామాల సమీక్ష తప్పడం లేదు.ఈ విషయంలో మొదట ఒకమాట అనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఎందుకు రెండుగా విభజించబడింది అనే విషయంలో పదేళ్ళ తర్వాత అయినా మనకు స్పష్టత అవసరం. ఇక్కడ రాష్ట్రాల్లో అయినా అక్కడ ఢిల్లీలో అయినా ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వంలోకి ప్రవేశించే ‘లెజిస్లేచర్’ కాకుండా, శాశ్వతమైన ‘ఎగ్జిక్యూటివ్’ అనే శక్తిమంతమైన వ్యవస్థ మరొకటి ఉంది. ఈ రెండింటిపై ‘జ్యుడిషియరీ’ ఉంది. ప్రభుత్వాలు ఉనికిలో లేని విరామాల మధ్య కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే, 2014 ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రం ‘గవర్నర్ పాలన’లో ఉంది. దేశ ప్రాదేశిక భద్రత విషయమై గురుతరమైన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. పరిపాలనలో కేంద్ర– రాష్ట్ర సంబంధాలు ఢిల్లీలో ‘హోమ్’శాఖ వద్ద ఎందుకు ఉంటాయో మనకు అర్థం కావాలి. అలాగే, 2014 మొదట్లో ‘యూపీఏ–2’ ప్రభుత్వంలో ఢిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయినప్పుడు; అధికారుల కమిటీ కాకుండా, ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎందుకు అధ్యక్షుడుగా ఉన్నారో మనకు అర్థం కావాలి. అటువంటి గ్రహింపుతో మొత్తంగా భారత ప్రభుత్వం సమగ్రమైన తూర్పు దృష్టి (లుక్ ఈస్ట్) ‘డ్రైవ్’ అంతా కేవలం ఆగ్నేయ ఆసియా వైపు ఎందుకు ఉందో కూడా మనకు తెలియాలి. కీలకమైన కేంద్ర మంత్రిత్వశాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఎందుకు తమ కార్యకలాపాల వేగాన్ని పెంచుతున్నాయో మనకు తెలియాలి. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణం రాష్ట్ర రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం. దానితో పనిలేకుండా కేంద్రం 2022 అక్టోబర్ నాటికి కాకినాడ వద్ద ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సౌత్ ఇండియా కేంపస్ తెచ్చింది. మార్చి 2024 నాటికి బాపట్ల సమీపాన ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ దళాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పడింది. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్’ (డీఆర్డీఓ) రూ. 100 కోట్లతో ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ మచిలీ పట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద వద్ద నిర్మి స్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా బాపట్ల–బందరు రెండూ కూడా విజయవాడ, గుంటూరు నగరాలతో సంబంధం లేని సొంత కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాలుగా మారాయి.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!కేంద్ర ఆర్థికశాఖ అనంతపురం జిల్లాలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్’ వంటి దేశంలోనే అత్యున్నత స్థాయి శిక్షణా సంస్థను 2022 నాటికి బెంగళూరు సమీపాన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించింది. అదే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి ప్రాంతాన్ని వేరుచేసి; సత్యసాయి జిల్లా పేరుతో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ సంస్థ ఆ కొత్త జిల్లాలో ఉంది. మరి వీటిలో దేన్నైనా ఇది ఇక్కడ కాదు, అని మరొకచోటికి తరలించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ; లేదా ‘కూటమి’లో భాగస్వామి అయిన బీజేపీ నడుపుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు అనడం లేదనే సందేహం మనకు రావాలి. అప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వాల అవసరాల కంటే, విస్తృతమైన దేశప్రయోజనాల కోసం కేంద్రంలో – రక్షణ, వాణిజ్యం, ఉపరితల రవాణా, రైల్వే, స్పేస్ సైన్స్, వంటి కొన్ని మంత్రిత్వశాఖల్లో– ‘ఏపీ’ కోసం ఒక ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న వైపుకు అవి మనల్ని మన రాష్ట్రం ‘జాగ్రఫీ’ వైపుకు తీసుకువెళతాయి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?అయితే, జరిగినవి ఏవీ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మనపట్ల ప్రేమతో చేయలేదు. ‘మెతుకు ముట్టుకుంటే అన్నం సోకు తెలుస్తుంది’ అన్నట్టుగా, రాష్ట్ర విభజన జరిగి ఆ ‘షాక్’ నుంచి ఇంకా మనం కోలుకోక ముందే 2014 మధ్యలోనే బందరు వద్ద భూమి కూడా ఎంపిక చేసిన ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ని ఇక్కణ్ణించి ఉత్తరాదికి వారు తరలించారు. అదే ఏడాది డిసెంబరులో ‘ఏపీ’కి కూడా మరొక ‘అకాడమీ’ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికి అటువంటిది ఏమీ లేదు. జరుగుతున్నవి అన్నీ ఇటీవల కొత్తగా వాడుకలోకి వచ్చిన ‘జియో – పాలి టిక్స్’లో భాగంగా దేశ ప్రాదేశిక అవసరాల మేరకు ‘బ్యురోక్రసీ’ స్థాయిలో జరుగుతున్న విధాన నిర్ణయాలు. ఇంతటి సమగ్రమైన వైశాల్యంతో మారిన కొత్త ‘మ్యాప్’లోని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడగలిగినప్పుడే, ఇక్కడ అది అమలు చేయాల్సిన స్వల్పకాలిక – దీర్ఘకాలిక ‘ప్లానింగ్’ ఎలా ఉండాల్సిందీ దానికి అర్థమవుతుంది. అప్పుడు ఈ మొత్తంలో – ‘రాజధాని’ అనే అంశానికి ఉన్న జాగా ఎంతో కూడా మనకు అర్థమవుతుంది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం
‘ఈ స్పృహ ఈనాటిది కాదు. దీనికి యాభయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. మానవకారక కాలుష్యాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు పర్యావరణ మార్పు దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలన్నది ఒప్పందం. అంతే తప్ప, ఆ పేరుతో పెట్టుబడుల్ని సాయంగా చూపి వ్యాపారం చేయడం కాదని ఇవాళ మనం నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. పదమూడేళ్ల కింద (2011 కోపెన్‌హాగెన్) మీరే అంగీకరించి, సంసిద్ధత ప్రకటించినట్టు ఏటా ఇవ్వాల్సిన లక్ష కోట్ల డాలర్ల పర్యావరణ ఆర్థిక సహాయాన్ని మీ మీ వ్యాపారాల వృద్ధికి బంగారు బాట చేసుకోకండి’ అని తాజాగా భారత్ స్పష్టం చేసింది. అజర్‌బైజాన్‌లోని ‘బాకు’లో ‘కాప్–29’ సదస్సు జరుగుతున్న సందర్భంలో భారత్ ఈ ప్రకటన వెలువరించింది. ఇవాళ 140 కోట్ల మానవ వనరుల శక్తిగా, మార్కెట్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న భారత్, శాసించాల్సిన చోట నామమాత్రపు పాత్రకే పరిమితమౌతోంది. కారణం, పర్యావరణ స్పృహ, దూరదృష్టి, ప్రపంచ దృక్పథం కలిగిన నాయకత్వం లేకపోవడమేనన్నది కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవం. యాభై ఏళ్ల కింద, నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చూపిన పర్యావరణ దృక్పథం, చేసిన ఆలోచనలు కాలం కన్నా ఎంతో ముందున్నాయి. తదుపరి అయిదారు దశాబ్దాల్లో అభివృద్ధి– పర్యావరణ పరిరక్షణ మధ్య తలెత్తబోయే ఘర్షణను గుర్తించారు. ఇదే విషయమై సంపన్న–పేద దేశాల మధ్య బంధాలకు సరికొత్త నిర్వచనాల అవసరాన్ని ఆమె సహేతుకంగా అంచనా వేశారు. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అవసరాలకూ, దామాషాకూ మించి కొల్లగొట్టడాన్ని పర్యావరణ నేరంగానే చూశారామె! విఘాతం కలిగించిన వారే మూల్యం/ నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచనకు ఆమె నాడే బీజం వేశారు. భారతదేశపు పర్యావరణ దృక్పథానికి, భావధారకు మూలాలు 1971–72 నాటి పాలకుల ఆలోచనల్లో, కేంద్ర ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలు చర్యలు దీన్ని ధ్రువీకరిస్తాయి. స్వీడన్ వినతి మేరకు ఐక్యరాజ్యసమితి చొరవతో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు స్టాక్‌హోమ్‌లో 1972 జూన్‌లో జరిగింది. కానీ, అంతకు ముందే 1972 ఫిబ్రవరిలోనే ‘పర్యావరణ ప్రణాళిక–సమన్వయ జాతీయ కమిటీ’ (ఎన్సీఈపీసీ) భారత్‌లో ఏర్పాటయింది. దీని ఏర్పాటుకు ఇంది రాగాంధీ చొరవ కారణం. ఆ కమిటీయే 1985లో కేంద్ర ‘పర్యావరణ అటవీ మంత్రిత్వ’ శాఖగా రూపాంతరం చెందింది. 1971 డిసెంబరులో ఆమె సిమ్లాలో ఉన్నారు. పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తర్వాతి పరిణామాల్లో... పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఆమె దౌత్య చర్చలు జరుపుతున్నారు. అంతటి ఒత్తిడిలోనూ, సిమ్లా నుంచే ఆమె బిహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందనీ, అది పర్యావరణానికి హాని చేసే తప్పుడు చర్య అవుతుంది కనుక ఉపసంహరించుకోవాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు.దక్షిణ ప్రపంచానికి గొంతిచ్చిన వైనంస్టాక్హోమ్ పర్యావరణ వేదికను ఇందిరాగాంధీ ఎంతో వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా వాడుకున్నారు. అక్కడ ఆమె ఒక అరుదైన ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఆతిథ్య స్వీడన్ కాకుండా ఆమె ఒక్కరే దేశాధినేత హోదాలో ‘ప్లీనరీ ప్రసంగం’ చేశారు. ‘ఆ సదస్సు తర్వాత పదేళ్లకు పైగా ఆ ఊపు ఆమెలో కనిపించింది. దాని ఫలితంగానే, ఇప్పటికీ దేశంలో గొప్ప రక్షణాయుధాలుగా ఉన్న పలు ప్రగతిశీల అటవీ, వన్యప్రాణి–సహజవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆ కాలంలోనే వచ్చాయ’ని ఆమె సమకాలికులైన ప్రభుత్వాధికారులు ఆయా సందర్భాల్లో వ్యాఖ్యానించేవారు. స్వల్ప జనాభా ఉన్న సంపన్న దేశాలు సౌఖ్యాలకు మరిగి, అసాధారణ స్థాయిలో ప్రకృతి సహజ వనరుల్ని కొల్లగొడుతూ చేస్తున్న పర్యావరణ హానిని ఆమె సోదాహరణంగా ఎండ గట్టారు. అభివృద్ధి–పర్యావరణ ఘర్షణను విడమర్చారు. కాలుష్య నివారణ కోసం విధించే కట్టుబాట్లు వెనుకబడ్డ దేశాల ప్రగతికి ప్రతిబంధకం అయ్యే తీరును ఎత్తిచూపడమే కాక ‘కాలుష్య కారకులే నష్టాల మూల్యం చెల్లించాల’నే వాదనను తెరపైకి తెచ్చి, మూడో ప్రపంచ దేశాల గొంతుకయ్యారు. ‘పర్యావరణ వాదననే మనం నెత్తికెత్తుకుంటే... యుద్ధం, పేదరికం వంటి సంక్షోభాలు అప్రాధాన్యమవుతాయేమో?’ అంటూ సదస్సు చైర్మన్‌గా ఉన్న యూఎన్ ప్రతినిధి మౌరిస్ స్ట్రాంగ్ వ్యక్తం చేసిన భయాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘ప్రకృతి పరిరక్షణ’ అనేది అభివృద్ధి–పేదరిక నిర్మూలన బాధ్యతకు వ్యతిరేకం కాదనీ, అదే వారి జీవనప్రమాణాల వృద్ధికి దోహదపడుతుందనీ ఆమె అదే వేదిక నుంచి స్పష్టం చేశారు. సంపద, హోదా, అధికార పరంగా మనమెంత బలిష్టులమైనా, పర్యావరణ మార్పు విపరిణామాలకు ప్రభావితులం కాకుండా తప్పించు కోజాలమని ఆనాడే హెచ్చరించారు.పర్యావరణ స్పృహగల వారిప్పుడు వాడుతున్న ‘ఒకే పృథ్వి’ ‘జీవులున్న ఏకైక గ్రహం’ వంటి మాటల్ని ఇందిరా గాంధీ 70లలోనే వినియోగించారు. ‘ప్రపంచం ఏ మూల నుంచో తరచూ సమాచారం అందుతోంది, దేశం వెనుక దేశం అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి తెగిస్తోంది, ఇలా సాగితే దీనికి ముగింపేమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. సాటి మనుషుల్ని రక్షించడం, దోషుల్ని శిక్షించడమే కాదు, సకల జీవుల పట్ల కరుణతో ఉండాలని బుద్ధుడు, అశోకుడు 2 వేల ఏళ్ల కింద ఏర్పరచిన బాట, భారతీయ సంస్కృతిని ఆమె స్టాక్‌హోమ్ వేదిక నుంచి జగతికి వినిపించారు. అతి పురాతనమైన రుగ్వేదాన్ని ఉటంకిస్తూ ఇందిరాగాంధీ ఆనాడు స్టాక్‌హోమ్‌లో చెప్పిన ‘ప్రకృతి నుంచి తీసుకున్నంత, తిరిగి వెనక్కి ఇవ్వటం మానవ ధర్మం’ అన్న మాట, మనమంతా ఆచరించాల్సిన అక్షరసత్యం!- దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్(నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి) -
శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!
వర్తమానంలోని అనేక సమస్యలకు చరిత్రలోనే మూలాలు ఉంటాయి. అటువంటి చరిత్రను పనికిమాలినదిగా భావించిన పాలకుల హయాంలో సమస్యలకు పరిష్కారాలు ఎలా లభిస్తాయి? కరవుకాటకాలతో వెనుకబడి పోయిన రాయలసీమ వెతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ‘శ్రీబాగ్ ఒడంబడిక’లోని అంశాలను చిత్త శుద్ధితో అమలుకు ప్రయత్నించకపోవడమే ఈ నాటి రాయలసీమ దుఃస్థితికి ప్రధాన కారణం. ఒడంబడిక ప్రకారం దక్కిన రాజధాని ఎటూ చెయ్యి దాటిపోయింది. కనీసం అభివృద్ధికి కీలకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నా పూర్తవుతాయా?శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకున్న అనుబంధం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర అవతరణకు మూలం. పాలకుల నిరాదరణకు గురైన ఈ ఒడంబడికకు నేటికి 87 సంవత్సరాలు. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ నైజాం నవాబు పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. భాషాభిమానం, రాజకీయ కారణాలతో తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలనే ఆలోచన మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలలో వచ్చింది. ఈ క్రమంలో 1913 (బాపట్ల)లో తొలి ‘ఆంధ్ర మహాసభ’ జరిగింది. అది భాష, సాంస్కృతిక వికాసం కోసం పరితపించిన వేదిక అయినా... అంతర్లీనంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతం విడిపోవాలని దీని నిర్వాహకులకు ఉండేది. కారణాలు ఏమైనా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు ప్రారంభంలో సమావేశాలకు హాజరు కాలేదు. అయితే రాయలసీమ భాగస్వామ్యం లేకుండా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆంధ్ర మహాసభ పెద్దలు సీమ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడం కోసం 1917లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సీమలో పర్యటించిన అనంతరం జరిగిన సభలలో సీమ ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు.మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు గొంతు కలపలేదు. కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలనలో ఉన్న ఆ ప్రాంతం... విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అలాగే కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీల వల్ల సీమతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందు ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృద్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం సీమ పెద్దలకు ఇష్టం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో జరిగిన అనుభవా లతో అనుమానాలు పెరిగాయి. 1926 ఆంధ్రమహాసభ ఆంధ్రా యూనివర్సిటీనీ వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. మద్రాసు శాసనసభలో ఈ అంశంపై జరిగిన తీర్మానంలో తమిళ శాసన సభ్యులు పాల్గొన వద్దని ఆనాటి ముఖ్యమంత్రి సూచించారు.వాస్తవానికి ఆంధ్ర మహాసభ తీర్మానం ప్రకారం... కోస్తా, సీమ సభ్యులు అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఓటు వేయాలి. అందుకు భిన్నంగా మధ్య కోస్తా సభ్యులు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి సూచనను పక్కన పెట్టి తమిళ శాసన సభ్యులు కొందరు సీమ సభ్యులకు అనుకూలంగా ఓటు వేయడంతో 25 – 35 ఓట్లతో అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ తీర్మానం, అసెంబ్లీ ఆమోదాన్ని కాదని విశాఖలో ఏర్పాటు చేసి తొలి ఉప కులపతిగా రాయలసీమ వారికి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంతో పప్పూరి రామాచార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి లాంటి వారు... ‘ఉంటే మద్రాసుతో కలిసి ఉందాము లేకపోతె రాయలసీమ రాష్ట్రంగా (ప్రస్తుతమున్న సీమ నెల్లూరు ప్రకాశం జిల్లా, కర్ణాటక లోని బల్లారితో సహా) విడిపోదాం’ అని ప్రతిపాదన చేశారు.ఇదంతా గమనిస్తున్న ఆంధ్రమహాసభలోని పెద్దలు చర్చల నిమిత్తం రెండు ప్రాంతాల సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 1937 నవంబర్ 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం (శ్రీబాగ్)లో కమిటీ సమావేశమయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం అవతరించిన తర్వాత పాలనా ప్రాధాన్యతలపై ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే ‘శ్రీబాగ్ ఒడంబడిక’. కోస్తా, సీమ ప్రజల పోరాటం... మరో వైపు పొట్టి శ్రీరాములు దీక్ష–ఆత్మార్పణల ఫలితంగా భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న అవతరించింది.శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు:1. ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఎంపిక చేసుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. 2. కృష్ణా, తుంగభద్రలలో నీటి వినియోగంలో రాయలసీమకు వాటా కేటాయించాలి. అందుకనుగుణంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. 3. రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వాన్ని సాధించేందుకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రా యూనివర్సిటీ కింద ఒక కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలి. 4. జనాభా లెక్కల ప్రకారం కాకుండా సీమ, కోస్తా ఆంధ్రకు సమానంగా నియోజక వర్గాల ఏర్పాటు చేయాలి.ఈ ఒప్పందం ప్రకారం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ, 1956లో తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో రాజధాని రాయలసీమ నుంచి తెలంగాణకు మారింది. అలా శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడటం ప్రారంభమయ్యింది. రాయలసీమ అభివృద్ధిలో అతి ముఖ్యపాత్ర పోషించే నీటి ప్రాజెక్టులనన్నా పూర్తి చేస్తున్నారా అంటే అదీ జరగడం లేదు. అదేమంటే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత లేదనీ, అది కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అనీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. నాటి కాంగ్రెస్ విభిన్న అభిప్రాయాలు ఉన్నవారి సంగమం. కమిటీ సభ్యులు కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన ఈ ఒప్పందం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా తేల్చడం సమంజసమేనా?చదవండి: హానికరమైన కొత్త జాతీయవాదంమద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోవడంలో సీమ ప్రజల త్యాగం ఉన్నది. ప్రస్తుత సీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి ఇప్పటికీ హైదరాబాద్ కన్నా చెన్నై నగరంతోనే అనుబంధం ఎక్కువ. తెలుగు రాష్ట్రం కావాలనే కోరిక పుట్టిన ప్రారంభంలోనే... తమిళులు మదురై కేంద్రంగా తమిళ రాష్ట్రం కోసం తీర్మానం చేశారు. దీనికి కారణం ఎప్పటికైనా చెన్నై తెలుగు వారిదే అవుతుందేమో అని వారి ఆలోచన. నిజానికి పప్పూరి రామా చార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి ప్రతిపాదన ప్రకారం రాయలసీమ రాష్ట్రం ఏర్పడి ఉంటే (ప్రస్తుత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బళ్ళారి, చెన్నై సమీప జిల్లాలతో కలిపి) చెన్నై మహానగరం మనదే అయ్యేది. దీన్నిబట్టి సమీపంలోని చెన్నై నగరాన్ని వదులుకుని తెలుగు రాష్ట్రం కోసం సీమ ప్రజలు త్యాగం చేశారని అర్థం చేసుకోవాలి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం కారణంగా శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధాని మాత్రమే ఆన్న ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. మరి నీటి ప్రాజెక్టుల సంగతేమిటి? శ్రీశైలం ప్రాజెక్టు నీటిని సత్వరం అందిపుచ్చుకునే విధంగా సిద్ధేశ్వరం ఆలుగునూ, పోతిరెడ్డి పాడునూ వెడల్పు చేయడం; రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నీటిని ఉపయోగించుకునే విధంగా గుండ్రేవుల, కుందూపై రిజర్వాయర్లు నిర్మించడం; గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం; చెరువుల పునరుద్ధరించడం వంటి చర్యలే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం. అందుకే రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్రలపై సీమ ప్రాంత సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అనుగుణంగా పై ప్రాజెక్టులు పూర్తి చేయాలి.శ్రీబాగ్ ఒడంబడికలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్ర నీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీబాగ్ ఒప్పంద స్ఫూర్తితో సీమ సమాజం ఇందుకోసం ముందుకు సాగాలి.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని..
మానవ సమాజ పరి ణామ క్రమంలో పుట్టుకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవ స్థలో... యజమాని, కూలి వంటి వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాల మధ్య అంతర్గత మైన అణచివేతలు, దోపిడీ కొనసాగింది. రైతులు, కూలీలు చేసిన ఉత్ప త్తులను యాజమానులు సంపదగా మలుచుకొని దోపిడీకి తెగబడ్డారు. మానవ సమాజాన్ని కారల్ మార్క్స్ అధ్యయనం చేసి దోపిడీ చేసే వర్గం సమాజంలో తక్కువగా ఉన్నదనీ, దోపిడీకి గురయ్యే వర్గం ఎక్కువగా ఉన్నదనీ చెప్పాడు. దోపిడీకి గురైన వారు ఐక్యంగా ఉండి తిరగ బడినప్పుడు మాత్రమే దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపాడు. దానికి మొదటగా 1848లో మొదటి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ప్రవేశ పెట్టాడు. మానవ కల్యాణానికి వర్గ రహిత సమాజ నిర్మాణానికి కారల్ మార్క్స్ కృషి చేశాడు.1895 అమెరికాలోని షికాగో నగరంలో అణచి వేయబడిన కార్మికులు... తడిచిన రక్తంలో తడిచిన కండువాను ఎర్రజెండాగా ఎగురవేసి కార్మికుల హక్కులకై పోరాటం చేశారు. ఈ ఉద్యమం అణచివేత, ఆవేదన, దోపిడీ నుండి పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వామపక్ష పార్టీలు విస్తరించాయి. ఈ విస్తరణలో భాగంగా శ్రీలంకలో వామపక్ష పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్‌లోని అన్ని వామ పక్షాలూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాలి.భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ వామపక్ష భావజాలా నికి స్థానం ఉంది. అయితే విస్తరించడానికి అడ్డంకులు ఉన్నాయి. భారతదేశంలో 1925లో కమ్యూ నిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన జరిగింది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల వలన ఇది అనేక పార్టీలుగా చీలిపోయింది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి. కానీ కుల, మత పార్టీలు పుట్టుకొచ్చాయి. భారతదేశంలో కమ్యూనిస్టులు శ్రమజీవుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడ్డారు. కమ్యూనిస్టులు పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో హక్కులను పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వామపక్ష పార్టీలలో మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే హక్కులను సాధించుకుందామనే ఆలోచనతో పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్న పోరాట రూపం తప్పు కావచ్చు. కానీ లక్ష్యం సరైనదే.నరేంద్రమోదీ, అమిత్‌షాలు వామపక్ష పార్టీలే ప్రధాన బద్ధశత్రువులుగా చూస్తున్నారు. వామపక్ష భావాలు కలిగిన వారిపై ఉపా, రాజద్రోహం కేసులు పెడుతూ బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంచటం చూస్తున్నాము. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా వందలమంది మావోయిస్టులను బలిగొంటున్నారు. వచ్చే ఏడాదికి నక్సలైట్లను నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఇస్తున్నారు. దానికి కారణం భారతదేశంలో వామపక్ష పార్టీలు లేకుండా చేయాలనే దుర్బుద్ధి తప్ప మరొకటి కాదు.చదవండి: ఆ ప్రాజెక్టుకు 10 లక్షల చెట్ల బలి!మావోయిస్టు పార్టీలే కాదు... పార్లమెంట్ పంథాలో పనిచేస్తున్న వామపక్షాలు కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓట్లు కీలకమైనందున ఓట్లు రాబట్టడానికి వామపక్షేతర పార్టీలు అడ్డమైనదారులు తొక్కుతూ అధికారమే పరమావధిగా ఓటర్లను ప్రభావితం చేసే సాధనాలను ఆశ్రయిస్తున్నాయి. డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల ఎర చూపి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. అందుకే అవి గెలుస్తు న్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. కాని దోపిడీ శక్తులూ, వారికి అండగా ఉండే మతోన్మాద శక్తులూ అధికారం హస్తగతం చేసుకుంటున్నాయి. దీంతో కార్మికులు, కూలీలు, బడుగు బలహీనవర్గాల శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. సామాజిక న్యాయం నినాదానికే పరిమితం అయ్యింది.వామపక్ష పార్టీలు ఎక్కడ అణచివేతలు, దోపిడీ ఉంటాయో అక్కడే ఉంటాయి. కొన్ని పార్టీల వారిని ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిని నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఉగ్రవాదులని అంటున్న వారికీ ప్రజా మద్దతు ఉన్న విషయాన్ని మరువరాదు. ఇదే తరుణంలో మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని ప్రత్యామ్నాయ ఆలోచనలకు పదును పెట్టాలి.చదవండి: గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?ప్రజలు తమ వంతుగా ప్రజాస్వామ్య ఫలాలు పొందడానికి పాలకులను ఆలోచింప చేసే విధంగా చైతన్యాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వ దమన చర్యలను ప్రజాస్వామ్య పద్ధతులలో మావోయిస్టులు తిప్పిగొట్టాలి. ‘కన్నుకు కన్ను... చావుకు చావు’ అనే సిద్ధాంతం నుండి కాకుండా కమ్యూ నిస్టులు ఐక్య పోరాటం చేసి అణచివేతలను వర్గ రహిత సమా జాన్ని నిర్మించాలి. మితవాద, మతవాద శక్తుల నుండి దేశం తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ దశలో వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా దానిని తిప్పికొట్టాలి. అందుకు తరుణమిదే! - చాడ వెంకటరెడ్డిసీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు -
ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు.. మూసీ సుందరీకరణ లక్ష్యం ఏమిటి?
రాజకీయ రంగస్థలంపై మూసీ ప్రక్షాళన, పారదర్శకత లోపించి తీవ్ర వివాదాస్పద మవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతకు సంబంధించి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అగ్రహం ప్రకటించింది. ‘రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏమిటని, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడుతారని, రాజకీయ భాష్యాలు చెప్పినట్లు చేస్తే జైళ్లకు పంపు తామ’ని హెచ్చరించింది. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారనీ, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారనీ. ప్రభుత్వంపై, కమిషనర్ రంగనాథ్‌పై, అమీన్పూర్ తహసిల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ఆక్రమణల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.టి.ఎల్. నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్.టి.ఎల్ బయట ఇల్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.‘అసలు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న సుందరీకరణ లక్ష్యం ఏమిటి? మూసీ నదిని, ఆ నదిలో కలిసే వాగులను (గృహ, హోటల్, వ్యాపార, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, మురుగునీటిని) పూర్తి (ఐరోపా ప్రమాణాల) స్థాయిలో ప్రక్షాళన (శుద్ధి) చేసి స్వచ్ఛమైన జలాలు (నది)గా మార్చే లక్ష్యం ఏమైనా ఉందా? ప్రాజెక్టు పూర్తి అయితే, అంటే ఆ మురుగు నీటిని మూసీ నదిలో కలిసే నాటికి పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ప్రక్రియ ఇందులో ఉందా? లేదా హైదరాబాద్ జంట నగరాలలోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలేసి ఆ మురుగు నీటి ప్రవాహంపైనే, సుందరీకరణ చేపడతారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. సమగ్రమైన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందు ఉంచాలి. ప్రజల నివాసాలకు నష్టం కలిగే ఏ ప్రాజెక్టులో నైనా ముందు పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తయిన తరువాతనే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారి నివాసాలను చివరలో ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కానీ, అందుకు భిన్నంగా సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు జీవితమంతా కష్టించి నిర్మించుకున్న ఇండ్లను ప్రాజెక్టు ప్రారంభంలోనే ఎందుకు కూల్చుతున్నారు? ఇదేనా కేసీఆర్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యం?సామాన్య, మధ్యతరగతి వారికి ఒక ఇల్లు అనేది వారి మొత్తం జీవితపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి జీవితంలో చాలా మూల్యం చెల్లిస్తారు. పట్టణంలో ఇల్లనే కల సాకారం కోసం సొంత ఊళ్ళలో ఉన్న పొలాలను, ఇతర ఆస్తులను అమ్ముతారు. అప్పులు తెస్తారు. అనేక కష్టాలతో వారి స్తోమతకు తగ్గ ఇల్లు నిర్మించుకుంటారు. ప్రాజెక్టు పేరుతో, పునరావాసం, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ప్రభుత్వాల, పెద్దల రియల్ ఎస్టేట్ దందాతో 10, 20 గజాల నేలపై ఇల్లు కట్టుకోవడం సామాన్య మధ్య తరగతికి ఒక గగన కుసుమంగా మారింది. అందుకే వీరు మురికి వాడలకు, దుర్గంధ నదుల పరివాహ ప్రాంతాలకు తరలు తున్నారు. చౌకగా వస్తుందని దుర్గంధపూరిత నది అంచునే స్థలం కొని, భారీ డబ్బుతో క్రమబద్ధీకరణ చేసుకొని, ఇండ్లు నిర్మించుకున్నారు. కూల్చివేతల భయంతో గుండె పోటు చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. 8 నెలల నిండు గర్భిణీ అనే కనికరం లేకుండా ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గం. ఒక బాధిత కుటుంబం 25 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటూ నలుగురు కొడు కులకు పెళ్లి చేసింది. నిర్వాసితులైన వీరందరికీ ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభించింది. ఒక్క ఇంట్లో ఇన్ని కుటుంబాలు ఎలా నివసించాలని వేదనకు గురవుతున్నారు వారు. హైడ్రాతో ప్రభుత్వానికి వచ్చిన కీర్తి, మూసి పేదల ఇళ్ల కూల్చివేతతో పాతాళంలోకి పోయింది.జల వనరులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించవలసిందే. కానీ వాటిని ఆక్రమించి భారీ ఆస్తులుగా చేసుకున్నది సామాన్య పౌరులు కాదు. అధికారంలో ఉన్న బడాబాబులు, పెద్దలే. మూసీ నదీ గర్భంలో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపినా, మరికొందరు ఇండ్లను వదిలిపెట్టడానికి ససేమిరా సిద్ధంగా లేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆశించిన స్థానిక ప్రజలు వాటిని తమకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మూసి నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ సమీప ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి దాదాపు 15 వేల కుటుంబ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 2022లోనే నిర్ణయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంలో పది వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. ఆ నిర్వాసి తులందరికీ వారి నివాసానికి, ఉపాధికి అనువైన చోట అన్ని మౌలిక వసతులతో కూడిన పునరావాస సౌకర్యాలను ప్రభుత్వం నిర్వాసితులకు కల్పించాలి. దౌర్జన్యంతో కాకుండా నిర్వాసితులను అన్ని విధాల ఒప్పించి మెప్పించి పునరావస కాలనీకి తరలించాలి.చదవండి: రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చాలి!శుద్ధీకరణ అంటే, మురుగు నీటిలో ఉన్న అశుద్ధ మూలకాలను, కాలుష్యాన్ని తొలగించడం. శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు త్రాగడానికి అనువైన విధంగా 100% సురక్షితంగా ఉండాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజె క్టులో నేటి ప్రభుత్వం ఆ నది మురుగు జలాలను అలా స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తుందా? దేశంలోని చాలా నగరాల్లో మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడా మురుగు నీటిని స్వచ్ఛ జలాలుగా మార్చిన చరిత్ర నేటికీ లేనేలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించారు. సీవరేస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ల ద్వారా మురుగునీటి శుద్ధీకరణ 30–35% కంటే మించదనీ, తెలంగాణలోలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ పథకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టనీ, మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అనీ రకరకాల పేర్లతో మంత్రులు, అధికారులే గందరగోళం చేస్తున్నారు. మూíసీ నదిని పూర్తి స్థాయిలో ఒక ఎకలాజికల్ ప్రాజెక్టు (ఒక స్వచ్ఛమైన నది)గా తీర్చి దిద్దాలనే లక్ష్యం ఏమైనా ప్రభుత్వానికి ఉందా?చదవండి: ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఒక మేన్యువల్‌ను 1997లో ప్రకటించింది. ‘డిజైన్ మేన్యువల్ ఫర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఇన్ ఇండియా’ (దేశంలోని వ్యర్థాల స్థిరీకరణ చెరువుల కోసం డిజైన్ మాన్యువల్). ఇది ప్రకటించి 27 ఏళ్ల అయింది. దీని అర్థం ఏమిటంటే... మురుగు నీటిని శుద్ధి చేయలేమని చేతులెత్తేసి, ఆ నీటిని తాగునీరులో కలవకుండా మురుగునీటిని కుంటలుగా స్థిరపరుస్తామని చెప్పడం. కోటిమంది హైదరాబాద్ నగర వాసులు వాడిన మురికి నీరు, వ్యాపార సముదాయాల వ్యర్థాలు, పరిశ్ర మలు వెదజల్లే విష పదార్థాలు మూసీ ద్వారా కృష్ణా నదిలో యధేచ్ఛగా కలుస్తున్నాయి. ఆ కలుషిత నీటినే ప్రజలు జీవజలంగా సేవిస్తున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ పథ కాలకు ఎంత అందమైన పేర్లు పెట్టినా శుద్ధీకరణ వట్టిదే నని 75 ఏళ్ల దేశ చరిత్ర రుజువు చేస్తోంది. ఇది కఠిన వాస్తవం. మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ లిమిటెడ్ ప్రక్షాళన ఏ రకమైనదో... డీపీఆర్‌ను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి.- నైనాల గోవర్ధన్ తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ -
రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చండి ప్లీజ్!
ప్రస్తుతం శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన సందడి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నిక కోసం పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదిని ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ ఓటు హక్కు కోసం 2021లోపు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ప్రకటించింది. ఆ యా పార్టీల అభ్యర్థులు, వ్యాపార సంస్థల నుండి పట్టభద్రులుగా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలనుకునే వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సెల్ నెంబరు ద్వారా ఓటు నమోదు కోసం గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు. అయితే పట్టభద్రులు తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి కావడంతో... చాలామంది రిజిస్ట్రేషన్‌కు వెళ్లడానికి బద్ధకిస్తున్నారు.వాస్తవానికి ఓటు హక్కును సులువుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల అనేక మంది పట్టభద్రులు ప్రత్యేకంగా ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి ఓటు నమోదు చేసుకోడానికి సమయం వెచ్చించడం లేదు. పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఉంచిన వెబ్ సైట్లో డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు నంబర్లను నమోదు చేసినా... మళ్లీ గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో ధ్రువీకరించిన పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలనే షరతు చికాకు కలిగిస్తోంది. అందుకే చాలామంది తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు.చదవండి: స్టూడెంట్ లీడర్ టు సీఎం.. రేవంత్ రెడ్డి రాజకీయ పొలిటికల్ జర్నీఒకవేళ ఇదే మంచి ఆలోచన అని ప్రభుత్వం భావించినప్పుడు ఆ యా మండల స్థాయిలోనే ఒకరిద్దరు గెజిటెడ్ స్థాయి అధికారులను ఉంచి, అక్కడే ఓటు హక్కును ప్రభుత్వమే నమోదు చేస్తే బాగుండేది. ఈ విషయాన్ని అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని షరతులు ఉన్నా... వాటిని అధిగమించి తమ ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. మంచి ప్రతినిధిని ఎన్నుకుని గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయాలి.– సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
స్ఫూర్తిమంతమైన విజయపథంలో... సీఎం రేవంత్ రెడ్డి
ప్రత్యర్థులు ఎన్ని అవరోధాలు కల్పించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు అనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంత స్తబ్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో రేవంత్ పాత్ర అంతా ఇంతా కాదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక దూకుడుగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. ఈ సమయంలో పార్టీలో సీనియర్లు, జూనియర్లనే భేదం లేకుండా అందరినీ కలుపుకు పోయారు. కేసీఆర్‌ను గద్దెదించుతానని శపథం చేసి నిజంగానే ఆయన్నిఇంటికి పంపారు. 2023, డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ పదవీ ప్రమాణం స్వీకారం చేసి ప్రజా పాలనను ప్రారంభించారు.రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా) వంగూర్ మండలం కొండారెడ్డి పల్లెలో జన్మించారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్ పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ అయ్యారు. 2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు.మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభ జన తర్వాత... అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా, మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా అత్యుత్తమ పని తీరును కనబరిచారు. దీంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో 2021లో రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది.అన్నీతానై 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తిచూపారు. వారి అవినీతిని బయట పెట్టారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కింద వైద్య చికిత్సకు పది లక్షల వరకు సాయం పెంచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. గత 11 నెలల్లో తెలంగాణలో మహిళలు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ ట్రిప్స్ ఉపయోగించు కున్నారు. దీని వల్ల మహిళలకు 3,433 కోట్ల రూపా యలు ఆదా అయ్యాయి. రుణమాఫీని బీఆర్ఎస్ పదేళ్లలో సక్రమంగా అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని కేవలం 8 నెలల్లోనే అమలు చేసింది కాంగ్రెస్. 22 లక్షల 22 వేల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. పేద లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ను ఇస్తోంది.చదవండి: పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?కేవలం 11 నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో వేల కొలది ఉద్యోగాలను భర్తీ చేశారు. మూసీ నది పునరుజ్జీవానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూని వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నారు. 11 నెలల కాలంలోనే బీఆర్ఎస్ పాలనలోని చీకట్లను రేవంత్ రెడ్డి పారదోలి తెలంగాణను అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చేస్తున్నారు. అటువంటి ప్రియ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు!- వెలిచాల రాజేందర్రావు (Velichala Rajender Rao)కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి(నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం) -
అధికార కేంద్రీకరణకు మార్గంగా.. జమిలి ఎన్నికలు
‘ఒకే దేశం – ఒకే సంస్కృతి – ఒకే పన్ను’ అంటూ నిరంతరం ప్రచారం చేసే అధికార బీజేపీ ఇప్పుడు ‘జమిలి ఎన్నికల’కు సన్నద్ధమవు తోంది. కేంద్ర మంత్రి వర్గం ఇటీవల జమిలి ఎన్నికలకు ఆమోదాన్ని తెలిపింది. దేశంలో సవివరమైన చర్చ జరగకుండానే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సూచనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలను పూర్తిగా సమర్థించేవారే కమిటీలో ఉన్నప్పుడు అది నిపుణుల కమిటీ ఎలా అవుతుంది? జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యంకాదనీ, ఇది అధికార కేంద్రీ కరణకు మార్గాన్ని సుగమం చేయడమేననీ, మన దేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ మౌలిక సూత్రా లపైన దాడి చేయడమేననీ ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.దేశంలో తరచూ ఏదో ఒక ఎన్నిక జరుగు తున్నందు వల్ల అభివృద్ధికి ఆటంకమేర్పడుతుందనేది ఒక అభిప్రాయం. ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందనీ, దీనికి మన జీడీపీ గణాంకాలే రుజువనీ ప్రభుత్వ పెద్దలు చెబు తున్నారు. మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజంగా సరైనవనుకుంటే అభివృద్ధికి తరుచూ జరిగే ఎన్నికలు ఎలా ఆటంకమవుతాయి? దేశం ముందున్న మౌలిక సవాళ్ళ నుండి జనం దృష్టిని ప్రక్కదారి పట్టించేందుకే జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తున్నారనేది ఒక విమర్శ. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చనేది సమర్థకుల మరో వాదన. ఈ వాదనను సరిగ్గా విశ్లేషిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2023–24 సంవత్సరానికి ఎన్నికల కోసం కేంద్రం కేటాయించింది కేవలం రూ. 466 కోట్లు మాత్రమే. పైగా అది ఎన్నికల సంవత్సరం కాబట్టి. అదే 2022–23 సంవత్సరానికి కేటాయించినది రూ. 320 కోట్లు మాత్రమే. రాష్ట్రాలు కూడా ఎన్నికల ఖర్చును భరిస్తాయి. లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్న కేంద్రానికి ఈ ఎన్నికల ఖర్చు నిజంగా పట్టించుకోవలసినది కాదు. నిజానికి జమిలి ఎన్నికలు జరిపితేనే ఖర్చు పెరుగుతుంది. ఈ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో ఈవీఎమ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని, రక్షణసిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి.ఎన్నికలు తరచూ జరగడం వల్ల ఇప్పటి వరకూ విధానపర నిర్ణయాలు చేయడంలో ఏనాడూ ఆటంకమేర్పడలేదు. ప్రజల ప్రయోజనాలకు, వారి స్వేచ్ఛకు జమిలి ఎన్నికలు విఘాతమే. ప్రభుత్వాల దూకుడుకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కళ్ళెం వేసేది ప్రజలు మాత్రమే. జమిలి ఎన్నికల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. పార్లమెంట్ లేదా అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధి వెంటనే మరణిస్తే ఏం చేస్తారు? అధికార పార్టీ మధ్యలో మెజారిటీ కోల్పోయి ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయమేమిటి? అటువంటి ప్రత్యామ్నాయం ప్రజాస్వామ్యయుతం అవుతుందా?చదవండి: ‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా?అందుకే జమిలి ఎన్నికలకు బదులు, ఎన్నికల సంస్కరణలను తక్షణమే చేపట్టి దామాషా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టాలి. పార్టీల మ్యానిఫెస్టోలను, వారి విధానాలను సమగ్రంగా విశ్లేషించుకుని రాజకీయ పార్టీలకు ప్రజలు ఓటు వేయడం న్యాయసమ్మతమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. ప్రస్తుత పద్ధతిలో రాజకీయ పార్టీలకు లభించిన ఓట్ల శాతం, ఆయా పార్టీలు గెలిచిన సీట్లకు ఉన్న తేడా అసంబద్ధంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రక్రియను అమలు చేసే ఆలోచనను విరమించి ప్రజాస్వామ్య పటిష్ఠతకు, పరిరక్షణకు అవసరమైన అన్ని మార్పులను మన రాజకీయ వ్యవస్థ చేపట్టాలి. అధికార బీజేపీ దీనికి ముందుగా చొరవ చూపాలి.- వి.వి.కె. సురేష్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం డివిజన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి -
ఇది పరిష్కరించుకోదగిన మిత్రవైరుద్ధ్యం!
భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల సమాజం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోంది. ప్రతి విషయంలోనూ కులం ప్రధానపాత్ర వహిస్తోంది. కులనిర్మూలన జరగక పోగా కులం వేళ్ళు మరింత బలంగా లోలోతుల్లోకి వెళ్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కుల నిర్మూలనైనా జరగాలి లేదా సంపద, అధికారాల్లో ఎవరి వాటా వారికైనా దక్కాలి. ఇవేవీ జరుగకపోగా వేలసంఖ్యలో విభజింపబడిన పాలిత కులాల మధ్య చెప్పలేనన్ని వైరుద్ధ్యాలు! తమకు దక్కాల్సిన వాటా కోసం ఉమ్మడి పోరాటాలు చేయకుండా తమలో తామే తన్నుకోవడం కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య వైరుద్ధ్యాలే కనిపిస్తున్నాయి. నిజానికివన్నీ మిత్ర వైరుద్ధ్యాలే తప్ప శత్రు వైరుద్ధ్యాలు కావు. వీటిని పరిష్కరించుకోకుండా దశాబ్దాలుగా తగవులాడుకుంటూనే ఉన్నారు.ఎస్సీల్లోని మాల–మాదిగలు, వారి ఉపకులాల మధ్య ఉండాల్సింది మిత్రవైరుద్ధ్యం కాగా అది శత్రువైరుద్ధ్యంగా కొనసాగుతుండడం బాధాకరం. ఇరువురికీ ఆరాధ్యుడు అంబేడ్కర్. ఆయన స్ఫూర్తితో దళిత జాతి విముక్తికై ఉమ్మడి పోరాటాలు చేయకుండా దశాబ్దాలుగా పాత వైరుద్ధ్యాలను మరింత విస్తృతం చేసి దళిత రాజ్యాధికార భావనకు మరింతదూరం జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘దళిత మహాసభ’ దళితులపై జరిగిన పాశవిక దాడులను సమర్థంగా ఎదుర్కొంది. ఎండగట్టింది. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది. అంబేడ్కర్ స్ఫూర్తితో, ఇంగ్లీషు చదువులతో, క్రైస్తవ చైతన్యంతో ఆంధ్ర మాలలు కొంతవరకైనా పాలక స్థాయికెదిగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. రాజకీయ పదవులూ గెలుచుకున్నారు. అలాగే మూడు దశాబ్దాల క్రితం మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ‘మాదిగ దండోరా’ ఉద్యమం చరిత్రాత్మకమైనది. అది మాదిగల్లో ఆత్మగౌరవాన్ని, పోరాట పటిమను, అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకునేలా చేసింది. అది కేవలం వర్గీకరణ ఉద్యమంగానే ఉండిపోకుండా వికలాంగుల పెన్షన్, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. కొందరు ఆధిపత్య కులాల వారు తమ పేరు చివర తమ కులాలను తెలియచేసే విశేషాలను పెట్టుకున్నట్లే.. మాదిగలు కూడా తమ పేరు చివర ‘మాదిగ’ పదాన్ని చేర్చుకోవాలని మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు ఆ కులంలో ఆత్మగౌరవాన్ని ప్రోది చేసింది. ఒక్క దళిత కులాల్లోనే కాదు పీడిత కులాలందరికీ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందీ దండోరా ఉద్యమం. అయితే దండోరా ప్రధాన లక్ష్యం రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ సాధించడం.కానీ వర్గీకరణ విషయంలో మాల, మాదిగల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దేశం మొత్తంగా కొన్నిచోట్ల మాలలు, మరికొన్ని చోట్ల మాది గలు రిజర్వేషన్లలో భాగాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారన్నది వాస్తవం. వర్గీకరణ చేస్తే మాల, మాదిగ ఉపకులాలన్నీ రిజర్వేషన్ సౌకర్యాన్ని సమానంగా అనుభవించి అన్ని ఉపకులాలు పైకొస్తాయన్నది వర్గీకరణ కావాలనే వారి వాదం. వర్గీకరణ వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని వర్గీకరణను వ్యతిరేకించే వారి వాదన. ఎక్కడ మాలల్లో గానీ, మాదిగల్లో కానీ చైతన్యం ఎక్కువగా ఉంటే అక్కడ ఆయా కులాలవారు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎక్కువ ఉపయోగించుకున్నారన్నది వాస్తవం.వర్గీకరణ కావాలనడంలో ఎవరి వాటా వారికి చెందాలన్న ప్రజాస్వామిక సూత్రముంది. ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణను ఒకసారి చేసినా కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల దాని అమలు నిలిపివేయబడింది. అప్పట్నుంచి వైరుద్ధ్యాలు మరీ ఎక్కువయ్యాయి. వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని పాలకపార్టీలు ఓట్లు రాజకీయాలాడటం మొదలు పెట్టాయి. దళితుల ఓట్లు కోసం వర్గీకరణను సమర్థించడం, వ్యతిరేకించడం రాజకీయ పార్టీలకు ఓ ఆటగా మారింది.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!ఈ మధ్యనే సుప్రీంకోర్టు వర్గీకరణ చేయడం సరైన దేనని తీర్పునిచ్చింది. అందులో మెలిక పెట్టింది. క్రీమీలేయర్ పాటించాలని. తరతరాలుగా రాజకీయ, సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగపరమైన అధికారాలు అనుభవిస్తున్న వారికి లేని క్రీమీలేయర్ దళితుల వర్గీకరణకు కావాలనడం ధర్మ సమ్మతమేనా? కొందరు దళితనేతలు క్రీమీలేయర్ వద్దంటే మరికొందరు వర్గీకరణే వద్దంటున్నారు. మాయావతి లాంటి నాయకురాలు కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఇలాంటి సందర్భాల్లో వర్గీకరణ అమలవుతుందా అనే అనుమానం రావడం సహజమే. అమలు కాకుండా ఉండటానికి వర్గీకరణ వ్యతిరేకులు, అమలు చేయడానికి వర్గీకరణ అనుకూలురు ఇంకా ఎన్నేండ్లు పోరాటాలు చేస్తూ తమ ఉమ్మడి లక్ష్యాన్ని మరిచిపోతారు?దళిత సోదర సోదరీమణులు తమ మధ్యనున్న వైరుధ్యాలను మిత్ర వైరుద్ధ్యాలుగా భావించి చర్చలతో వర్గీకరణ సమస్య విషయంలో ఏకీభావానికి వచ్చి దళిత రాజ్యాధికార భావనను సాకారం చేసే దిశగా పయనం కొనసాగిస్తే మంచిది. తమ అంతిమ లక్ష్యం దళిత సాధికారత, రాజ్యాధికారం అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఇరువైపుల వారికీ వర్గీకరణ సమస్య అతి చిన్నదిగా కనబడుతుంది.- డాక్టర్ కాలువ మల్లయ్యప్రముఖ కథా రచయిత -
విద్యారంగ మార్పుల గమ్యం ఎటువైపు?
అందరికీ విద్య లేకుండా ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదన్నాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్. నేటి బాలలే రేపటి పౌరులు అన్నాడు తొలి ప్రధాని నెహ్రూ. కానీ దేశంలో ఇప్పటికీ అక్షరాస్యత రేటు 77% దాటలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే అక్షరాస్యత రేటు 66% కూడా లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. తమ మేనిఫెస్టోలో విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయి స్తామని చెప్పి 7.3% మాత్రమే కేటాయించింది కాంగ్రెస్. పక్కన ఉన్న తమిళనాడులో 13.4%,ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యకు 12.6% నిధులు కేటాయించారు.పాఠశాల విద్యను తీసుకుంటే పాఠశాలల మూసివేతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 2022 –23 సంవత్సరంలో దాదాపు 8,500 పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్నారు. 1,864 స్కూళ్లలో విద్యార్థులే లేరు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల దగ్గరలోనే విద్యా శాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం. చట్ట ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు కనీసం ఒక్క కిలోమీటర్ దూరం ఉంటే తప్ప అనుమతులు ఇవ్వకూడదు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరొక ప్రధానమైన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడం. ఇంకా బతుకుదెరువు కోసం గ్రామాల నుండి పట్టణాలకు వలసలు, జనాభా తగ్గుదల మొదలైన అంశాలు విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలు కావచ్చు. ఇంకా ఈ విషయంపై లోతైన అధ్యయనం చేసి కారణాలను కనుక్కోకుండా, ఆ కారణాలను నిర్మూలించకుండా, తక్కువ విద్యార్థులు ఉన్నారని అక్కడ ఉన్న టీచర్లను వేరే స్కూళ్లకు పంపించడం, విద్యార్థులే లేరని పాఠశాలలను మూసివేయడం మూర్ఖత్వం.పాఠశాలల్లో ఒక ప్రణాళిక ప్రకారం బోధన జరుగుతుందా లేదా చూసుకోవాలంటే విద్యాశాఖ అధికారులు ఉండాలి. అటువంటి అధికారుల పోస్టులు దాదాపు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దిగ జారుతున్న ఈ పరిస్థితులను చక్కబెట్టి సుమారు 30 వేల పాఠశాలలను అభివృద్ధి చేసే బదులు, నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపి స్తామని అంటున్నారు. కామన్ స్కూల్‌కు భిన్నంగా ఇప్పటికే రకరకాల అంతరాలతో భ్రష్టు పడుతున్న పాఠశాల విద్యకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకొక అంతరాల దొంతర తయారు కాబోతున్నది.అలాగే ఉన్నత విద్యలో ప్రభుత్వ రంగంలో ఉన్న 17 స్టేట్ యూనివర్సిటీలను సమగ్రంగా అభి వృద్ధి చేసే బదులు భూకబ్జాదారులకు, విద్యా వ్యాపారులకు, కంపెనీలకు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో 50 ఎకరాల భూమిలో ఒక ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో 2 వేలకు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బంది ఖాళీలు తీసుకుంటే అవి వేల సంఖ్యలో ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలలోని పోస్టులను భర్తీ చేయలేదు.ప్రస్తుతమున్న యూనివర్సిటీలను, ఇంజనీరింగ్ కళాశాలలను, పాలిటెక్నిక్ కళాశాలలను, ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి నైపుణ్యాలను నేర్పవచ్చు. అలా చేయకుండా కొత్తగా స్కిల్ యూనివర్సిటీని స్థాపించడం ఎవరికోసమనే ప్రశ్న తలెత్తక మానదు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో భాగంగా 19 పేరెన్నిక గల విదేశీ కంపెనీలు హైద రాబాదుకు రాబోతున్నాయని తెలుస్తున్నది. ఇక్కడ 2 వేల మందికి నైపుణ్యాలను నేర్పిస్తామని అంటున్నారు. ఈ విదేశీ కంపెనీలకు నైపుణ్యం కలిగిన తక్కువ జీతానికి పనిచేసే, బానిస మనస్తత్వం కలిగిన కార్మికులను తయారుచేయడానికి వస్తుందా ఈ స్కిల్ యూనివర్సిటీ అనే అనుమానం కలుగు తుంది. ఇక్కడ ఫ్యాకల్టీని నియమించడంలో, విద్యార్థులకు అడ్మిషన్ కల్పించడంలో రిజర్వేషన్ల పద్ధతి పాటిస్తారా? ఫీజులు ఎంత ఉంటాయి అన్న వివరాలు ఇంకా అధికారికంగా తెలియవలసి ఉంది. చదవండి: సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు పాఠశాల స్థాయి నుండి అన్ని వసతులతో కూడిన వ్యాయామ విద్య లేకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం అర్థరహితం. వేలాది ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. క్రీడా పరికరాలు లేవు. అన్ని పాఠశాలలో పీఈటీ / పీడీ పోస్టులు మంజూరు చేయబడలేదు. పట్టణాలలో మెజారిటీ ప్రైవేటు పాఠశాలలకు ఆట స్థలాలే లేవు. అటువంటి పరిస్థితులలో స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తామనడం పునాది లేకుండా భవనం నిర్మించడమే. మొత్తానికి గత తొమ్మిది నెలల్లో తెలంగాణ విద్యారంగంలో వచ్చిన మార్పుల గురించి సమాజంలో లోతైన చర్చ జరగవలసి ఉన్నది.-ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యులు -
లంక కామ్రేడ్ల నుంచి స్ఫూర్తి పొందాలి!
భారత్ పొరుగు దేశమైన శ్రీలంకలో మార్క్సిస్టు నాయకులైన అనూర కుమార దిస్సనాయకే దేశ అధ్యక్షుడుగానూ, హరిణి అమరసూర్య ప్రధానమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆసియా రాజకీయాల్లో పెను ఆసక్తికర, ఆహ్వానించదగిన పరిణామాలకు ఆస్కారం ఏర్పడింది. భారత దేశంలోని ఎన్డీయే– ఆరెస్సెస్ వినాశకర కూటమి ప్రభుత్వం శ్రీలంకలోని మితవాద పక్ష పాలకులతో ‘జోడీ’ కట్టి చిరకాలంగా వర్ధిల్లుతున్న భారత్–శ్రీలంక స్నేహ పూర్వక సంబంధాలలో ‘చిచ్చు’ పెట్టింది. ఈ విషమ పరిణామానికి సకాలంలో విరుగుడుగా వచ్చిందే సింహళంలో వామపక్ష పరిపాలన.శ్రీలంక సమగ్రాభివృద్ధిని కాంక్షించి, పాక్షిక ధోరణుల్లో గాక శ్రీలంక ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని చేపట్టారు మార్క్సిస్టు నాయకులు. అలాంటి పరిణామాన్నే భారతదేశంలోనూ ఆవిష్కరించగల అవకాశం ఉన్నా... చీలికలు పీలికలుగా ఉన్న వామపక్షాలు ఒకే తాటిపైకి రాలేకపోతున్నాయి. నాయకులు తమ పదవులను త్యజించి విస్తృత ప్రాతిపదికన ఒకే ఒక పార్టీగా ఆవిర్భవించడానికి కృషి చేయడంలేదు. ఎన్టీయే కూటమి దుష్ట ఇజ్రాయెల్‌తో కలిసి దేశంలోని ప్రగతివాద శక్తులపై నిఘాపెట్టి నానా ఇబ్బంది పెట్టిన చరిత్ర తెలియంది కాదు. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశంలోని వామ పక్షాలన్నీ ‘చిల్లర తగాదాలు’ మానుకుని ఐక్య వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇందుకు శ్రీలంక చూపిన ‘ఐక్య ఉద్యమ స్ఫూర్తి’ని భారత వామపక్షాలన్నీ తక్షణం పొందాల్సిన అవసరం ఉంది.ఇదే సందర్భంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశంలో ఆచరణలో నిజమైన ఫెడరల్ వ్యవస్థను పాదుకొల్పడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమతులమైన అధికారాల పంపిణీ నొక్కి వక్కాణించారు. ఫెడరల్ వ్యవస్థ సూత్రాల ప్రకారం, కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలనుంచి వసూలు చేస్తున్న సెస్‌లు, ఇతర పన్నులను అదే దామాషా ప్రకారం రాష్ట్రాలకు పంచి తీరాల్సిందేనని భట్టి కోరారు. దీన్నిబట్టి చూస్తే, ఇరుగు–పొరుగైన శ్రీలంకలో అంతటి భారీ స్థాయిలో వామపక్ష నేతల ఆధ్వ ర్యంలో క్రమానుగతంగా సాగక తప్పని పరిస్థితులు ఎందుకు వచ్చాయో భారత వామపక్షాల నేతలు కేవలం గుర్తించడమేగాదు, ఆచరణలో దేశంలో ఐక్య ఉద్యమ నిర్మాణానికి పునాదుల్ని పటిష్టం చేసుకొనక తప్పదు. ఇటాలియన్ మాఫియా నుంచి, ఇజ్రాయెల్ గూఢచారుల నుంచి భారతదేశ తక్షణ రక్షణకు దేశంలోని వామపక్షాలన్నీ సిద్ధం కావాలి. నిరుపేదలైన షెడ్యూల్డ్ తరగతులకు చెందిన అట్టడుగు వర్గాల ప్రజలపైనే 13 రాష్ట్రాలలో దారుణమైన అత్యాచారాలు నమోదయ్యా యని తాజా నివేదికలు సాధికారికంగా ప్రకటించాయి. వీటన్నింటికి ముగింపు ఎప్పుడు? ఫెడరల్ వ్యవస్థ పునరుద్ధరణ ద్వారానేనని ఆ నివేదికలు తెలియజేస్తున్నాయి.చదవండి: ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?ఎన్డీయే – ఆరెస్సెస్ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ దశలో, ముఖ్యంగా చైతన్యశీలి అయిన ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి 2025 నాటికి గానీ పదవీ విరమణ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆ లోగా ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రధాని’ అన్న నినాదంతో ప్రస్తుత కేంద్ర పాలకులు ఏ అఘాయిత్యం చేసే అవకాశం లేదు. ఈలోపు దేశీయ వామపక్షాలు, సంబంధిత వర్గాలన్నీ ఒక్క తాటిపై కదిలి రాగల కార్యాచరణ వ్యూహానికి శ్రీకారం చుట్టాలి.శ్రీలంకలో కమ్యూనిస్టు – మార్క్సిస్టుల అను భవం సుదీర్ఘ కాలంలో నేటి అమూల్యమైన దీర్ఘకాలిక ఫలితాన్ని శ్రీలంక ప్రజలకు ప్రసాదించగల్గింది. లంక పరిణామం ఆసియాలోని చుట్టు పట్ల దేశాల ప్రజాబాహుళ్యానికి సహితం ఆదర్శంగా పరిణమించింది. భారత వామపక్షాలు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఏకం కావాలి. శ్రీలంక వామపక్షాలు సాధించి ఆదర్శనీయమైన విజయం నుంచి భారత ప్రజల భవిష్యత్తుకు అనువైన ఉమ్మడి వ్యూహ రచనకు నడుం బిగించాలి. ఇందుకు మొదటి షరతుగా నాయకత్వం రూపకల్పనకు అవసరమైన వ్యూహాన్ని సమష్టిగా రూపొందించుకోవాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. ఈ సందర్భంగా శ్రీలంకలో భారత మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ శ్రీలంక పరిణామాల్ని సమీక్షిస్తూ... విప్లవాత్మక భావాలు మార్చుకోకుండానే ప్రజాస్వామిక ధోరణులు కూడా బలపడటానికి అనువుగా రాజకీయ పక్షాల సిద్ధాంత ధోరణులు కూడా ఉండాలనీ, ఈ ధోరణుల్ని శ్రీలంక వామపక్షాలు పెంచుకుంటూ మార్పునకు అనుగుణమైన వ్యూహరచనను ఆశ్రయించాయనీ అన్నారు. భారత్–శ్రీలంక సంబంధాలలో కూడా పెను మార్పులకు అవకాశం ఉందని గోఖలే ఆశాభావం వెలిబుచ్చారు.- ఏబీకే ప్రసాద్సీనియర్ సందకులు abkprasad2006@yahoo.co.in -
సామాన్యుల ముఖ్యమంత్రి!
1988 మార్చిలో రాజ్య సభకు ఎన్నికయ్యాను. అప్పటికి ఒక మాసం ముందు త్రిపుర శాసన సభకు జరిగిన ఎన్నిక లలో, అప్పటికి పదే ళ్ళుగా అధికారంలో ఉన్న నృపేన్ చక్రవర్తిని ఓడించి, కాంగ్రెస్‌కు చెందిన సుధీర్ రంజన్ మజుందార్ ప్రభుత్వం కొలువు తీరింది. ప్రతిపక్షాలకు చెందిన కార్య కర్తలపై దాడులు, వారి ఆస్థులను ధ్వంసం చేయడం, ఇళ్ళను తగులబెట్టడం వంటి దుర్మా ర్గాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ నుండి ఒక అఖిలపక్షం ఆ రాష్ట్రంలో పర్యటించి, వారికి ధైర్యం చెప్పి, సాంత్వన కల్పించాలని మా సభలో మా సహచరులు దిపేన్ ఘోష్, సుకుమార్ సేన్, సురేన్ భట్టా చారి, గురుదాస్ దాస్ గుప్తా కోరారు. తెలుగు దేశం నుండి శివాజీ రావాలని కోరారు. సరేనన్నాను.శుక్రవారం సాయంత్రం రాజ్యసభ సమా వేశాలు ముగిసినాక, సాయంత్రం బయలుదేరి కలకత్తా చేరుకొన్నాం. విమానాశ్రయంలో బెంగాల్‌కు చెందిన మార్క్సిస్టు పార్టీ నాయకులు మాకు స్వాగతం పలికి, విమానాశ్రయంలోని విశ్రాంతి గదులలో ఏర్పాటు చేసిన బసలో మమ్మల్ని దించారు. అదే సమయంలో ఢిల్లీ వెళ్ళడానికి విమానాశ్రయానికి వచ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు మమ్ములను పరి చయం చేసి, కాసేపు ముచ్చటించే ఏర్పాటు చేశారు. మరురోజు ఉదయం అగర్తలాకు విమా నంలో వెళ్లాము. మాతోపాటు బెంగాల్ మంత్రులు కూడా మూడు రోజులు పర్యటించారు. ఒక నివేదిక తయారు చేశాం. అదంతా రాజ్యసభలో ప్రస్తావించాం. ఆ కథ అంతటితో ముగిసింది.తరువాత పుష్కర కాలం గడిచినాక 2000 నవంబరులో జ్యోతిబసు తరువాత బుద్ధదేవ్ ముఖ్యమంత్రిగా – పదకొండు సంవత్సరాలు ఆదర్శవంతమైన, విశుద్ధ పరిపాలన అందించారు. మాతో సామాన్య కార్యకర్త మాదిరి సిగరెట్లు కాలుస్తూ, చేతిలో ఆంగ్ల నవల పట్టుకొని సంచరించిన బుద్ధదేవ్, ముఖ్యమంత్రిగా అధికార నివాసానికి మారకుండా, తానుండే సాదా–సీదా రెండు పడక గదుల ఆపార్టుమెంటులోనే కొనసాగారు. సాయంత్రం 5 గంటల కల్లా రైటర్స్ భవన్ నుండి బయటకొచ్చి, తోవలో పార్టీ కార్యాలయంలో కాసేపుండేవారు. ఇంటికొచ్చి పచ్చి వక్కను కత్తిరించుకొని నములుతూ, ఇంగ్లిష్ నవలను ఆస్వాదిస్తూ, టుంగుటుయ్యాలలో కూర్చుని సేదదీరేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వారి శ్రీమతి ఒక పాఠ శాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ట్రాం మీద ప్రయాణం చేసేవారు. ప్రతిరోజూ ఇంటివద్ద ఎవరినీ, సందర్శకులకు అనుమతించేది లేదు. ఎవరైనా ఆఫీసులో కలుసుకోవాల్సిందే.ఆగస్టు 8న మరణించిన బుద్ధదేవ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ, కొత్తగా రాజకీయాలలోకి అడుగు పెడుతున్న యువతరం వారిని ఆదర్శంగా తీసు కోవాలని ఆకాంక్షి స్తున్నాను. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త, రాజ్యసభ మాజీ సభ్యులు -
‘భూత్’ బంగ్లా సర్కార్!
దేశంలోని ప్రస్తుత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఫోర్–ఓ (4.0) వెర్షన్. పదిహేనేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్‌లైన్‌తో తిరిగారు. ఇంతటి అనుభవశాలి ఎందుకో కలవరపడుతున్నారు. అభద్రతా భావంతో తత్తరపాటుకు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరు వింటేనే ఆయన సర్వేంద్రియాలు సంక్షో భానికి లోనవుతున్నవి. విజ్ఞత విలుప్తమైపోతున్నది. ఆయన జనంలోకి వెళితే ఈయన జ్వరపీడితుడవుతున్నారు. ఆ వేడికి భాష మరిగిపోతున్నది.విశాఖ సమీపంలో జరిగిన ఫార్మా కంపెనీ దుర్ఘటన సందర్భాన్నే తీసుకుందాము. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ అనునయించి ధైర్యం చెప్పారు. అండగా నిల బడతానని భరోసా ఇచ్చారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది జనం అక్కడ గుమిగూడారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికి జరిగిన ఒక గ్రామ సభలో ఆయన మాటలు అదుపు తప్పాయి.మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు.ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవు తారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొల కెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్‌కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్‌నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తున్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేకపోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి. రెండున్నర మాసాల్లోనే ‘95 మోడల్’ చూపెట్టిన చిన్న ఝలక్ మాత్రమే ఇది. ముందున్నది అసలైన నిజరూప దర్శనం. పేదలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, ప్రైవేట్ గద్దలకు మాత్రం సమస్త వనరులను దోచిపెట్టాలన్నది ఆ మోడల్ నిత్యం జపించే తిరుమంత్రం. అందుకే ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. అందుకే ‘రైతు భరోసా’ ఆగిపోయింది.‘విద్యా దీవెన’, ‘విద్యా కానుక’లు ఆగిపోయాయి. పంటల బీమా, మత్స్యకార భరోసా వెనక్కు మళ్లాయి. ఇంటి దగ్గర దర్జాగా పెన్షన్లు తీసు కున్న అవ్వాతాతలను నాయకుల ఇళ్ల ముందు నిలబెట్టుకుంటున్నారు. నిరుపేదల బిడ్డలు సైతం సంపన్న శ్రేణితో సమానంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఈ ’95 మోడల్ వచ్చీరాగానే తన్ని తగలేసింది. ఐబీ సిలబస్‌ను అటకెక్కించారు. ఇంగ్లిషు మీడియం ఉపసంహరణకు రంగం సిద్ధమైంది.పేదలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం కార్యక్రమాలు చేపట్టినందుకే మాజీ ముఖ్యమంత్రిని మన ‘95 మోడల్’ భూతంగా పరిగణిస్తున్నది. ఈ ధోరణి కొత్త కాదు. పేద ప్రజల పక్షాన నినదించిన ప్రతి గొంతుకనూ దయ్యాలు, భూతాల గొంతుకగా బ్రాండింగ్ చేయడం, దుష్ప్రచారానికి ఒడి గట్టడం శతాబ్దాలకు పూర్వమే ప్రారంభమైంది. 1848లో కార్ల్ మార్క్స్ ప్రచురించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ‘యూరోప్‌ను కమ్యూనిస్టు భూతం వెంటాడుతున్నది’ అనే వాక్యంతో ప్రారంభమైంది. కమ్యూనిస్టు భావజాలాన్ని భూతంగా భావించే నాటి పాలక ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికగా మార్క్స్ ఈ వాక్యాన్ని రాశారు.ఇప్పుడూ అంతే! ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బయ్ వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అకౌంట్లలోకే బదిలీ చేసి అణ గారిన జీవితాలనూ, వాటితోపాటు ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్దీపింపజేసిన దార్శనిక పాలనను భూతాల పరిపాలనగా ప్రచారం చేస్తున్నారు. వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ, ప్రజా వైద్య విధానాన్ని రూపొందించిన ప్రభుత్వానిది భూతాల పాలనట! దాన్నిప్పుడు ప్రైవేట్ పెట్టు బడికి తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రగతిశీలమట! దయ్యాలు వేదాలు వల్లించడమంటే అచ్చంగా ఇదే కదా! ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని చేస్తున్నారు.ఏ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే అంశంపై చర్చ జరపడం ఒక భాగం. ఎవరిది ప్రజాస్వామ్య రాజ కీయమో, ఎవరిది దయ్యాలు – భూతాల రాజకీయమో తేల్చడా నికి ఇంకో చర్చ కూడా ఉన్నది. వారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది పరిశీలించడానికి ఈ చర్చ జరగాలి. ఈ ముఖ్యమంత్రి తొలి రౌండ్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన వెన్నుపోటు కథ. పార్టీ ఆయన స్థాపించినది కాదు. ఎమ్మెల్యేలను గెలిపించిందీ ఆయన కాదు. వదంతులను ప్రచారం చేసి, ఎమ్మెల్యేలను ‘వైస్రాయ్’లో నిర్బంధించి, మీడియాతో కుమ్మక్కయి, రాజ్యాంగ వ్యవస్థలను మచ్చిక చేసు కుని దొడ్డిదారిన అధికార పీఠమెక్కారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రయాణం. ఆయనే స్వయంగా పార్టీని నిర్మించుకున్నారు. ఇందుకు భారీ మూల్యాన్ని ఆయన చెల్లించుకోవలసి వచ్చింది. అయినా తలొగ్గ కుండా జనంలోకి వెళ్లారు. అలవికాని వాగ్దానాలను చేయడానికి నిరాకరించి కోరి ఓటమిని తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు గట్టిగా నిలబడి ఒంటరి పోరాటంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. భూతం ఎవరు? రాచబాటలో వచ్చినవారా? దొడ్డి దారిన ప్రవేశించిన వారా?ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నాలుగో దఫా ఎలా అధికారంలోకి వచ్చారు? పెంపుడు మీడియాను ఉసిగొలిపి పాత ప్రభుత్వంపై అవాకులు చెవాకులు ప్రచారం చేశారు. సరిపోలేదు. కాళ్లావేళ్లా పడి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇది కూడా సరిపోలేదని స్వతంత్ర పరిశోధకులు, సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో 68 శాతానికి పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత తీరిగ్గా నాలుగు రోజుల సమయం తీసుకొని 81 శాతం పోలైనట్టు ప్రకటించింది. ఇది అసాధార ణమని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ) అనే సంస్థ వాదిస్తున్నది. గతంలో ఎన్నడూ ఈ తేడా ఒక శాతం కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5 శాతంగా నమోదైంది. ఈవీ ఎమ్ల మాయాజాలమే ఈ అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కార ణమని వీఎఫ్‌డీ ఆరోపిస్తున్నది. ఎన్డీఏ మౌత్‌పీస్‌గా పనిచేసే ఓ జాతీయ చానల్ కూడా నిన్న ప్రసారం చేసిన ఒక సర్వే వివరాల్లో చంద్రబాబుకు 44 శాతం ప్రజల మద్దతున్నట్టు తేల్చింది. కూటమికి పడిన 56 శాతం ఓట్లలో ఇది 12 శాతం కోత. వీఎఫ్‌డీ చెబుతున్న అక్రమ ఓట్లకు ఈ నంబర్ సరిపోతున్నది.వీఎఫ్‌డీ ఈ వ్యవహారంపై ఒక సమగ్రమైన రిపోర్టును విడుదల చేసి, నెలరోజులు దాటినా ఇప్పటివరకూ ఎన్నికల సంఘం స్పందించలేదు. ఈ కృత్రిమ అధిక ఓట్ల నమోదు కార ణంగా కేంద్రంలోనూ, ఏపీ, ఒడిషాల్లోనూ గెలవాల్సిన పక్షాలు ఓడిపోయాయి. పోలింగ్ శాతంపై కొన్ని రోజుల తర్వాత చేసిన తుది ప్రకటనకూ, లెక్కించిన ఓట్లకూ కూడా తేడాలున్నాయి. సుమారు 390 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు పోలయినట్టు ప్రకటించిన ఓట్ల కంటే తక్కువున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువున్నాయి. ఇదెలా సాధ్యం? ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లలో దయ్యాలు, భూతాలు దూరితేనే సాధ్యమవుతుంది.ఆ దయ్యాలూ, భూతాలు ఎట్లా దూరాయన్న రహస్యం విజేతలకు మాత్రమే తెలుస్తుంది. వారికి అనుబంధంగా పని చేసిన ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పలువురు మేధావులు గొంతెత్తి మాట్లాడారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం నోరు విప్పలేదు. పైపెచ్చు, అనుమానం ఉన్న నియో జకవర్గాల్లో 5 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై కూడా ఈసీ వక్రభాష్యాలు చెబుతున్నది. ఈవీఎమ్‌లపై అధికారికంగా ఫిర్యాదులు చేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం కూడా పలు అను మానాలకు తావిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా ఈ అంశంపై నోటికి తాళం వేసుకున్నది. కచ్చితంగా ఏదో జరిగిందన్నది అఖిలాంధ్ర ప్రజల నిశ్చితాభిప్రాయం. ఎన్నికల హామీల నుంచి, ఈవీఎమ్‌ల బాగోతం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో కూటమి పెద్దల మాటలూ, చేతలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని భూస్థాపితం చేసి పైకి రాకుండా కాంక్రీట్ పోయాలనే పైశాచిక ఆలోచనలు చెలరేగు తున్నాయి."మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు చంద్రబాబు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవుతారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొలకెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్‌కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్‌నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తు న్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేక పోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి." – వర్ధెల్లి మురళి -
చరిత్ర కుహరాల నుంచి...
అణగారిన ప్రజలు తమకి ఓ గొప్ప పోరాట చరిత్ర ఉందని తెలిస్తే యధాతథ వాదాన్ని అంగీ కరించరు. వర్తమానంలో తమపై అమలయ్యే వివక్షను కచ్చితంగా ఎదిరిస్తారు. అది తమ తలరాత అని ఊరుకోకుండా తమపై రుద్దిన బానిసత్వంపై తిరగబడి తమదైన కొత్త సమాజాన్ని నిర్మించుకుంటా రని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎప్పుడో చెప్పాడు. ఫూలే చెప్పిన పోరాటాల చరిత్రను... ప్రాచీన భారత దేశ చరిత్ర అంతా బౌద్ధానికి– వైదిక హిందూ మతానికి మధ్య జరిగిన ఘర్షణ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ విశదీ కరించాడు. ఇంతకాలం కట్టుకథలు, పిట్టకథలు చరిత్రగా చలామణి అయినట్లే మన సినిమాలు కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మసిపూసి మారేడుకాయ చేస్తూ కొందరి జీవితాన్నే అందరి జీవితంగా కాకమ్మ కథలతో జనం కంట్లో కారం కొట్టి బతికేస్తున్నాయి.అయితే సింహాల నుంచి చరిత్రకారుడు పుట్టు కొచ్చాడు. వర్ణ అంధత్వంతో కునారిల్లిన నూరేళ్ళ వెండి తెరను బదబదాలుగా చించి పోగులు పెడుతూ సరికొత్త దారిని వేసుకుంటూ పోతున్నాడు పా. రంజిత్. అవును పా. రంజిత్ అసలైన చరిత్రను రక్తమాంసాలతో సిల్వర్ స్క్రీన్ మీద పరుస్తున్నాడు. తంగలాన్ ఈ దేశ మూలవాసుల అసలు చరిత్ర... చూసినవాళ్లకి కంటి మీద కునుకు పడ నీయని చరిత్ర! తంగలాన్ అందర్నీ తీవ్రంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. కడుపులో చేయిపెట్టి దేవుతున్నాడు. కొందరు బాహాటంగానే వాంతులు చేసుకుంటున్నారు. మరికొందరికి రక్తం మరుగుతుంది, కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చారెడు భూమి కోసం, కాసింత గౌరవం కోసం తమవాళ్ళు చేసిన హాహాకారాలు, కొండలు గుట్టలు దాటి నడిచిన యోజనాలు, కడచిన దారులు, చరిత్ర పొడవునా పారిన నెత్తురు కళ్ళముందు కదులుతూంటే గుండె చెరువవుతోంది.ఎవరు కాదని బుకాయించినా ఈ దేశ సాంస్కృతిక వారసత్వం బౌద్ధంలో ఉంది. నేటి దళితులు బౌద్ధ సాహి త్యంలో పేర్కొన్న నాగుల సంతతివారు. వారే బౌద్ధాన్ని అవలంబించి బుద్ధుని మార్గంలో నడి చిన శాంతి కాముకులు. కానీ బౌద్ధాన్ని చంపి, బౌద్ధులపై అంటరాని తనాన్ని రుద్దుతూ వారి మెడలో ముంతలు కట్టింది వైదిక బ్రాహ్మణ మతం. తర్వాత తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి దళితుల మెడలో ముంతను అంతే ఉంచి జంధ్యం వేసింది. వైష్ణవ మతంలోకి వెళ్ళిన దళితులను వెళ్లని వారి నెత్తిన కూర్చోబెట్టింది. ఈ చరిత్రను తంగలాన్‌లో పా. రంజిత్ కళ్ళకు కట్టించాడు.బౌద్ధంలో ‘హారీతి’ అనే దేవత ఉన్నట్టు తెలుగు శాస నాల్లో కూడా ఉంది. ఆమె ఒక ప్రకృతి దేవత. వజ్రయానంలో సిద్దులు చేసిన ప్రయోగాలు, సిద్దుల రసవాదం పక్కన పెట్టి వారిని ‘క్షుద్ర’ విద్యలు తెలిసిన మాంత్రి కులనీ, బుద్ధుడిని అశుభానికి గుర్తుగా ప్రచారం చేసింది పూజారి వర్గం. బౌద్ధాన్ని అవలంబించేవారిని ఉలిపి కట్టెలుగా, సమాజానికి కీడు చేసేవారిగా చిత్రించి వారిపట్ల ద్వేష భావం పెంచడాన్ని ఈ సినిమాలో సందర్భానుసారంగా చూపించాడు. తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్‌లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమాజాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ లాండ్ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచే ప్రారంభించడం విశేషం.కేజీఎఫ్‌లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్. తంగలాన్ దళిత సమస్య తాలూకు ప్రతి అంశాన్నీ తడిమిందని చెప్పాలి. దళిత స్త్రీలు ఒకప్పుడు పైవస్త్రం రవిక వేసుకునే వీలు లేదు. అది కొన్ని ప్రాంతాలలో నిషేధం అయితే మరికొన్ని చోట్ల తమ పేదరికం వలన కూడా వారికి అది దక్కేది కాదు. వారు రవిక ధరించడం తమ జనంలో ఓ గొప్ప ఉత్సవం. ఈ సినిమాలో అటువంటి సన్నివేశం ఒకటి అద్భుతంగా చిత్రించాడు పా. రంజిత్.అలాగే దళితుల ఆహారం! వారంతా గని తవ్వకం పనికి కోలార్ వెళ్లినాక కథానాయకుడు తంగలాన్‌తో అతని భార్య గంగమ్మ ‘మావా చింతపండు పులుసు పోసి నెత్తళ్ళ కూర వొండేదా?’ అంటే అతడు ‘కాదుమే, ఎండు తునకలు కూర చెయ్’ అంటాడు. వారు తిండిలేక అలమటిస్తున్నప్పుడు ఒక అడవి దున్న కనిపిస్తే దానిని నరికి మాంసం తిని తిరిగి శక్తి తెచ్చుకుని పని మెదలు పెట్టాలి అనుకుంటారు. ఇవన్నీ వారి జీవితాలలో సహజాతి సహజం. దళిత సమాజంలో స్త్రీ–పురుష సంబంధాలలో ఒకప్పుడు కనిపించే అరమరికలు లేనితనం, గుంపులో ఒకరిపట్ల మరొకరికి ఉండే కన్సర్న్, సామూహికత, చక్కటి సంభాషణలు తంగలాన్ సినిమాకు గొప్ప సౌందర్యాన్ని అద్దాయనవచ్చు.తెగిపడిన శాక్యముని తలని అతికించడం, చరిత్రలో కానరాకుండా పోయిన బంగారం లాంటి మూలవాసుల చరిత్రను వెలికితీయడం... అనే రెండు ముఖ్యమైన కర్తవ్యా లను తంగలాన్ శక్తిమంతంగా నిర్వహించింది. భూమి కోసం, భుక్తికోసం, ఆత్మగౌరవం కోసం చరిత్ర పొడవునా దళితులు వేసిన పొలికేకలు ఈ సినిమాలో మనకి అడుగ డుగునా వినిపిస్తాయి. చరిత్ర కళ్ళకు కట్టినట్టు వాస్తవికంగా కనిపించడం తంగలాన్ విజయం! నూరేళ్ళ వెండితెరపై మట్టి పాదాల్ని తన సంతకంగా ముద్రించిన సిసలైన తంగలాన్ పా. రంజిత్, తంగలాన్ పాత్రలో పూర్తిగా నిమగ్నమై గొప్పగా దానికి జీవం పోసిన హీరో విక్రమ్, అతని భార్యగా నటించిన పార్వతి, ప్రకృతి దేవత ‘ఆరతి’గా నటించిన మాళవిక, ఇతర నటీనటులు; ఒళ్ళు గగుర్పొడిచే సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్, ‘అంటారానోళ్ల’ చరిత్రని సంగర్వంగా సమర్పించిన జ్ఞాన వేల్... అందరికీ జై భీమ్!'తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్‌లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమా జాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ లాండ్ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచే ప్రారంభించడం విశేషం. కేజీఎఫ్‌లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్'.– చల్లపల్లి స్వరూపరాణి, వ్యాసకర్త, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్