జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రెండంత్రాల బంగ్లల బేతా లుడు ఉంటున్నడు. విక్రమార్కుడు మోటరాపిండు. హారన్ గొట్టిండు. బేతాలుడు ఇంట్లకెల్లి ఇవుతలి కొచ్చిండు. మోటరెక్కి ఎన్క సీట్ల ఆరాంగ గూసుండు. విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. గప్పుడు బేతాలుడు –
‘ఎండలు మండుతున్నా. వానలు దంచిగొడ్తున్నా, సలి ఒక్క తీర్గ వొన్కిస్తున్నా తాతీల్ దీస్కోకుంట దినాం మోటర్ దీస్కోని వొస్తవు. ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పు తవు. ఏ బర్రెన్న నీ మోటర్‌కు అడ్డం రావొచ్చు. ఎంటిక మందంల టక్కర్ దప్పొచ్చు. నువ్వు ఎంత హారన్ గొట్టినా ఎవడన్న సైడియ్యక పోవచ్చు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు యాస్ట రావొచ్చు. యాస్ట మర్సెతందుకు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను’’
‘‘చెప్పెతందుకు నువ్వుంటె ఇనెతందుకే నేనున్నా’’ అని విక్రమార్కుడు అన్నడు.
‘‘గుజరాత్ అసెంబ్లి ఎలచ్చన్లు అయితున్నయి. గా రాస్ట్రంల ఇర్వై ఏడేండ్ల సంది బీజేపీ సర్కారే ఉన్నది. ఇంతకుముందు గుజరాత్‌ల కాంగ్రెస్, బీజేపీ నడ్మనే పోటీ ఉండేది’’ అన్కుంట బేతాలుడు ఇంకేమో జెప్పబోతుంటె – ‘‘గిప్పుడు కొట్లాడ్త లెవ్వా?’’ అని విక్రమార్కుడు అడిగిండు.
‘‘నన్ను చిడాయించెతంద్కు నువ్వు గిసువంటి సవాల్లు అడ్గుతుంటవని నాకెర్క లేదనుకుంటున్నవా? గిప్పుడు సుత కొట్లాడ్తున్నయి. గుజరాత్లనే గాకుంట దేసంలున్న అన్ని రాస్ట్రా లల్ల ఎప్పటి సందో బీజేపీ, కాంగ్రెస్లు ఎలచ్చన్ల కొట్లాడ్తనే ఉన్నయి. గీపారి గుజరాత్ అసెంబ్లి ఎలచ్చన్ల దంగలకు చీపిరి కట్ట బట్కోని ఆప్ దిగింది.’’
‘‘రొండు పెద్ద పార్టిల నడ్మల చిన్న పార్టి ఆప్ నెగులుకొస్తదా?’’
‘‘ఎంత చెత్త ఉన్నా ఊకేది చీపిరితోనే. గా రొండు పార్టీలను మా చీపిరితోని ఊకి పారేస్తం. ఢిల్లిల గా రొండు పార్టీల మా చీపిరి తోని ఊకినం. పంజాబ్ల సుత ఊకి పారేసినం. గుజరాత్‌లో గుడ్క ఊకి పారేస్తం. ఆప్ సర్కార్ దెస్తం అని కేజ్రీవాల్ అన్నడు. అనుడే గాకుంట ఒక కాయితం మీద రాసిచ్చిండు.’’
‘‘గుజరాత్ల ఆప్‌కు గెల్సేంత బలమున్నదా?’’
‘‘బలం లేదు గని మా సర్కార్ గినొస్తె సర్కార్ జీతగాల్ల జీతాలు బెంచుతం. ఫిరీగ కరెంటు ఇస్తం. పాత పింఛను విదానం దెస్తం. రోగాలు గినొస్తె దవకాన్ల ఫిరీగ ఇలాజ్ జేపిస్తం అసువంటి వాగ్దానాలు ఆప్ జేసింది. గంతేగాకుంట చీపిరికట్ట బట్టుకోని కేజ్రీవాల్ గుజరాత్ అంత ఒక్క తీర్గ తిర్గిండు. ఊర్లల్ల కాంగ్రెస్‌కు బలముంటె పట్నాలల్ల బీజేపీకి బలమున్నది. వైసు పోరగాల్లు, పోరిలు ఆప్ అంటె ఇస్టంతోని ఉన్నరని అంటున్నరు.’’
‘‘కాంగ్రెస్ సంగతేంది?’’
‘‘ఒకప్పుడు గుజరాత్ల కాంగ్రెస్ సర్కారే ఉండేది. శాన ఏండ్ల సంది మల్ల గా రాస్ట్రంల గెల్సెతంద్కు కాంగ్రెస్ ఒక్క తీర్గ కోషిస్ జేస్తున్నది. మెల్లమెల్లగ సీట్లు పెంచుకొంటున్నది. గుజరాత్ల మొత్తం 182 సీట్లు ఉన్నయి. 2002ల బీజేపీకి 127 సీట్లు వొచ్చినయి. గని 2007ల 117కు, 2012ల 115కు, 2017ల 99 సీట్లకు పడిపోయినయి. బీజేపీకి సీట్లు తక్వ అయితుంటె కాంగ్రెస్‌కు సీట్లు పెర్గినయి. ఎలచ్చన్లు రాంగనే ప్రతాని మోది సెంటిమెంట్ రాజేస్తుండు. గిప్పుడు గాయినకు గా మోక ఇయ్యొద్దని కాంగ్రెస్ అనుకున్నది. భారత్ జోడో యాత్రల రాహుల్ గాంది ఉన్నడు. గాయిన గుజరాత్ల ఊకూకె ప్రచారం జేస్తలేదు. ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ సి.ఎం. అశోక్ గెహ్లత్ కాంగ్రెస్ దిక్కు కెల్లి ప్రచారం జేస్తున్నరు. ‘మున్సిపల్ కార్పొరేషన్ ఎలచ్చన్లు వొచ్చినా మోది ప్రచారం జేస్తడు. అసెంబ్లి ఎలచ్చన్లు వొచ్చినా ప్రచారం జేస్తడు. రావనాసురుని లెక్క ప్రతానికి పది తల్కా యలున్నయి. గుజరాత్ల చిన్నప్పుడు ఒక రేల్‌టేషన్ల ఛాయ్ అమ్మిన అని మోది జెప్పిండు. గని గాయిన ఛాయ్ అమ్మిన అని జెప్తున్న జమాన్ల గాడ రేల్‌టేషనే లేదు. లేని రేల్‌టేషన్ల మోది ఛాయ్ ఎట్ల అమ్మిండు’ అని ఖర్గే అడిగిండు.’’
‘‘బీజేపీ ప్రచారం ఎట్ల జేసింది?’’
‘‘అమిత్ షా మాట్లాడుకుంట గోద్రా అల్లర్లు గుర్తు జేసిండు. మల్ల బీజేపీ వస్తెనే గుజరాత్ల ఎసు వంటి కొట్లాటలు ఉండయని జెప్పిండు. ఉత్తరప్రదేశ్ ముక్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్‌డోజర్లు దెస్తనని జెప్పిండు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఖిలాప్ కొట్లాడిన నర్మదా బచావో లీడర్ మేథాపాట్కర్ రాహుల్ గాందితోని గల్సి భారత్ జోడో యాత్రల నడ్సింది. గుజరాత్ రాస్ట్రం రాకముందు గుజరాతీలు, మహారాష్ట్రుల నడ్మ కాంగ్రెస్ కొట్లాటలు బెట్టింది. మేము గసుంటోల్లం గాదు. జై శ్రీరాం అంటం. కార్పరేట్ సంస్థలకు పెద్ద పీట ఏస్తం. నేను తినను. ఎవ్వర్ని తిననియ్యను. శాన పెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మ బెట్టి పిచ్చిన. ‘గుజరాత్‌నంత మీరే గడ్తె కూలిన మోర్బీ ఫూల్ గుడ్క మీరే గట్టిండ్రా?’ అని అడిగితె మోదీ ఏమన్నడు? గీ సవాల్కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్కు టక్కరైతది’’ అని బేతాలుడన్నడు.
‘‘మోర్బీ ఫూల్ నేను గట్టలేదు. కూలోల్లు గట్టిండ్రు అని మోదీ అన్నడు’’ అని విక్రమార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంట్లకు బోయిండు. (క్లిక్ చేయండి: కలిసి ఏడుద్దాం – నా కల నిజం చేద్దాం)
- తెలిదేవర భానుమూర్తి
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment