Gujarat Assembly Election 2022
-
కాంగ్రెస్ కోమాలో ఉంది: రాహుల్ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం చురకలు
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ ఘోర పరాజయానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కోమాలో ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటే మార్పు(చేంజ్) కాదు, మార్పిడికి(ఎక్స్ఛెంజ్) సంబంధించినదని పంజాబ్ సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీలకు అడ్డంగా మారారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారిందని.. ప్రత్యర్థి పార్టీలకు సంఖ్యాబలం లేనప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారి ఎమ్మెల్యేలను అమ్మేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ .. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉందని అన్నారు. ‘గుజరాత్లో రాహుల్ గాంధీ ఎన్నిసార్లు పర్యటించారు. కేవలం ఒకేసారి. మరి ఒక్కసారే రాష్ట్రాన్ని సందర్శించి ఎన్నికల్లో గెలవాలనుకున్నాడు. సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడో (గుజరాత్) అక్కడ ఎన్నికలు జరిగాయి. రాహుల్ గాంధీ తన పాదయాత్రను సూర్యుడు మొదట ఉదయించే ప్రదేశం (కన్యాకుమారి) నుంచి ప్రారంభించాడు. ముందు తన టైమింగ్‌ను సరిచేసుకోనివ్వండి” అని భగవంత్ మాన్ చురకలంటించారు. చదవండి: బార్‌పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు.. పోలీసులు షాక్.. కాగా శుక్రవారం రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతీసిందని మండిపడ్డారు. ఆప్ లేకుండా అధికార బీజేపీని ఓడించేవాళ్లమన్నారు. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ ఆప్‌ను ఉపయోగించిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. 182 స్థానాల్లో 156 సీట్లు గెలుచుకొని రికార్డ్ సృష్టించింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో ఏ రాజకీయ పార్టీకీ ఇన్ని సీట్లు దక్కలేదు. 1985 ఎన్నికలలో కాంగ్రెస్ 149 స్థానాలు గెలుచుకోగా.. 37 ఏళ్ల ఈ రికార్డును బీజేపీను అధిగమించింది. అయితే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించింది. -
ఆ పార్టీ లేకుంటే గుజరాత్లో గెలిచేవాళ్లం: రాహుల్ గాంధీ
జైపూర్: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై ఆపార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ కీలకపాత్ర పోషించిందని రాహుల్ పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ లేకుంటే అధికార బీజేపీని కాంగ్రెస్ ఓడించేదని తెలిపారు. గుజరాత్లో కాంగ్రెస్ ఓటమికి ఆప్ కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఆప్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ బీజేపీకి బీటీమ్‌గా వ్యవహరించిందనిమండిపడ్డారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి ఆప్ బీజేపీతో కుమ్మకైందని దుయ్యబట్టారు. దేశాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు రాహుల్. ప్రజల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు బీజేపీని ఓడించాలన్న దృక్పథమే లేదని విమర్శించారు. అయితే రాహుల్ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చింది. గుజరాత్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనున్న ఉన్న ఆప్‌ను బీజేపీ, కాంగ్రెస్ అడ్డుకున్నాయని పేర్కొంది. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులో మొదలైన యాత్ర ఫిబ్రవరి నెలలో కశ్మీర్లో ముగియనుంది. 150 రోజులపాటు మొత్తం 3,500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ నడక యాత్ర సాగనుంది. జోడోయాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. తమిళనాడు,కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర 2,800 కిమీలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 24న ఢిల్లీలో ప్రవేశించనుంది. అనంతరం ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రల్లో పర్యటిస్తూ చివరకు జమ్ము కశ్మీర్లో ముగుస్తుంది. చదవండి: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కేంద్రం ఈ నిజాన్ని దాస్తోంది: రాహుల్ ఫైర్ -
Gujarat Election 2022: గుజరాత్ ఓటేసిందిలా...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దుమ్ము రేపి వరుసగా ఏడోసారి అధికారంలోకి రావడంపై పలు రాజకీయ వర్గాల్లో పలు కోణాల్లో విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రజల్లో చాలా విషయాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అంతటి అసంతృప్తిని, అధికార వ్యతిరేకతను అధిగమిస్తూ ఏకంగా నాలుగింట మూడొంతులకు పైగా మెజారిటీ సాధించిన వైనం రాష్ట్ర బీజేపీ ముఖ్యులను కూడా ఆశ్చర్యపరిచింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి కనీసం గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్ చివరికి ఘోర పరాజయం పాలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీని అడ్డుకోలేకపోగా, కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా దాని జైత్రయాత్రకు పరోక్షంగా సహకరించినట్టయింది! దాంతో రాష్ట్రంలో ఎటు చూసినా కాషాయ రెపరెపలే కనిపించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ విహంగ వీక్షణం... – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక భారతీయ అస్మిత!
గుజరాతీ ‘అస్మిత’ (ఆత్మగౌరవం) పులకించిపోయింది. ఆ పులకింత వెల్లువలో ఏడో వరస విజయం బీజేపీ ఒడిలోకి వచ్చి పడింది. గుజరాత్లో కనిపించే ఎత్తయిన విగ్రహం సర్దార్ పటేల్‌దే కావచ్చు. కనిపించని ఎత్తయిన విగ్రహం ఇప్పుడు గుజరాతీ అస్మిత. అది పులకించకుండా ఎలా ఉంటుంది? గుజరాతీ బిడ్డ నరేంద్ర మోదీ దేశంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు. నెంబర్ టూగా మరో గుజరాతీ సేఠ్ అమిత్‌షా చక్రం తిప్పుతున్నారు. వారిద్దరి ప్రభావం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థను గుజరాతీ వ్యాపారులు నడిపిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులు అనేకం దేశంలోని ఇతర ప్రాంతా లకు జెల్లకొట్టి గుజరాత్ బాట పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ‘కెమ్ చో’ (ఎలా ఉన్నావ్) వంటి కొన్ని గుజరాతీ మాటలు నేర్చు కుంటున్నారు. మాట్లాడుతున్నారు. గుజరాతీ అస్మితకు ఇంతకంటే ఏంకావాలి? మధ్యతరగతి మందహాసం చేస్తున్నది. ఉన్నత వర్గాలు మీసం మెలేస్తున్నాయి. దరిద్రనారాయణుల ‘న్యూసెన్స్’ గురించి ఆలోచించే ఓపిక ఇప్పుడు అస్మితకు లేదు. మోర్బీ వంతెన కూలిపోయింది. అయితే ఏమిటి? వందమందికి పైగా చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం, అధికారుల అవినీతి ఈ విషాదానికి కారణం. అఫ్కోర్స్! ప్రపంచ రాజ్య కూటముల్లో ఎలైట్ క్లబ్‌గా పరిగణించే జీ–20కి ఇప్పుడు గుజరాతీ బిడ్డ నరేంద్రభాయ్ నేతృత్వం వహిస్తున్నారు. ఏది ముఖ్యం? ఇంతకంటే ఎక్కువ దేశాలు సభ్యులుగా ఉన్న అలీనోద్యమానికి పండిత నెహ్రూ, ఇందిరాగాంధీ నాయకులుగా ఉన్నారు. ఇది రొటేషన్ పదవే కనుక వారు పెద్దగా పటాటోపాన్ని ప్రదర్శించలేదు. కానీ గుజరాతీలు వ్యాపార ప్రవీణులు. దీన్ని కూడా బ్రాండింగ్ చేసుకున్నారు. ఈ బిల్డప్‌ను ‘అస్మిత’ ఆమోదించింది. గుజరాతీ అస్మిత వేసిన తెరలకు ఆవల కూడా కొంత గుజరాతీ సమాజం ఉన్నది. అక్కడా ఓట్లుంటాయి. వాటికి ఏకైక హక్కుదారుగా ఉండవలసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీనస్థితికి దిగజారింది. అహ్మద్ పటేల్ మరణం తర్వాత అది అనాధగా మారిపోయింది. కాంగ్రెస్ నిస్తేజమవడంతో దాని ఓట్లను కొల్ల గొట్టడానికి చీపురుకట్ట తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగింది. పదమూడు శాతం కాంగ్రెస్ ఓట్లను చీల్చగలిగింది. ‘ఆప్’ చీల్చిన ఓట్ల కారణంగా సౌరాష్ట్ర ప్రాంతంలో 18 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుజరాత్ చరిత్రలో ఎన్నడూ ఎరగనంత ఘనవిజయం బీజేపీకి సాధ్యమైంది. వరసగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించడం అసాధారణమైన విషయమే. సీపీఎం నాయకత్వంలో లెఫ్ట్ కూటమి ఒక్కటే ఇప్పటివరకూ బెంగాల్లో ఆ ఘనతను సాధించింది. ఇప్పుడు బీజేపీ ఆ రికార్డును సమం చేసింది. ఏడవసారి గెలవడం, 52.5 శాతం ఓట్లను కొల్లగొట్టడం, 156 (182లో) సీట్లు సాధించడం స్వప్నతుల్యమైన విజయమే. బెంగాల్లో సీపీఎం కూటమి ఏడోసారి గెలిచినప్పుడు కూడా 50.5 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు గుజరాత్లో 10 పార్టీలు రంగంలో ఉంటే, అప్పుడు బెంగాల్లో 30 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఈ అంశాన్ని గమనంలోకి తీసుకుంటే రెండు విజయాలూ సమాన మైనవే. కానీ, నేటి గుజరాత్ విజయాన్ని కనీవినీ ఎరుగని సునామీగా మేళతాళాలు మోగిస్తూ మీడియా ప్రకటించింది. ఇందులో పావలా వంతు ప్రాధాన్యం కూడా నాటి లెఫ్ట్ విజయానికి దక్కలేదు. దటీజ్ బీజేపీ! జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీతో పోల్చదగిన మరో నాయకుడు ప్రచారంలో లేడన్నమాట నిజం. ఆయన రాజకీయ కెరీర్లోనే ఇప్పుడు ఉచ్చదశలో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన మేజిక్ ఎంతోకొంత పనిచేసే అవకాశం కూడా ఉన్నది. అయితే రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో అది పనిచేయాలన్న నియమం లేదు. హిమాచల్‌ప్రదేశ్ ఫలి తాలు ఈ అంశాన్ని నిర్ధారించాయి. ఈ రాష్ట్రం బీజేపీకి అనుకూల మైనదే. అసెంబ్లీ ఎన్నికల్లో చెరో అవకాశం ఇస్తున్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉంటున్నది. 2019 ఎన్నికల్లో కమలం పార్టీకి రికార్డు స్థాయిలో ఓట్లను కురిపించింది. సైనిక దళాల్లో ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పనిచేస్తుంటారు. కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ కార్యక్రమాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు. యాపిల్స్ పండించే రైతాంగం సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతాంగ సమస్యను బీజేపీ పట్టించుకోకపోవడం మైనస్‌గా మారింది. జై జవాన్ – జై కిసాన్లిద్దరూ బీజేపీ ఓటమికి కారకులయ్యారు. మోదీ నాయకత్వం, హిందుత్వ, జాతీయవాదం వంటి అంశా లపై మెజారిటీ హిమాచలీయులకు ఎటువంటి పేచీ లేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి స్థానిక అంశాల ఆధారంగానే వారు స్పందించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను ఏకధాటిగా పదిహేనేళ్ల పాటు కమలం పార్టీ ఏలింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ‘ఆప్’కి తలవంచక తప్పలేదు. ‘ఆప్’ ప్రస్తావించిన స్థానిక అంశాలపైనే ఓటర్లు స్పందించారు తప్ప మోదీ బొమ్మను పట్టించుకోలేదు. మునిసిపల్ అధికార యంత్రాంగంలో పేరుకొనిపోయిన అవినీతిని పెకిలిస్తామని ‘ఆప్’ ప్రచారం చేసుకున్నది. వీధి కుక్కల బెడద మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది. వీధి వ్యాపారులను లంచాల నుంచి కాపాడతామని చెప్పింది. రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని చెప్పింది. మునిసిపల్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పింది. ఈ సాదాసీదా హామీల వైపే ఓటర్లు మొగ్గుచూపారు. ఈ ఎన్నికలతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలే వచ్చాయి. ఒక్క గుజరాత్లో అఖండ విజయం సిద్ధించినా, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరంలోగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవలసి ఉన్నది. డబుల్ ఇంజిన్ వ్యూహం హిమాచల్‌లో పనికిరాలేదు. గుజరాతీలు తమ ముఖ్యమంత్రిగా కూడా మోదీయే ఉన్నట్టు భావిస్తున్నారు. కనుక వారి దృష్టిలో అక్కడున్నది సింగిల్ ఇంజనే! విఫలమైన ఈ వ్యూహాన్ని వచ్చే ఐదు రాష్ట్రాల్లో మళ్లీ అనుసరిస్తారా? పైగా సాధారణ ఎన్నికలకు ఏడాది వ్యవధి లోపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని డ్రెస్ రిహార్సల్‌గా పరిగణిస్తారు. సాధారణ ఎన్నికల ఆహార్యాన్ని ఎంతోకొంత ఈ ఎన్నికల్లో ప్రదర్శించవలసి ఉంటుంది. ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలపై విస్తృత చర్చ జరగ కుండా ఒక జాతీయ ఎజెండా, వీలైతే భావోద్వేగపూరితమైన అంశం చుట్టూ ప్రచారం కేంద్రీకృతమయ్యేలా బీజేపీ ప్రయత్నిస్తుంది. రాష్ట్రాల స్థానిక అంశాలపై చర్చలో బీజేపీ ఇరుక్కోవడమంటే మొసళ్ల మడుగులో గజేంద్రుడు పాదం మోపినట్టే! అప్పుడు ‘సిరికింజెప్పి, శంఖ చక్రములు’ సంధిస్తూ మోదీ వచ్చి వాలినా చేయగలిగిందేమీ ఉండదు. కనుక ఈ వేసంగిలో జరిగే కర్ణాటక ఎన్నికల నాటికే బీజేపీ సరికొత్త ఎజెండా శాంపుల్ బయటకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ బీజేపీకి ఊరట కలిగించే విషయం ఒకటున్నది. వచ్చేయేడు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ జాతీయ పార్టీలతోనే తలపడనున్నది. నాలుగు రాష్ట్రాల్లో వృద్ధ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. తెలంగాణలో నిన్ననే జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి. కనుక తన కొత్త ఎజెండాపై డ్రెస్ రిహార్సల్ చేయడం సులభం. ఈసారి బీజేపీ ఏ నినాదంతో ముందుకు రావచ్చు? హిందూత్వ? జాతీయవాదం? ఆర్థికాభివృద్ధి? అన్నీ గుదిగుచ్చిన భారతీయ అస్మిత హారం? భారతీయ ఆత్మగౌరవ విజయాన్ని ఎలుగెత్తి చాటేందుకు సాధించిన విజయాలేమున్నాయి? హిందూత్వ అంశం తప్పకుండా ఉంటుంది. దండలో దారం మాదిరిగా ఇప్పుడూ ఉన్నది. ఇకముందు కూడా ఉంటుంది. బీజేపీ భౌతిక రూపాన్ని నడిపించే నాడీ మండలం ఆర్ఎస్ఎస్ అనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాల్లేవు. భారత రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన మరుసటిరోజే ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ఆర్గనైజర్’ దానిపై స్పందించింది. ఈ రాజ్యాంగంలో భారతీయతే లేదని అభిశంసించింది. మనుధర్మ శాస్త్రంలోని అంశాలను రాజ్యాం గంలో జొప్పించకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికీ మూల సూత్రాలని డాక్టర్ అంబేడ్కర్ నొక్కి చెప్పారు. సమానత్వం అనేది భారతీయ భావన కాదంటారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్. భిన్నవర్గాల మధ్య సామరస్యతే భారతీయత అనేది ఆయన వాదన. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రవేశం ఫలితంగా అంబేడ్కర్ ప్రవచిం చిన రాజ్యాంగ మౌలిక ఆశయానికి దెబ్బతగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు. అంటే ఆట మొదలైనట్టే కదా! భారతదేశం ఫెడరల్ వ్యవస్థగా ఉండటాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నది. గురు గోల్వాల్కర్ తన రచనల్లో ఫెడరల్ వ్యవస్థను గట్టిగా వ్యతిరేకించారు. దేశమంతా ఏకచ్ఛత్ర పాలన కింద, ఏకభాష (హిందీ), ఏకైక మతం (హిందూ)తో వర్ధిల్లాలనేది వారి ఆశయం. కొత్త పన్నుల విధానం (జీఎస్టీ), కొత్త విద్యావిధానాలను (ఎన్ఇపి) కూడా రాష్ట్రాల అధికారా లను కత్తిరించడానికి, వాటిని బలహీనపరచడానికి ఉపయోగి స్తున్న వైనం కనబడుతూనే ఉన్నది. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, ఎన్ఆర్సీ, హిజాబ్ నిషేధం వంటి పరిణామాల వెనుక హిందూత్వ ఎజెండా కనిపిస్తూనే ఉన్నది. గోహత్యా పాతకులుగా ముద్రవేయడం ద్వారా ఒక మతా వలంబుల్ని సమాజానికి దూరంగా నెట్టే ప్రయత్నమూ కట్టెదుటే ఉన్నది. కనుక హిందూత్వ ఎజెండా ఇప్పటికీ ఉన్నది. ఇంకా బలంగా ఉండబోతున్నది. మనదేశంలో తొంబయ్యవ దశకం ప్రారంభంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు కేవలం ఆర్థిక వ్యవస్థనే మార్చలేదు. సామాజిక, రాజకీయ వ్యవస్థలను కూడా ఆసాంతం మార్చి వేశాయి. ఎనభయ్యో దశకం తర్వాత పుట్టిన వాళ్లను ‘మిలీనియల్స్’ అంటున్నారు. ఈ మిలీనియల్స్, పోస్ట్ మిలీనియల్స్ తరాల్లో చరిత్ర, సమాజ పరిణామ శాస్త్రాల అధ్యయనం మృగ్యమైంది. అందువల్ల భావోద్వేగపూరితమైన, మతపరమైన, కులపరమైన అంశాలకు సులభంగా ప్రభావిత మవుతున్నారు. ఈ పరిణామం కూడా బీజేపీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడింది. సోషల్ మీడియాపై ఆ పార్టీకి ఉన్న పట్టు కారణంగా ఇకముందు కూడా ఉపయోగపడుతుంది. కనుక హిందూత్వ ఎజెండా ఇకముందు కూడా బలంగా ఉండబోతున్నది. కేవలం హిందూత్వ కార్డుతోనే ఎన్నికలకు వెళ్లడం కుదరదు కాబట్టి అందులో జాతీయవాదాన్ని మిక్స్ చేసి, ఆర్థికాభివృద్ధితో గార్నిష్ చేసుకుని ఎజెండాను వడ్డించవచ్చు. సరిహద్దుల్లో బలవంతుడైన చైనావాడితో ఢీ అంటే ఢీ అనడం, ఆక్రమిత కశ్మీర్‌ను హస్తగతం చేసుకుంటామని ప్రకటనలు చేయడం జాతీయ భావాలను ప్రేరేపితం చేసే కార్యక్రమాలే! అంతర్జా తీయ యవనికపై ప్రముఖపాత్రను పోషించడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఆర్థికాభివృద్ధిని గురించి ఉటం కించడానికైతే గణాంకాలు అందుబాటులోనే ఉన్నాయి. 2014లో రెండు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ 2022 నాటికి మూడున్నర ట్రిలియన్ డాలర్లకు చేరింది. తలసరి ఆదాయం లక్ష రూపాయల నుంచి రెండు లక్షలకు పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ను దాటేసి ఐదో స్థానంలోకి చేరింది. అయితే మానవ అభివృద్ధి సూచికలో మాత్రం దేశం 130వ స్థానం నుంచి 132కు దిగజారింది. మరి బలపడిన ఆర్థిక వ్యవస్థ మానవ అభివృద్ధికి ఎందుకు ఉపకరించలేదు? సృష్టించిన సంపద అంతా ఎక్కడికి వెళ్లింది? ఆక్స్‌ఫామ్ ఇండియా రిపోర్టులో సమాధానం దొరుకుతుంది. సంపద అంతా పిడికెడు మంది చేతిలో కేంద్రీకృతమై ఉన్నది. 80 శాతం సంపద 10 శాతం శ్రీమంతుల చేతిలో ఉన్నది. అందులోనూ ఒక్కశాతం కుబేరుల చేతుల్లో 55 శాతం సంపద కేంద్రీకృతమై ఉన్నది. అయినప్పటికీ జీడీపీలోనూ, తలసరి ఆదాయంలోనూ పెరుగు దల కనిపిస్తున్నది కదా? అంబానీ ఆదాయం లక్షకోట్లు, అప్పారావు ఆదాయం లక్ష రూపాయలు అనుకుందాం. ఇద్దరి తలసరి ఆదాయం యాభైవేల కోట్ల యాభైవేల రూపాయలు అవుతుంది కదా! ఈ సంగతి తెలిస్తే అప్పారావు మూర్ఛపోతే పోవచ్చు గాక! లెక్క లెక్కే కదా! ఈ లెక్క ప్రకారం ఇండియా ఈజ్ షైనింగ్. ఈ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వాజపేయి ప్రభుత్వం గతంలో దెబ్బతిన్నది. కనుక ఈ షైనింగ్‌లో ఈసారి హిందూత్వ మెరుపులు, జాతీయ తళుకులూ ఉండవచ్చు. ఇదొక సంభావ్యత మాత్రమే! కొత్త జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ రైతు రాజ్యాన్ని ఎజెండాగా ప్రకటించుకున్నది. కొత్తగా జాతీయ పార్టీ హోదా సాధించిన ‘ఆప్’కు ‘అవినీతి’ బాణం ఉండనే ఉన్నది. కాంగ్రెస్ సంగతేమిటో ఆ పార్టీలోనే ఇంకా ఎవరికీ తెలియదు. మూడు నాలుగు పాయలుగా చీలిన ప్రతి పక్షం మురిపిస్తుండగా బీజేపీ మెరిపించబోయే ఎజెండా కోసం దేశం ఎదురుచూస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
గన్ షాట్: గుజరాత్ మోడల్ పేపర్
-
గుజరాత్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకులు.. సీఎం ఎంపికపై దృష్టి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇక నూతన ముఖ్యమంత్రి ఎంపికపై దృష్టి సారించింది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం గాంధీనగర్‌లో సమావేశమై, తమ పార్టీ శాసనసభా పక్ష(సీఎల్పీ) నేతను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండాను బీజేపీ అధిష్టానం నియమించింది. సీఎల్పీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని బీజేపీ అధిష్టానం గతంలోనే ప్రకటించింది. భూపేంద్ర పటేల్ రాజీనామా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయన మంత్రివర్గం సైతం రాజీనామా సమర్పించింది. బీజేపీ నిర్ణయం ప్రకారం.. భూపేంద్ర పటేల్ ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి? -
ఇంతకీ.. గెలిచింది ఎవరు!
మూడు రాష్ట్రాలు. మూడు ఎన్నికలు. మూడు పార్టీలు. మూడు విభిన్న తీర్పులు. మూడు ముక్కల్లో తాజాగా ముగిసిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సారాంశమిదే. దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకునే సమ్మోహన శక్తి ఏ పార్టీకీ లేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి గానీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు గానీ, బీజేపీకి పోటీగా ఎదగాలని కలలుగంటున్న ఆప్‌కు గానీ అవి ఊహించుకుంటున్నంత బలం లేదని తేలిపోయింది. ఈ మూడు పార్టీలు ఎక్కడ గెలవాలన్నా ఇంకేదో వాటికి అసంకల్పితంగా సహాయపడుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓ పార్టీగా నెగ్గలేదు. మోదీ ప్రధానిగా ఉండటం వల్ల మాత్రమే రికార్డు విజయాన్ని సాధించగలిగింది. ప్రధాని గుజరాతీ కావడం వల్లే ఆ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను ఆసాంతం పక్కకు నెట్టేసి బీజేపీని అక్కున చేర్చుకున్నారు. ఇక హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా అది సొంత చరిష్మాతో అసలే కాదు. పాలక పక్షమైన బీజేపీపై గూడుకట్టుకుని ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌కు ఓటేయడం ద్వారా జనం బహిర్గతం చేశారు. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓటర్లు ఇలాగే స్పందించడంతో ఎంసీడీపై 15 ఏళ్ల బీజేపీ పెత్తనానికి తెర పడింది. అక్కడ కాంగ్రెస్ కన్నా ఆప్ మెరుగని ఓటర్లు భావించడంతో ఎంసీడీ కేజ్రీవాల్ పార్టీ వశమైంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ గెలిచిన పార్టీలకు సొంత బలానికి మించి అదనపు బలం వ్యతిరేక ఓటు ద్వారానో, ప్రాంతీయాభిమానం రూపేణో సమకూరింది. ఆ లెక్కన వాటివి అసంపూర్ణ విజయాలు మాత్రమే! గెలవలేదు, గెలిచామనిపించాయి!! మోదీ మ్యాజిక్‌ను నమ్ముకుని 2024లో ఏకంగా 400 ఎంపీ స్థానాలు కొల్లగొడతామని కలలుగంటున్న బీజేపీ పైకి ఏం చెబుతున్నా ఈ మూడు ఎన్నికల్లో సదరు మ్యాజిక్ ఒకే రాష్ట్రానికి, అదీ ఆయన స్వరాష్ట్రానికి మాత్రమే పరిమితమైందన్న వాస్తవం మింగుడుపడటం లేదు. తన మ్యాజిక్కూ పరిమితులున్నాయని మోదీకి కూడా ఈసరికే అర్థమై ఉంటుంది. కలెగూరగంప లాంటి తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరి పరిమితులేమిటో చూద్దాం... మోదీ.. తగ్గుతున్న మేజిక్ గుజరాత్‌ను సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రి. ప్రస్తుతం దేశాన్నేలుతున్న ప్రధాని. ప్రపంచం దృష్టిలో విశ్వగురు. అత్యధిక ప్రజాదరణ ఉన్న నేత. బీజేపీకి పెద్ద దిక్కు. ఒకరకంగా పారీ్టకి ప్రస్తుతతం అన్నీ ఆయనే! ఎంతగా అంటే... బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ అనేంతగా!! వరుసగా రెండోసారి ప్రధాని పదవి చేపట్టాక మోదీ ద్విగుణీకృత ఆకర్షణ శక్తితో వెలిగిపోయినా ఆ శక్తి రాను రానూ సన్నగిల్లుతున్నట్టు కన్పిస్తోంది. తాజా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అది కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. ఒకవిధంగా మోదీ గ్రాఫ్ తగ్గడం నోట్ల రద్దు నిర్ణయంతోనే మొదలైంది. తర్వాత బడా కార్పొరేట్ దిగ్గజాల భారీ రుణాలను గుండుగుత్తగా మాఫీ చేయడం మొదలుకుని ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దాకా ఆయన గ్రాఫ్ పడిపోతూనే ఉంది. మెజారిటీ లేని రాష్ట్రాల్లో బేరసారాలతో రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ వశం చేయడం సాధారణ పౌరులకు కూడా మింగుడుపడని అంశం. ఎంసీడీలోనూ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని ఉంటే మోదీ గాలికి తిరుగులేదని బహుశా నిరూపితమయ్యేదేమో. కానీ జరిగింది మరొకటి. గుజరాత్‌లోనూ ఎన్నడూ లేనంతటి మెజారిటీ సాధించడం కచి్చతంగా మోదీకి ప్లస్ పాయింటే. అయితే అది మోదీ స్వరాష్ట్రం కావడం వల్లే ఆ ఘనత సాధ్యమైంది. ఆయన్ను తమ రాష్ట్ర ముద్దుబిడ్డగా గుజరాత్ ఓటర్లు భావించబట్టే ఆ స్థాయిలో అందలమెక్కించారు. మోదీ కాక మరో రాష్ట్ర నేత ఎవరైనా ప్రధానిగా ఉన్నట్టయితే గుజరాత్ ఫలితం మరోలా ఉండేదేమో! ఊహాజనితమే అయినా ఇది చర్చనీయాంశమే! గుజరాత్లో గెలిచింది నిస్సందేహంగా మోదీ మాత్రమే. బీజేపీ కేవలం ఆయన వెంట నడిచింది. అంతే! అదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు మోదీ కూడా ఓడారన్నది కాదనలేని వాస్తవం! బీజేపీ.. మోదీపైనే భారం కేంద్రంలో అధికారంలో ఉన్న పారీ్టగా అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగరేయాలని ఉవి్వళ్లూరుతున్న బీజేపీకి హిమాచల్ ఓటమి మింగుడుపడనిదే. ఈ ఫలితంతో బీజేపీ అధికారం 16 రాష్ట్రాలకే పరిమితమైంది. వీటిలో సొంతంగా 10 రాష్ట్రాల్లో, సంకీర్ణంతో మిగతా ఆరుచోట్ల అధికారంలో ఉంది. డబుల్ ఇంజన్ (కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం) నినాదంతో దేశాన్ని హోరెత్తిస్తున్న బీజేపీకి హిమాచల్‌లో ఒక ఇంజన్ పట్టాలు తప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అక్కడ కేవలం ఒక శాతం ఓటు తేడాతోనే ఓడామని మోదీ సరిపుచ్చుకునే ప్రయత్నం చేసినా ఓటమి ఓటమే కదా! పైగా హిమాచల్‌లో కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం కూడా చేయకపోయినా విజయం ఆ పార్టీనే వరించడం బీజేపీపై అక్కడి ప్రజలకున్న వ్యతిరేకతకు అద్దం పడుతుంది. స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన అగి్నపథ్, వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకం వంటివాటిపై బీజేపీ దృష్టి పెట్టకపోవడం, కేవలం మోదీ మ్యాజిక్ మీదే మితిమీరిన నమ్మకం పెట్టుకోవడం ఓటమికి దారితీశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరిగిన ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు అసెంబ్లీ సీట్లలో మాత్రమే నెగ్గింది. ఆ పార్టీ ప్రాభవం తగ్గుతోందంనేందుకు ఇదీ సూచికే. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ, కతౌలీ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడటం గమనార్హం. మెయిన్‌పురితో సమాజ్‌వాదీ అభ్యరి్థ, పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఏకంగా 2.88 లక్షల ఓట్ల మెజారిటీ సాధించడం మరో విశేషం. 2024 లోక్‌సభ ఎన్నికల్లోగా బీజేపీ సంస్థాగతంగా మరింత పట్టు సాధించకుంటే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా తయారవడం ఖాయం. లేదంటే మోదీనే నమ్ముకుని గుజరాత్ వంటి విజయాల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. కాంగ్రెస్... అదే అయోమయం ఈ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హిమాచల్‌లో గట్టెక్కినా అది సొంతం బలంతో కాదని కాంగ్రెస్‌కూ తెలుసు. గుజరాత్లో, ఢిల్లీ కార్పొరేషన్లో పార్టీ కనీస స్థాయి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆప్ దెబ్బకు గుజరాత్లో ముక్కోణపు పోరులో పూర్తిగా మునిగింది. కోలుకునే పరిస్థితి సుదూరంలోనూ కని్పంచడం లేదు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదు. గుజరాత్‌పైనే దృష్టి పెట్టిన కాంగ్రెస్, హిమాచల్‌లో సరైన ప్రచారం కూడా చేయలేదు. ప్రియాంకా గాంధీ అదపాదడపా పర్యటనలతో మమ అనిపించారు. రాహుల్ ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయినా బీజేపీ వైఫల్యానికి తోడు, ఆప్ ప్రభావం చూపలేకపోవడంతో కాంగ్రెస్‌ను విజయం తనంతతానుగా వరించింది. కష్టించి సాధించినది కాదు. ఆప్... అప్పుడే కాదు! బీజేపీకి కంచుకోట అయిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను బద్దలు కొట్టి 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెర దించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. భారీ పథకాలు, తాయిలాలతో అట్టహాసంగా రాష్ట్ర ఎన్నికల బరిలో దిగిన ఆప్.. ‘పహలే ఆప్’ అంటూ ఏమాత్రం పోటీనివ్వకుండా బీజేపీకి దారిచి్చంది! పైగా కాంగ్రెస్ ఓట్లను భారీగా చీల్చి బీజేపీకి రికార్డు సంఖ్యలో స్థానాలు కట్టబెట్టింది. గుజరాత్లో సాధించిన ఓట్ల శాతం సాయంతో జాతీయ పార్టీ గుర్తింపు దక్కనుండటమే ఆప్‌కు ఏకైక ఊరట. బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనంటూ పదేపదే చీపురు ఝళిపిస్తున్న ఆప్ నిజంగా ఆ స్థాయికి చేరాలంటే మరింత సమయం తప్పదని ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి. ఇక హిమాచల్ ఎన్నికల్లోనైతే ఆప్ సోదీలో కూడా లేకుండానే పోయింది. ఓడినా అనుభవం దక్కిందని తృప్తి పడటమే ఆ పారీ్టకి చివరికి మిగిలింది! - ఎస్.రాజమహేంద్రారెడ్డి -
గుజరాత్ ఎన్నికలు.. గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే!
నరేంద్ర రికార్డులను భూపేంద్ర బ్రేక్ చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కమళనాథులకు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 127 సీట్లు రావడమే బీజేపీ ఖాతాలోకి అత్యధిక రికార్డు. ఇప్పుడు బీజేపీ దాన్ని తిరగరాసింది. ఏకంగా 156 సీట్లను చేజిక్కించుకుంది. మాధవ్‌సిన్హ్ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ నెగ్గిన 149 సీట్ల రికార్డునూ బీజేపీ ప్రస్తుతం తిరగరాయడం విశేషం. విపక్షాల మధ్య ఓట్ల చీలిక వచ్చినా... బీజేపీ ఏకంగా 53 (ఎన్నికల కమిషన్ తాజా సమాచారం ప్రకారం) శాతం ఓట్లు సాధించడం కూడా రికార్డే. కమలనాథులకు ఈ స్థాయిలో ఓట్లు గతంలో ఎప్పుడూ రాలేదు. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు 1977 నుంచి 2011 వరుసగా ఏడు పర్యాయాలు అధికారాన్ని చేపట్టాయి (34 ఏళ్ల పాటు బెంగాల్‌ను పాలించాయి). గుజరాత్లో 1998 నుంచి నిరంతరాయంగా అధికార పీఠంపై ఉన్న బీజేపీ వరుసగా ఏడోసారి నెగ్గి ఈ రికార్డును సమయం చేసింది. ►గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజారిటీతో గెలిచారు. ► క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జామ్‌నగర్ నార్త్‌లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెల్చారు. ► పటీదార్ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ అర్బన్ వీరమ్గ్రామ్ స్థానంనుంచి ఆప్ అభ్యర్థిపై గెలిచారు. ► వదగామ్ (ఎస్సీ) స్థానంలో గతంలో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దళిత నేత జిగ్నేశ్ మేవానీ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ► హార్దిక్ మాజీ సన్నిహితుడు, పటీదార్ నేత అల్పేశ్ కథిరియా వరఛా రోడ్ (సూరత్) స్థానంలో విజయఢంకా మోగించారు. ► కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన గాంధీనగర్ (సౌత్) నియోజకవర్గ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ సైతం గెలిచారు. ఓడిన ప్రముఖులు ► గుజరాత్ ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కటర్గామ్లో ఓడారు. ► ఆప్ సీఎం అభ్యర్థి ఎసుదాన్ గాఢ్వీ ఖంభలియా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ► ప్రాథమిక, యువజన విద్యాశాఖ సహాయ మంత్రి కీర్తిసిన్హా వాఘేలా, ఏడుగురు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. ► ఇక హిమాచల్‌లో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగిన ఆశాకుమారి, రామ్‌లాల్ ఠాకూర్, కౌల్సింగ్ ముగ్గురూ ఓటమి చవిచూశారు. -
Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికి
అహ్మదాబాద్: పార్టీ పట్ల అంకితభావం, కష్టించే తత్వం భూపేంద్ర పటేల్‌ను మున్సిపాలిటీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేర్చాయి. గుజరాత్ శానససభ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భూపేంద్ర పటేల్ ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ప్రకటించారు. గుజరాత్లో ఎన్నికలకు సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రిని మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. విజయ్ రూపానీ స్థానంలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర వైపు మొగ్గుచూపింది. అధిష్టానం అంచనాలకు తగ్గట్టే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించారు. 2017లో రికార్డు స్థాయి మెజార్టీ భూపేంద్రబాయ్ పటేల్ అలియాస్ భూపేంద్ర పటేల్ 1962 జూలై 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జlచారు. 1982 ఏప్రిల్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. తొలుత అహ్మదాబాద్ జిల్లాలోని మేమ్‌నగర్ మున్సిపాలిటీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. రెండు సార్లు అదే మున్సిపాలిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2010 నుంచి 2015 దాకా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి 2017 వరకు అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(ఏయూడీఏ) చైర్మన్‌గా సేవలందించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీదీనగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఘట్లోడియా శాసనసభ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. చదవండి: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం ఏకంగా 1.17 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌పై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. 2021 సెప్టెంబర్ 13న గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన(2022) అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజార్టీతో నెగ్గడం గమనార్హం. -
ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయహోదాతో వచ్చే మార్పులేంటి ?
హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాతా తెరవలేకపోయింది. గుజరాత్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆప్ కలలు కంది. కానీ ఆ కలలన్నీ కల్లలైపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఊడవలేకపోయిన చీపురు మూలకూర్చుండిపోయింది. గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావడంతో ఆ పార్టీకి కాస్త బలం వచ్చినట్టయింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన పంజాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎరగవేయడంతో గుజరాత్లో కూడా ఆ పార్టీ ప్రబల శక్తిగా ఎదుగుతుందని అందరూ భావించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా తన ఉనికిని చాటుతుందని అనుకున్నారు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఆప్‌కి జాతీయ పార్టీ హోదా దక్కడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రెండేళ్ల ముందు నుంచి రాష్ట్రంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ గుజరాత్‌పై దృష్టి పెట్టడం, సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటడంతో తొలిసారిగా రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. అయితే మొదట్నుంచి ఆప్ కాంగ్రెస్‌నే విమర్శిస్తూ ఆ పార్టీ ఓటు బ్యాంకునే లక్ష్యంగా చేసుకోవడంతో నామమాత్రంగానే మిగిలిపోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఆమ్ మొదట్లో విస్తృతంగా తిరిగినప్పటికీ అవినీతి ఆరోపణల కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్‌తో ఆప్ ఆశలు వదిలేసుకుంది. గుజరాత్లో వివిధ మీడియా సంస్థల పోల్స్ కూడా ఆప్‌కి 20 శాతం వరకు ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీకి సొంత గడ్డ మీదనున్న క్రేజ్ ముందు కేజ్రివాల్ నిలబడలేకపోయారు. చదవండి: (ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం) జాతీయ పార్టీ హోదా ‘‘గుజరాత్ ప్రజలు మాకు జాతీయ పార్టీ హోదా కట్టబెట్టారు. ఇప్పటివరకు దేశంలో కొన్ని పార్టీలకు మాత్రమే ఆ హోదా ఉంది. నిజంగా ఇది మాకో అద్భుతమైన విజయం’’.. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అరవింద్ కేజ్రివాల్ పంపిన సందేశమిది. జాతీయ పార్టీకి హోదా రావడానికున్న షరతుల్లో ఒకటైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలో 6శాతం ఓట్లు, కనీసం రెండు సీట్లలో గెలిచి ఉండాలి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆప్ గోవాలో 6శాతం ఓట్లు, 2 సీట్లను సాధించింది. ఇప్పుడు గుజరాత్లో అయిదు సీట్లను గెలుచుకొని, 13శాతం ఓట్లతో జాతీయ పార్టీ హోదాని దక్కించుకుంది. దేశంలో ఉన్న జాతీయ పార్టీలివే.. మన దేశంలో ఇప్పటివరకు ఎనిమిది మాత్రమే జాతీయ పార్టీలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీకి మాత్రమే ఈ గుర్తింపు ఉంది. ఆప్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తిస్తే తొమ్మిదో జాతీయ పారీ్టగా అవతరిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ జాతీయ హోదాతో వచ్చే మార్పులేంటి ? ►పార్టీకి జాతీయ హోదా వస్తే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ఎన్నికల గుర్తు లభిస్తుంది ►సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్‌లో బ్రాడ్కాస్ట్, టెలికాస్ట్ బాండ్స్ లభిస్తాయి ►40 మంది స్టార్ క్యాంపైనర్లు ప్రచారంలో పాల్గొనచ్చు. వారికయ్యే ఖర్చులు అభ్యర్థులకుండే ఖర్చుల పరిమితి నుంచి మినహాయిస్తారు. ►పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి రాష్ట్రాల్లో ప్రభుత్వ జాగాలు లభిస్తాయి. ►అభ్యర్థులు నామినేషన్ వేసినప్పుడు ఒకరే ప్రొపోజర్ ఉంటే సరిపోతుంది. -
ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం
పోయిన చోటే వెతుక్కోవాలంటారు. గత ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన స్థానాలపై బాగా దృష్టి పెట్టడంలో, దూరమైన వర్గాలను కలుపుకొని పోవడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీ గుజరాత్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు సీఎంతో పాటు కేబినెట్ మొత్తాన్నీ మార్చేసి ప్రభుత్వ వ్యతిరేకత బారి నుంచి తప్పించుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా దశా దిశా లేకుండా సాగిన కాంగ్రెస్ చివరికి చతికిలపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత గడ్డ అయిన గుజరాత్లో 27 ఏళ్ల అధికార వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ ఏడాది ముందు నుంచి సన్నాహాలు చేసుకుంది. పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయడంతోపాటు ప్రభుత్వానికి కొత్త రూపు రేఖ కల్పించింది. సీఎంగా విజయ్ రూపానిని సీఎం పీఠం నుంచి తొలగించి రాష్ట్రంలో అత్యంత కీలకమైన పటేల్ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌కు సీఎం పగ్గాలు అప్పగించింది. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి పార్టీని గాడిన పెట్టడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా షాకిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలకు కాస్త ముందు 2020 జులైలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ సామాజిక వర్గానికి చెందిన జితు విఘానిని తొలగించి ఆయన స్థానంలో సీ.ఆర్.పాటిల్‌కు అవకాశం కల్పించారు. టిక్కెట్ల పంపిణీలో కూడా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినంగానే వ్యవహరించారు. ఏకంగా 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించి కొత్త ముఖాలను ప్రోత్సహించారు. చివరికి ఎన్నికలకి ముందు 140 మంది ప్రాణాలు కోల్పోయిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయిన మోర్బీలో కూడా బీజేపీ రికార్డు స్థాయి విజయం సాధించిందంటే ఆ పార్టీ రచించిన పకడ్బందీ వ్యూహాలే కారణం. మోదీకి దేశ విదేశాల్లో ఉన్న జనాదరణ కూడా ఈ ఎన్నికల ఫలితాలను బాగా ప్రభావితం చేసింది. ఆయన 34 ర్యాలీలు, రెండు భారీ రోడ్ షోలతో దాదాపుగా కోటి మంది ఓటర్లను నేరుగా కలిశారు. ‘గుజరాత్‌ను నేనే నిర్మించాను, నన్ను చూసి ఓటు వెయ్యండ’న్న మోదీ విజ్ఞప్తికి ఓటర్లు సానుకూలంగా స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా సెల్ఫ్ గోల్ వేసుకోవడం బీజేపీ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నేతలందరూ బిజీగా ఉండి గుజరాత్‌ను పూర్తిగా వదిలేశారు. గతంలో కాంగ్రెస్‌కు బాగా కలిసొచి్చన క్షత్రియులు, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీల వ్యూహాన్ని తెరపైకి తెచ్చి దళిత ఉద్యమకారుడు జిగ్నేశ్ మేవానీ, ముస్లిం వర్గంలో పట్టున్న ఖాదిర్ ఫిర్జాదాలకు అక్కున చేర్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకునే కొల్లగొట్టి కొన్ని సీట్లు సొంతం చేసుకోవడం బీజేపీకి లాభించింది. సామాజిక సమీకరణలు సామాజికంగా అన్ని వర్గాలను కలుపుకుని పోయే వ్యూహాలనే బీజేపీ రచించింది. గత ఎన్నికల్లో పటేళ్ల ఉద్యమంతో బీజేపీకి దూరమైన వారిని అక్కున చేర్చుకోవడానికి ఉద్యమ సారథి హార్దిక్ పటేల్‌ను పార్టీలో చేర్చుకుంది. 37శాతం ఉన్న ఓబీసీ ఓటర్లపై దృష్టి పెట్టి కాంగ్రెస్ నుంచి అల్వేష్ ఠాకూర్‌ని చేర్చుకుంది. ఫలితంగా 90 నియోజకవర్గాల్లో పై చేయి సాధించింది. చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు) -
బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు
దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే గుజరాత్లో కూడా సామాన్యుల్లో చాలా అంశాలపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ధరల పెరుగుదల మొదలుకుని నానా రకాల సమస్యలతో వాళ్లు కూడా సతమతమవుతూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా భావించే పాడి పరిశ్రమపై ఆధారపడ్డ అసంఖ్యాకులు ద్రవ్యోల్బణం దెబ్బకు లాభాలు సన్నగిల్లి అల్లాడుతున్నారు. వారంతా దీన్ని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యంగానే చూశారు. సంపన్న సూరత్ వస్త్ర వ్యాపారుల నుంచి మధ్య గుజరాత్‌లోని నిరుపేద పొగాకు రైతుల దాకా అందరిదీ ఇదే వ్యథ, ఇదే అభిప్రాయం. అయినా సరే, బీజేపీకి ఓటేయడం మినహా మరో మార్గం లేదన్న భావన వారిలో ప్రబలంగా వ్యక్తమవడం విశేషం! 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించకపోవడం మరో విశేషం. ఇందుకు మూడు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. హిందూత్వ నినాదం, ప్రధాని మోదీ మేజిక్, విపక్ష ఓటులో చీలిక. ఈ మూడూ కలగలిసి బీజేపీకి కళ్లుచెదిరే విజయం కట్టబెట్టాయి. హిందూత్వ నినాదం హిందూత్వ రాజకీయాలు గుజరాత్లో చిరకాలంగా లోలోతులకు పాతుకుపోయాయి. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలో కూడా రాష్ట్రంలో సన్నకారు పాడి రైతు మొదలుకుని పాటిదార్ పత్తి రైతు దాకా ఎవరిని కదిలించినా ద్రవ్యోల్బణం దెబ్బకు రెండు మూడేళ్లలో ఆర్థికంగా అక్షరాలా చితికిపోయామంటూ వాపోయినవాళ్లే. కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నది వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట! ముస్లింల ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే మరో మార్గం లేదన్నది వారు వెలిబుచ్చిన అభిప్రాయం. ‘‘గతంలో అహ్మదాబాద్ వెళ్లాలంటే ‘గొడవ’లేమన్నా అవుతున్నాయా అని ముందుగా వాకబు చేయాల్సొచ్చేది. కానీ సాహెబ్ (మోదీ) వచ్చాక అల్లర్లూ లేవు, సమస్యలూ లేవు’’ అని సగటు హిందూ ఓటర్లంతా చెప్పుకొచ్చారు. ఈ ముస్లిం వ్యతిరేక భావజాలం వారిలో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. మతపరమైన విభజన ఆర్థిక కష్టాలను కూడా వెనక్కు నెట్టేసేంది. ఇదే బీజేపీకి శ్రీరామరక్షగా మారింది. మోదీ మేనియా సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా తటస్థ, ఎటూ నిర్ణయించుకోలేని ఓటర్లు మోదీ కరిష్మా కారణంగా బీజేపీవైపే మొగ్గినట్టు ఫలితాల సరళి స్పష్టంగా చెబుతోంది. నిజానికి అధికార బీజేపీ ఎమ్మెల్యేల అసమర్థత, అధికారుల్లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని రాష్ట్రంలో జనం అసహ్యించుకునే పరిస్థితి ఉంది! కానీ మోదీ మేనియా వీటన్నింటినీ చాలావరకు అధిగమించేసింది. విపక్ష ఓటులో చీలిక గుజరాత్లో ఎప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగుతూ వచ్చిన పోరు కాస్తా ఆప్ అన్ని అస్త్రశ్రస్తాలతో రంగంలోకి దిగడంతో ముక్కోణ పోరుగా మారిపోయింది. కేజ్రీవాల్ పార్టీ ప్రధానంగా చీల్చింది బీజేపీ వ్యతిరేక ఓటునే! అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకునే!! అంతిమంగా ఇది ప్రధాన ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బగా, బీజేపీకి అనుకోని వరంగా పరిణమించింది. ఈ కారణంగానే కమలం పార్టీ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 150 సీట్ల మార్కును దాటగలిగింది. ఏకంగా 53 శాతం ఓట్లు కొల్లగొట్టింది. మరోవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకు 41 శాతం నుంచి 27 శాతానికి పడిపోయింది. ఆప్ సాధించిన 13 శాతం ఓట్లు చాలావరకు కాంగ్రెస్‌నని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. 2017లో కాంగ్రెస్ దుమ్ము రేపిన సౌరాష్ట్ర ప్రాంతాన్ని కూడా బీజేపీ ఈసారి పూర్తిగా తనవైపు తిప్పుకుంది. కానీ ఇక్కడ ఏకంగా 18 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, ఆప్ రెండింటి ఓట్ల శాతం కలిపితే బీజేపీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం! పైగా 2017లో బీజేపీకి చెమటలు పట్టించి కాంగ్రెస్‌కు చాలావరకు ఉపయోగపడ్డ పాటిదార్ ఉద్యమం వంటివేవీ ఈసారి లేకపోవడం కమలనాథులకు మరింతగా కలిసొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్లో ‘నరేంద్ర’జాలం
ఢిల్లీ స్థానిక ఎన్నికల ఫలితాలతో నిర్ఘాంతపోయిన బీజేపీకి గుజరాత్ ఓటర్లు గురువారం ఊహాతీతమైన విజయాన్ని అందించి సాంత్వనపరిచారు. అక్కడ వరసగా ఏడోసారి అధికారం అప్ప గించటం మాత్రమే కాదు... ఆ పార్టీకి ఎన్నడూలేని స్థాయిలో సీట్లు కట్టబెట్టారు. 182 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి ఏకంగా 156, కాంగ్రెస్‌కు కేవలం 17, ఆప్‌కు 5 స్థానాలు లభించటం గమనించ దగ్గది. ప్రధాని నరేంద్ర మోదీ సమ్మోహనశక్తి పనిచేయటంతోపాటు అధికార పక్షానికి గట్టి ప్రత్యామ్నాయం అందించగల శక్తి సామర్థ్యాలు విపక్షానికి కొరవడటం బీజేపీ అసాధారణ విజయానికి ఊతమిచ్చింది. మోదీ సీఎంగా ఉన్నప్పుడు సైతం అత్యధికంగా 127 స్థానాలు మాత్రమే గెలుచు కున్న చరిత్రగల బీజేపీ ఇప్పుడు భారీ మెజారిటీ సాధించటం మాటలు కాదు. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం బీజేపీ బోర్లాపడక తప్పలేదు. ప్రతి అయిదేళ్లకూ అధికార పక్షాన్ని సాగనంపే సంప్రదా యాన్ని ఓటర్లు ఈసారి కూడా కొనసాగించటంతోపాటు అక్కడి సమస్యలపై పోరాడిన తీరు కాంగ్రెస్‌కు లాభించింది. అయితే రెండు పార్టీల ఓట్ల శాతం వ్యత్యాసం ఒక్క శాతంకన్నా తక్కువే. అక్కడి 68 స్థానాల్లో కాంగ్రెస్‌కు 40, అధికారం మెట్లు దిగుతున్న బీజేపీకి 25 రాబోతున్నాయి. ఢిల్లీలో దక్కిన విజయంతో సంతోషసంరంభాల్లో మునిగితేలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలూ షాక్ అనే చెప్పాలి. ఆ పార్టీకి కొత్తగా జాతీయ పార్టీ హోదా రావటం మినహా సీట్లపరంగా పెద్దగా దక్కిందేమీ లేదు. హిమాచల్‌లో గట్టి సవాల్ ఇస్తుందనుకుంటే కనీసం ఖాతా కూడా ప్రారం భించలేకపోయింది. గుజరాత్ గురించి సాక్షాత్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గొప్పలకు పోయినా ఎవరూ దాన్ని విశ్వసించలేదు. కానీ పొరుగునున్న పంజాబ్ మాదిరే హిమాచల్‌లో సైతం ఏదో ఇంద్రజాలం చేస్తుందని నమ్మినవారికి నిరాశే ఎదురైంది. ఆ పార్టీ చేసిన హడావుడికీ, వచ్చిన సీట్లకూ ఎక్కడా పొంతన లేకపోవటం గమనించదగ్గది. అధికార పక్షం పనితీరుకన్నా ఇతరేతర అంశాలు ప్రాధాన్యం సంతరించుకోవటం ఈమధ్య కాలంలో దేశంలో అక్కడక్కడ కనబడుతోంది. ఇప్పుడు గుజరాత్‌లోనూ జరిగింది అదే. ఇది విప క్షాల వైఫల్యం తప్ప మరొకటి కాదు. కరోనా మహమ్మారి కాటేయడంతో ఆ రాష్ట్రంలో దాదాపు అన్నివర్గాల జనం ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమవుతున్నారు. సంపన్నవంతులైన సూరత్‌లోని జౌళి మిల్లుల యజమానులు మొదలుకొని అంతంతమాత్రంగా నెట్టుకొచ్చే పొగాకు రైతుల వరకూ అందరికీ సమస్యలున్నాయి. రాష్ట్రంలో వృద్ధి రేటు అరకొరగా ఉండగా ద్రవ్యోల్బణం పట్టిపీడిస్తోంది. నిరుద్యోగ సమస్య సరేసరి. సాధారణ పరిస్థితుల్లో ఇవన్నీ అధికార పక్షానికి చుక్కలు చూపాలి. కానీ రాష్ట్ర ఓటర్లలో 52 శాతంమంది మళ్లీ బీజేపీనే కొనసాగించాలనుకున్నారంటే విపక్షమైన కాంగ్రెస్‌పై వారికున్న అవిశ్వాసం ఎంతటిదో అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 41 శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ఈసారి 27 శాతానికి పడిపోయిందంటే అది ఆ పార్టీ పతనావస్థను పట్టి చూపుతుంది. క్రితంసారి ఎన్నికల్లో సౌరాష్ట్ర ప్రాంతాన్ని బీజేపీనుంచి చేజిక్కించుకున్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఆప్ ఆగమనం వల్ల కావొచ్చు... ఓట్లు చీలి దాన్ని తిరిగి బీజేపీకే అప్పగించింది. ఆప్ కేవలం కాంగ్రెస్ ఓట్లను మాత్రమే కాదు... అంతో ఇంతో బీజేపీ ఓట్లను కూడా రాబట్టుకోగలిగింది. 2017 ఎన్నికల నాటికి పటీదార్ల ఉద్యమం గుజరాత్‌ను హోరెత్తించింది. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. తమకు రాయితీలు దక్కటం లేదని రైతాంగం ఆగ్రహంతో ఉంది. అలాంటి సమయంలోనే లాగలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు ఏదో చేస్తుందని ఎవరూ అనుకోలేదు. జనం ఎదుర్కొంటున్న సమస్యలపై తానే ఉద్యమించి అందరినీ కూడగట్టి ఉంటే ఆ పార్టీకి అంతో ఇంతో లాభించేది. అలాంటి చొరవ తీసుకున్న నేతలే లేకపోవటం కాంగ్రెస్‌కు పెద్ద శాపం. అటు ప్రధాని నరేంద్ర మోదీ 31 ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటే కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మినహా మిగిలిన బడానేతల జాడ అంతంతమాత్రం. గడప దాటకుండా, సమస్యలపై ఉద్యమించకుండా విజయం తనంతతాను దరి చేరాలని ఏ విపక్షం భావించినా తెలివితక్కువతనం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు చూసినా, హిమా చల్లో కాంగ్రెస్ విజయం గమనించినా ఇదే రుజువవుతుంది. హిమాచల్‌లో బీజేపీ ప్రచారహోరు తక్కువేమీ లేదు. అది ప్రధాని మోదీ ఆకర్షణనూ, ప్రతిసారీ ఏకరువుపెట్టే ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వ వాదాన్నీ, ఉమ్మడి సివిల్ కోడ్‌నూ, జాతీయ భద్రతనూ ఎజెండాలోకి తెచ్చింది. అటు చూస్తే నిరుడు వీరభద్రసింగ్ మరణం తర్వాత కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండాపోయారు. అయినా రాష్ట్రంలో నిరుద్యోగంపై, యాపిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ఎన్నో ఉద్యమాలు చేసింది. జనం సతమతమవుతున్న సమస్యల్ని తీసుకుని ఉద్యమాలు నిర్మిస్తే విజయం పెద్ద కష్టం కాదని నిరూపించింది. ఆ రకంగా చూస్తే హిమాచల్ ఎన్నికల ఫలితాలు విపక్షాలకు మాత్రమే కాదు, బీజేపీకి సైతం హెచ్చరిక లాంటివే. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. కానీ గెలిచిన పక్షం జనం ఎందుకు గెలిపించారో, వాగ్దానాల అమలుకు తాను చేయాల్సిందేమిటో గుర్తెరగాలి. ఓటమి పాలైన వారు తమవైపు ఎలాంటి లోపాలున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓటమిని హుందాగా స్వీకరిం చటం నేర్చుకోవాలి. జనం అధికారం కట్టబెట్టనిచోట దాన్ని నయానో భయానో కొల్లగొట్టి పబ్బం గడుపుకుందామనే ఆలోచనలకు దూరంగా ఉండాలి. లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. -
కాంగ్రెస్‌లో అంతర్మథనం.. పక్కలో బల్లెంలా మారుతున్న ఆప్
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు భరించలేని చేదును, కాస్త తీపిని రుచి చూపాయి. గుజరాత్లో బీజేపీ దెబ్బకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతటి ఘోర పరాజయాన్ని చవిచూడ్సాలి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లో గెలిచినా దాన్ని కాంగ్రెస్ ఘనత అనేకంటే బీజేపీ స్వయంకృతమనే చెప్పాలి. ఆ లెక్కన తాజా ఫలితాలు రెండూ కాంగ్రెస్‌కు ప్రమాద ఘంటికలే. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా ఒక్కో రాష్ట్రానికీ విస్తరిస్తూ పక్కలో బల్లెంలా మారుతున్న వైనం హస్తం పార్టీని మరింతగా కలవరపెట్టేదే. కాంగ్రెస్ ఇంతకాలం ప్రధానంగా బీజేపీతోనే తలపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పలు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాపాడుకోవడానికి ముందుగా ఆప్‌తోనే కాంగ్రెస్ తలపడాల్సిన పరిస్థితి తలెత్తే సూచనలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. ఇది మూలిగే నక్కపై తాటిపండు చందమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. గుజరాత్‌లోనూ అదే జరిగింది. ఆప్ గెలిచింది ఐదు స్థానాలే అయినా ప్రధానంగా కాంగ్రెస్‌నే దెబ్బ తీసింది. ఆప్ సాధించిన 13 శాతం ఓట్లు కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు గండి పెడుతూ సాధించినవే. ‘‘రానున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆప్ ముప్పు కాంగ్రెస్‌ను వెంటాడటం ఖాయం. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అది మరింత పెరుగుతుంది’’ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు) -
ఆప్ ఘోర పరాజయం.. సీఎం అభ్యర్థికీ తప్పని ఓటమి
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. బీజేపీ, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్న ఆప్ ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లు మొండిచేయి చూపారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా గుజరాత్ ఎన్నికల బరిలో దిగిన ఆప్ అత్యంత దారుణంగా చతికిల పడింది. అన్ని స్థానాల్లో బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేక పోయింది. ఖాతా తెరవని ఆప్ 182 స్థానాల్లో కేవలం 4 చోట్లా మాత్రమే గెలుపొందింది. 12 శాతం ఓట్లను సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గుజరాత్లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పార్టీ కీలక నేతలంతా భారీగా ప్రచారం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. బీజేపీ దూకుడు ముందు ఆప్ వ్యూహాలేవీ ఫలించలేదు. సీఎం అభ్యర్థి ఓటమి దీనికి తోడు గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గడ్వీకి కూడా ఓటమి తప్పలేదు. ఖంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి అయర్ ములుభాయ్ హర్దాస్‌భాయ్ బేరాపై 19,000 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ఇసుదాన్ గాధ్వి 53,583 ఓట్లు రాగా, బేరాకు 71,345 ఓట్లు వచ్చాయి. అంతేగాక గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా కూడా ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి వినోద్ మోరాదియా విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఆప్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కాంగ్రెస్ ఓట్లకు గండి అయితే గుజరాత్లో ఓట్లను చీల్చడంలో మాత్రం గట్టి పాత్ర పోషించింది. కాంగ్రెస్ ఓట్లకు ఆప్ గండి కొట్టింది. గత ఎన్నికల్లో 41 శాతం ఓటింగ్ సాధించిన కాంగ్రెస్ ఈ సారి 27 శాతానికి పడిపోయింది. ఒకవేళ ఆప్ పోటీలో లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా బీజేపీకి గట్టిపోటి ఇచ్చి ఇంకొన్ని స్థానాలను గెలుచుకునేదేమో! మొత్తానికి ఈ ఏడాది పంజాబ్ అసెంబ్లీ గెలుపుతో ఊపు మీదున్న ఆప్‌కు గుజరాత్ ఎన్నికలు భారీ షాక్‌నిచ్చాయి. అసలు హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ పోటీలో ఉందా అనే స్థితికి చేరింది. -
వారి ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ కూడా అక్కడికి చేరుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించడంతో బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. మోదీ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. పార్టీ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచామన్నారు. గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని నిరూపించారన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తుందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు భవిష్యత్తు విజయాలకు సంకేతమన్నారు. హిమాచల్‌లో ఒక శాతం ఓట్లే గెలుపోటములను డిసైడ్ చేశాయని తెలిపారు. హిమాచల్ అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. చదవండి: హిమాచల్ ఫలితాలు: కాంగ్రెస్ విజయంపై స్పందించిన ఖర్గే -
గుజరాత్లో మోదీ మేనియానా? లేక కమలం హవానా? ఫలితాలు ఏం చెబుతున్నాయి?
గుజరాత్లో బీజేపీ దుమ్మురేపింది. రికార్డు స్థాయిలో సీట్లను కొల్లగొట్టి ప్రభంజనాన్ని సృష్టించింది. మోదీ- షా సొంత రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకుంది కమల దళం. మోదీ మ్యాజిక్‌తో 156 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. 54శాతం ఓట్లను దక్కించుకుంది. బీజేపీ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది. 20 సీట్లు కూడా గెలవలేక చతికిలపడింది. గుజరాత్లో ఎన్నికల ఆరంగేట్రం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 12శాతం ఓట్లను కొల్లగొట్టింది. డిసెంబర్ 12న భూపేంద్ర పటేల్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్లో బీజేపీ గెలుపుకు దోహం చేసిన అంశాలేవీ?. గుజరాత్లో గెలిచింది బీజేపీనా? మోదీనా?. బలమైన నేతలను ఆకట్టుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందా?. రాబోయే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతోంది? రాహుల్ జోడో యాత్ర, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఖర్గే ప్రభావం ఎక్కడ? వంటి అనేక అంశాలపై సాక్షి విశ్లేషణ.. -
చరిత్ర సృష్టించిన ఆప్.. దేశంలో తొమ్మిదో పార్టీగా రికార్డ్
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఊరట లభించింది. గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. జాతీయ పార్టీ హోదాను సంపాదించేందుకు కృషి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు, దేశప్రజలకు అభినందనలు తెలిపారు. కాగా గుజరాత్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న ఆప్ మరో స్థానంలో ముందంజలో ఉంది. గుజరాత్ ఎన్నికల్లో 13 శాతం ఓట్లను సాధించింది. ప్రస్తుతం దేశంలో ఎనిమిది పార్టీలు జాతీయ హోదా పొందాయి. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఎన్నికల సంఘం జాతీయ పార్టీలుగా గుర్తించింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన తొమ్మిదో పార్టీగా నిలిచింది. राष्ट्रीय पार्टी बनने पर आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं और सभी देशवासियों को बधाई। pic.twitter.com/sba9Q1sz1f — Arvind Kejriwal (@ArvindKejriwal) December 8, 2022 ఒక రాజకీయ పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 2 సీట్లు, 6శాతం ఓట్లు సాధిస్తే కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తిస్తుంది.. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. గోవాలో రెండు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో ఆప్ జాతీయ హోదా ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఆప్ నాలుగు రాష్ట్రాల్లో తమ ప్రజాప్రతినిధులను కలిగి ఉంది. చదవండి: Himachal Election Results: కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా -
గుజరాత్: బీజేపీ ఖాతాలో ఆ రికార్డు కూడా?!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత ప్రభంజనంతో బీజేపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్(92)ను దాటేసి ఏకంగా 150కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది కాషాయం పార్టీ. ఈ ఫలితంలో గుజరాత్ తమ కంచు కోట అని బీజేపీ చాటిచెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ చరిష్మా గుజరాత్ ఎన్నికలకు బాగా కలిసొచ్చింది. మోదీతో పాటు అమిత్ షా సొంత రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునే ప్రయత్నాలు భారీగా సక్సెస్ అయ్యాయి. గుజరాత్లో అన్ని అసెంబ్లీ ఎన్నికల రికార్డులను బీజేపీ బద్ధలు కొట్టింది. వరుసగా ఏడోసారి అధికారం జేక్కిచ్చుకుని.. పశ్చిమ బెంగాల్ వామపక్ష పార్టీ అధికార కైవసం రికార్డు సరసన నిలవబోతోంది. అలాగే గుజరాత్ గడ్డ నుంచే మరో రికార్డును సైతం నెలకొల్పే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుజరాత్ చరిత్రలో ఇంత మెజార్టీతో ప్రభుత్వాన్ని మునుపెన్నడూ ఏర్పాటు చేసింది లేదు. 1985లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 149 సీట్లు గెల్చుకుంది. ఆ టైంలో మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వం వహించారు. ఆపై 2002లో 127 సీట్లు సాధించింది ఆ లిస్ట్‌లో వెనుక నిల్చుకుంది బీజేపీ. ఇక ఇప్పుడు ఏకంగా 150 సీట్లకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్న కమలం.. కాంగ్రెస్ నెలకొల్పిన ప్రభుత్వ ఏర్పాటు రికార్డును బద్ధలు కొడుతుందా? అనే తుది ఫలితం వచ్చాకే తేలేది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అప్డేట్ కోసం.. -
గుజరాత్ లో బీజేపీకి బంపర్ మెజార్టీ
-
మోదీ అడ్డాగా గుజరాత్.. రికార్డులు బద్దలుకొట్టిన బీజేపీ!
గుజరాత్.. బీజేపీ అడ్డా అని మరోసారి రుజువైంది. గుజరాత్లో తమకు తిరుగులేదని కమలం పార్టీ ఏకఛత్రాధిపత్యం చూపించుకుంది. ఎన్నికలేవైనా సరే.. కాషాయ జెండా ఎగురవేయాల్సిందేనని బీజేపీ నేతలు నిరూపించుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుజరాత్లో అధికార బీజేపీ భారీ విజయాం దిశగా దూసుకుపోతోంది. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలో ఫుల్ ఫోకస్ పెట్టారు. గుజరాత్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందునుంచే అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మాస్టర్ ప్లాన్స్ రచిస్తూ గుజరాతీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ, బీజేపీ ఎలక్షన్ స్టంట్స్ ఎదుట ఆ పాచికలేవీ పారలేదు. ఇక, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికే పరమితమైనట్టు సమీకరణాలే చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ముందు కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడటం కూడా హస్తం పార్టీకి కలిసిరాలేదు. ముఖ్యంగా పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం కాషాయ పార్టీకి కొంత లాభం చేకూర్చిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక, ముందు నుంచి గుజరాత్లో మోదీ మంత్రం పనిచేస్తున్నట్టుగానే ఈ ఎన్నికల్లో కూడా అది మరోసారి నిరూపితమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ప్రచారం ప్రారంభమయ్యాక.. మోదీ రోడ్ షోలతో బిజీగా అయ్యారు. గుజరాత్ అంటే బీజేపీ బ్రాండ్ అంటూ తమ గళం వినిపించారు. దీంతో, అప్పటి వరకు డైలామాలో ఉన్న గుజరాతీలు బీజేపీ వైపునకు మోగ్గారు. ఇదిలా ఉండగా.. 1995 నుంచి గుజరాత్లో బీజేపీ.. వరుసగా విజయం సాధిస్తూనే ఉంది. 1995-2017 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచి బీజేపీ దేశ రాజకీయ చరిత్రలో రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే బీజేపీ తమ ఖాతాలో ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. ఇక, ఈ ఎన్నికల్లో బీజేపీ 127 స్థానాలకు పైగా సీట్లో గెలిస్తే కమలం పార్టీ మరో రికార్డు బద్దలుకొట్టినట్టు అవుతుంది. గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లు.. 1. 1995లో 121 2. 1998లో 117 3. 2002లో 127 4. 2007లో 117 5. 2012 లో 115 6. 2017లో 99 7. 2022లో కూడా 100కు పైగా సీట్లలో విజయం సాధించే అవకాశం ఉంది. -
విక్టరీ ఏమోగానీ.. ఆప్‌లో దానిపైనే ఉత్కంఠ
ఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపీ, ఆప్ కొత్త రికార్డుల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. గుజరాత్లో వరుసగా 7వ సారి గెలిచి దేశంలో కమ్యూనిస్టు పార్టీ విజయం(పశ్చిమ బెంగాల్) రికార్డును సమం చేయనున్న బీజేపీ. అలాగే.. ఈ ఎన్నికలతో జాతీయ పార్టీగా అవతరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఏదైనా పార్టీ కనీసం 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తే జాతీయ పార్టీగా అర్హత పొందుతుంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఆప్. ఇక ఆ మధ్య గోవాలో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు తోడు గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో ఏదో ఒక చోట 6 శాతం దాటితే జాతీయ పార్టీగా అర్హత పొందినట్లు అవుతుంది. అంటే గుజరాత్లో కనీసం రెండు సీట్లు గెలిచినా సరిపోతుంది ఆప్. ఒకవేళ జాతీయ పార్టీగా మారితే.. దేశంలో జాతీయ పార్టీ హోదా సాధించిన ఎనిమిదవ పార్టీగా ఆప్ నిలవడంతో పాటు ఈవీఎం మెషీన్లలో మొట్టమొదటి పేరు ఆమ్ ఆద్మీ పార్టీ, సింబల్ ఉండనుంది. 2021లో సూరత్ మున్సిపల్ ఎన్నికలలో 28% ఓట్ల వాటాను సాధించడం ద్వారా కాంగ్రెస్ స్థానంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆప్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శనను కనబరుస్తామని ఆశిస్తోంది. 2024 ఎన్నికలకు జాతీయ పార్టీ హోదాతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఆప్‌కి ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. -
ప్రారంభమైన గుజరాత్ ఓట్ల లెక్కింపు
-
నేడు గుజరాత్ ఓట్ల లెక్కింపు
-
గుజరాత్ ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 64.33 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2017 నాటి ఎన్నికలతో పోలిస్తే 4.08 శాతం తగ్గింది. రాష్ట్రంలో 2017 ఎన్నికల్లో 68.41 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ నెల 1న 89 స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 63.31 శాతం, 4న 93 స్థానాలకు జరిగిన రెండో దశ ఎన్నికల్లో 65.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో 4.91 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ ఎన్నికల్లో 3.16 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా నర్మదా జిల్లాలో 78.42 శాతం, అతి తక్కువగా బోతాడ్ జిల్లాలో 57.59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. తాపీ జిల్లాలో 77.04 శాతం, బనస్కాంతా జిల్లాలో 72.49 శాతం, సబర్‌కాంతా జిల్లాలో 71.43 శాతం, నవసారి జిల్లాలో 71.06 శాతం, మోర్బీ జిల్లాలో 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు తేలింది. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదీ చదవండి: ఎగ్జిట్ పోల్స్: గుజరాత్ బీజేపీదే