గుజరాత్.. బీజేపీ అడ్డా అని మరోసారి రుజువైంది. గుజరాత్‌లో తమకు తిరుగులేదని కమలం పార్టీ ఏకఛత్రాధిపత్యం చూపించుకుంది. ఎన్నికలేవైనా సరే.. కాషాయ జెండా ఎగురవేయాల్సిందేనని బీజేపీ నేతలు నిరూపించుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుజరాత్‌లో అధికార బీజేపీ భారీ విజయాం దిశగా దూసుకుపోతోంది.
ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలో ఫుల్ ఫోకస్ పెట్టారు. గుజరాత్‌లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందునుంచే అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మాస్టర్ ప్లాన్స్ రచిస్తూ గుజరాతీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ, బీజేపీ ఎలక్షన్ స్టంట్స్ ఎదుట ఆ పాచికలేవీ పారలేదు.
ఇక, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికే పరమితమైనట్టు సమీకరణాలే చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ముందు కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడటం కూడా హస్తం పార్టీకి కలిసిరాలేదు. ముఖ్యంగా పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం కాషాయ పార్టీకి కొంత లాభం చేకూర్చిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక, ముందు నుంచి గుజరాత్‌లో మోదీ మంత్రం పనిచేస్తున్నట్టుగానే ఈ ఎన్నికల్లో కూడా అది మరోసారి నిరూపితమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ప్రచారం ప్రారంభమయ్యాక.. మోదీ రోడ్ షోలతో బిజీగా అయ్యారు. గుజరాత్ అంటే బీజేపీ బ్రాండ్ అంటూ తమ గళం వినిపించారు. దీంతో, అప్పటి వరకు డైలామాలో ఉన్న గుజరాతీలు బీజేపీ వైపునకు మోగ్గారు.
ఇదిలా ఉండగా.. 1995 నుంచి గుజరాత్‌లో బీజేపీ.. వరుసగా విజయం సాధిస్తూనే ఉంది. 1995-2017 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచి బీజేపీ దేశ రాజకీయ చరిత్రలో రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే బీజేపీ తమ ఖాతాలో ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. ఇక, ఈ ఎన్నికల్లో బీజేపీ 127 స్థానాలకు పైగా సీట్లో గెలిస్తే కమలం పార్టీ మరో రికార్డు బద్దలుకొట్టినట్టు అవుతుంది.
గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లు..
1. 1995లో 121
2. 1998లో 117
3. 2002లో 127
4. 2007లో 117
5. 2012 లో 115
6. 2017లో 99
7. 2022లో కూడా 100కు పైగా సీట్లలో విజయం సాధించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment